29, ఆగస్టు 2020, శనివారం

త్యాగరాజస్వామి ప్రహ్లాద భక్తి విజయం కీర్తన ఎన్నగ మనసుకు రాని - పోతన గారి పద్యాల మధ్య సారూప్యత

సద్గురువులు త్యాగరాజస్వామి అనేక వేల కీర్తనలతో పాటు ప్రహ్లాద భక్తి విజయం అనే యక్షగానం కూడా రచించారు. కీర్తనలు, పద్యాల ద్వారా ప్రహ్లాదుని ద్వారా శ్రీహరి వైభవాన్ని, భాగవత మాధుర్యాన్ని మనకు అందించారు. పోతన గారు రచించిన ఆంధ్ర మహాభాగవతం ప్రభావం త్యాగరాజస్వామిపై చాలా ఉంది అన్నది ఈ ప్రహ్లాద భక్తి విజయం పఠిస్తే అర్థమవుతుంది. పోతన భాగవతంలోని సప్తమ స్కంధం ప్రహ్లాదచరితంలోని ఈ రెండు పద్యాలకు సారూప్యమైన భావంతో త్యాగరాజస్వామి కొన్ని కీర్తనలను ప్రహ్లాద భక్తి విజయంలో పొందుపరచారు. వాటిలో ఒకటి ఎన్నగ మనసుకు రాని. పోతన పద్యాలను, త్యాగయ్య కీర్తనను పరిశీలిద్దాం,



కంజాక్షునకు గాని కాయంబు కాయమే? పవన గుంభిత చర్మ భస్త్రి గాక
వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే? ఢమ ఢమ ధ్వని తోడి ఢక్క గాక
హరి పూజనము లేని హస్తంబు హస్తమే? తరు శాఖ నిర్మిత దర్వి గాక
కమలేశు జూడని కన్నులు కన్నులే? తను కుడ్య జాల రంధ్రములు గాక

చక్రి చింతన లేని జన్మంబు జన్మమే?
తరళ సలిల బుద్బుదంబు గాక
విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే?
పాదయుగము తోడి పశువు గాక

తండ్రీ! శ్రీహరిని సేవింపని శరీరము కూడా ఒక శరీరమేనా? అది గాలితో నిండిన ఒక చర్మపు సంచి మాత్రమే. వైకుంఠవాసుని పొగడని నోరు కూడా ఒక నోరేనా? అది ఢమ ఢమ ధ్వని చేసే డప్పు మాత్రమే. హరి పూజ చేయని చేతులు కూడా చేతులేనా? అవి చెట్టుకొమ్మలతో చేయబడిన తెడ్లు మాత్రమే. కమలేశుని చూడని కన్నులు కన్నులే? అవి దేహమనే గోడలో ఉన్న రంధ్రములు మాత్రమే. చక్రధారి అయిన ఆ నారాయణుని ధ్యానించని జన్మ కూడా ఒక జన్మయేనా? అది కదులుచున్న నీటి బుడగ మాత్రమే. విష్ణుభక్తిలేని పండితుడు కూడా ఒక పండితుడా? అతడు రెండు కాళ్లున్న పశువు మాత్రమే.

హరి భక్తిలేని జీవి, దేహము ఎంత వ్యర్థమో పోతన నిష్కర్షగా ప్రహ్లాదుని నోట చెప్పించారు. అదే భావనను త్యాగరాజస్వామి తన సంకీర్తనలో ఆవిష్కరించారు.



ఎన్నగ మనసుకు రాని పన్నగ శాయి సొగసు
పన్నుగ గనుగొనని కన్ను లేలే? కంటి మిన్ను లేలే?

మోహముతో నీలవారివాహ కాంతిని గేరిన
శ్రీహరిని గట్టుకొనని దేహమేలే? ఈ గేహ మేలే?

సరసిజ మల్లె తులసి విరజాజి పారిజాత
విరులచే పూజించని కరము లేలే? ఈ కాపురము లేలే?

మాలిమితో త్యాగరాజునేలిన త్యాగరాజ మూర్తిని
లాలించి పొగడని నాలికేలే? సూత్ర మాలికేలే?

మనసు ఎంచలేని శేషసాయి సొగసును కనుగొనలేని కన్నులెందుకు? కంటిరెప్పలెందుకు? తన్మయత్వంతో నీలమేఘ కాంతిని కలిగిన శ్రీహరి రూపమును తన యందు స్థిరము చేసుకోలేని ఈ దేహమెందుకు? ఈ గృహమెందుకు? కలువలు, మల్లెలు, తులసి, పారిజాత పుష్పములచే ఆ రాముని పూజించలేని చేతులెందుకు? గృహస్థాశ్రమమెందుకు? మక్కువతో త్యాగరాజును ఏలిన ఆ స్వామిని లాలించి పొగడని నాలుకెందుకు? హారములెందుకు?

భక్తి సామ్రాజ్యంలో భాగవతోత్తముల భావనలలో ఎంత సారూప్యముంటుందో మనకు పై పద్యాలు, కీర్తన ద్వారా సుస్పష్టం. పరమాత్మకే జీవితాన్ని అంకితం చేసి దేహమనే అద్భుతమైన సాధన ద్వారా పరమాత్మ ఉపాసన చేయటం అత్యుత్తమమైన కర్మ అని ఈ భాగవతోత్తముల భావన. ఆ శ్రీహరి చింతన లేని మనసు, శ్రీహరి సేవకై ఉపయోగించబడని దేహము పూర్తిగా నిరర్థకమని ఇంతకన్నా స్పష్టంగా ఎవ్వరూ చెప్పలేరు.

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వారెందరో మహానుభావులు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి