3, జులై 2026, శుక్రవారం

శ్యామశాస్త్రుల వారి "మాయమ్మ"



సంగీత త్రయంలో పెద్దవారు శ్యామశాస్త్రి గారు. ఆయన వాగ్గేయకారులు, దేవీ భక్తులు, ఉపాసకులే కాదు పారంపర్యంగా వచ్చిన తంజావూరు బంగారు కామాక్షీ అమ్మవారి దేవస్థానంలో అర్చకత్వం కూడా చేశారు. సనాతనమైన ఈ బంగారు కామాక్షీ విగ్రహం తొలుత కాంచీపురంలో ఉండగా ఆది శంకరులే శ్యామశాస్త్రి గారి పూర్వీకులకు ఆ విగ్రహ పూజా బాధ్యతలను అప్పగించారట. 16వ శతాబ్దం మధ్యలో రాజకీయ పరిస్థితుల వలన శ్యామశాస్త్రి పూర్వీకులు కాంచీపురం వదలి ఆ విగ్రహాన్ని తంజావూరు తీసుకు వచ్చి అక్కడ ప్రతిష్ఠించి అక్కడి రాజుల ఆదరణతో ఆ బంగారు కామాక్షి దేవాలయానికి వైభవం వచ్చేలా చేశారు. తంజావూరు మహారాజా తులజావారు మేల రాజవీధిలో ఆ గుడికై పెద్ద స్థలాన్ని కేటాయించి, అగ్రహారాలు, మాన్యాలు, ఆభరణాలు కానుకగా ఇచ్చారు. శ్యామశాస్త్రి తండ్రిగారైన విశ్వనాథశాస్త్రి గారు మరణించిన తరువాత శ్యామశాస్త్రి గారు అమ్మ కైంకర్య బాధ్యతలను స్వీకరించారు. 

శ్యామశాస్త్రి కన్న ముందు వారి కుటుంబంలో ఎవ్వరికీ సంగీతంలో ప్రవేశం లేదు. ఆ బంగారు కామాక్షి కరుణతో ఆయన అద్భుతమైన గాయకునిగా, వాగ్గేయకారునిగా పేరొందారు. నిత్యపూజాదికాల తరువాత శ్యామశాస్త్రి వారు ఆ అమ్మ ముందు కూర్చుని ఆనందభాష్పాలు రాలుస్తూ తన కృతులను గానం చేసేవారు. ఎలా? ఆ తల్లిని తన కన్న తల్లిలా, తాను ఒక పసిబిడ్డవానిగా త్రికరణ శుద్ధిగా భావించి పాడేవారు. అమ్మను వేడుకోవడం, అమ్మను నుతించటం, అమ్మను ప్రశ్నించటం, అమ్మ లాలన పొందిన అనుభూతులు, అమ్మ ప్రేమను ఆస్వాదించిన వర్ణనలు...ఆయన కీర్తనలన్నీ మాతృభావనతో వ్రాసినవే.

ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఆయనకు కలలో వచ్చి మదురై వెళ్ళి మీనాక్షీ అమ్మను ఆరాధించమని చెప్పగా, శ్యామశాస్త్రుల వారు అక్కడికి వెళ్ళి నవరత్నమాలికగా పేరొందిన తొమ్మిది అద్భుతమైన కృతులను రచించి అమ్మ ముంగిట ఆలపించారు. వాటిలో ఏడు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి - సరోజదళనేత్రి, దేవీ మీననేత్రి (శంకరాభరణం రాగంలో), మరివేరే గతి యెవరమ్మ (ఆనందభైరవి), నన్ను బ్రోవు లలిత (లలిత), మాయమ్మ (ఆహిరి), దేవీ నీ పద సారస (కాంభోజి), మీనలోచనా బ్రోవ (ధన్యాసి). తమాషా ఏమిటంటే శ్యామశాస్త్రి కుటుంబీకులు తమిళ అయ్యరు బ్రాహ్మణులైనా, ఆయన కృతులన్నీ తెలుగులో వ్రాసినవే. కాబట్టి శ్యామశాస్త్రి పూర్తిగా తెలుగు వారే అని చెప్పవచ్చు. చక్కని లయజ్ఞానంతో, మధురమైన భావసంపదతో, స్వరాక్షర మరియు ప్రాసల సౌందర్యంతో, రాగ అర్థ రస భావనలతో ఆయన కామాక్షీ, మీనాక్షీ పరదేవతలను తన కృతులతో కొలిచారు. శ్యామశాస్త్రి తన రచనలలో దేవీవైభవం పరిపూర్ణంగా ఆవిష్కరించారు. మాతృప్రేమను కురిపించి, అనుగ్రహించి, ఘనపాపములను తొలగించే అమ్మను 300కు పైగా కృతులలో నుతించారు. సంగీత త్రయంలో దేవీతత్త్వాన్ని ఒక కుమారునిగా అద్బుతంగా వర్ణించారు. 

నాదోపాసనలో మాతృతత్త్వాన్ని, పరదేవతానుగ్రహాన్ని మనకు అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదగా కృతులను అందించిన శ్యామశాస్త్రుల వారు తంజావూరు బంగారు కామాక్షి సేవలోనే తరించి పరమపదించారు. వీరి కుమారులైన సుబ్బరాయశాస్త్రి గారు తండ్రి వద్ద, వారి సమకాలీకులైన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితుల వారి వద్ద సంగీత శిక్షణను పొంది మంచి వాగ్గేయకారులుగా పేరొందారు. 

స్వాంతంబులోన నిన్నే తలచిన సుజనులకెల్లనీ వేళ  సంతోషము లొసగేవని నీవు మనోరథ ఫలదాయిని వని
కాంతమగు పేరు పొందితివి కారుణ్యమూర్తివై జగము  కాపాడిన తల్లి కదా నేడు నీదు బిడ్డను లాలించి
కనక గిరి సదన లలిత నిను భజన సంతతము సేయ నిజముగను
వినుము నిఖిల భువన జననీ ఇపుడు మా దురితము దీర్చి వరాలిచ్చి

పాలించు కామాక్షీ! పావనీ! పాపశమనీ! 

ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ - ఆత్రేయ భక్తి గీతం



మధురభక్తిలో అనేక రకాలు, బహుళంగా ఉండే భావన నాయికా నాయకుని భావనైతే మాతృత్వ భావన, స్నేహ భావన లాంటివి ఈ మార్గంలో మరెన్నో. దేని ప్రత్యేకత దానిదే. కానీ, ఆ పరమాత్మను తన బిడ్డగా భావించే మాతృత్వ మధుర భక్తి చాలా ఉన్నతమైనది. తన బిడ్డను లాలించించే రీతినే ఆ తల్లి పరమాత్మను కూడా లాలిస్తుంది. ఈ భావనలను ఎందరో వాగ్గేయకారులు, రచయితలు అద్భుతంగా ఆవిష్కరించారు. వారిలో అన్నమాచార్యుల వారు అగ్రగణ్యులు. అటువంటి మాతృత్వ భావనలతో నిండిన ఓ మధుర భక్తి గీతం శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం చిత్రానికి ఆత్రేయ గారు రచించారు. పెండ్యాల వారి సంగీతం, బహుముఖ ప్రజ్ఞాశాలి శాంతకుమారి గారి నటన, గాత్రం కూడా. వకుళమాత శ్రీకృష్ణునికై ఎదురు చూస్తూ ఆరాధించే సన్నివేశం. యశోద మళ్లీ కలియుగంలో వకుళమాతగా జన్మించి శ్రీనివాసుని తల్లి అయ్యింది. శాంతకుమారి పూర్తిగా శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన. గాయనీమణి. చాలా ఆర్తితో, భక్తితో ఈ గీతాన్ని ఆలపించారు. 

ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాల
ఎంత పిలచినా ఎంత వేడినా ఈ నాటికి దయరాదేల

గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల

వీనుల విందుగ వేణుగానము విని తరింపగా వేచితిరా
వేచి వేచి యీ వెన్నముద్దవలె కరగిపోయెరా నా బ్రతుకు కరగిపోయెరా నా బ్రతుకు

వెన్న మీగడలు జున్ను పాలకు ఏమి కొరతరా మన యింట
పాలను ముచ్చిలి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్యా ఈ తల్లి హృదయము ఓర్వలేదయా

ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ యెదురు చూతురా గోపాలా
ఎంత పిలచినా ఎంత వేడినా ఈ నాటికి దయరాదేల

గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల
గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల

https://www.youtube.com/watch?v=6KLid-HkoFc 

సరససామదానభేదదండ చతుర - త్యాగరాజస్వామి కృతి

 


సరససామదానభేదదండ చతుర సాటి దైవమెవరే బ్రోవవే

పరమ శాంభవాగ్రేసరుండగుచు పల్కు రావణుండు తెలియలేకపోయె

హితవు మాటలెంతో బాగ బల్కితివి సతముగానయోధ్యనిచ్చేనంటివి
నత సహోదరుని రాజు చేసి రాక హతము చేసితివి త్యాగరాజనుత

ఓ శ్రీరామా! సందర్భోచితంగా సామదానభేదదండోపాయములలో నిపుణుడవైన నీ సాటి దైవమెవరు, నన్ను బ్రోవుము! శివభక్తులలో అగ్రగణ్యుడనని గొప్పలు చెప్పుకునే రావణుడు నీ మహత్తును తెలుసుకోలేకపోయాడు. యుద్ధ సమయములో హితవైన మాటలను ఎంతో బాగా పలికినావు, తప్పును తెలుసుకుని శరణు కోరినచో శాశ్వతముగా అయోధ్యను కూడా ఇచ్చెదననినావు, దుష్టుడైన రావణుని వీడి నీ శరణు కోరిన అతని సోదరుడు విభీషణుని రాజు చేసినావు, దండోపాయముతో రావణుని హతము చేసినావు, పరమశివునిచే నుతించబడే ఓ శ్రీరామా! నన్ను బ్రోవుము. 

- త్యాగరాజస్వామి

శ్రీరామచంద్రుని గుణవైభవాలను మనోజ్ఞంగా ఆవిష్కరించే ఈ కృతిని సద్గురువులు కాపీనారాయణి రాగంలో స్వరపరచారు. ఈ కృతిని రంజని-గాయత్రి సోదరీమణులు అద్భుతంగా ఆలపించారు. 

 https://www.youtube.com/watch?v=ZSsiWR4W5wA 

శ్రీ చంద్రశేఖరాయ నమస్తే నమస్తే - అక్కారై స్వర్ణలత గారి రచన


 

శ్రీ చంద్రశేఖరాయ నమస్తే నమస్తే
శ్రీకరాయ సదా భక్త జన చింతితార్థ శుభఫలప్రదాయ

శ్రీ చంద్రమౌళీశ్వర పూజకాయ దయామయాయ
మహాచార్యాయ శ్రోత్రియాయ మహార్థోపదేశాయ వరాయ

దాస జనాది మనోహరాయ దాన దీక్షా పరాయణాయ
భాసమాన శాంతచిత్తాయ భాగధేయ నిర్ధారకాయ

సరసిజ వదన సముజ్జ్వలాయ పరమానంద సుభాగ్యదాయ
కీరవాణయే శిక్షకాయ సుఖప్రదాయ జగన్మయాయ

ఓ శ్రీ చంద్రశేఖర మహాస్వామీ! మీకు పునఃపునః నమస్కారములు. మీరు మంగళప్రదులు, భక్తుల సత్కోరికలను నెరవేర్చి శుభఫలాలను అనుగ్రహించేవారు. శ్రీ చంద్రమౌళీశ్వరుని పరమభక్తితో ఆరాధించే కరుణామూర్తి, వేదశాస్త్రాలలో ప్రవీణులైన మహాచార్యులు, పరమార్థాన్ని బోధించే జగద్గురువులు. మీ సౌమ్యత, దాతృత్వం, ధర్మనిష్ఠ, ప్రశాంత స్వభావం అందరి హృదయాలను ఆకర్షిస్తాయి. భక్తుల జీవితాలను శ్రేయోమార్గంలో నడిపించి వారికి భాగ్యం, ఆనందం, శుభం ప్రసాదిస్తారు. కమలంలా ప్రకాశించే ముఖకాంతితో, మధురమైన ఉపదేశంతో జగత్తును సన్మార్గంలో నడిపిస్తూ, సమస్త జీవులకు సుఖశాంతులను అనుగ్రహించే సర్వవ్యాపక దివ్యస్వరూపులు మీరు. మీకు నమస్కారములు. 

- అక్కారై స్వర్ణలత గారి రచన, సంగీతం.  

https://www.youtube.com/watch?v=gLrUa7W7Xeo

2, జులై 2026, గురువారం

అలంపురం జోగులాంబ క్షేత్ర విశేషాలు



దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన అలంపురం, శైవం–శాక్తేయం రెండింటి వైభవాన్ని ఏకకాలంలో దర్శింపజేసే అరుదైన పుణ్యక్షేత్రం. ఇక్కడ వెలసిన జోగులాంబ అమ్మవారు అష్టాదశ మహా శక్తి పీఠాలలో ఒకరిగా భక్తులచే ఆరాధింపబడుతున్నారు. నవబ్రహ్మేశ్వరాలయాలతో కలిసి ఈ క్షేత్రం భారతీయ ఆధ్యాత్మిక, చారిత్రక, శిల్పకళా సంపదకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచింది.

క్షేత్ర పరిచయం

తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున, కృష్ణా–తుంగభద్రా సంగమానికి సమీపంలో అలంపురం ఉంది. పురాణాలలో ఈ ప్రాంతాన్ని హేమలాపురం, దక్షిణ కాశి, అలాగే శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమ ద్వారం అని పేర్కొన్నారు. స్కంద పురాణంలో కూడా ఈ క్షేత్ర మహిమ ప్రస్తావించబడింది.  ఇక్కడ ఒకవైపు జోగులాంబ అమ్మవారు శక్తి స్వరూపిణిగా కొలువై ఉండగా, మరోవైపు ఏడవ–ఎనిమిదవ శతాబ్దాలకు చెందిన నవబ్రహ్మ శివాలయాలు శైవ సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి.

శక్తి పీఠంగా అలంపురం

పురాణాల ప్రకారం, దక్ష యజ్ఞంలో అవమానానికి గురైన సతీదేవి యోగాగ్నిలో దేహత్యాగం చేసింది. విషాదంలో మునిగిన పరమశివుడు ఆమె దేహాన్ని మోస్తూ తాండవం చేయగా, లోకాల రక్షణార్థం మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. అలంపురంలో సతీదేవి పై దవడ పళ్లు (Upper Teeth) పడినట్లు శాక్తేయ సంప్రదాయం విశ్వసిస్తుంది. అందువల్ల ఈ క్షేత్రం అష్టాదశ మహా శక్తి పీఠాలలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది.  పూర్వకాలంలో ఈ ప్రాంతం హలంపురం, హేమళాపురంగా పిలువబడేది.

జోగులాంబఅనే పదం తెలుగు పదమైన యోగుల అమ్మనుండి ఉద్భవించిందని పండితులు చెబుతారు. అంటే యోగులకు తల్లి, యోగసాధకులను కాపాడే ఆదిశక్తి అనే భావన. ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపంలో దర్శనమిస్తారు. శవంపై ఆసీనురాలై, తలపై తేలు, బల్లి, కప్ప వంటి ప్రతీకలతో కనిపించడం విశేషం. ఇవి జీవన–మరణ చక్రం, ప్రకృతిలోని భయాలను అధిగమించే దివ్యశక్తికి సంకేతాలుగా భావిస్తారు. 

చారిత్రక కాలక్రమం (Timeline)

 క్రీస్తుశకం 7వ శతాబ్దం బాదామి చాళుక్యుల పాలనలో జోగులాంబ ఆలయం మరియు నవబ్రహ్మ శివాలయాలు నిర్మించబడ్డాయి. ఆ కాలంలో అలంపురం దక్షిణ భారతదేశంలో ప్రముఖ శైవ–శాక్త కేంద్రంగా అభివృద్ధి చెందింది.  7వ–9వ శతాబ్దాల మధ్య చాళుక్యులు తొమ్మిది శివాలయాలను నిర్మించారు. వీటినే నవబ్రహ్మ ఆలయాలు అంటారు. ఇవి భారతీయ దేవాలయ శిల్పకళలో ప్రారంభ దశ నాగర శైలికి అద్భుత ఉదాహరణలుగా నిలిచాయి.   14వ శతాబ్దం (సుమారు 1390 ఛే)సమయంలో బహమనీ దండయాత్రల సమయంలో అసలు జోగులాంబ ఆలయం ధ్వంసమైంది. అయితే భక్తులు అమ్మవారి మూలవిగ్రహాన్ని రక్షించి సమీపంలోని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో శతాబ్దాల పాటు భద్రపరిచి నిత్యపూజలు కొనసాగించారు.  దాదాపు ఆరు శతాబ్దాల తరువాత 2005లో ఆధునిక ఆలయం నిర్మించి, పురాతన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించారు. అప్పటి నుండి జోగులాంబ అమ్మవారు మళ్లీ స్వస్థానంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 

నవబ్రహ్మ ఆలయాల విశిష్టత

అలంపురంలోని తొమ్మిది శివాలయాలు: బాల బ్రహ్మ,  స్వర్గ బ్రహ్మ,  పద్మ బ్రహ్మ,  అర్క బ్రహ్మ,  వీర బ్రహ్మ,  కుమార బ్రహ్మ, గరుడ బ్రహ్మ,  విశ్వ బ్రహ్మ,  తారక బ్రహ్మ. ఈ ఆలయాలు ఎర్రరాతితో నిర్మించబడి, ఉత్తర భారత నాగర శైలి మరియు దక్షిణ భారత ద్రావిడ శైలుల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తాయి. బాలబ్రహ్మేశ్వర ఆలయంలో నేటికీ నిత్యపూజలు కొనసాగుతున్నాయి. 

ఆధ్యాత్మిక విశిష్టత

అలంపురం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శివుడు మరియు శక్తి ఒకే క్షేత్రంలో సమాన ప్రాధాన్యంతో ఆరాధింపబడుతున్నారు. భక్తులు ముందుగా జోగులాంబ అమ్మవారిని దర్శించి, అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించడం సంప్రదాయంగా భావిస్తారు.

ఈ క్షేత్ర దర్శనంతో శత్రు బాధలు తొలగుతాయని, గ్రహదోషాలు శాంతిస్తాయని, యోగసిద్ధి, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందని, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం. 

ముఖ్య ఉత్సవాలు

జోగులాంబ ఆలయంలో సంవత్సరం పొడవునా పూజలు జరుగుతున్నప్పటికీ ముఖ్యంగా ఆశ్వయుజ నవరాత్రులు, విజయదశమి, మహాశివరాత్రి, కార్తీకమాస ప్రత్యేక పూజలు, శక్తి హోమాలు, చండీ పారాయణాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భాలలో వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివస్తారు. 

శిల్పకళా ప్రాముఖ్యం

నవబ్రహ్మ ఆలయాలు భారత పురావస్తు శాఖ (ASI) సంరక్షణలో ఉన్న ప్రముఖ చారిత్రక కట్టడాలు. చాళుక్యుల ప్రారంభ దేవాలయ నిర్మాణ శైలికి ఇవి గొప్ప నిదర్శనాలు. పట్టడకల్, ఐహోళె వంటి కర్ణాటక దేవాలయాల అభివృద్ధికి పూర్వ రూపంగా అలంపురం ఆలయాలను పరిశోధకులు పేర్కొంటారు.

కూడవెల్లి సంగమేశ్వర ఆలయం – చాళుక్యుల ప్రాచీన శైవ సంపద

అలంపురం పుణ్యక్షేత్రంలో జోగులాంబ అమ్మవారి ఆలయం, నవబ్రహ్మ దేవాలయాలతో పాటు అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో కూడవెల్లి (కూడలి) సంగమేశ్వర స్వామి ఆలయం ఒకటి. సంగమేశ్వరఅనే పేరు సంగమంఅనే పదం నుండి ఉద్భవించింది. ఒకటి కంటే ఎక్కువ పవిత్ర నదులు కలిసే ప్రాంతానికి సంగమం అని పేరు. ఈ ఆలయం మొదట కృష్ణా–తుంగభద్రా నదుల సంగమానికి సమీపంలోని కుడవెల్లి గ్రామంలో నిర్మించబడింది. శాసనాధారాల ప్రకారం ఇది అలంపురంలోని చాళుక్య దేవాలయాలలో అత్యంత ప్రాచీనమైన నిర్మాణంగా భావించబడుతోంది.  చాళుక్యుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం శైవ ఆరాధనకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా అసలు స్థలం జలాశయంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడడంతో, భారత పురావస్తు శాఖ (ASI) 1979–1990 మధ్యకాలంలో ఆలయాన్ని రాతి రాయిగా   విడదీసి, ప్రస్తుత అలంపురం సమీపానికి తరలించి యథాతథంగా పునర్నిర్మించింది. భారతదేశంలో విజయవంతంగా పునఃస్థాపించబడిన ప్రాచీన దేవాలయాలలో ఇది ఒక విశిష్ట ఉదాహరణగా గుర్తింపు పొందింది. 

ఆలయం తూర్పు ముఖంగా నిర్మించబడింది. గర్భగృహం, అంతరాలయం, మండపం, నంది మండపం, శిల్పాలతో అలంకరించిన స్తంభాలు చాళుక్య శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. గంగ, యమునా, శివుని వివిధ రూపాలు, మకరతోరణాలు, హంసతోరణాలు వంటి శిల్పాలు విశేష ఆకర్షణగా నిలుస్తాయి.  భక్తుల విశ్వాసం ప్రకారం సంగమేశ్వర స్వామిని దర్శించడం ద్వారా పితృదేవతల అనుగ్రహం, పాప విమోచనం, కుటుంబ శ్రేయస్సు లభిస్తాయి. ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తీకమాసం సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు.

పాపనాశి దేవాలయ సముదాయం – పాపాలను హరించే పవిత్ర క్షేత్రం

అలంపురానికి నైరుతి దిశలో సుమారు 1.5 కి.మీ. దూరంలో ఉన్న పాపనాశి దేవాలయ సముదాయం చాళుక్యుల తరువాత రాష్ట్రకూటులు మరియు పశ్చిమ చాళుక్యుల కాలంలో, సుమారు 9వ నుండి 11వ శతాబ్దాల మధ్య నిర్మించబడింది. ఈ సముదాయంలో ప్రస్తుతం 23 ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా శివునికి అంకితం చేయబడినప్పటికీ, విష్ణు, దేవి మరియు ఇతర దేవతలకు సంబంధించిన శిల్పాలు కూడా కనిపిస్తాయి.  ఈ సముదాయంలోని ప్రధాన ఆలయం పాపనాశీశ్వర స్వామి ఆలయం. పాపనాశిఅనే పేరుకు అర్థం పాపాలను నశింపజేసేవాడు. ఈ క్షేత్రంలో భక్తిశ్రద్ధలతో స్నానం చేసి, శివుని దర్శించి పూజలు చేస్తే జన్మజన్మాంతర పాపాలు తొలగుతాయని విశ్వాసం. అందుకే ఈ ప్రాంతానికి పాపనాశిఅనే పేరు వచ్చింది.  ఈ ఆలయాలు ప్రధానంగా నాగర శిల్పశైలిలో నిర్మించబడ్డాయి. గర్భగృహాలు, మండపాలు, నంది విగ్రహాలు, నాట్యమూర్తి శివుడు (నటరాజ), సప్తమాతృకలు, సముద్రమథనం వంటి పురాణ ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలు భారతీయ దేవాలయ కళకు అపూర్వ నిదర్శనాలు. శ్రీశైలం జలాశయ నిర్మాణంతో ఈ ఆలయాల అసలు ప్రదేశం మునిగిపోయే ప్రమాదం ఏర్పడడంతో, భారత పురావస్తు శాఖ 1980లలో ఈ దేవాలయాలను శాస్త్రీయ పద్ధతిలో విడదీసి ఎత్తైన ప్రదేశానికి తరలించి పునర్నిర్మించింది. ఈ పునఃస్థాపన భారతీయ వారసత్వ సంరక్షణలో ఒక గొప్ప విజయంగా పరిగణించబడుతుంది. 

యాత్రికులకు ఉపయోగకరమైన సమాచారం

రాష్ట్రం: తెలంగాణ
జిల్లా: జోగులాంబ గద్వాల
సమీప నగరం: కర్నూలు (సుమారు 27 కి.మీ.)
హైదరాబాద్ నుండి దూరం: సుమారు 220 కి.మీ.
సమీప నదులు: తుంగభద్రా – కృష్ణా సంగమం
ప్రత్యేకతలు: అష్టాదశ మహా శక్తి పీఠం, నవబ్రహ్మ శివాలయాలు, దక్షిణ కాశి, శ్రీశైల పశ్చిమ ద్వారం. 

1, జులై 2026, బుధవారం

శ్రీశైలం ఇష్టకామేశ్వరి దేవి ఆలయం



ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో, శ్రీశైలం క్షేత్రానికి సమీపంలోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన పవిత్ర శక్తి పీఠమే **శ్రీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయం**. శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవి ఆలయాల తర్వాత భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకునే క్షేత్రాలలో ఇది ఒకటి. ప్రకృతి ఒడిలో, గుహను పోలిన చిన్న ఆలయంలో కొలువై ఉన్న ఈ అమ్మవారు భక్తుల కోరికలను నెరవేర్చే దేవిగా విశ్వసించబడుతున్నారు. "ఇష్టకామేశ్వరి" అనే పేరుకే "భక్తుల ఇష్టకామ్యాలను నెరవేర్చే దేవి" అనే అర్థం ఉంది. 

ఈ ఆలయం శ్రీశైలం నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతంలో ఉంది. సాధారణ వాహనాలు వెళ్లలేని మార్గం కావడంతో ప్రత్యేక జీపుల ద్వారా కొంతదూరం ప్రయాణించి, అక్కడి నుంచి కొంతదూరం కాలినడకన చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం సాహసోపేతమైనదైనా, నల్లమల అడవుల సహజ సౌందర్యం భక్తులకు మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. అడవి సంరక్షణ నిబంధనల కారణంగా సాయంత్రం తర్వాత ఈ ప్రాంతంలో ప్రవేశానికి పరిమితులు ఉంటాయి. 

ఆలయంలోని ప్రధాన దేవత పార్వతీదేవి స్వరూపమైన ఇష్టకామేశ్వరి అమ్మవారు. అమ్మవారి విగ్రహం నాలుగు చేతులతో దర్శనమిస్తుంది. రెండు చేతుల్లో తామర పుష్పాలు, మరో చేతిలో శివలింగం, ఇంకో చేతిలో రుద్రాక్ష జపమాలను ధరించి ఉంటుంది. ఈ రూపం శైవ సంప్రదాయంలో పార్వతీదేవి తపోమూర్తి స్వరూపాన్ని సూచిస్తుందని పండితులు భావిస్తారు. ఆలయం చిన్న గుహలో ఉండటం వల్ల అక్కడి ప్రశాంతమైన వాతావరణం భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని మరింత పెంచుతుంది. 

ఈ ఆలయంలో అత్యంత విశేషంగా చెప్పుకునే అంశం అమ్మవారి నుదురు. దర్శనానికి వచ్చిన భక్తులు కుంకుమను అమ్మవారి నుదుటిపై సమర్పించడం ఆనవాయితీ. ఆ సమయంలో విగ్రహం నుదుటి భాగం మానవ చర్మంలా మృదువుగా అనిపిస్తుందని అనేక మంది భక్తులు తమ అనుభవంగా చెబుతారు. దీనిని భక్తులు దైవ మహిమగా భావిస్తారు. అయితే ఇది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని గుర్తుంచుకోవాలి. 

స్థానిక చెంచు గిరిజనులు ఈ ఆలయ సేవా కార్యక్రమాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ తరతరాలుగా అమ్మవారిని ఆరాధిస్తున్నారు. శ్రీశైలం ప్రాంత చరిత్రలో చెంచు సమాజానికి ప్రత్యేక స్థానం ఉండటంతో, ఈ ఆలయం వారి ఆధ్యాత్మిక సంప్రదాయాలకు కూడా ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ దద్దోజనం, పొంగలి వంటి నైవేద్యాలను సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 

ఇష్టకామేశ్వరి ఆలయం నిర్మాణ కాలానికి సంబంధించిన ఖచ్చితమైన శాసన ఆధారాలు లేనప్పటికీ, ఆలయ నిర్మాణ శైలి మరియు శిల్పకళను పరిశీలించిన చరిత్రకారులు దీనిని సుమారు 8వ నుండి 10వ శతాబ్దాల మధ్యకాలానికి చెందిన ప్రాచీన దేవాలయంగా భావిస్తున్నారు. ఈ ఆలయం శ్రీశైలం మహాక్షేత్ర పరిధిలోని ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది.

ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రకృతి, ఆధ్యాత్మికత, ప్రాచీన సంప్రదాయం ఈ మూడు అంశాల సమ్మేళనంగా నిలిచిన ఇష్టకామేశ్వరి దేవి ఆలయం శ్రీశైలం యాత్రలో తప్పక దర్శించదగిన పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది.  

28, జూన్ 2026, ఆదివారం

బహుముఖప్రజ్ఞాశాలి పసుపులేటి కన్నాంబ




 తెలుగు సినీ చరిత్రలో భాష, నవరసాలు మేళవించిన నటనాకౌశలం కలిగిన నటీమణులలో సావిత్రి కన్నా ముందు తరం వారిలో అగ్రగణ్యురాలు పసుపులేటి కన్నాంబ గారు. ఆరోజుల్లో ఏడువారాల నగలు వేసుకునే ధనవంతురాలైన మహిళగా పేరోందారు. బాగా సంపాదిస్తున్న రోజుల్లో ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ దాచుకునేవారట. నిండైనా విగ్రహం, అనన్యసమానమైన వాక్పటిమ, సంభాషణల్లో స్పష్టత. పల్నాటి నాగమ్మగా, ద్రౌపదిగా, కౌసల్యగా, జోథాబాయిగా, చంద్రమతిగా, చండికగా, పార్వతిగా, కణ్ణగిగా ఎన్నో పౌరాణిక చారిత్రాత్మక మరియు సాంఘిక పాత్రలను 170కు పైగా చిత్రాలలో అద్భుతంగా పోషించిన నటనారాణి కన్నాంబ గారు. అంతే కాదు సావిత్రి, అనసూయ, అన్నపూర్ణ వంటి స్త్రీపాత్రలే కాదు, ఎన్నో మగపాత్రలు కూడా నాటకాలలో వేశారు కన్నాంబగారు. ఆవిడ పద్యాలు పాడితే వన్స్ మోర్ అని ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ కోరేవారట. 

పసుపులేటి కన్నాంబ జన్మతేదీ గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. వివిధ వేదికల్లో ఆమె జనన సంవత్సరం 1910, 1912, 1913గా పేర్కొనబడింది. అయితే, 1949 అక్టోబరులో పేసుం పడం పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నాంబ తన జన్మతేదీ 1911 అక్టోబర్ 5 అని పేర్కొన్నారు. 

కన్నాంబ కడపలో లోకాంబ, వెంకటనరసయ్య దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి ప్రభుత్వ కాంట్రాక్టర్. ఏకైక సంతానమైన కన్నాంబ, ఏలూరులోని తన మాతామహుల వద్ద పెరిగింది. ఆమె తాత నాథముని నాయుడు గ్రామ వైద్యుడు కాగా, అమ్మమ్మ గ్రామ నర్సుగా సేవలందించేది. చిన్నప్పటి నుంచే ఆమెకు సంగీతంపై మంచి పట్టు ఉండేది. కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందింది. సాహిత్యం, కవిత్వం అంటే అమితమైన అభిరుచి ఉన్న ఆమె తాత, ఆమె విద్యాభ్యాసాన్ని స్వయంగా పర్యవేక్షించారు. 

రంగస్థల ప్రవేశం

1927లో, పదహారేళ్ల వయసులో, ఏలూరులో నారాల నాటక సమాజం ప్రదర్శించిన హరిశ్చంద్ర నాటకాన్ని కన్నాంబ వీక్షించింది. ఆ నాటకంలో చంద్రమతి పాత్రధారి ఎంతో భావోద్వేగంతో పాట పాడుతూ ఏడ్చినా, ప్రేక్షకులు నవ్వారు. అది చూసిన కన్నాంబ, "ఇంకా బాగా నటించాలి" అని గట్టిగా వ్యాఖ్యానించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ నటుడు, "నటన అంత సులభం కాదు, నువ్వే వచ్చి చేసి చూపు" అని సవాలు విసిరాడట. కన్నాంబ వెంటనే వేదికపైకి ఎక్కి పాట పాడి, నటించి, కాసేపటి క్రితం నవ్విన అదే ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది. ఆమె అసాధారణ నటనా ప్రస్థానానికి అదే నాంది అయింది. మరుసటి రోజే ఆమె ఆ నాటక సంస్థలో ప్రధాన నటిగా చేరి, అనసూయ, సావిత్రి, యశోద వంటి పాత్రలను పోషించి విశేష ప్రశంసలు అందుకుంది.

ఈ నాటక సమాజ నిర్వాహకుల్లో ఒకరైన కడారు నాగభూషణం కన్నాంబను ప్రేమించి 1934 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. అది ఆయన రెండో వివాహం. నాగభూషణం గారు నాటక ప్రయోక్త, దర్శక నిర్మాతలు. అదే సంవత్సరం ఈ దంపతులు శ్రీరాజరాజేశ్వరి నాట్య మండలి అనే తమ స్వంత నాటక సంస్థను స్థాపించి, మద్రాస్ ప్రెసిడెన్సీతో పాటు నిజాం ప్రాంతాల్లోనూ నాటకాలు ప్రదర్శించారు. తదుపరి అడుగు సహజంగానే సినీరంగమే అయింది. స్టార్ కంబైన్స్ సంస్థకు చెందిన ఎ. రామయ్య, కొల్హాపూర్‌లోని శాలిని సినీటోన్ స్టూడియోలో రూపొందిన హరిశ్చంద్ర చిత్రంలో చంద్రమతి పాత్ర కోసం ఆమెను ఆహ్వానించారు. ఆమె అంగీకరించడంతో సినీ జీవితం ప్రారంభమైంది.

ఆ తర్వాత బెజవాడకు చెందిన సరస్వతి టాకీస్ సంస్థ ద్రౌపది వస్త్రాపహరణం (1936) చిత్రంలో ద్రౌపది పాత్రను ఆమెకు అప్పగించింది. ఈ చిత్రం కూడా కొల్హాపూర్‌లోనే తెరకెక్కింది. వెల్ పిక్చర్స్ నిర్మించిన కనకధార చిత్రంలో ఆమె విషాదభరిత నటనకు అపారమైన ప్రశంసలు లభించాయి. అలా ఆమె స్టార్‌గా ఎదగడం ప్రారంభమైంది. అనంతరం హెచ్.ఎం.రెడ్డి, బి.ఎన్.రెడ్డిలతో కలిసి గృహలక్ష్మి(1938) చిత్రంలో నటించారు. తరువాత జయా ఫిలిమ్స్ నిర్మించిన కాళిదాసు చిత్రంలో నటించింది. ఈ సంస్థే తర్వాత శోభనాచల స్టూడియోస్, అనంతరం వీనస్ స్టూడియోస్‌గా రూపాంతరం చెందింది. సరస్వతి టాకీస్ భాగస్వామ్యంతో రూపొందిన చండిక చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఆ చిత్రంలో కోపం, ద్వేషం, ప్రేమ వంటి విభిన్న భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించి, అప్పటివరకు విషాద నాయికగా ఉన్న తన ఇమేజ్‌కు భిన్నమైన కోణాన్ని చూపించింది.

తమిళ చిత్రరంగంలో అడుగులు

రాజగోపాల్ పిక్చర్స్, మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (తరువాతి జెమినీ స్టూడియో)లో కృష్ణ తూతు చిత్రాన్ని నిర్మించాలనుకున్నప్పుడు, దర్శకుడు రఘుపతి ప్రకాశ్ ఆమెను తన తొలి తమిళ చిత్రానికి ఎంపిక చేశారు.అయితే తమిళ సంభాషణల ఉచ్చారణలో తడబాటు, బలమైన తెలుగు యాస కారణంగా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. కానీ, ఎం.కె.త్యాగరాజ భాగవతార్ నటించిన క్లాసిక్ చిత్రం అశోక్ కుమార్ నిర్మాతలు ఆమెపై విశ్వాసం ఉంచారు. ఆ చిత్రంలో రచయిత ఎలంగోవన్ రాసిన తమిళ సంభాషణలను ఆమె ఎంతో చక్కగా పలకడంతో, 1941లో రూపొందిన కణ్ణగి చిత్రంలో ప్రధాన పాత్రకు ఆమెనే సహజ ఎంపికగా మారింది.

ఇప్పటికే ఆమె, భర్త నాగభూషణంతో కలిసి శ్రీరాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీని స్థాపించారు. త్యాగరాజ భాగవతార్ పాటలకు అనుగుణంగా నృత్యం చేయడానికి ఆమె ప్రత్యేకంగా భరతనాట్యం నేర్చుకుంది. ఆయన పాడితే ఆమె నర్తించడం అనే తరహా దృశ్యాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించి, తర్వాతి చిత్రాలకు మార్గదర్శకంగా నిలిచాయి.

అమరమైన నటన

జూపిటర్ ఫిలిమ్స్ నిర్మించిన కణ్ణగి చిత్రానికి ఆర్.ఎస్.మణి దర్శకత్వం వహించగా, ఎలంగోవన్ కథ, సంభాషణలు రాశారు. సాహిత్య గంభీరతతో కూడిన కవితాత్మక తమిళాన్ని భావోద్వేగం, స్పష్టమైన ఉచ్చారణ, సరైన లయతో ఆమె పలికిన తీరు చిరస్మరణీయంగా నిలిచింది. ఆ చిత్రంలో ఆమె నటన ఈ రోజుకీ ఆదర్శప్రాయంగా భావించబడుతుంది. కన్నాంబ పేరు "కణ్ణగి" పాత్రకు పర్యాయపదంగా మారిపోయింది. ఆ చిత్రంలో ఆమె, యు.ఆర్.జీవరత్నం మధ్య సాగిన ప్రశ్నోత్తర గీతం తర్వాతి కాలంలో అనేక చిత్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎస్. వి. వెంకట్రామన్‌కు  ఈ అవకాశం రావడానికి కారణం, అప్పటికే కన్నాంబ నిర్మించిన తల్లి ప్రేమ చిత్రానికి ఆయన సంగీతం సమకూర్చడం. అనంతరం ఆయన మీరా వంటి చిరస్మరణీయ చిత్రాలకు సంగీతం అందించారు.

కన్నాంబగారు కేవలం నటి మాత్రమే కాదు, గాయని కూడా. సినిమాల్లో నటించడమే కాకుండా అనేక చిత్రాల్లో తన పాటలను తానే ఆలపించారు. ఆ కాలంలో ప్లేబ్యాక్ విధానం పూర్తిగా స్థిరపడకముందు నటీనటులే పాటలు పాడేవారు. గృహలక్ష్మి, తల్లిప్రేమ, చండిక, మాయా మచ్చీంద్ర, పల్నాటి యుద్ధం వంటి చిత్రాల్లో ఆమె గానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కన్నాంబ గారు నవరసాలను సమానంగా పోషించిన అరుదైన నటి. చాలామంది "ట్రాజెడీ క్వీన్"గా గుర్తించినప్పటికీ, ఆమె విషాద పాత్రలకే పరిమితం కాలేదు. పౌరాణిక, చారిత్రాత్మక, జానపద, సాంఘిక చిత్రాల్లో కోపం, వీరత్వం, కరుణ, హాస్యం, భక్తి వంటి అన్ని రసాలను సమర్థంగా ప్రదర్శించి నవరస నటిగా పేరు తెచ్చుకున్నారు. 

ఆమె భర్త కడారు నాగభూషణంతో కలిసి స్థాపించిన శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ దక్షిణ భారత చిత్రసీమలో అత్యంత క్రమశిక్షణ కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటిగా పేరుపొందింది. వీరు సిబ్బందికి జీతాలు నెలాఖరుకే ముందుగానే చెల్లించేవారు. సెట్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయం కల్పించేవారు.కళాకారులు, సాంకేతిక నిపుణులను కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారు. 

కన్నాంబ దంపతులు అవసరంలో ఉన్నవారికి డబ్బులు అప్పుగా ఇవ్వడం, చాలామందికి హామీదారులుగా సంతకాలు చేయడం వల్ల భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్నారు. నిర్మించిన కొన్ని సినిమాలు కూడా నష్టపోవడంతో జీవితాంతంలో ఆర్థిక పరిస్థితి బలహీనపడింది. ఆవిడ స్థాపించిన నిర్మాణ సంస్థ తెలుగు, తమిళ భాషలతో పాటు కొన్ని చిత్రాలను కన్నడలో కూడా నిర్మించింది. ఆ కాలంలో బహుభాషా నిర్మాణాలను చేపట్టిన తొలి మహిళా నిర్మాతల్లో ఆమె ఒకరు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీరంగంలో అగ్రనటిగా కొనసాగారు. ఆవిడ నిర్మించిన నవజీవనం (1949) చిత్రం అప్పటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఉత్తమ చిత్రంగా గుర్తింపు పొందింది. ఇది ఆమె నిర్మాతగా సాధించిన ముఖ్య విజయాల్లో ఒకటి. 1940–50 దశకాల్లో ఆమెకు ఉన్న ప్రజాదరణ ఎంతగానో ఉండేది. అప్పట్లో మార్కెట్లో కన్నాంబ లోలాకులు అనే పేరుతో ఆభరణాలు కూడా అమ్ముడయ్యేవని సినీ రచయిత రావికొండలరావు తన రచనల్లో పేర్కొన్నారు. 

ఆమె చివరి చిత్రాలు

ఆమె జీవితం చివరిదశలో కూడా నటన కొనసాగించారు. "ఆత్మబలం", "రామదాసు", "పరువు ప్రతిష్ఠ", "లవకుశ", "ఆప్తమిత్రులు", "ఆత్మబంధువు" వంటి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. 

మరణానంతరం చోటుచేసుకున్న విషాద సంఘటన

కొన్ని జీవితచరిత్రలు, కుటుంబ సభ్యుల కథనాల ప్రకారం, కన్నాంబను సంప్రదాయం ప్రకారం నగలతో సమాధి చేయగా, అనంతరం ఆమె సమాధిని దొంగలు తవ్వి నగలు అపహరించారని, ఆమె భౌతికకాయం కూడా కనిపించకుండా పోయిందని ప్రచారంలో ఉంది. దీనిపై పలు కథనాలు ఉన్నప్పటికీ, ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు పరిమితంగానే ఉన్నాయి. 

మహిళా నిర్మాతలకు మార్గదర్శి

1930–40 దశకాల్లో మహిళలు నటించడం కూడా అరుదైన కాలంలో, కన్నాంబ నటి మాత్రమే కాకుండా నిర్మాణ సంస్థను విజయవంతంగా నడిపిన తొలి తెలుగు మహిళా నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. ఆమె తర్వాత భానుమతి, సావిత్రి వంటి నటీమణులు నిర్మాణ రంగంలోకి రావడానికి ఆమె ఆదర్శంగా నిలిచారు. 

వ్యక్తిత్వం, కుటుంబం, వారసత్వం

కన్నాంబ అత్యంత భక్తిశ్రద్ధలు కలిగిన వ్యక్తి. ప్రతి రోజు సినిమా షూటింగ్‌కు బయలుదేరే ముందు పూజ చేసేది. ఆమెకు సంతానం లేకపోవడంతో ఒక కుమారుడిని, ఒక కుమార్తెను దత్తత తీసుకున్నారు. కుమార్తె రాజరాజేశ్వరి, దర్శకుడు సి. పుల్లయ్య కుమారుడు, దర్శకుడు సి. ఎస్. రావును వివాహం చేసుకుంది. దత్తపుత్రుడు తబలా విద్వాంసుడు. 170కుపైగా చిత్రాల్లో నటిగా, 25కుపైగా చిత్రాలకు నిర్మాతగా సేవలందించిన ఆమె కెరీర్‌లో మనోహర చిత్రంలో రాజమాత పాత్ర మరో మైలురాయిగా నిలిచింది.

ప్రముఖ నటి అంజలీదేవి కన్నాంబ గురించి ఇలా గుర్తుచేసుకున్నారు - తమిళంలో సంభాషణలు ఎలా చెప్పాలో, పెద్దలకు నమస్కారం ఎలా చేయాలో వంటి చిన్నచిన్న విషయాలనూ ఆమె మాకు నేర్పేవారు. తమిళ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనేక తెలుగు నటీనటులకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు.

1964 మే 7న కన్నాంబ కన్నుమూశారు. ఏ భాషలోనైనా రాణించాలంటే ఆ భాషను నేర్చుకోవాలనే సంకల్పం ఉంటే చాలని కన్నాంబ తన జీవితంతో నిరూపించారు. నేటి తరానికి కూడా అది ఒక గొప్ప పాఠమే. 

బ్రోచే వారెవరే రఘుపతే - త్యాగరాజస్వామి కృతి

బ్రోచే వారెవరే రఘుపతే! నిను వినా బ్రోచే వారెవరే! శ్రీరామ నెనరున బ్రోచే వారెవరే! సకల లోక నాయక! బ్రోచేవారెవరే! నరవర! నీ సరి బ్రోచేవారెవరే! మున...