24, సెప్టెంబర్ 2026, గురువారం

ఎంత పని జేసితివి రామా - భద్రాచల రామదాసు కృతి


ఎంత పని జేసితివి రామా! నిన్నేమందు సార్వభౌమా! (నీవు) 

పంతమా నా మీద పరమ పావననామ! సంతోషముడిపితివి సకల సద్గుణధామ!

నిన్నే దైవంబనుచు నమ్మి రామ తిన్నగా దుఃఖములజిమ్మి
కన్నదినమని నెమ్మి నిన్ను సేవింపగ నన్నిట్లు నట్టేట ముంచుటెరుగకపోతి  

అన్నన్న మాటాడవేరా నీ కన్నులను నను జూడవేరా
చిన్నెలన్నియు దరిగియున్న ఈ చిన్నన్న క్రన్ననను జూడు మా యన్న ఓ రామన్న  

భద్రాద్రివాసుడౌ రామా మనుపు మము నిరుపద్రవముగానుండుమనుచు
భద్రనుత కరుణాసముద్ర యోశ్రీరామభద్ర నిన్నే మదిని భద్రముగ నమ్మితిని 

ఓ రామా! నీవు నాపట్ల ఎంత పని చేశాయ్యా! సార్వభౌమా! నిన్ను నేనేమని అనగలను? పరమ పవిత్రమైన నామము కలవాడఅవు! నాపైన నీకు ఇంత పంతమేమిటయ్యా? సకల సద్గుణాలకు నిలయమైన నీవు నా సంతోషమంతా పోగొట్టితివి. నీవే నా దైవమని నమ్ముకున్న నాకు రామా! వరుసగా దుఃఖాలను కలిగించితివి. నిన్ను కన్నరోజే ధన్యమైన రోజని సంతోషించి నిన్ను సేవిస్తుంటే, నన్నిలా నట్టేట ముంచుతావని నేను ఎరుగకపోయితిని. అన్నా! నాతో ఒక్క మాటైనా మాట్లాడవేరా? నీ కన్నులతో నన్ను కనికరించి చూడవేరా? నా శక్తిసామర్థ్యాలన్నీ కరిగిపోయి దీనుడనై ఉన్న ఈ చిన్నవాడిని ఒక్కసారి చూడవయ్యా! మా అన్నవైన ఓ రామన్నా! భద్రాద్రిలో నివసించే రామా! మమ్మల్ని కాపాడి ఎలాంటి ఉపద్రవాలు లేకుండా ఉండేలా రక్షించుము. భక్తులచే స్తుతింపబడే కరుణాసముద్రుడవు! శ్రీరామభద్రా! నీవే నాకు భద్రమైన ఆశ్రయమని నా మనసులో సంపూర్ణంగా నమ్ముకున్నాను. 

నాదనామక్రియ రాగంలో స్వరపరచబడిన ఈ భద్రాచల రామదాసు కృతిని ఆకాశవాణి భక్తిరంజని బృందగానంలో వినండి. 

గరుడ గమన రారా - భద్రాచల రామదాసు కృతి


గరుడ గమన రారా నను నీ కరుణనేలు కోరా

పరమపురుష ఏ వెరవు లేక నీ
మరుగు జొచ్చితిని అరమర సేయక 

పిలువగానే రమ్మి అభయము తలపగానే ఇమ్మి
కలిమి బలిమి నా కలలో నీవని పలవరించిన నను గన్నాయ్య 

పాలకడలిశయనా దశరథబాల జలజనయన
పాల ముంచినా నీట ముంచినా నీ పాలబడితిని జాలము సేయక 

యేల రావు స్వామి నను ఇపుడేలుకోవదేమి
ఏలువాడవని చాల నమ్మితిని ఏల రావు కరుణలవాల హరి

ఇంత పంతమేల భద్రగిరీశ వరకృపాల
చింతలణచి శ్రీరామదాసుని అంతరంగపతివై రక్షింపుము 

గరుడుని వాహనంగా కలిగిన శ్రీరామా! నాపై నీ కరుణ చూపించి నన్నేలుకో!  పరమపురుషా! మరే విధమైన భయమూ లేకుండా నిన్నే ఆశ్రయించాను. నాపట్ల ఎలాంటి భేదభావమూ చూపకుండా నన్ను ఆదరించుము. నేను పిలిచిన వెంటనే వచ్చి నన్ను కాపాడుము. నిన్ను తలచిన వెంటనే నాకు అభయమివ్వుము. సంపదలోనూ, బలంలోనూ, చివరకు నా కలలోనూ నీవే నాకు ఆధారమని పలవరిస్తున్న నన్ను కన్నతండ్రిలా ఆదుకొనుము. పాలసముద్రంపై శయనించే పరమాత్మా! దశరథుని కుమారుడవు! కమలాల వంటి కన్నులు కలవాడవు! నన్ను పాలలో ముంచినా, నీటిలో ముంచినా నేను నీకే చెందినవాడిని. నీ పాలనే పడ్డాను. ఇక ఆలస్యం చేయకుండా నన్ను రక్షించుము. స్వామీ! ఇంకా ఎందుకు రావు? ఇప్పుడైనా వచ్చి నన్ను ఏలుకొని కాపాడవేమి? నీవే నన్ను ఏలే ప్రభువని ఎంతో నమ్ముకున్నాను. కరుణకు నిలయమైన హరీ! మరి ఎందుకు రావు? భద్రగిరీశా! వరాలను, కృపను ప్రసాదించేవాడవు! నాపై ఇంత పట్టుదల ఎందుకు? నా చింతలన్నింటినీ తొలగించి, ఈ రామదాసుని హృదయంలో కొలువై ఉన్న ప్రభువుగా నన్ను రక్షించు స్వామీ!

సురటి రాగంలో స్వరపరచబడిన ఈ భద్రాచల రామదాసు కృతిని ఆకాశవాణి భక్తిరంజని బృందగానంలో వినండి.


రామ సీతారామ - భద్రాచల రామదాసు కృతి



రామ సీతారామ రఘురామ జయరామా
రామా నా మనవి విని ఏమంటివి రామా

అపరాధిని నెపమెన్నక కృప జూడుము రామ
జపతపము జేసి గతి నెపమెరుగను రామా

పాపాత్ముడ బహుబాధల పాలైతిని రామా
ఏపారగ పెనుభూతము దాపాయెను రామా

కవరమున పర స్త్రీలను కనుగొంటిని రామా
ఏవిధముగ దుష్కర్మము లెడబాపెదో రామా

ఇల సౌఖ్యంబధికంబని ఎంచితిరా రామా
కలకాలంబొక రీతిని గడువదుగద రామా 

అనుదినమును నెమ్మనమున కనుగొంటిని రామా
ఘనకోపిని బహుపాపిని మనజాలను రామా 

సురవందిత భద్రాచల వరనిలయుడ రామా
కరుణగలిగి రామదాసుని కరుణించవె రామా 

సీతారామా! రఘురామా! జయరామా! నేను చేస్తున్న ఈ మనవిని విని నీవేమంటావో చెప్పుమయ్యా. నేను అపరాధినైనా నా తప్పులను లెక్కించకుండా నాపై కృప చూపుము. జపతపాలు చేసి సద్గతి పొందే మార్గమేమిటో కూడా నాకు తెలియదు. పాపాత్ముడనై ఎన్నో బాధలకు పాలయ్యాను. అంతులేని పెద్ద భూతంలాంటి ఆపద నన్ను చుట్టుముట్టింది. కామవికారంతో పరస్త్రీలను చూశాను. నేను చేసిన ఈ దుష్కర్మాలన్నీ ఏ విధంగా తొలగిపోతాయో తెలియడం లేదు. ఈ లోకంలోని సుఖాలే గొప్పవని భావించాను. కానీ జీవితం ఎల్లకాలమూ ఒకే విధంగా సాగదని ఇప్పుడు గ్రహిస్తున్నాను. ప్రతిరోజూ నా మనస్సులోని దోషాలను గమనిస్తున్నాను. తీవ్రమైన కోపం కలవాడిని, ఎన్నో పాపాలు చేసినవాడిని, నా మనస్సును అదుపులో ఉంచుకోలేకపోతున్నాను. దేవతలచే పూజించబడే వాడవు, పవిత్రమైన భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీరామా! నాపై దయ కలిగి ఈ రామదాసుని కరుణించి రక్షించుమయ్యా. 


ఝంఝూటి రాగంలో స్వరపరచబడిన ఈ భద్రాచల రామదాసు కృతిని బృందగానంగా వినండి. 

23, సెప్టెంబర్ 2026, బుధవారం

శరణాగత రక్షణ బిరుదని - భద్రాచల రామదాసు కృతి



శరణాగత రక్షణ బిరుదని నే శరణంటిగదయ్యా
వెరవకుమని అభయంబొసగవే నను గన్నతండ్రివయ్యా

కరివరదా సిరులొసగను దశరథ నందన రావయ్యా
నిరతము నీ నామము నా జిహ్వకు రుచికరమయ్యా 

ముద్దులొలుక రామదాసుడని ముచ్చటలాడుమయ్యా
పద్దులన్నీ దీర్చెడి భద్రాచలపతి నీవేనయ్యా 

శ్రీరామా! శరణాగతులను రక్షించేవాడనే బిరుదు నీకు ఉన్నదని నమ్మి నేను నీ శరణు వేడితిని కదయ్యా! భయపడవద్దని నాకు అభయమిచ్చి కాపాడవయ్యా, నీవే నన్ను కన్న తండ్రివయ్యా! గజేంద్రుని రక్షించిన వరదా! దశరథనందనుడవైన శ్రీరామా! నాకు సంపదలను ప్రసాదించుటకు రావయ్యా! ఎల్లప్పుడూ నీ నామమే నా నాలుకకు ఎంతో రుచికరమై ఉన్నదయ్యా! ప్రేమ పొంగేలా నన్ను రామదాసుడని పిలుస్తూ నాతో ముచ్చటలాడుమయ్యా! నా అప్పులన్నింటినీ తీర్చగల భద్రాచలపతివి నీవే కదయ్యా! 

యమన్ కల్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ భద్రాచల రామదాసు కృతిని మల్లాది సోదరులు ఆలపించారు. 

 

కోదండరామా కోదండరామా - భద్రాచల రామదాసు కృతి


కోదండరామా కోదండరామా కోదండరామా పాహి

నీ యండ నాకు! నీవెందు బోకు!
వాదేల నీకు! వలదు పరాకు!
శ్రీరామ! మమ్ము చేపట్టుకొమ్ము!
ఆదుకోరమ్ము! ఆరోగ్యమిమ్ము!

జయ రఘువీరా! జగదేక శూరా!
భయవినివారా! భక్త మందారా!
మణిమయభూషా! మంజులభాషా!
రణవిజయఘోషా! రమణీయవేషా! 

తల్లివి నీవే! తండ్రివి నీవే!
తాతయు నీవే! దైవము నీవే!
సరసిజనేత్రా! సౌందర్య గాత్రా!
పరమ పవిత్రా! భవ్య చరిత్రా!

వందనమయ్యా! వాదేలనయ్యా!
దండన సేయ తగదు మీకయ్యా!
లాలితహాసా! లక్ష్మీవిలాసా!
పాలితదాసా! భద్రాద్రివాసా!

ఓ కోదండరామా! మమ్ములను రక్షింపుము. నీ అండ మాకు కావలి, నీవు వేరెక్కడికీ పోవద్దు. మాతో వాదములు, పరాకు వద్దు. శ్రీరామా! మమ్ములను చేపట్టి ఆదుకొనుము, మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించుము. ఓ రఘువీరా! నీవు జగదేకశూరుడవు, నీకు జయము. మా భయాలను పారద్రోలేవాడవు, భక్తుల పాలిట కల్పవృక్షానివి! మణులతో పొదగబడిన ఆభరణములతో అలంకరించబడిన వాడవు, మృదువైన సంభాషణలు చేసేవాడవు, యుద్ధములో విజయశంఖారావాన్ని పూరించేవాడవు, అందమైన రూపము కలవాడవు, మమ్ములను రక్షింపుము. శ్రీరామా! నీవే మాకు తల్లి, తండ్రి, తాత మరియు దైవము. కలువల వంటి కన్నులు, అందమైన రూపము కలవాడవు! పరమ పవిత్రమైన వాడవు, గొప్ప చరిత్ర కలవాడవు, మమ్ములను రక్షింపుము. ఓ శ్రీరామ! నీకు వందనములు, మాతో వాదనలు ఎందుకు? మమ్ములను శిక్షించటం మీకు తగదు.  అందమైన చిరునవ్వు కలవాడవు, లక్ష్మీదేవితో విలాసముగానున్నవాడవు, దాసులను పాలించేవాడవు, భద్రాద్రిలో నివసించే వాడవు, మమ్ములను రక్షింపుము.  

బిలహరి రాగంలో స్వరపరచబడిన ఈ భద్రాచల రామదాసు కృతిని మల్లాది సోదరులు పిల్లలకు నేర్పించిన వీడియో. 

ఓ రఘువీరా యని - భద్రాచల రామదాసు కృతి



ఓ రఘువీరా యని నే పిలచిన ఓహో యనరాదా

సారెకు వేసారి నా మది అన్యము చేరదు యేరా ధీరా రామా

నీట జిక్కి కరి మాటికి వేసారి నాటకధర నీ పాటలు పాడగ
మేటి మకరి తల మీటి కాచు దయ యేటికి నాపై నేటికి రాదో

మున్ను సభను ఆపన్నత వేడుచు నిన్ను కృష్ణా యని యెన్నగ ద్రౌపది
కెన్నో వలువలిడి మన్నన బ్రోచిన వెన్నుడ నామొర వింటివో  లేదో 

బంటునైతినని యుంటే పరాకుననుంటివి ముక్కంటి వినుత నామ
జంట బాయకను వెంటనుండుమని వేడితి భద్రాచల వాసా 

రఘువీరా అని నేను పిలిచితే ఓహో అని స్పందించవయ్యా అని ఎంత అందంగా పలికారో రామదాసు. అన్యదైవం యొక్క తలపే లేకుండా స్వామిపై పరిపూర్ణమైన నమ్మకంతో, మకరి బారి నుండి ఆ గజేంద్రుని కాపాడిన దయను తనపై చూపుమని, కురుసభలో ఆపదలో ద్రౌపది కృష్ణా అని వేడుకోగా చీరలిచ్చి మానాన్ని కాపాడిన రీతి తన మొరను వినుమని, నీకు బంటుగా ఉంటానని నిశ్చయించుకుంటే పరాకుగా  ఉన్నావు, తోడు వీడకుండా వెంట ఉండమని వేడుకొంటున్నాను  అన్నారు రామదాసు గారు. ఈ భద్రాచల రామదాసు కృతిని మల్లాది సోదరులు సామ రాగంలో ఆలపించారు.  

రావయ్య భద్రాచల రామ - భద్రాచల రామదాసు కృతి


రావయ్య భద్రాచల రామ రమణీయ జగదభిరామ లలామ 

కేవల భక్తి విలసిల్లగ భావము దెలిసిన దేవుడవైతే 

ప్రొద్దుప్రొద్దున నిన్ను పొగడుచునెపుడు పద్దు మీరగను భజన చేయుచు
గద్దరి తనమున ప్రొద్దులు పుచ్చుచు ముద్దులు గులుకుచు మునుపటివలెనిటు

దోసములెంచని దొరవని యెప్పుడు దోసిలొగ్గి నినే కొలుత పరాకు
దాసును తప్పులు దండముతో నీవు మీసము గలిగిన దాసపోషకుడై 

ననుగన్న తండ్రి నామదిలోన నీకన్ననితరుల గొలిచెదనా
శ్రీకర దివ్య ప్రభాకరకుల రత్నాకర పూర్ణ సుధాకర తేజా  

భద్రాచల రామా! జగత్తంతటికీ ఆనందాన్ని కలిగించే సుందర స్వరూపుడా, అందరిలో శ్రేష్ఠుడా, రావయ్యా! నా హృదయంలో కేవలం నీపై భక్తి మాత్రమే వెలుగొందుతున్నదనీ, నా అంతరంగ భావం ఏమిటో తెలిసిన దేవుడవు నీవేననీ నమ్ముతున్నాను. ప్రతిరోజూ తెల్లవారినప్పటి నుంచే నిన్ను స్తుతిస్తూ, సమయాన్ని కూడా లెక్కచేయకుండా నిరంతరం నీ భజన చేస్తూ ఉన్నాను. అయినా నీవు నా దగ్గరకు రాకుండా మొండితనంతో రోజులు గడుపుతున్నావేమిటి? మునుపటిలాగా ప్రేమతో నా దగ్గరకు వచ్చి ముద్దులు కురిపిస్తూ నన్ను ఆదరించవయ్యా. భక్తుల దోషాలను లెక్కించకుండా కాపాడే దొరవు నీవని నమ్మి, ఎల్లప్పుడూ చేతులు జోడించి నిన్నే కొలుస్తున్నాను. నా మొరను నిర్లక్ష్యం చేయవద్దు. నీ దాసుడనైన నేను తప్పులు చేసినా వాటిని దండనతో సరిదిద్దే అధికారం నీకున్నది. దాసులను పోషించి రక్షించే సమర్థుడైన ప్రభువుగా నన్ను కాపాడవయ్యా. నన్ను కన్న తండ్రివి నీవే. నీవు నా మనసులో ఉండగా నిన్ను విడిచి మరొకరిని నేను ఎలా కొలుస్తాను? మంగళాన్ని ప్రసాదించేవాడా, దివ్యమైన ప్రకాశంతో వెలిగేవాడా, సూర్యవంశకులమనే సముద్రానికి అమూల్య రత్నమా, పూర్ణచంద్రునివలె అమృతకాంతులు వెదజల్లే తేజోమయుడా, భద్రాచల రామా, నా వద్దకు రావయ్యా! 

ఆనందభైరవి రాగంలో స్వరపరచబడిన ఈ భద్రాచల రామదాసు కృతిని నేదునూరి కృష్ణమూర్తి గారు ఆలపించారు.

బ్రోచే వారెవరే రఘుపతే - త్యాగరాజస్వామి కృతి

బ్రోచే వారెవరే రఘుపతే! నిను వినా బ్రోచే వారెవరే! శ్రీరామ నెనరున బ్రోచే వారెవరే! సకల లోక నాయక! బ్రోచేవారెవరే! నరవర! నీ సరి బ్రోచేవారెవరే! మున...