29, ఆగస్టు 2020, శనివారం

కదలేవాడు గాడే రాముడు - త్యాగరాజస్వామి కృతి


 

వాగ్గేయకారుల గొప్పతనం వారి అనుభూతులను అద్భుతమైన వర్ణనలుగా ఆవిష్కరిస్తూనే మూలతత్త్వాన్ని పరిపూర్ణంగా తెలియజేయటంలో కూడా ఉంది. గురుకృప వలన నాకు ఉదయమే త్యాగరాజస్వామి వారి కీర్తనల పుస్తకం తీసి ఆ పేజీలో ఉన్న కీర్తనను అర్థం చేసుకునే అలవాటు కొన్నేళ్లుగా ఉంది. ఈరోజు పరబ్రహ్మమైన రాముని ఆయన అద్భుతంగా సులభమైన పదాలలో వర్ణించిన కృతి కనబడింది. మానవజన్మ ఎత్తి ధర్మాచరణ చేసి ధర్మాన్ని స్థాపించిన రాముడు మనకు తెలుసు. ఆ స్థాయిని దాటి రాముని పరబ్రహ్మ తత్త్వంగా దర్శించి తరించిన త్యాగయ్య ఆ వైభవాన్ని మనతో కూడా పంచుకున్న కృతి ఇది. మానసగోచరమైతే తప్ప ఇటువంటి కృతులను రచించలేరు. అటువంటి రామసాక్షాత్కారం పొంది నిరంతరం రామామృతపానం చేస్తూ తరించిన త్యాగరాజస్వామి మన కర్మభూమిపై మన భాషలో కృతులను రచించటం మన అదృష్టం.

కదలేవాడు గాడే రాముడు కథలెన్నో గలవాడే

మొదలే తానైనాడే తుదమొదలే లేనివాడైనాడే

కల్పనలెన్నడు లేడు సంకల్పములే కలవాడు శేష
తల్పశయనుడే వాడు శ్రీత్యాగరాజ నుతుడైనాడే

శ్రీరాముడు చరాచర స్వరూపుడు. స్థావరరూపుడైనను, జంగమ రూపములతో వేదవేదాంత పురాణేతిహాసములలో అనేక కథలు గలవాడు. సనాతనుడు, శాశ్వతుడు, మొదలు తుది లేనివాడు, సత్యమైనవాడు, మాయాతీతుడు, అనంతమైన సృష్ట్యద్భుతాలనే సంకల్పముగా గలవాడు, నారాయణునిగా ఆదిశేషునిపై శయనించుచున్నవాడు, శంకరునిచే నుతింబడుచున్నాడు శ్రీరామచంద్రుడు. 

నారాయణగౌళ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మల్లాది సోదరులు ఆలపించారు.

రామా నీపై తనకు ప్రేమ బోదు - త్యాగరాజస్వామి కృతి



 త్యాగరాజస్వామి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, ఆయన నిశ్చలమైన రామభక్తిని సూచించే కృతులు ఎన్నో ఉన్నాయి. వాటిలో కేదార రాగంలో కూర్చిన "రామా నీపై తనకు" అనే కృతి ఒకటి. తనకు రామునిపై కలిగే భావనలు, ఉన్న ధ్యాస అంతా రాముని కరుణే అని, భోగభాగ్యలలో కూడా రామునిపైనే మనసు నిలిచి యుండి పరమానందము పొందుచున్నానని, స్వామిపై తన ప్రేమ అచంచలమైనదని సహస్రార కమలము వికసించిన యోగి లక్షణాలను ప్రస్ఫుటంగా కనబరచారు. నిరంతర రామ నామ సంకీర్తనతో అన్నిటా రామునే దర్శిస్తూ, అన్నీ రాముని వల్లనే అని తన అవ్యాజమైన భక్తిని ప్రకటించారు.

రామా! నీపై తనకు ప్రేమ బోదు! సీతా

తామరస నయన! నీదేమో మాయ గాని

మనసు నీ పదములనే జేర కనులు నీ రూపమునే కోర
విను నీ పేరులకే నోరూర తన పై ఇది నీ కరుణేరా!

జననీజనకాప్తులన్యులు ధన కనక గురు వేల్పులు
దినము నీవేయని మాటలు అనగా ఇవి నా భూషణములు!

భోగానుభవములందు బాగుగ బుద్ధి నీయందు
త్యాగరాజుని హృదయమందు వాగీశానందమందు!

ఓ సీతారామా! నీపై నా ప్రేమ ఎన్నటికీ తరగదు. కలువలవంటి కన్నులు గల రామా! నీది ఏమి మాయో కానీ నీపై ప్రేమ ఎన్నటికీ తరగదు. ఓ రామా! నీ పదములనే చేరుకోవాలని నా మనసు, నీ రూపమునే చూడాలని నా కన్నులు కోరుతున్నాయి, నీ నామముల ఉచ్చరించుటకే నా నోరూరుతున్నది, ఇది అంతా నీ కరుణే, నీపై నా ప్రేమ ఎన్నటికీ తరగదు. ఓ రామా! తల్లి, తండ్రి, బంధువులు, ఇతరులు, ధనము, బంగారము, గురువు, దైవము నిత్యమూ నీవే అనే మాటలు నా ఆభరణములు,నీపై నా ప్రేమ ఎన్నటికీ తరగదు. భోగములు అనుభవించుటలో కూడా బుద్ధి నీపైనే నిలిచియున్నది, నా హృదయమునందు బ్రహ్మానందము కలిగించుచున్నది, నీపై నా ప్రేమ ఎన్నటికీ తరగదు.

కేదార రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని నిత్యశ్రీ మహదేవన్ గారు ఆలపించారు.

వినరాదా నా మనవి - త్యాగరాజస్వామి వారి క్షేత్ర కృతి


వినరాదా నా మనవి!

కనకాంగ! కావేటి రంగ! శ్రీకాంత! కాంతలెల్ల కామించి పిలచితే!

తేజినెక్కి బాగ తెరువున రాగ! రాజసతులు చూచి రమ్మని పిలచితే!

భాగధేయ వైభోగ రంగ! శ్రీత్యాగరాజనుత! తరుణులు పిలచితే!

ఓ శ్రీరంగనాథా! నా మనవి వినరాదా! బంగారు మేని ఛాయగల కావేటి రంగా! లక్ష్మీపతీ! కాంతలందరూ నిన్ను కోరి పిలీచితే వినరాదా! అశ్వమునెక్కి చక్కని రాజమార్గమున రాగా, రాజసతులు నిన్ను జూచి రమ్మని పిలచితే వినరాదా! భాగ్యవంతుడవై ఎన్నో వైభోగములు కలిగిన, శివునిచే నుతించబడిన ఓ శ్రీరంగనాథా! స్త్రీలందరు నిన్ను పిలుచుతున్నారు, వినరాదా!

త్యాగరాజస్వామి కావేరీ తీరంలో ఉన్న తిరువాయూరులో నివసించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన కూడా దీక్షితులవారి లాగానే అనేక క్షేత్రాలను దర్శించారు. అందులో కావేటి రంగనాథుని అనేక మార్లు దర్శించుకుని నుతించారు. ఆ సందర్భంగా ఆయన రచించిన ఒక క్షేత్ర కృతి దేవగాంధారి రాగంలో కూర్చబడిన ఈ వినరాద నా మనవి. దేవగాంధారి రాగం శరణాగతికి, భక్తికి, విన్నవించుకునే భావానికి ప్రతీక. త్యాగరాజస్వామి ఈ కృతిలో రంగనాథుని మధురభక్తిలో ఓలలాడుతున్న స్త్రీల మనోభావనలను ఆవిష్కరించారు. గోదా స్వామి మధురభక్తిలో తరించి ఆ స్వామిలో జీవైక్యం చెందిన సంగతి తిరుప్పావై మొదలైన గ్రంథముల ద్వారా మనకు తెలిసిందే. ఆ మార్గంలోనే ఎందరో స్త్రీలు కావేటి రంగనాథుని కొలిచి ముక్తిని పొందారు. ఈ కీర్తనలో వర్ణించినట్లుగానే శ్రీరంగంలోని రంగనాథుని వైభవం ఉంటుంది. ఆ స్వామి ఊరేగింపులు, సేవలు, భోగములు, అక్కడి వాతావరణం మధురభక్తికి అనుక్షణం అద్దం పడతాయి. త్యాగరాజస్వామి రచనలలో ఆయన ఆధ్యాత్మిక సోపానం, జీవితంలో వేర్వేరు దశలలోని ఆయన మానసిక పరిస్థితిని ఆవిష్కరిస్తాయి. ఈ కీర్తన ఆయన మధురభక్తిని ఆస్వాదించి అనుభూతి చెంది రచించిన ఆయన యుక్త వయసును సూచిస్తుంది. తరువాత ఆయన త్యాగం, శరణాగతి, భక్తి భావనలతో అంతర్ముఖులై మరింత విశిష్టమైన కృతులను రచించారు. ఈ కృతిని ప్రియా సోదరీమణులు గానం చేశారు.

భజన సేయ రాద - త్యాగరాజస్వామి కృతి

సగుణోపాసనలో తరించిన వాగ్గేయకారులలో త్యాగరాజస్వామి అగ్రగణ్యులు. సహస్రశీర్షుడైన పరమాత్మ విరాట్ స్వరూపాన్ని మన ఇంద్రియములు గ్రహించి ఆనందించగలిగిన రూపంలో చూసి తన్మయులై తరించారు త్యాగయ్య. ఆ స్థితిలో ఆయన నోట వెలువడిన కృతులు కొన్ని వేలు. అటువంటిదే సామాన్యులకు కూడా అర్థమయ్యే ఈ భజన సేయరాదా అన్న కృతి. కనకమయ చేలములు ధరించి మోహనరూపుడైన రాముని ఆకృతిని తలచుచు అన్నీ మరచి భజన చేయుము అని మనసుకు, మనకు బోధించారు త్యాగయ్య.

భజన సేయ రాద! రామ భజన సేయ రాద!

అజ రుద్రాదులకు సతతమాత్మ మంత్రమైన రామ

కరుకు బంగారు వల్వ కటినెంతో మెరయగ
చిరునవ్వులు గల మొగమును చింతించి చింతించి

అరుణాభాధరమును సురుచిర దంతావళీని
మెరయు కపోల యుగమును నిరతమునను దలచి దలచి

బాగుగ మానస భవసాగరమునను తరింప
త్యాగరాజు మనవిని విని తారకమగు రామ నామ

ఓ మనసా! రాముని భజన సేయ రాదా! బ్రహ్మ రుద్రాదుల ఆత్మలకు నిరంతరము మననమైన రామ భజన చేయరాదా! కరుకైన బంగారు వస్త్రము నడుమున మెరుస్తూ ఉండే రాముని భజన చేయరాదా! చిరునవ్వులు గల ఆ స్వామి మోమును సదా ధ్యానించుచు, సూర్యుని వలె ప్రకాశించే ఎర్రని పెదవులు, అందమైన పలువరస, మెరిసే బుగ్గలు కలిగిన రాముని నిరంతరము తలచుచు భజన చేయరాదా! త్యాగరాజు మనవిని విని భవసాగరములను దాటేందుకు అద్భుత సాధనమైన రామ నామ భజన చేయరాదా!

అఠానా రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

త్యాగరాజస్వామి జీవిత విశేషాలు



పుష్య బహుళ పంచమి (1847 సంవత్సరం) కాకర్ల త్యాగరాజస్వామి వారు సిద్ధి పొందిన రోజు. తిరువాయూరులో కావేరీ తీరాన శిష్యులందరూ చూస్తుండగా విదేహముక్తి పొందిన వారు త్యాగయ్య. వారి చరిత్రను ప్రధానంగా రచించిన వారు ఆయన శిష్యులు వాలాఝీపేట వేంకటరమణ భాగవతార్ గారు, కృష్ణస్వామి భాగవతార్ గారు. విశేషమేమిటంటే వీరిద్దరు తండ్రీ కొడుకులు. తండ్రి త్యాగయ్య జీవితంలోని మొదటి భాగం విశేషాలు వ్రాయగా, కృష్ణస్వామి భాగవతార్ గారు రెండవ భాగం విశేషాలు రచించారు. వీరు తాళపత్రాలలో, నోటుబుక్కుల రూపంలో ఉన్న త్యాగయ్య సాహిత్యాన్ని మదురైలోని సౌరాష్ట్ర సభలో పదిల పరచారు. అక్కడే త్యాగయ్య ఉపయోగించిన తంబుర మొదలైన అపురూపమైన వస్తువులు కూడా ఉన్నాయి. ఈ తండ్రీ కొడుకులిద్దరూ కూడా త్యాగరాజస్వామి వరి చరిత్రను తెలుగులోనే రచించారు. ప్రముఖ సంగీత పరిశోధకులు పీ. సాంబమూర్తి గారు కృష్ణస్వామి గారిని స్వయంగా కలిసి, వారి జీవితశైలిని గమనించి కొన్ని సంభాషణలకు పుస్తక రూపం కూడా ఇచ్చారు. ఆ తండ్రీ కొడుకుల జీవితంపై త్యాగయ్య సాహిత్య ప్రభావం పరిపూర్ణంగా ఉందని సాంబమూర్తి గారి గమనిక.

త్యాగరాజస్వామి వారి సాహిత్యాన్ని తెలుగులో పుస్తక రూపంలో మొట్ట మొదట ప్రచురించిన ప్రముఖులు నరసింహ భాగవతార్ గారు, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు. నరసింహ భాగవతార్ గారు 1908లో సద్గురు త్యాగరాజస్వామి కీర్తనలు అన్న పుస్తకాన్ని రచించగా, వీరభద్రశాస్త్రి గారు 1948లో త్యాగరాజ కీర్తనలు - సవ్యాఖ్యానం అన్న పుసక్తం రచించారు. రెండూ, తరువాతి వారికి ప్రామాణికమైనాయి. ఈ రెండు పుస్తకాలలోని కీర్తనల సాహిత్యం, స్వరాలు కూడా వేంకటరమణ భాగవతార్/కృష్ణస్వామి భాగవతార్ గార్లు సౌరాష్ట్ర సభలో ఉంచిన తాళపాత్ర సాహిత్యంతో పూర్తిగా సారూప్యం కలిగి ఉన్నాయి.

తరతరాలుగా తంజావూరు ప్రాంతంలో తెలుగు వారే ఎక్కువ ఉండే వారు - ముఖ్యంగా రాజపోషణకు, ధనధాన్య సమృద్ధికి. అందుకే తెలుగు ప్రధాన భాషగా ఉండేది. త్యాగయ్య సాహిత్యం మొత్తం (కొన్ని సంస్కృత కీర్తనలు తప్ప) అచ్చ తెలుగులోనే. అద్భుతమైన రససిద్ధికి తెలుగు భాష పరిపూర్ణంగా తొడైంది. అప్పటి దేశకాల పరిస్థితులను కూడా ఆ సాహిత్యం తెలుగులో చక్కగా ప్రతిబింబించింది. తంజావూరు ప్రాంతం బ్రాహ్మణ ప్రవృత్తికి అనువైన ప్రాంతం కావటంతోనే అక్కడ కావేరీ తీరాన వారు స్థిర పడ్డారు. అదే సాంప్రదాయానికి చెందిన వారు త్యాగయ్య.

త్యాగరాజస్వామి వారి కుటుంబం పరమేశ్వరాజ్ఞతో తిరువాయూరు ఎలా వచ్చిందో నిన్న తెలుసుకున్నాము. అక్కడే త్యాగయ్య సంస్కృత పాఠశాలలో విద్యనభ్యసించారు. తండ్రి వద్ద రామతారక మంత్రోపదేశాన్ని పొందారు. చిన్ననాటి నుండే తండ్రి ప్రోద్బలంతో రామోపాసనలో నిమగ్నులైనారు. రామకృష్ణానందస్వామి అనే సన్యాసి వద్ద రామ షడక్షరీ మంత్రోపదేశం పొంది తీవ్రమైన సాధన చేశారు. త్యాగయ్య చిన్నతనంలోనే సాహిత్యాన్ని రచించారు. ఆ సంగీత సాహిత్యాభిలాషను చూసి తండ్రి ఆయనను తంజావూరు రాజాస్థానంలో విద్వాంసులైన శొంఠి వేంకటరమణయ్య గారి వద్ద కర్నాటక శాస్త్రీయ సంగీత విద్యను నేర్చుకోవటానికి చేర్చారు. విద్యతో పాటు నారద భక్తి ఆయనలో పెంపొందింది. తన తాతగారు గిరిరాజ కవి రచించిన కృతులను ఆయన ఆలపిస్తూ భక్తి పారవశ్యంలో ఉండేవారు. స్వయంగా నారదుడే త్యాగయ్యలోని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై "స్వరార్ణవము" అనే పుస్తకాన్ని అందించారు. దాదాపుగా 20 ఏళ్ల పాటు త్యాగయ్య రామ తారక మంత్రాన్ని జప సాధన చేశారు. ఆ విధంగా రామకోటి పూర్తైన తరుణంలో శ్రీరామచంద్రుడు త్యాగరాజస్వామికి ప్రత్యక్షమై అనుగ్రహించాడు. అప్పుడు ఆయన నోట "బాలకనకమయ చేల" అన్న కృతి వెలువడినట్లు ఆయన సమకాలీకులు తెలిపారు. ఇక అప్పటి నుండి త్యాగయ్య సాహిత్యం గంగా ప్రవాహమే. అతి త్వరలోనే త్యాగయ్య గురువు గారి నుండి బంగారు పతకం, రాజు గారి ప్రశంస పొందారు.ఆ పతకాన్ని తిరిగి గురువు గారి కుమార్తెకు వివాహంలో బహుమతిగా ఇచ్చారు త్యాగయ్య. రాజుగారి కానుకలను, ఆశ్రయాన్ని తిరస్కరించారు.

తంజావూరు రాజా వారి అల్లుడైన మోతీరావు గారు తరచూ త్యాగరాజస్వామి వారింటికి వచ్చి వారి సంగీతాన్ని విని ఎంతో ఆనందించేవారు. మద్రాసులో గొప్ప ధనవంతులైన కోవూరు సుందర మొదలియార్ త్యాగయ్యను వారి ఇంటికి రావలసిందిగా ఆహ్వానించారు. కానీ నరస్తుతికి విముఖులైన త్యాగయ్య దానిని తిరస్కరించారు. అప్పుడు మొదలియార్ వారు కాంచీపురంలో స్థితులైన గొప్ప యతీంద్రులు ఉపనిషద్బ్రహ్మం గారి ద్వారా తన మనవిని విన్నవించారు. ఉపనిషద్బ్రహం గారు 108 ఉపనిషత్తులపై భాష్యాలు, రామ తరంగిణి, రామ అష్టపది, అనేక గ్రంథాలు రచించారు. వీరు తొలుత తంజావూరులో నివసించినప్పుడు 12 ఏళ్ల బాలుడైన త్యాగయ్య వీరి రామభక్తికి ఎంతో తన్మయుడైనాడు. వారి రామ అష్టపది ఆలపనలు త్యాగయ్యను ఎంతో ప్రభావితం చేశాయి. ఉపనిషద్బ్రహ్మం గారు త్యాగయ్యకు తీర్థయాత్ర చేస్తూ దారిలో తమను కలవవలసిందిగా కోరతారు. ఆయన కోరిక మన్నించి త్యాగయ్య తిరుమల తీర్థయాత్ర వెళుతూ దారిలో కాంచీపురంలో ఉపనిషద్బ్రహ్మం గారి అగస్త్యాశ్రమానికి వెళ్లి అక్కడి సీతారాములను, యంత్రోద్ధారక హనుమంతుని అర్చిస్తారు. తిరుమల యాత్ర మార్గమధ్యంలో అనేక క్షేత్రాలు దర్శించి కృతులను రచించారు త్యాగయ్య.

తన జీవిత చరమాంకంలో త్యాగయ్య సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. పుష్య బహుళ పంచమి నాడు బ్రాహ్మణులకు పేదలకు అన్నసంతర్పణ చేసి కావేరీ తీరాన భజనలు ఆలపించబడుచుండగా రామునిలో ఐక్యమైనారు. అక్కడ ఆయన శిష్యులు కట్టిన సమాధి కొంతకాలానికే శిథిలమైపోగా బెంగళూరు నాగరత్నమ్మ గారు తన స్వంత ద్రవ్యాన్ని వినియోగించి నేడున్న సమాధి మందిరం నిర్మించారు. అంతకు ముందు రెండుగా చీలి విడి విడిగా జరుగుతున్న త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను ఏకం చేసి భవ్యంగా ఆ ఉత్సవాలను తిరువైయారులో నిర్వహించే ఏర్పాట్లను చేశారు. నేడు జరుగుతున్న త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఆ పరంపరవే.

వ్యాసో నిగమ చర్చయా మృదుగిరా వల్మీక జన్మామునిః
వైరాగ్యేశుక ఏవ భక్తి విషయే ప్రహ్లాద ఏవస్వయం
బ్రహ్మా నారద ఏవచా ప్రతియ యోః సాహిత్యా సంగీతయోః
యో రామామృత పాన నిర్జిత శివః తం త్యాగరాజం భజే

సద్గురువు త్యాగరాజ స్వామి వారు వేదములను విప్పి చెప్పుట యందు వ్యాసుని వంటివారు, మధురమైన వాక్యములు రాయుటలో వాల్మీకి కవి వంటి వారు, వైరాగ్యములో శుకుని వంటి వారు, భక్తిలో ప్రహ్లాదుని వంటి వారు, సాహిత్యములో బ్రహ్మ వంటి వారు, సంగీతములో నారదుని వంటి వారు, రామ నామమనే అమృతమును గ్రోలుటలో పరమశివునికి సమానులు. అటువంటి సద్గురువులను భజిస్తున్నాను - అని ఆయన ప్రియ శిష్యుడు శ్రీ వాలాఝీపేట వేంకటరమణయ్య భాగవతార్ గారు పై శ్లోక రూపంలో నుతించారు

సుజన జీవనా - త్యాగరాజస్వామి కృతి

సుజన జీవనా! రామ! సుగుణ భూషణా! రామా!

భుజగభూషణార్చిత! బుధజనావనా!
అజవందిత! శ్రితచందన! దశతురంగ! మామవ!

చారునేత్ర! శ్రీకళత్ర! శ్రీరమ్యగాత్ర!
తారకనామ! శుభచరిత్ర! దశరథపుత్ర!
తారకాధిపానన! ధర్మపాలక!
తారయ రఘువర! నిర్మల! త్యాగరాజ సన్నుత!

 సజ్జన జీవితం గడిపిన వాడు, సుగుణాలన్నీ కలవాడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీరామచంద్రుడే. అవతార పురుషుడైనా రావణ వధ జరిగి బ్రహ్మేంద్రాదులు తెలిపేంత వరకూ మానవునిలానే జీవించిన రాముడు పార్వతీ పరమేశ్వరులచే కొలువబడిన వాడు, సజ్జనులను కాపాడిన వాడు, భక్తుల పాలిట చందనము వంటి వాడు, మంచి చరిత్ర కలవాడు, ధర్మపాలకుడు, నిర్మలుడు. గుణాలెంత గొప్పవో రూపము అంతకన్నా రమ్యమైనదిగా యున్నవాడు - చారు నేత్రుడు, రమ్యగాత్రుడు, తారలకధిపతియైన చంద్రుని వంటి ముఖము కలవాడు, దశరథ మహారాజు కుమారుడు, రఘువంశశ్రేష్ఠుడు...

నిజంగా ఈ కర్మభూమిలో జనించిన వాగ్గేయకారులు కొన్ని లక్షల కృతులు శ్రీరామునిపై రచించి ఉంటారు...వారందరిలోనూ శ్రేష్టునిగా నిలిచిన త్యాగరాజస్వామి ఎంత ధన్యజీవి! రాముని ఉపాసన చేసి, మంత్ర సిద్ధి పొంది, ఆ రాముని దర్శించి, అద్భుతంగా వర్ణించి, రామవైభవానికి అక్షర రూపమిచ్చి, సమస్త భోగాలను రామభక్తి అనే భోగం కోసం త్యాగం చేసి నాదయోగంలో తరించాడు. భక్తిబిచ్చమెత్తి రామమంత్ర భిక్షాపాత్రుడు కావడమే కాదు, భవతారకమైన ఆ రామపరబ్రహ్మ తత్త్వాన్ని తనివితీరా అనుభవించాడు. ఆయన సాహిత్యంలో పదాలు ఆయన ఆధ్యాత్మిక సోపానానికి సూచికలు. రాముడు భక్తుల పాలిట చందనమెలా అయ్యాడు అన్న ఒక్క విషయం ఆలోచిస్తే త్యాగయ్య హృదయం అర్థమవుతుంది - ఆధ్యాత్మిక, ఆధిభౌతిక తాపాలకు రామనామమే చందనంలా ఉపశమనం కలిగించేది అన్నది ఆయన జీవితంలో అడుగడుగునా మనకు సుస్పష్టంగా నిరూపించబడింది. అందుకే త్యాగయ్య రాముని భక్తచందన, శ్రితచందన అని అభివర్ణించారు.

ఖమాస్ రాగంలోని సుజన జీవనా అన్న కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

త్యాగరాజస్వామి ప్రహ్లాద భక్తి విజయం కీర్తన ఎన్నగ మనసుకు రాని - పోతన గారి పద్యాల మధ్య సారూప్యత

సద్గురువులు త్యాగరాజస్వామి అనేక వేల కీర్తనలతో పాటు ప్రహ్లాద భక్తి విజయం అనే యక్షగానం కూడా రచించారు. కీర్తనలు, పద్యాల ద్వారా ప్రహ్లాదుని ద్వారా శ్రీహరి వైభవాన్ని, భాగవత మాధుర్యాన్ని మనకు అందించారు. పోతన గారు రచించిన ఆంధ్ర మహాభాగవతం ప్రభావం త్యాగరాజస్వామిపై చాలా ఉంది అన్నది ఈ ప్రహ్లాద భక్తి విజయం పఠిస్తే అర్థమవుతుంది. పోతన భాగవతంలోని సప్తమ స్కంధం ప్రహ్లాదచరితంలోని ఈ రెండు పద్యాలకు సారూప్యమైన భావంతో త్యాగరాజస్వామి కొన్ని కీర్తనలను ప్రహ్లాద భక్తి విజయంలో పొందుపరచారు. వాటిలో ఒకటి ఎన్నగ మనసుకు రాని. పోతన పద్యాలను, త్యాగయ్య కీర్తనను పరిశీలిద్దాం,



కంజాక్షునకు గాని కాయంబు కాయమే? పవన గుంభిత చర్మ భస్త్రి గాక
వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే? ఢమ ఢమ ధ్వని తోడి ఢక్క గాక
హరి పూజనము లేని హస్తంబు హస్తమే? తరు శాఖ నిర్మిత దర్వి గాక
కమలేశు జూడని కన్నులు కన్నులే? తను కుడ్య జాల రంధ్రములు గాక

చక్రి చింతన లేని జన్మంబు జన్మమే?
తరళ సలిల బుద్బుదంబు గాక
విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే?
పాదయుగము తోడి పశువు గాక

తండ్రీ! శ్రీహరిని సేవింపని శరీరము కూడా ఒక శరీరమేనా? అది గాలితో నిండిన ఒక చర్మపు సంచి మాత్రమే. వైకుంఠవాసుని పొగడని నోరు కూడా ఒక నోరేనా? అది ఢమ ఢమ ధ్వని చేసే డప్పు మాత్రమే. హరి పూజ చేయని చేతులు కూడా చేతులేనా? అవి చెట్టుకొమ్మలతో చేయబడిన తెడ్లు మాత్రమే. కమలేశుని చూడని కన్నులు కన్నులే? అవి దేహమనే గోడలో ఉన్న రంధ్రములు మాత్రమే. చక్రధారి అయిన ఆ నారాయణుని ధ్యానించని జన్మ కూడా ఒక జన్మయేనా? అది కదులుచున్న నీటి బుడగ మాత్రమే. విష్ణుభక్తిలేని పండితుడు కూడా ఒక పండితుడా? అతడు రెండు కాళ్లున్న పశువు మాత్రమే.

హరి భక్తిలేని జీవి, దేహము ఎంత వ్యర్థమో పోతన నిష్కర్షగా ప్రహ్లాదుని నోట చెప్పించారు. అదే భావనను త్యాగరాజస్వామి తన సంకీర్తనలో ఆవిష్కరించారు.



ఎన్నగ మనసుకు రాని పన్నగ శాయి సొగసు
పన్నుగ గనుగొనని కన్ను లేలే? కంటి మిన్ను లేలే?

మోహముతో నీలవారివాహ కాంతిని గేరిన
శ్రీహరిని గట్టుకొనని దేహమేలే? ఈ గేహ మేలే?

సరసిజ మల్లె తులసి విరజాజి పారిజాత
విరులచే పూజించని కరము లేలే? ఈ కాపురము లేలే?

మాలిమితో త్యాగరాజునేలిన త్యాగరాజ మూర్తిని
లాలించి పొగడని నాలికేలే? సూత్ర మాలికేలే?

మనసు ఎంచలేని శేషసాయి సొగసును కనుగొనలేని కన్నులెందుకు? కంటిరెప్పలెందుకు? తన్మయత్వంతో నీలమేఘ కాంతిని కలిగిన శ్రీహరి రూపమును తన యందు స్థిరము చేసుకోలేని ఈ దేహమెందుకు? ఈ గృహమెందుకు? కలువలు, మల్లెలు, తులసి, పారిజాత పుష్పములచే ఆ రాముని పూజించలేని చేతులెందుకు? గృహస్థాశ్రమమెందుకు? మక్కువతో త్యాగరాజును ఏలిన ఆ స్వామిని లాలించి పొగడని నాలుకెందుకు? హారములెందుకు?

భక్తి సామ్రాజ్యంలో భాగవతోత్తముల భావనలలో ఎంత సారూప్యముంటుందో మనకు పై పద్యాలు, కీర్తన ద్వారా సుస్పష్టం. పరమాత్మకే జీవితాన్ని అంకితం చేసి దేహమనే అద్భుతమైన సాధన ద్వారా పరమాత్మ ఉపాసన చేయటం అత్యుత్తమమైన కర్మ అని ఈ భాగవతోత్తముల భావన. ఆ శ్రీహరి చింతన లేని మనసు, శ్రీహరి సేవకై ఉపయోగించబడని దేహము పూర్తిగా నిరర్థకమని ఇంతకన్నా స్పష్టంగా ఎవ్వరూ చెప్పలేరు.

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వారెందరో మహానుభావులు!

శరణాగత రక్షణ బిరుదని - భద్రాచల రామదాసు కృతి

శరణాగత రక్షణ బిరుదని నే శరణంటిగదయ్యా వెరవకుమని అభయంబొసగవే నను గన్నతండ్రివయ్యా కరివరదా సిరులొసగను దశరథ నందన రావయ్యా నిరతము నీ నామము నా జిహ్వక...