27, డిసెంబర్ 2010, సోమవారం

రాఘవాష్టకం - తాత్పర్యము

తండ్రి మాటకై పదునాలుగేండ్లు వనవాసము చేసి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన మానవ అవతారమూర్తి శ్రీ రామ చంద్రుడు. ఏక పత్నీ వ్రతుడు, ధర్మ పరిపాలనా దక్షుడు, సోదర భావన మూర్తీభవించిన మంగళాకారుడు ఆ రామచంద్రుడు. ఈ రాఘవాష్టకం ఆ శ్రీరాముని గుణ కీర్తనలో ఒక మంచి భావ వ్యక్తీ కరణ. రచించిన కవి (ఎవరో తెలీదు) మంచి రసానుభూతి పొంది చేసిన కృతి.

రాఘవాష్టకం, తాత్పర్యము, శ్రవణం

(రచనలలో ఉపమానములు, అలంకారములు, విశేషణములు వాడేటప్పుడు మగవారిని సింహము, ఏనుగులతో పోల్చటం పరిపాటి. ఈ రెండు జంతువులూ ఉన్నతమైన లక్షణాలు కలిగి నేత్రుత్వానికి, పరాక్రమానికి ప్రతీకగా నిలిచాయి కాబట్టే ఇలా పోలిక. వెనుదిరుగని ధైర్యము, శౌర్యము సింహానిది అయితే, నాయకత్వము, నిలకడ, ప్రశాంతత, అవసరమైనప్పుడు భీకర పరాక్రమము ఏనుగు లక్షణాలు. సింహము ఒక్క ఏనుగుకు తప్ప దేనికి నిలువదు. అందుకే ఈ స్తోత్రములో కవి రఘు కుంజరం అని రాముని ఏనుగుతో ఉపమానము చేసినట్టున్నాడు).


రాఘవం కరుణాకరం మునిసేవితం సురవందితం
జానకీవదనారవిందదివాకరం గుణభాజనం
వాలిసూనుహితైషిణం హనుమత్ప్రియం కమలేక్షణం
యాతుధానభయంకరం ప్రణమామి రాఘవకుంజరం  ౧

మైథిలీకుచభూషణామలనీలమౌక్తికమీశ్వరం
రావణానుజపాలనం రఘుపుంగవం మమ దైవతం
నాగరీవనితాననాంబుజబోధనీయకలేవరం
సూర్యవంశవివర్ధనం ప్రణమామి రాఘవకుంజరం  ౨

హేమకుండలమండితామలకంఠదేశమరిందమం
శాతకుంభమయూరనేత్రవిభూషణేనవిభూషితం
చారునూపురహారకౌస్తుభకర్ణభూషణభూషితం
భానువంశవివర్ధనం ప్రణమామి రాఘవకుంజరం  ౩

దండకాఖ్యవనే రతామరసిద్ధయోగిగణాశ్రయం
శిష్టపాలనతత్పరం ధృతిశాలిపార్థకృతస్తుతిం
కుంభకర్ణభుజాభుజంగవికర్తనే సువిశారదం
లక్ష్మణానుజవత్సలం ప్రణమామి రాఘవకుంజరం  ౪

కేతకీకరవీరజాతిసుగంధిమాల్యసుశోభితం
శ్రీధరం మిథిలాత్మజాకుచకుంకుమారుణవక్షసం
దేవదేవమశేషభూతమనోహరం జగతాం పతిం
దాసభూతభయాపహం ప్రణమామి రాఘవకుంజరం  ౫

యాగదానసమాధిహోమజపాదికర్మకరైర్ద్విజైః
వేదపారగతైరహర్నిశమాదరేణ సుపూజితం
తాటకావధహేతుమంగతతాతవాలినిషూదనం
పైతృకోదితపాలకం ప్రణమామి రాఘవకుంజరం  ౬

లీలయా ఖరదూషణాదినిశాచరాశువినాశనం
రావణాన్తకమచ్యుతం హరియూథకోటిగణాశ్రయం
నీరజాననమంబుజాంఘ్రియుగం హరిం భువనాశ్రయం
దేవకార్యవివక్షణం ప్రణమామి రాఘవకుంజరం  ౭

కౌశికేన సుశిక్షితాస్త్రకలాపమాయతలోచనం
చారుహాసమనాథబంధుమశేషలోకనివాసినం
వాసవాదిసురారిరావణశాసనం చ పరాంగతిం
నీలమేఘనిభాకృతిం ప్రణమామి రాఘవకుంజరం  ౮

రాఘవాష్టకమిష్టసిద్ధిదమచ్యుతాశ్రయసాధకం
ముక్తిభుక్తిఫలప్రదం ధనధాన్యసిద్ధివివర్ధనం
రామచంద్రకృపాకటాక్షదమాదరేణ సదా జపేత్
రామచంద్రపదాంబుజద్వయసంతతార్పితమానసః  ౯

రామ రామ నమోఽస్తు తే జయ రామభద్ర నమోఽస్తు తే
రామచంద్ర నమోఽస్తు తే జయ రాఘవాయ నమోఽస్తు తే
దేవదేవ నమోఽస్తు తే జయ దేవరాజ నమోఽస్తు తే
వాసుదేవ నమోఽస్తు తే జయ వీరరాజ నమోఽస్తు తే  ౧౦

ఇతి శ్రీరాఘవాష్టకం సంపూర్ణమ్

తాత్పర్యము: 

రఘువంశములో ఉత్తముడు, కరుణాకరుడు, మునులచే,సురులచే  పూజించ బడిన వాడు,  సీత యొక్క కలువ ముఖమునకు సూర్యుని వంటి వాడు, ఎన్నో సుగుణములకు నిలయము, అంగదునికి హితుడు, హనుమంతునికి ప్రియుడు, కమలముల వంటి కన్నులు కలవాడు, రాక్షసుల పాలిట సింహ స్వప్నమైన, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

సీతాదేవి కుఛములపై శాశ్వతమైన నీలపు ముత్యము వంటి ఈశ్వరుడు, విభీషణునికి రక్షకుడు, రఘువంశములో ఉత్తమ పురుషుడు, నా ఇష్టదైవము, అందమైన కలువ వంటి ముఖము కల నాగరిక స్త్రీ సౌందర్యాన్ని తలదన్నే రూపము కలవాడు, సూర్య వంశ వర్ధనుడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

మెడకిరు వైపులా బంగారపు కర్ణ కుండలములచే అలంకరించ బడిన వాడు, బంగారు నెమలి కన్నుల ఆభరణము ధరించిన వాడు, అందమైన నూపురములు, మెడలో కౌస్తుభ హారము, అందమైన చెవి ఆభరణములు కలిగిన వాడు, సూర్య వంశ వర్ధనుడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

దండకారణ్యములో అమరులైన సిద్ధులకు, యోగులకు ఆశ్రయము ఇచ్చిన వాడు, ధర్మ రక్షణే ఆశయముగా కలవాడు, పార్థునిచే పొగడబడిన వాడు, కుంభకర్ణుని సర్పముల వంటి చేతులను చేదించిన వాడు, లక్ష్మణుడు మొదలగు సోదరుల పట్ల ప్రేమ కలవాడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

కేతకీ, కరవీర, జాతి సుగంధ పుష్పముల మాలతో శోభిల్లే వాడు, లక్ష్మిని కలిగిన వాడు, సీతాదేవి స్తనముల కుంకుమచే ఎరుపెక్కిన హృదయ భాగము (వక్ష స్థలము) కలవాడు, ఉత్తమోత్తముడు, అందరిని ఆకట్టుకునే వాడు, లోకేశ్వరుడు, భక్తుల భయము పోగొట్టే వాడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

అగ్నిహోత్రము, దానము, ధ్యానము, ధూపము, జపము మొదలగు సేవల ద్వారా వేదార్థము తెలిసిన బ్రాహ్మణులచే అనన్యమైన భక్తితో కొలవబడిన వాడు, తాటకిని, వాలిని సంహరించిన వాడు, వారసత్వాన్ని కాపాడిన వాడు, ఏనుగువంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

ఖర దూషణులను అవలీలగా సంహరించిన వాడు, రావణుని సంహరించిన వాడు, నాశనము లేనివాడు, కోట్లాది వానర సమూహమునకు రక్షకుడు, కలువ వంటి ముఖము, పాద పద్మములు కలవాడు, హరి, లోకమునకు ఆశ్రయము, దేవతల కార్యము నెరవేర్చుటలో నిమగ్నుడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

విశ్వామిత్రునిచే శస్త్రాస్త్రముల విద్య నేర్పబడిన వాడు, విశాలమైన నేత్రములు, అందమైన చిరునవ్వు కలవాడు, దీన బంధు, అన్నిలోకముల నివసించే వాడు, ఇంద్రుని, రావణుని శాసించే వాడు, ముక్తి మార్గము లో చిట్టచివరి గతి యైన వాడు, నీల మేఘ శ్యాముడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

భక్తి, శ్రద్ధలతో, రాముని పాదపద్మముల స్మరణతో ఈ రాఘవాష్టకం పఠించిన వారికి ఇష్టదేవతా సిద్ధి, రాముని ఆశ్రయము, భుక్తి, ముక్తి, ధన ధాన్య సమృద్ధి కలుగును.

రామునికి, రామ భద్రునికి జయము జయము మరియు నమస్కారములు. దేవ దేవునికి, దేవ రాజునకు, వాసుదేవునకు, వీరాధివీరునకు జయము జయము మరియు నమస్కారములు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి