పుష్య బహుళ పంచమి (1847 సంవత్సరం) కాకర్ల త్యాగరాజస్వామి వారు సిద్ధి పొందిన రోజు. తిరువాయూరులో కావేరీ తీరాన శిష్యులందరూ చూస్తుండగా విదేహముక్తి పొందిన వారు త్యాగయ్య. వారి చరిత్రను ప్రధానంగా రచించిన వారు ఆయన శిష్యులు వాలాఝీపేట వేంకటరమణ భాగవతార్ గారు, కృష్ణస్వామి భాగవతార్ గారు. విశేషమేమిటంటే వీరిద్దరు తండ్రీ కొడుకులు. తండ్రి త్యాగయ్య జీవితంలోని మొదటి భాగం విశేషాలు వ్రాయగా, కృష్ణస్వామి భాగవతార్ గారు రెండవ భాగం విశేషాలు రచించారు. వీరు తాళపత్రాలలో, నోటుబుక్కుల రూపంలో ఉన్న త్యాగయ్య సాహిత్యాన్ని మదురైలోని సౌరాష్ట్ర సభలో పదిల పరచారు. అక్కడే త్యాగయ్య ఉపయోగించిన తంబుర మొదలైన అపురూపమైన వస్తువులు కూడా ఉన్నాయి. ఈ తండ్రీ కొడుకులిద్దరూ కూడా త్యాగరాజస్వామి వరి చరిత్రను తెలుగులోనే రచించారు. ప్రముఖ సంగీత పరిశోధకులు పీ. సాంబమూర్తి గారు కృష్ణస్వామి గారిని స్వయంగా కలిసి, వారి జీవితశైలిని గమనించి కొన్ని సంభాషణలకు పుస్తక రూపం కూడా ఇచ్చారు. ఆ తండ్రీ కొడుకుల జీవితంపై త్యాగయ్య సాహిత్య ప్రభావం పరిపూర్ణంగా ఉందని సాంబమూర్తి గారి గమనిక.
త్యాగరాజస్వామి వారి సాహిత్యాన్ని తెలుగులో పుస్తక రూపంలో మొట్ట మొదట ప్రచురించిన ప్రముఖులు నరసింహ భాగవతార్ గారు, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు. నరసింహ భాగవతార్ గారు 1908లో సద్గురు త్యాగరాజస్వామి కీర్తనలు అన్న పుస్తకాన్ని రచించగా, వీరభద్రశాస్త్రి గారు 1948లో త్యాగరాజ కీర్తనలు - సవ్యాఖ్యానం అన్న పుసక్తం రచించారు. రెండూ, తరువాతి వారికి ప్రామాణికమైనాయి. ఈ రెండు పుస్తకాలలోని కీర్తనల సాహిత్యం, స్వరాలు కూడా వేంకటరమణ భాగవతార్/కృష్ణస్వామి భాగవతార్ గార్లు సౌరాష్ట్ర సభలో ఉంచిన తాళపాత్ర సాహిత్యంతో పూర్తిగా సారూప్యం కలిగి ఉన్నాయి.
తరతరాలుగా తంజావూరు ప్రాంతంలో తెలుగు వారే ఎక్కువ ఉండే వారు - ముఖ్యంగా రాజపోషణకు, ధనధాన్య సమృద్ధికి. అందుకే తెలుగు ప్రధాన భాషగా ఉండేది. త్యాగయ్య సాహిత్యం మొత్తం (కొన్ని సంస్కృత కీర్తనలు తప్ప) అచ్చ తెలుగులోనే. అద్భుతమైన రససిద్ధికి తెలుగు భాష పరిపూర్ణంగా తొడైంది. అప్పటి దేశకాల పరిస్థితులను కూడా ఆ సాహిత్యం తెలుగులో చక్కగా ప్రతిబింబించింది. తంజావూరు ప్రాంతం బ్రాహ్మణ ప్రవృత్తికి అనువైన ప్రాంతం కావటంతోనే అక్కడ కావేరీ తీరాన వారు స్థిర పడ్డారు. అదే సాంప్రదాయానికి చెందిన వారు త్యాగయ్య.
త్యాగరాజస్వామి వారి కుటుంబం పరమేశ్వరాజ్ఞతో తిరువాయూరు ఎలా వచ్చిందో నిన్న తెలుసుకున్నాము. అక్కడే త్యాగయ్య సంస్కృత పాఠశాలలో విద్యనభ్యసించారు. తండ్రి వద్ద రామతారక మంత్రోపదేశాన్ని పొందారు. చిన్ననాటి నుండే తండ్రి ప్రోద్బలంతో రామోపాసనలో నిమగ్నులైనారు. రామకృష్ణానందస్వామి అనే సన్యాసి వద్ద రామ షడక్షరీ మంత్రోపదేశం పొంది తీవ్రమైన సాధన చేశారు. త్యాగయ్య చిన్నతనంలోనే సాహిత్యాన్ని రచించారు. ఆ సంగీత సాహిత్యాభిలాషను చూసి తండ్రి ఆయనను తంజావూరు రాజాస్థానంలో విద్వాంసులైన శొంఠి వేంకటరమణయ్య గారి వద్ద కర్నాటక శాస్త్రీయ సంగీత విద్యను నేర్చుకోవటానికి చేర్చారు. విద్యతో పాటు నారద భక్తి ఆయనలో పెంపొందింది. తన తాతగారు గిరిరాజ కవి రచించిన కృతులను ఆయన ఆలపిస్తూ భక్తి పారవశ్యంలో ఉండేవారు. స్వయంగా నారదుడే త్యాగయ్యలోని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై "స్వరార్ణవము" అనే పుస్తకాన్ని అందించారు. దాదాపుగా 20 ఏళ్ల పాటు త్యాగయ్య రామ తారక మంత్రాన్ని జప సాధన చేశారు. ఆ విధంగా రామకోటి పూర్తైన తరుణంలో శ్రీరామచంద్రుడు త్యాగరాజస్వామికి ప్రత్యక్షమై అనుగ్రహించాడు. అప్పుడు ఆయన నోట "బాలకనకమయ చేల" అన్న కృతి వెలువడినట్లు ఆయన సమకాలీకులు తెలిపారు. ఇక అప్పటి నుండి త్యాగయ్య సాహిత్యం గంగా ప్రవాహమే. అతి త్వరలోనే త్యాగయ్య గురువు గారి నుండి బంగారు పతకం, రాజు గారి ప్రశంస పొందారు.ఆ పతకాన్ని తిరిగి గురువు గారి కుమార్తెకు వివాహంలో బహుమతిగా ఇచ్చారు త్యాగయ్య. రాజుగారి కానుకలను, ఆశ్రయాన్ని తిరస్కరించారు.
తంజావూరు రాజా వారి అల్లుడైన మోతీరావు గారు తరచూ త్యాగరాజస్వామి వారింటికి వచ్చి వారి సంగీతాన్ని విని ఎంతో ఆనందించేవారు. మద్రాసులో గొప్ప ధనవంతులైన కోవూరు సుందర మొదలియార్ త్యాగయ్యను వారి ఇంటికి రావలసిందిగా ఆహ్వానించారు. కానీ నరస్తుతికి విముఖులైన త్యాగయ్య దానిని తిరస్కరించారు. అప్పుడు మొదలియార్ వారు కాంచీపురంలో స్థితులైన గొప్ప యతీంద్రులు ఉపనిషద్బ్రహ్మం గారి ద్వారా తన మనవిని విన్నవించారు. ఉపనిషద్బ్రహం గారు 108 ఉపనిషత్తులపై భాష్యాలు, రామ తరంగిణి, రామ అష్టపది, అనేక గ్రంథాలు రచించారు. వీరు తొలుత తంజావూరులో నివసించినప్పుడు 12 ఏళ్ల బాలుడైన త్యాగయ్య వీరి రామభక్తికి ఎంతో తన్మయుడైనాడు. వారి రామ అష్టపది ఆలపనలు త్యాగయ్యను ఎంతో ప్రభావితం చేశాయి. ఉపనిషద్బ్రహ్మం గారు త్యాగయ్యకు తీర్థయాత్ర చేస్తూ దారిలో తమను కలవవలసిందిగా కోరతారు. ఆయన కోరిక మన్నించి త్యాగయ్య తిరుమల తీర్థయాత్ర వెళుతూ దారిలో కాంచీపురంలో ఉపనిషద్బ్రహ్మం గారి అగస్త్యాశ్రమానికి వెళ్లి అక్కడి సీతారాములను, యంత్రోద్ధారక హనుమంతుని అర్చిస్తారు. తిరుమల యాత్ర మార్గమధ్యంలో అనేక క్షేత్రాలు దర్శించి కృతులను రచించారు త్యాగయ్య.
తన జీవిత చరమాంకంలో త్యాగయ్య సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. పుష్య బహుళ పంచమి నాడు బ్రాహ్మణులకు పేదలకు అన్నసంతర్పణ చేసి కావేరీ తీరాన భజనలు ఆలపించబడుచుండగా రామునిలో ఐక్యమైనారు. అక్కడ ఆయన శిష్యులు కట్టిన సమాధి కొంతకాలానికే శిథిలమైపోగా బెంగళూరు నాగరత్నమ్మ గారు తన స్వంత ద్రవ్యాన్ని వినియోగించి నేడున్న సమాధి మందిరం నిర్మించారు. అంతకు ముందు రెండుగా చీలి విడి విడిగా జరుగుతున్న త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను ఏకం చేసి భవ్యంగా ఆ ఉత్సవాలను తిరువైయారులో నిర్వహించే ఏర్పాట్లను చేశారు. నేడు జరుగుతున్న త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఆ పరంపరవే.
వ్యాసో నిగమ చర్చయా మృదుగిరా వల్మీక జన్మామునిః
వైరాగ్యేశుక ఏవ భక్తి విషయే ప్రహ్లాద ఏవస్వయం
బ్రహ్మా నారద ఏవచా ప్రతియ యోః సాహిత్యా సంగీతయోః
యో రామామృత పాన నిర్జిత శివః తం త్యాగరాజం భజే
సద్గురువు త్యాగరాజ స్వామి వారు వేదములను విప్పి చెప్పుట యందు వ్యాసుని వంటివారు, మధురమైన వాక్యములు రాయుటలో వాల్మీకి కవి వంటి వారు, వైరాగ్యములో శుకుని వంటి వారు, భక్తిలో ప్రహ్లాదుని వంటి వారు, సాహిత్యములో బ్రహ్మ వంటి వారు, సంగీతములో నారదుని వంటి వారు, రామ నామమనే అమృతమును గ్రోలుటలో పరమశివునికి సమానులు. అటువంటి సద్గురువులను భజిస్తున్నాను - అని ఆయన ప్రియ శిష్యుడు శ్రీ వాలాఝీపేట వేంకటరమణయ్య భాగవతార్ గారు పై శ్లోక రూపంలో నుతించారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి