సందర్భము:
త్యాగరాజ స్వామి వారు రచించిన కీర్తనలన్నిటిలో ఇది మొదటిది అని నానుడి. రామ తారక మంత్రానుష్ఠానమైన పిదప శ్ఱీరాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుని వెంట ఆయన యాగ సంరక్షణార్థమై వెళుతున్న దృశ్యము త్యాగరాజస్వామి వారికి సాక్షాత్కారమవుంతుంది. ఆ పారవశ్యములో బాలకనకమయ చేల అనే బాలరాముని రూపాన్ని వర్ణించారు.
ఈ త్యాగయ్య కృతికి వస్తే, శ్రీ రాముని శుభలక్షణాలు, శౌర్య పరాక్రమాలు, అలంకారములు, భక్త జన కారుణ్యము పేర్కొని నాపై ఏల దయ చూపించవు అని వేడుకొంటాడు కృతికర్త. అద్భుతమైన తెలుగు సాహిత్యము ఈ కృతిలో గుప్పించారు త్యాగబ్రహ్మ. కీర్తన సాహిత్యము, తాత్పర్య సంగ్రహము,
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గళంలో శాస్త్రీయ శ్రవణం,
సాగర సంగమం చిత్రంలో ఎస్. జానకి గారి గళంలో మంజు భార్గవి మరియు కమలహాసన్ గారి నాట్యం.
కృతి: ఏలా నీ దయరాదు బాలకనకమయ
రాగం: అఠాణా
తాళం: ఆది
ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయము గాదు
బాల కనకమయ చేల సుజన పరి
పాల శ్రీ రమాలోల విధృత శర
జాలశుభద కరుణాలవాల ఘన
నీల నవ్య వన మాలికాభరణ (ఏల)
పాల శ్రీ రమాలోల విధృత శర
జాలశుభద కరుణాలవాల ఘన
నీల నవ్య వన మాలికాభరణ (ఏల)
రారా దేవాది దేవ రారా మహానుభావ
రారా రాజీవనేత్ర రఘువర పుత్రా
రారా రాజీవనేత్ర రఘువర పుత్రా
సారతర సుధా పూర హృదయ పరి
వార జలధి గంభీర దనుజ సం
హార మదన సుకుమార బుధ జనవి
హార సకల శృతిసార నాదుపై (ఏల)
వార జలధి గంభీర దనుజ సం
హార మదన సుకుమార బుధ జనవి
హార సకల శృతిసార నాదుపై (ఏల)
రాజాధిరాజ ముని పూజితపాద రవి
రాజలోచన శరణ్య అతి లావణ్య
రాజలోచన శరణ్య అతి లావణ్య
రాజధరనుత విరాజతురగ సుర
రాజ వందిత పాద అజ జనక దీన
రాజ వందిత పాద అజ జనక దీన
రాజకోటి సమతేజ దనుజ గజ
రాజ నిచయ మృగరాజ జలజముఖ (ఏల)
రాజ నిచయ మృగరాజ జలజముఖ (ఏల)
యాగరక్షణ పరమ భాగవతార్చిత
యోగీంద్ర సుహృద్భావిత ఆద్యంత రహిత
నాగశయన వర నాగవరద పు
న్నాగ సుమధర సదాఘమోచనస
దా గతిజ ధృత పదాగమాంత చర
రాగరహిత శ్రీ త్యాగరాజనుత (ఏల)
యోగీంద్ర సుహృద్భావిత ఆద్యంత రహిత
నాగశయన వర నాగవరద పు
న్నాగ సుమధర సదాఘమోచనస
దా గతిజ ధృత పదాగమాంత చర
రాగరహిత శ్రీ త్యాగరాజనుత (ఏల)
తాత్పర్యము:
ఓ బాల రామా! బంగారము కూడిన ఆభరణములు, వస్త్రములు ధరించిన వాడా! సుజనులను కాపాడే వాడా! లక్ష్మీ దేవిని కలిగిన వాడా! శరములు సంధించే వాడా! శుభము కలిగించి కరుణించే వాడా! ఘనుడా! నీల మేఘ శ్యామ! వనమాల ధరించిన వాడా! నాపై ఏల దయరాదు?
దేవాదిదేవా! రా రా! మహానుభావా రా రా! అందమైన కన్నులు కలవాడా రా రా! రఘువంశములో పుట్టిన వాడా! అమృత హృదయులైన వారి పరివారం కలవాడా! సముద్రము వంటి గాంభీర్యము కలవాడా! అసురులను సంహరించే వాడా! మన్మథునిలా కుమారుడా! జ్ఞానులతో మెలిగెడి వాడా! అన్ని శ్రుతుల సారమైన వాడా! శ్రీ రామా! నాపై ఏల దయరాదు?
రాజాధిరాజా! మునులచే పూజించ బడిన పాదములు కలవాడా! సూర్య చంద్రులు కన్నులుగా కలవాడా! శరణ్య! అతి సౌందర్య మూర్తి! చంద్రుని ధరించిన శివునిచే నుతించబడిన వాడా! గరుత్మంతుని అధిరోహించిన ప్రభూ! దేవేంద్రునిచే పూజించబడిన వాడా! బ్రహ్మకు తండ్రీ! కోటి సూర్యుల ప్రకాశము కలవాడా! శత్రువుల పాలిట సింహమా! కమలము వంటి ముఖము కలవాడా! శ్రీ రామా! నాపై ఏల దయ రాదు?
యాగ రక్షకా! ఉత్తములచే నుతించ బడిన వాడా! యోగులచే ధ్యానించ బడిన వాడా! ఆద్యన్తములు లేని వాడా! శేష శయన! గజేంద్రుని రక్షించిన వాడా! పున్నాగ పూలు ధరించిన వాడా! ఎల్లప్పుడూ పాపములను నాశనము చేసే వాడా! ఎల్లప్పుడూ వాయుపుత్రుడైన హనుమంతునిచే సేవించబడే పాదములు కలవాడా! ఆగమముల అంశమా! కోరికలు లేని వాడా! త్యాగరాజునిచే నుతించబడిన రామా! నాపై ఏల దయరాదు?. పరాకు చేసేందుకు సమయము కాదు రామా!
గమనిక - ప్రాస కోసం చరణాలలోని పదాలను విడదీయవలసి వచ్చింది. సాహిత్యాన్ని కలిపి చదివి, పాడవలసినదిగా మనవి.
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండి