29, ఆగస్టు 2020, శనివారం

రామా నీపై తనకు ప్రేమ బోదు - త్యాగరాజస్వామి కృతి



 త్యాగరాజస్వామి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, ఆయన నిశ్చలమైన రామభక్తిని సూచించే కృతులు ఎన్నో ఉన్నాయి. వాటిలో కేదార రాగంలో కూర్చిన "రామా నీపై తనకు" అనే కృతి ఒకటి. తనకు రామునిపై కలిగే భావనలు, ఉన్న ధ్యాస అంతా రాముని కరుణే అని, భోగభాగ్యలలో కూడా రామునిపైనే మనసు నిలిచి యుండి పరమానందము పొందుచున్నానని, స్వామిపై తన ప్రేమ అచంచలమైనదని సహస్రార కమలము వికసించిన యోగి లక్షణాలను ప్రస్ఫుటంగా కనబరచారు. నిరంతర రామ నామ సంకీర్తనతో అన్నిటా రామునే దర్శిస్తూ, అన్నీ రాముని వల్లనే అని తన అవ్యాజమైన భక్తిని ప్రకటించారు.

రామా! నీపై తనకు ప్రేమ బోదు! సీతా

తామరస నయన! నీదేమో మాయ గాని

మనసు నీ పదములనే జేర కనులు నీ రూపమునే కోర
విను నీ పేరులకే నోరూర తన పై ఇది నీ కరుణేరా!

జననీజనకాప్తులన్యులు ధన కనక గురు వేల్పులు
దినము నీవేయని మాటలు అనగా ఇవి నా భూషణములు!

భోగానుభవములందు బాగుగ బుద్ధి నీయందు
త్యాగరాజుని హృదయమందు వాగీశానందమందు!

ఓ సీతారామా! నీపై నా ప్రేమ ఎన్నటికీ తరగదు. కలువలవంటి కన్నులు గల రామా! నీది ఏమి మాయో కానీ నీపై ప్రేమ ఎన్నటికీ తరగదు. ఓ రామా! నీ పదములనే చేరుకోవాలని నా మనసు, నీ రూపమునే చూడాలని నా కన్నులు కోరుతున్నాయి, నీ నామముల ఉచ్చరించుటకే నా నోరూరుతున్నది, ఇది అంతా నీ కరుణే, నీపై నా ప్రేమ ఎన్నటికీ తరగదు. ఓ రామా! తల్లి, తండ్రి, బంధువులు, ఇతరులు, ధనము, బంగారము, గురువు, దైవము నిత్యమూ నీవే అనే మాటలు నా ఆభరణములు,నీపై నా ప్రేమ ఎన్నటికీ తరగదు. భోగములు అనుభవించుటలో కూడా బుద్ధి నీపైనే నిలిచియున్నది, నా హృదయమునందు బ్రహ్మానందము కలిగించుచున్నది, నీపై నా ప్రేమ ఎన్నటికీ తరగదు.

కేదార రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని నిత్యశ్రీ మహదేవన్ గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి