13, డిసెంబర్ 2010, సోమవారం

శంకరాచార్యవిరచిత షట్పదీ - తాత్పర్యము

ఆది శంకరులు రచించిన స్తోత్రాలలో విష్ణు షట్పది ఒకటి. మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం  ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.

శంకర విరచిత విష్ణు షట్పదీ, తాత్పర్యము మీకోసం. శ్రవణం కంచి కామకోటి పీఠం వారి వెబ్ సైట్ లో. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు అద్భుతమైన ప్రవచనం చెప్పారు ఈ షట్పది మీద. ప్రవచనం శ్రవణం డౌన్లోడ్ కొరకు వారి వెబ్ సైట్ చూడండి.



అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణాం
భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః

దివ్యధునీమకరందే పరిమలపరిభోగసచ్చిదానందే
శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే

సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీనస్త్వం
సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః

ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః

మత్స్యాదిభిరవతారైరవతారవతాఽవతా సదా వసుధాం
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోఽహం

దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద
భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే

నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ
ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు

ఇతి శ్రీమద్ శంకరాచార్యవిరచితం విష్ణుషట్పదీస్తోత్రం సంపూర్ణమ్

తాత్పర్యము

ఓ విష్ణో!  నాలోని అహంకారాన్ని తొలగించు. మనస్సును శాంతితో నింపుము. పాశవిక కోరికలనుంచి నన్ను దూరము చేయుము. సకల ప్రాణుల పట్ల నేను దయతో ఉండునట్లు చేయుము. ఈ భవసాగరాన్ని దాటుటకు చేయూతనీయుము.

సంసార సాగరములోని భయాన్ని, దుఖాన్ని పోగొట్టే, పవిత్రమైన పుప్పొడి నది వంటి, సచ్చిదానందాన్ని ఇచ్చే దివ్య సుగంధము వంటి నీ పాదపద్మములకు నమస్కరించు చున్నాను.

ఎలాగైతే సముద్రము అలలు ఒకటే అని అనిపించినా, సముద్రపు అల సముద్రములోని భాగమే కానీ సముద్రం అలలోని భాగం కాదో, అలాగే సత్యము గ్రహించు నపుడు కూడా, భేదము గ్రహించలేనప్పుడు, నేను నీలోని భాగమే కానీ నీవు నాలో భాగము కావు.

పర్వతమును ఎత్తిన వాడవు (కృష్ణుడవు, కూర్మావతారము కూడా), పర్వతరాజు శత్రువైన ఇంద్రుని సోదరుడవు, అసురుల శత్రువువు, సూర్య చంద్రులు కన్నులుగా చూసేవాడవు, నిన్ను చూసిననంత లోకపు శోకము పోవును. నిన్ను చూసిన తర్వాత ఇంకా జరుగ వలసినది ఏమైనా ఉందా?

మత్స్య రూపము మొదలకొని వివిధ అవతారములతో ఈ భువిని కాపాడుతున్నావు. పరమేశ్వరా! ఈ భవసాగరమును చూసి భయపడుతున్న నన్ను కాపాడుము.

నడుమునకు త్రాడు కట్టుకున్న విష్ణో (దామోదరా)! సకల సద్గుణ సంపన్నా! కలువ వంటి అందమైన ముఖము కలవాడా! అందరి రక్షకుడా! ఈ భవ సాగరాన్ని మధించ అత్యుత్తమ సాధనమైన వాడా! ఈ జీవనసాగరంలో నా భయాలను పోగొట్టుము.

ఓ నారాయణా! కరుణామయా! నా చేతులు నీ పదములకు మ్రొక్కనీ! ఈ ఆరు శ్లోకములు నా వదనములో ఎల్లప్పుడూ నిలవనీ!

రామ రామ రామ రామ - పట్టాభి రాముని వర్ణన

శ్రీ రాముని నుతించటం అంటే అది త్యాగరాజునికే చెల్లు. ఆ నీల మేఘ శ్యాముని మానవావతారాన్ని త్యాగయ్య అనుభూతి పొందినట్లు బహుశ ఎవ్వరు పొంది ఉండక పోవచ్చు. అంతే అనుభూతితో సంగీతకారులు శ్రీ ఎం.డీ. రామనాథన్ గారు ఒక మంచి రచన చేశారు. సులువుగా అర్థమయ్యే పదాలతో, ఉయ్యాలలూపే నీలాంబరి రాగంలో ఈ రామ రామ రామ రామ అనే కీర్తన కూర్చారు ఎం.డీ.ఆర్.

కేరళలోని పాల్ఘాట్ జిల్లాలో జన్మించిన ఎం.డీ.ఆర్ రుక్మిణి దేవి అరుండేల్, మరియు టైగర్ వరదాచారి వద్ద శిష్యరికం చేసి శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులైనారు. ఆయన ఎన్నో అద్భుతమైన కీర్తనలను రచన చేశారు. పద్మశ్రీ, సంగీత కళానిధి బిరుదులను, సంగీత నాటక అకాడెమీ మరియు కలైమామణి పురస్కారములను పొందారు.  నేటికీ ఒక మంచి వాగ్గేయకారునిగా నిలిచిపోయారు రామనాథన్ గారు. 


పట్టాభిషిక్తుడైన శ్రీరాముని వర్ణించే ఈ కీర్తనలో లాలనా భావం చాలా కనిపిస్తుంది. శ్రీ రాముని పట్టాభిషేక సమయంలో వానరులు, విభీషణుడు, సనక సనందాదులు, బ్రహ్మ, శివుడు మొదలగు వారంతా దిగి వచ్చారుట. అంతంటి శుభ ఘట్టంలో మరి ఆ రాముని వైభవము ఎట్టిదో ఊహించండి.

నీలాంబరి రాగం ఊయలలూపే లాలిత్యము, ప్రశాంతత, మృదుత్వము ఉంటుంది. స్తుతికి, నుతికి ఇదొక అద్భుతమైన రాగం. ఈ కీర్తన శ్రవణం ఎం.డీ. రామనాథన్ గళంలో , రామ వర్మ గళంలో. రెండు, కొన్ని కొన్ని చరణాలు కలిగి ఉన్నాయి. ఎవరి శైలిలో వాళ్లు ఓలలూగించారు. నీలాంబరి వైశిష్ట్యాన్ని శాస్త్రీయంగా చూపించారు ఈ కళాకారులు. సాహిత్యం క్రింద.

రామ రామ రామ రామ  రాగం: నీలాంబరి తాళం: ఆది

రామ రామ రామ రామ రామ కోదండరామా రామ పట్టాభిరామ రామ రాఘవా

భామా  శ్రీ జానకీ భరత లక్ష్మణ రిపుఘ్న పవమాన సుత సహిత రామ రాఘవా
దశరథ రాజకుమార దశ ముఖాది సంహార విశదీకృత చరిత రామ రాఘవా
కౌసల్యా వర తనయ శ్రీ కౌశిక ముని తప పాల అచల  గరళ పూజ్య రామ రాఘవా
గుహ శబరీ ఆంజనేయ కపివర శ్రీ సుగ్రీవ రిపు సోదరాదుల బ్రోచిన రామ రాఘవా
సాకేత ధామ శ్రీ సీతా మనోల్లాస చాల భేదన నిపుణ రామ రాఘవా
త్యాగరాజాది నిజ దాసులు పొగడగ నాగశయన శ్రీ రామ రాఘవా

తాత్పర్యము:

శత్రున్జయుడైన, కోదండము ధరించిన పట్టాభిరాముడు భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమత్ సమేతుడై ఉన్నాడుట. ఆయనను కృతి కర్త, దశరథ తనయునిగా, రావణ సంహారిగా, గొప్ప చరిత్ర కలవానిగా, కౌసల్య వరపుత్రునిగా, విశ్వామిత్రుని తపము కాచిన వానిగా, బ్రహ్మ, శివులచే పూజించిన వానిగా, గుహుని, శబరిని, ఆంజనేయుని, ఇతర వానరులను, సుగ్రీవుడు, విభీషణుడు మొదలగు వారిని బ్రోచిన వానిగా, సాకేత పురాధిపునిగా, సీతా మనోల్లాసునిగా, తాటిచెట్ల వరుసను ఒకే బాణముతో కూల్చిన వానిగా, త్యాగరాజు మొదలగు నిజ దాసులు పొగడిన రాముని, రాఘవునిగా వర్ణించాడు.

జయదేవ కృత గీత గోవిందం - దశావతార స్తుతి, తాత్పర్యము

జయదేవుడు అనగానే అష్టపదులు, గీత గోవిందము వాటిలోని  గోపికలు, విరహము, బృందావనము, రాధ, దశావతారములు - వెంటనే తెర మీద చిత్ర సమూహంలా మన మస్తిష్కములో వ్యక్తమవుతాయి.  13 వ శతాబ్దపు కవి ఈ జయదేవుడు. ప్రస్తుతపు ఒడిషా పురీ ప్రాంతం లోని కేండులి గ్రామంలో జయదేవుడు జన్మించాడు. సరళమైన సంస్కృతములో గీతగోవిందము, అష్టపదులు రచించాడు. పురీ జగన్నాథుని దేవాలయము, భువనేశ్వర్ లోని లింగరాజ దేవాలయము ఇదే సమయములో నిర్మించబడి ఉంటాయని చరిత్రకారుల అభిప్రాయం. లింగరాజ స్వామి గుడిలో గీతగోవిందానికి సంబంధించిన దృశ్యాలు ఈ మందిర కుడ్యాలపై ఉన్నాయిట. గీతగోవిందము, జగన్నాథ దేవాలయానికి సంబంధించిన గాధలు కూడా ఉన్నాయి.


గీతగోవిందం లోని దశావతార స్తుతి చాలా ప్రాచుర్యం పొందింది. సంగీత, నాట్య రంగాలలో విరివిగా నుతిన్చబడి, ప్రదర్శించ బడినది.  సాహిత్యం, తాత్పర్యము మీకోసం. సుబ్బులక్ష్మి గారి గాత్రంలో శ్రవణం. ఈ వర్ణనలో బుద్ధుని ఒక దశావతారం గా చెప్పబడినది. కాబట్టి అప్పటికే బౌద్ధ మతం ప్రాచుర్యం బాగా చెందినదని తెలుస్తోంది.

ప్రళయపయోధిజలే ధృతవానసి వేదం
విహితవహిత్రచరిత్రమఖేదం
కేశవ ధృతమీనశరీర జయ జగదీశ హరే  ౧

క్షితిరతివిపులతరే తవ తిష్ఠతి పృష్ఠే
ధరణిధరణకిణచక్రగరిష్ఠే
కేశవ ధృతకచ్ఛపరూప జయ జగదీశ హరే  ౨

వసతి దశనశిఖరే ధరణీ తవ లగ్నా
శశిని కళంకకలేవ నిమగ్నా
కేశవ ధృతసూకరరూప జయ జగదీశ హరే  ౩

తవ కరకమలవరే నఖమద్భుతశృంగం
దళితహిరణ్యకశిపుతనుభృంగం
కేశవ ధృతనరహరిరూప జయ జగదీశ హరే  ౪

ఛలయసి విక్రమణే బలిమద్భుతవామన
పదనఖనీరజనితజనపావన
కేశవ ధృతవామనరూప జయ జగదీశ హరే  ౫

క్షత్రియరుధిరమయే జగదపగతపాపం
స్నపయసి పయసి శమితభవతాపం
కేశవ ధృతభృఘుపతిరూప జయ జగదీశ హరే  ౬

వితరసి దిక్షు రణే దిక్పతికమనీయం
దశముఖమౌళిబలిం రమణీయం
కేశవ ధృతరామశరీర జయ జగదీశ హరే  ౭

వహసి వపుషి విశదే వసనం జలదాభం
హలహతిభీతిమిళితయమునాభం
కేశవ ధృతహలధరరూప జయ జగదీశ హరే  ౮

నిందతి యజ్ఞవిధేరహహ శ్రుతిజాతం
సదయహృదయదర్శితపశుఘాతం
కేశవ ధృతబుద్ధశరీర జయ జగదీశ హరే  ౯

మ్లేచ్ఛనివహనిధనే కలయసి కరవాలం
ధూమకేతుమివ కిమపి కరాలం
కేశవ ధృతకల్కిశరీర జయ జగదీశ హరే  ౧౦

శ్రీజయదేవకవేరిదముదితముదారం
శృణు సుఖదం శుభదం భవసారం
కేశవ ధృతదశవిధరూప జయ జగదీశ హరే  ౧౧


తాత్పర్యము:

ప్రళయ కాలములో సాగర జల ఘోషలో వేదములను నావ వలె కాపాడిన మీనావతారమైన శ్రీహరికి, జగదీశ్వరునికి జయము జయము.

మందర పర్వతాన్ని తన వీపుపై మోసి, ఆ పర్వతము ఒక చక్రం లాగ తిరిగి సాగర మథనం ముందుకు సాగేలా చేసిన కూర్మావతారమైన శ్రీహరికి, జగదీశ్వరునికి జయము జయము.

నీట మునిగిన భూమిని తన ముక్కుపై చంద్రుని నెలవంక వలె నిలిపి కాపాడిన ఖడ్గమృగావతారమైన శ్రీహరికి, జగదీశ్వరునకు జయము జయము.

దానవుడైన హిరణ్యకశిపుని తన చేతులకు ఉన్న గోళ్ళతో చీల్చి చెండాడి పురుగువలె నలిపి చంపిన నృసింహ అవతారమైన శ్రీహరికి, జగదీశ్వరునకు జయము జయము.

తన విశ్వవ్యాప్తమైన పదములతో బలిని పాతాళమునకు పంపి, ఆ పాదముల వద్ద నుండి ఉబికిన నీరు జనులను పావనం చేయగా, బడుగు బాపని రూపమైన ఆ వామనావతార రూప శ్రీహరికి, జగదీశ్వరునకు జయము జయము.

క్షత్రియుల రక్తముతో భూదేవికి స్నానము చేయించి, భూమిపై ఉన్న పాపమును నాశనము చేసిన,  భూతాపమును తగ్గించిన పరశురామావతారమైన శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.

దశ దిక్కులకు రావణుని పది తలలను బహుకరించిన రామావతారమైన  శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.

యమునానది రంగులో తన తెల్లని శరీరము పై వస్త్రములు ధరించిన, తన నాగలి ధాటితో యమునను భయపెట్టి తన వైపు మళ్లించిన, బలరామావతారమైన శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.

వేదములలో చెప్పబడిన యజ్ఞ విధి, దానిలో జరిగే జంతు బలిని వ్యతిరేకించిన, దయారూపమైన, బుద్ధ అవతారమైన  శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.

తోకచుక్కవలె, ఆశ్వముని అధిరోహించి, తన ఖడ్గముతో మ్లేచ్ఛులను సంహరించి కలియుగాంతము చేసే కల్కి అవతారమైన  శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.

ఈ జయదేవ విరచిత దశావతార స్తుతిని వినినంత శుభము, సుఖము కలిగించే శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.

భగవద్రామానుజ విరచిత శ్రీరంగ గద్యం - తాత్పర్యము


భగవద్రామానుజులు 1017  సంవత్సరములో శ్రీ పెరంబుదూర్ లో కేశవ సోమయాజి మరియు కాంతిమతి దంపతులకు జన్మించారు. కాంచీపురం లోని యాదవ ప్రకాశ అనే గురువు వద్ద వేదాధ్యయనము చేస్తుండగా, గురువు గారు ఈర్ష్య వలన కల్పించిన విపత్కర పరిస్థితులలో అక్కడినుంచి బయట పడి తన ఆధ్యాత్మిక జీవితాన్ని మొదలు పెడతారు. భారత దేశమంతా తిరిగి విశిష్టాద్వైత తత్త్వాన్ని ప్రచారం చేసి వైష్ణవ సాంప్రదాయాన్ని నలుదెసలా చాటారు. ఆయన బ్రహ్మ సూత్ర భాష్యము అత్యంత విశిష్టమైనది.  ఇది శ్రీ భాష్యం గా పిలువబడినది. ఆయన వేదార్థ సారము, వేదాంత సంగ్రహము, వేదాంత దీపము అనే అద్భుతమైన రచనలు కూడా చేశారు.  ఇవే కాక, వైకుంఠ గద్యము, శరణాగతి గద్యము, శ్రీ రంగ గద్యము మొదలగు వచన రచనలు సామాన్యులకు భగవద్భక్తి ఇనుమడిన్చేలా చేశారు.

భగవద్రామానుజులు

శ్రీరంగము లోని రంగనాథ క్షేత్రము, తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుని క్షేత్రము, మెల్కోటేలో చెలువ నారాయణ క్షేత్రము మొదలగు అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో వైష్ణవ సంప్రదాయాన్ని స్థాపించి, దైవారాధనను పునరుద్ధరించి, నిలిపి, ఉత్థానమునకు తీసుకువచిన జగద్గురువులు రామానుజులు. 120 ఏళ్ల విశేషమైన మానవ జీవితాన్ని ఆ విష్ణు భక్తిలో గడిపిన ముని రామానుజులు. అంత వరకు రహస్యముగా ఉన్న నారాయణ మంత్రమును (ఓం నమో నారాయణాయ) గురువులు, పెద్దలను ఎదిరించి శ్రీ రంగములోని మందిరం ఎక్కి ఎలుగెత్తి చాటుతాడు.  భగవంతుని చేరటానికి సాధనమైన మంత్రాన్ని అందరికీ చెప్పటం వలన పాపం కలిగితే, ఆ పాపము, దాని ఫలితము అనుభవించటానికి నేను సిద్ధము అని తన ఔన్నత్యాన్ని చాటారు రామానుజాచార్యులు.

ఈనాటికి కూడా, ఆయన స్థాపించిన క్షేత్రాలలో సాంప్రదాయము, భక్తి, ఆచారములతో సేవలు నిర్వహించటం ఆయన మహత్తుకు నిదర్శనం.  ఆయన రచించిన అద్భుతమైన నుతి ఒకటి ఈ వ్యాసములోని శ్రీరంగ గద్యము. ఆర్తితో, సర్వస్య శరణాగతితో, భక్తి నివేదనతో చేసిన రచన ఇది. సాహిత్యం, తాత్పర్యము మీకోసం. మాధుర్యానికి మారు పేరైన మదురై షణ్ముఖవడివు (ఎమ్మెస్) సుబ్బులక్ష్మి గారి గళంలో శ్రవణం.

శ్రీరంగ గద్యము

స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తిభేదం క్లేశ కర్మాద్యశేష దోషా సంస్పృష్టం!

స్వాభావికానవధికాతిశయ జ్ఞానబలైశ్వర్య వీర్యశక్తి తేజస్సౌశీల్య వాత్సల్య మార్దవ ఆర్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్యసంకల్ప కృతిత్వ కృతజ్ఞతాద్యసంఖ్యేయ కల్యాణ గుణగణౌఘ మహార్ణవం!

పరబ్రహ్మ భూతం! పురుషోత్తమం! శ్రీరంగ శాయినం! అస్మద్స్వామినం! ప్రబుద్ధ నిత్య నియామ్య నిత్యదాస్యైకరసాత్మ స్వభావోహం! తదేకానుభవః! తదేకప్రియః! పరిపూర్ణం భగవంతం విశదతమ అనుభవేన నిరంతరమనుభూయ! తదనుభవజనిత అనవధికాతిశయ ప్రీతికారిత అశేషావస్థోచిత అశేష శేషతైకరతిరూప నిత్య కింకరో భవాని!

స్వాత్మ నిత్య నియామ్య నిత్యదాస్యైకరసాత్మ స్వభావాను సంధానపూర్వక భగవదనవధికాతిశయ స్వామ్యాద్యఖిల గుణగణానుభవజనిత అనవధికాతిశయ ప్రీదికారిత అశేషావస్థోచిత అశేష శేషైతైకరతిరూప నిత్య కైంకర్య ప్రాప్త్యుపాయ భూతభక్తితదుపాయ సమ్యగ్ జ్ఞాన తదుపాయ సమీచీనక్రియాతదనుగుణ సాత్వికత్ ఆస్తిక్యాది సమస్త ఆత్మ గుణ విహీనః! దురుత్తరానంత తద్విపర్యయ జ్ఞానక్రియానుగుణ అనాది పాప వాసనా మహార్ణవాంతర్నిమగ్నః!  తిలతైలవత్! దారువన్హివత్! దుర్వివేచ త్రిగుణ క్షణక్షరణస్వభావ అచేతన ప్రకృతి వ్యాప్తిరూప దురత్యయ భగవన్ మాయాతిరోహిత స్వప్రకాశః! అనాద్య విద్యా సంచితానంతాశక్య విస్రంసన కర్మపాశ ప్రగ్రథితః! అనాగతానంతకాల సమీక్షయాఽఅపి అదృష్ట సంతారోపాయః! నిఖిల జంతు జాత శరణ్య!! శ్రీమన్నారాయణ!! తవ చరణారవిందయుగళం చరణమహం ప్రపద్యే!

ఏవమవస్థితస్యాప్యర్థిత్వమాత్రేణ! పరమకారుణికో భగవాన్! స్వానుభవ ప్రీత్యోపనీతైకాంతికాత్యంతిక నిత్యకైంకర్యరతిరూప నిత్య దాస్యం దాస్యతీతి విశ్వాసపూర్వకం భగవంతం నిత్య కింకరతాం ప్రార్థయే!

తవానుభూతి సంభూత ప్రీతికారిత దాసతాం!
దేహి మే కృపయా నాథ! న జానే గతిమన్యథా!!
సర్వావస్థోచితాశేషశేషతైకరతిస్తవ!
భవేయం పుందరీకాక్ష! త్వమేవైవం కురుష్వ మాం!!

ఏవంభూత తత్వాథాత్మ్యావబోదతదిచ్ఛారహితస్యాపి! ఏతదుచ్చారణ మాత్రావలంబనేన! ఉచ్యమానార్థ పరమార్థ నిష్టమ్ మే మనః త్వమేవ అద్యైవ కారయ!

అపార కరుణాంబుధే! అనాలోచిత విశేష అశేష లోక శరణ్య! ప్రణతార్తి హర! ఆశ్రిత వాత్సల్యైక మహో దధే! అనవరత విదిత నిఖిల భూత జాత యాథాత్మ్య! సత్యకామ! సత్య సంకల్ప! ఆపత్సఖ! కాకుత్స్థ!శ్రీమన్!
నారాయణ! పురుషోత్తమ! శ్రీరంగ నాథ! మమ నాథ!నమోస్తు తే! 


తాత్పర్యము:

ఓ భగవాన్! నీవు చేతనా, అచేతనా అవస్థలలోని మూడు రకాలు వాటి ఉనికి, వాటికి సంబంధించిన  పనులను స్వాధీనములో కలవాడవు, కష్టములు, సుకర్మలు, దుష్ట కర్మల ప్రభావము లేని వాడవు, ఎన్నలేనన్ని విశేష కళ్యాణ గుణ గణములు కలవాడవు. వాటిలో కొన్ని - జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు, సౌశీల్యము, వాత్సల్యము, మార్దవము (మృదుత్వము), ఆర్జవము (విశ్వాసము/నమ్మకము),  సౌహార్ద్రము (అన్నీ మంచి ఆలోచనలే), సామ్యము (సమాన భావము) , కారుణ్యము, మాధుర్యము, గాంభీర్యము, ఔదార్యము, చాతుర్యము, స్థైర్యము, ధైర్యము, శౌర్యము, పరాక్రమము, సత్య కామ (నీ అభీష్టము ఎప్పుడూ నెరవేరును), సత్య సంకల్ప (ఎల్లప్పుడూ నీ కార్యములు నెరవేరును), కృతిత్వము (భక్తుల మరియు దేవతల కార్యములు పూర్తి చేసే వాడవు), కృతజ్ఞత. అటువంటి అనేక గుణముల సాగరానివి, నిధివి. నీవే పరబ్రహ్మవు, పురుషోత్తముడవు, శ్రీరంగ శాయివి,  నా స్వామివి. నీ ఆజ్ఞకు బద్ధుడను. నీ సేవలోని మాధుర్యాన్ని చవి చూసినాను. నా భక్తి జ్ఞాన ఫలము, గమ్యము నీవు.  ఎటువంటి అంతరములు, అంతరాయములు లేకుండా, నీవే నా ఏకైక గమ్యముగా ఆరాధిస్తున్నాను. దానివలన కలిగే ఆనందము వర్ణించలేని సచ్చిదానందము. నేను ప్రతిక్షణము, ఎల్లప్పుడూ, నీ విశేషమైన అశేషమైన సేవలో నిమగ్నుడనై ఉందును.

జీవాత్మ అనే నేను నీ కనుసన్నలకై వేచి ఉన్నాను. నీ సేవకు, సేవ చేయాలనే ఆలోచనకు నేను నిరంతరమూ దాసుడను. నీ అశేషమైన కళ్యాణ గుణ గణముల వలన ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను. అటువంటి ఆనందము వలన భక్తి, జ్ఞాన, కర్మ యోగములు, సాత్వికము, ఆస్థికము మొదలగునవి కలుగును. కానీ అవేవీ నాలో లేవు.   పైగా నాలో విపరీత జ్ఞానము, కర్మలు ఉన్నాయి. వాటి వలన నేను పాపముల సాగరములో చిక్కుకొని ఉన్నాను. నాకున్న భక్తి జ్ఞానములతో ఈ సాగరాన్ని నేను దాటలేను. ఎందుకంటే అవి అహంకారము, మరియు మాయ ప్రకృతి యొక్క గుణములచే కప్పబడి యున్నవి. త్రిగుణములతో నా సాంగత్యము నువ్వు గింజలోని నూనె వలె,  యాగ సమిధలోని అగ్ని వలె యున్నది. ఎన్నో జన్మలలో మూట గట్టుకున్న గుణములు, పాపముల వలన, అజ్ఞానము వలన నేను కర్మ పాశామునకు బద్ధుడ నైతిని. ఈ సంసార సాగరాన్ని దాటుటకు నేను ఆశక్తుడను. నేను ఎంత ప్రయత్నించినను ఇది సాధ్యముగా లేదు. కావున ఆర్త రక్షకా! ఓ ప్రభూ! శ్రీమన్ నారాయణా! లక్ష్మీ పతీ! నీవొక్కడవే నాకు దిక్కు. నేను నీ పాద పద్మముల వద్ద శరణంటిని. నీవే కాపాడుము.

నేను ఇటువంటి దీనావస్థలో ఉన్నాను. అయినా, నిన్ను శరణు అన్నందు వలన, కరుణామూర్తివైన నీవు, తదేక దీక్ష, శ్రద్ధలతో నీకు సేవ చేసే భాగ్యమును కలిగిస్తావు. ప్రభూ నేను ప్రార్థిస్తున్నాను. నాకు ఆ వరమొసగుము.

ఓ భగవాన్! నాకు వేరే రక్ష లేదు. వేరే మార్గము లేదు. నిన్ను దర్శించి, అనుభూతి పొందే ఆనందముతో నీ సేవా భాగ్యమును ప్రసాదించుము. నా ప్రేమతో నిన్ను తృప్తి పరచే భాగ్యము, నీ అనంతమైన కృపను ప్రసాదించుము.

కలువల వంటి కనులు కల ఓ నారాయణ! నీ సేవకొరకు ఎటువంటి రూపము తీసుకొనుటకు, ఎటువంటి పని చేయుటకు నేను సిద్ధముగా ఉండవలెను. అటువంటి మానసిక స్థితిని నాకు ప్రసాదించుము.

సత్యమును తెలుసుకునే కోరిక కాని, మనసు కాని లేని వాడను. నేను గమ్యమైన నిన్ను పొందుటకు అర్హుడను కాను ఎందుకంటే నేను మానసిక నిజాయితీ లేకుండా కేవలం పదములను పెదవుల ద్వారా పలుకుతున్నాను - దీనిని నా విన్నపముగా తీసుకుని నా మాటలపై ధ్యాస, నిజాయితీ చూపే మనసును ప్రసాదించు. నా ఈ మాటలను నాలోని లోపములను సరిదిద్దేలా చేయుము.

అపారమైన, అనంతమైన కరుణ కలిగిన సాగరమా!  ఎటువంటి తారతమ్యము లేకుండా దయ చూపి రక్షణ కలిగించే ప్రభూ!  శరణాగతుల కష్టములను దుఃఖములను రూపు మాపే ప్రభూ! భక్తులకు ప్రేమ సాగరమైన దేవా! జీవరాసుల జన్మ సత్యమును తెలిసిన దేవా! పరిపూర్ణుడా!  అన్ని కోరికలు తీర్చేవాడా! సంకల్పములన్ని నెరవేర్చే వాడా! శ్రీ రామా! శ్రీ పతీ!  శ్రీమన్ నారాయణా! పురుషోత్తమా! శ్రీ రంగ నాథా! నా నాథా! శరణు శరణు.  నీకు నమస్కారము చేయుచున్నాను. నన్ను కాపాడుము.

శ్రీమతే రామానుజాయ నమః 

12, డిసెంబర్ 2010, ఆదివారం

భావయామి గోపాలబాలం - అన్నమయ్య గోపాలుని నుతి


శ్రీకృష్ణుడు అనే సరికి పదాలు, వర్ణనలు, ఉపమానాలు, అలంకారాలు, ప్రాసలు, విశేషణాలు అన్నీ ముత్యాల వరసలా రూపొందుతాయి. ఎందుకో?. సౌందర్యము, అలంకారము, భోగము, యోగము, భక్తి, ప్రేమ - అన్నిటికీ ఆయన మూర్తి కాబట్టే.  సాకార సగుణోపాసన అనే అధిభౌతిక తత్త్వములో అగ్ర్యము, నిరాకారము, నిరామయము అనే పారలౌకిక ఆధ్యాత్మిక తత్త్వము లో యోగ్యము కృష్ణ తత్త్వము. నలుగురిలో ఒకడై, వారికి చెందని వాడై,  కర్మ యోగ సిద్ధాంతకర్త గా కృష్ణుని అవతారము పరిపూర్ణమైనది. అందుకనే ఆయన వర్ణన కూడా ఒక రకంగా పరిపూర్ణమే.

మరి పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుని నోట ఆ శ్రీ కృష్ణుని వర్ణన జరిగితే? అది ఈ వెన్నదొంగ చేత ఉన్న నవనీతంలా మధురాతి మధురంగా ఉంటుంది. అదే భావయామి గోపాల బాలం అనే కృతి. అచ్చ తెలుగులో కీర్తనలు రాసిన అన్నమయ్య ఈ కీర్తనకు ప్రాకృత సంస్కృతాన్నిఉపయోగించటం ఆయన పొందిన పారలౌకికానుభూతికి నిదర్శనం. భావనలో, చింతనలో ఆ గోపాల బాలుని ఆరాధించుమని ఆయన మనో భావన. దానికి ఆ చిన్నికృష్ణుని మేని వర్ణన కూడి చిరస్మరణీయమైన కీర్తన గా నిలిచిపోయింది ఈ భావయామి గోపాలబాలం.  స్వర మహాలక్ష్మి సుబ్బులక్ష్మి గళంలో ఈ కీర్తన యమన్ కల్యాణి రాగంలో భక్తి పారవశ్యంలో సాగుతుంది.


భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా

కటిఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా పటల నినదేన విభ్రాజమానం
కుటిల పదఘటిత సంకుల సింజితే నతం చటుల నటనా సముజ్జ్వల విలాసం

నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది సురనితర భావనా శోభిత పదం
తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం పరమ పురుషం గోపాల బాలం


ఆ బాల కృష్ణుడు నడుముకు కట్టుకున్న మేఖలము, అలంకరించ బడిన మణి ఘంటిక, మృదువైన శబ్దాలు చేస్తూ విలసిస్తున్నాయిట. కొంటె పదములు వేస్తూ, పెన వేసుకుంటూ, దూరమవుతూ, అద్భుతమైన నటన చేస్తూ ఉన్నాడుట. ఎల్లప్పుడూ చేతులకు వెన్న కలిగి ఉండే దొంగ కృష్ణుడు, బ్రహ్మ మొదలగు దేవతల భావనలలో ఆయన పాదాలు శోభిల్లుతాయిట. ఆయనే శ్రీ హరి, పరమపురుషుడు, వేరే ఉపమానము లేని వాడు, శ్రీ వేంకటాచలముపై వెలసిన శ్రీనివాసుడు.

గోవిందాష్టకం - తాత్పర్యము

గోవిందం పరమానందం అంటూ ఆదిశంకరులు ఆ లీలామానుష రూపమైన శ్రీ కృష్ణుని పరి పరి వర్ణించే స్తోత్రము గోవిందాష్టకం. ఆ మన మోహనుని సుందర రూపము చూడ వేయి కన్నులు చాలవు. ముఖ్యంగా ఇస్కాన్ మరియు ఉత్తర భారత దేశంలోని మందిరాలలో రాధాకృష్ణుల మూర్తులు వర్ణనకు అందని సౌందర్యము, లావణ్యము, ప్రశాంతతతో శోభిల్లుతుంటాయి. ఆ విగ్రహాలను చూస్తే మనసులో ప్రేమ, భక్తి పొంగిపొరలుతుంది. అదే ఆ రాధాకృష్ణుల తత్త్వములో ఉన్న  సమ్మోహనా శక్తి.

ఈ గోవిందాష్టకంలో శంకరులు కృష్ణావతార  లీలలను, వాటిలోని ఆధ్యాత్మికతను మనోహరంగా నుతించారు. కృష్ణ భక్తిలో ఉన్న ప్రేమ తత్త్వము, కొంటెతనము చాటున దాగి ఉన్న ఆధ్యాత్మిక సంపద,  సామాన్య మానవులకు పరమార్థాన్ని, కర్తవ్యాన్ని బోధించే స్పష్టత, విపులత మరే అవతారము లోను కనిపించదు. మీలో ఒకడిని అంటూ జీవన రథ సారథిగా నిలిచిన ఆ పరమాత్మ అందుకే జగద్గురువుగా  కొలవబడ్డాడు.

శంకర  భగవత్పాద విరచిత గోవిందాష్టకం సాహిత్యం, తాత్పర్యము, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి మధుర స్వరంలో శ్రవణం.


సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం
గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసం
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారం
క్ష్మాయా నాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం

మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసం
వ్యదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిం
లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకం
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం

త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నం
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారం
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసం
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందం

గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలం
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలం
గోభిర్నిగదిత గోవిందస్ఫుతనామానం బహునామానం
గోపీగోచరపథికం ప్రణమత గోవిందం పరమానందం

గోపీమండలగోష్ఠిభేదం భేదావస్థమభేదాభం
శశ్వద్గోఖురనిర్ఘూతోద్ధతధూలీధూసరసౌభాగ్యం
శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావం
చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందం

స్నానవ్యాకులయోశిద్వస్త్రముపాదాయాగముపారూఢం
వ్యదిత్సంతిరథ దిగ్వస్త్రా హ్యుపుదాతుముపాకర్షంతం
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థం
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందం

కాంతం కారణకారణమాదిమనాదిం కాలమనాభాసం
కాలిందీగతకాలియశిరసి ముహుర్నృత్యంతం నృత్యంతం
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నం
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందం

బృందావనభువి బృందారకగణబృందారాధ్యం వందేఽహం
కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందం
వంద్యాశేషమహామునిమానసవంద్యానందపదద్వంద్వం
వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందం

గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యో
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి
గోవిందాంఘ్రిసరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘో
గోవిందం పరమానందామృతమంతఃస్థం స తమభ్యేతి

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం శ్రీగోవిందాష్టకం సంపూర్ణం

తాత్పర్యము:

 సత్యము, జ్ఞానము, అనంతము, నిత్యము, ఆకాశాన్ని మించిన వాడు,  అన్నిటినీ మించిన వాడు, గోకులములో సంచరించే వాడు, ఎటువంటి ప్రయత్నమూ అవసరము లేని వాడు, అన్నిటికన్నా ఎక్కువ శ్రమ ఐన వాడు, మాయా రూపములో వివిధ రూపములలో ఉండేవాడు, ఆకారము లేని వాడు,  విశ్వాకారుడు, భూమి మీద అవతరించిన వాడు, నాథుడు లేని వాడు, పరమానందము అయిన గోవిందుని నుతించుము.

యశోద దెబ్బలకు భయపడి పారిపోబోయి, దొరికినంత, మన్ను తిన్నావా అని తల్లి అడిగినంత, నోటంతా పదునాలుగు భువనాలను చూపించిన, ముల్లోకాలకు మూల స్తంభమైన వాడు, లోకప్రకాశకుడు, లోకానికి అధిపతి, పరమేశ్వరుడు,  పరమానందము అయిన గోవిందుని నుతించుము.

రాక్షసులను సంహరించే వాడు, భూ భారాన్ని తగ్గించే వాడు, భవ రోగములను తగ్గించే వాడు, ముక్తిని ప్రసాదించే వాడు, వెన్నను తినే వాడు, ఆహారము అక్కర లేని వాడు, లోకానికి ఆహారమైన వాడు (ఆహార రూపుడు), విమలమైన మనస్సులలోని విశేషమైన స్థితిలో కనిపించే వాడు, పూర్తిగా దృశ్యము కాని వాడు,  శివుని ప్రస్తుతించే వాడు, ఎల్లప్పుడూ శాంతముగా, పవళించి ఉండే వాడు,   పరమానందము అయిన గోవిందుని నుతించుము.

గోపాలుడు, లీలామానుష విగ్రహుడు, యదువంశములో జన్మించిన వాడు, గోపికలతో ఆడి , గోవర్ధన గిరిని ఎత్తి గోకులాన్ని తన లీలలలో ముంచెత్తిన వాడు,  కామధేనువుచే మచ్చలేని 'గోవింద' అనే నామము పొందిన వాడు, అనేక నామములు కలవాడు, గోపికల గోచరానికి అందని వాడు,   పరమానందము అయిన గోవిందుని నుతించుము.

గోపికల సమూహంలోకి వెళ్లే వాడు, సచ్చిదానందమై వారికందని స్థితిలో వారిమధ్య ఉండే వాడు, గోధూళి వలన ద్విగుణీకృతమైన సౌందర్యము కలవాడు, భక్తిని ఆనందముగా స్వీకరించే వాడు, కారణానికి అందని వాడు, సద్బుద్ధికి కారణమైన వాడు, మహిమలలో చింతామణి వంటి వాడు, పరమానందము అయిన గోవిందుని నుతించుము.

చెట్టుపై కూర్చుని స్నానమాడుతున్న గోపికల వస్త్రములు దోచిన వాడు, వస్త్రముల కొరకు తన దగ్గరకు రమ్మనిన వాడు, శోకము, వ్యామోహం లేని వాడు, జ్ఞాని, జ్ఞానుల హృదయములో నివసించువాడు, సత్తమాత్రమైన వాడు, పరమానందము అయిన గోవిందుని నుతించుము.

కాంతియైన వాడు, కారణానికే కారణుడు, విశ్వానికి కారకుడు, మొదలు లేని వాడు, కాలానికి గతి అయిన వాడు, అప్రకాశుడు, కాళింది మడుగున కాళీయుని పై నర్తించిన వాడు, కాలుడు, మరణానికి అతీతుడు (కాలాతీతుడు), నిరాకారుడు, కలియుగ దోషాలను పోగొట్టే వాడు, భూత, భవిష్యద్వర్తమానములకు   కారణమైన వాడు, పరమానందము అయిన గోవిందుని నుతించుము.

బృందావనములో వ్రజ భూమి యొక్క గణముల సమూహములో విలసిల్లే వాడు, దేవతలు, బృందచే ప్రార్ధించ బడిన వాడు, మల్లె పూవు వంటి చిరునవ్వుతో అమృతమును చిందించే వాడు, స్నేహితులకు ఆనందము కలిగించే వాడు, అందరికీ వంద్యమైన పాదపద్మములు కలవాడు, సర్వ లక్షణ సంపన్నుడు, పరమానందము అయిన గోవిందుని నుతించుము.

ఎవరైతే గోవిందునికి మనసు సమర్పించి,  గోవింద, అచ్యుత, మాధవ, విష్ణు, గోకులనాయక, కృష్ణ అనే నామములతో నుతించి, ఆయన పాదపద్మములను పూజించుట వలన పాప ప్రక్షాళనము పొంది, గోవిందాష్టకం నుతిస్తారో, వారు గోవిందునితో ఏకమై పరమానందమును పొందుదురు.

9, డిసెంబర్ 2010, గురువారం

శ్రీమన్నారాయణీయం - ద్వితీయ స్కంధము, తాత్పర్యము

శ్రీమన్నారాయణీయం ద్వితీయ స్కంధము


నాలుగవ దశకము: అష్టాంగయోగ, యోగ సిద్ధి వర్ణనము

కల్యతామ్ మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా|
స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయాఽఽశు తవ తుష్టిమాప్నుయామ్ || ౪-౧


ఓ కృష్ణా! నిన్ను భక్తితో ఉపాసన చేయుటకు కావలసిన ఆరోగ్యమును నాకు ప్రసాదించుము. ఆష్టాంగ యోగమును సరియైన విధములో అనుష్ఠించుట చే నీ కృప త్వరగా పొందగలను అని విశ్వసిస్తున్నాను.

బ్రహ్మచర్యదృఢతాదిభిర్యమైరాప్లవాదినియమైశ్చ పావితాః|
కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః || ౪-౨


ప్రభూ!  నీ భక్తులమైన మేము దృఢమైన బ్రహ్మచర్యము, స్నానము మొదలైన నియమములతో పవిత్రులమై, సుఖాసనము లేదా పద్మాసనము లో స్థిరముగా కూర్చొని యోగమును అభ్యసిస్తాము.

తారమంతరనుచింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః|
ఇంద్రియాణి విషయాదథాపహృత్యాఽఽస్మహే భవదుపాసనోన్ముఖాః || ౪-౩


ఓ కృష్ణా! మనసులో ఓంకారము ధ్యానించుచు ప్రాణాయామము చేయుచు ప్రాణవాయువును బంధించి నిర్మలమైన మనసుతో ఇంద్రియములను విషయములనుండి మరల్చి నీ ఉపాసన చేయుదుము.

అస్ఫుటే వపుషి తే ప్రయత్నతో ధారయేమ ధిషణాం ముహుర్ముహుః|
తేనభక్తిరసమంతరార్ద్రతాముద్వహేమ భవదంఘ్రిచింతకాః || ౪-౪


ఓ కృష్ణా! నీ స్వరూపమును మేము ధ్యానిస్తున్నాము. ఆ రూపము మాకు స్పష్టముగా కనుపించుట లేదు. కావున, బుద్ధి, ప్రయత్న పూర్వకముగా ధారణ చేసెదము. ఈ సాధన వలన, నీ పాదములను ఎల్లప్పుడూ స్మరించుట వలన భక్తి రసములో మునిగి తేలుతూ ఉంటాము.

విస్ఫుటావయవభేదసుందరం త్వద్వపుస్సుచిరశీలనావశాత్|
అశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగనిరతాస్త్వదాశ్రయాః || ౪-౫||


నీ పదములను ఆశ్రయించి, ఎంతో కాలము ధారణము చేయుచు, ధ్యానయోగములో ఉందుము. దాని వలన, ఎంతో మనోహరమైన నీ రూపము మా హృదయములలో స్థిరముగా నిలిచి యుండును. అప్పుడు ఎట్టి శ్రమ లేకుండానే నీ స్వరూపమును మనసులో ధ్యానించెదము.

ధ్యాయతాం సకలమూర్తిమీదృశీమున్మిషన్మధురతాహృతాత్మనామ్|
సాంద్రమోదరసరూపమాంతరం బ్రహ్మరూపమయి తేఽవభాసతే || ౪-౬||


ఓ పరబ్రహ్మా! అన్ని కళలతో శోభిల్లుతున్న నీ మూర్తిని ధ్యానించు వారి హృదయములలో అది కనిపించుటచే వారు పరవశులగుదురు. అప్పుడు సచ్చిదానందమైన నీ పరబ్రహ్మ స్వరూపము వారి హృదయములలో ప్రకాశించును.

తత్సమాస్వదనరూపిణీం స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక|
ఆశ్రితాః పునరతః పరిచ్యుతావారభేమహి చ ధారణాధికమ్ || ౪-౭||


ఓ విశ్వనాయకా! సర్వాంగ శోభితమైన నీ స్వరూపమునందే మా మనస్సులు ఎల్లప్పుడూ లగ్నమై యుండుటచే సమాధి స్థితిని పొందెదము. ఏ కారణం వల్లనైన ఆ స్థితి నుండి జారినచో మరల నీ పాదములను ఆశ్రయించు, ధారణ ధ్యానము మొదలగు వాటిని ఆరంభించెదము.

ఇత్థమభ్యసననిర్భరోల్లసత్వత్పరాత్మసుఖకల్పితోత్సవాః|
ముక్తభక్తకులమౌలితాం గతాః సంచరేమ శుకనారదాదివత్ || ౪-౮||


ఓ కృష్ణా! అనన్యమైన భక్తితో సాధన చేయటం వలన అమితమైన సుఖమనే అనుభూతిలో ఓలలాడుతాము. అప్పుడు జీవించే ముక్తిని పొంది శుకుడు, నారదుని వలె సంచరిస్తాము.

త్వత్సమాధివిజయే తు యః పునర్మంక్షు మోక్షరసికః క్రమేణ వా|
యోగవశ్యమనిలం షడాశ్రయైరున్నయత్యజ సుషుమ్నయా శనైః || ౪-౯


ఓ పరమాత్మా! ఈ విధముగా సమాధి స్థితిని పొందటంలో పూర్తిగా సఫలమైన తర్వాత లేక కాలక్రమములో మోక్షగాముల మగుదుము. అప్పుడు ఆష్టాంగ యోగము ద్వారా ప్రాణ వాయువును స్వాధీనమునకు తెచ్చుకొని మూలాధారము మొదలగు చక్రములను, సుషుమ్న అను నాడి ద్వారా మెలమెల్లగా శిరస్సులో ఉన్న బ్రహ్మరంద్రము వరకు తీసుకొని వచ్చెదము.

లింగదేహమపి సంత్యజన్నథో లీయతే త్వయి పరే నిరాగ్రహః|
ఊర్ధ్వలోకకుతుకీ తు మూర్ధతస్సార్ధమేవ కరణైర్నిరీయతే || ౪-౧౦||


ఓ కృష్ణా! ఇట్టి సమాధి స్థితిలో ముక్తిని కోరుకునే వారు సూక్ష్మ శరీరమును కూడ విడిచి, పరమాత్మవైన నీలో లీనమగుదురు. అదే సాయుజ్యము. ఈ విధముగా కాకుండా మరికొందరు బ్రహ్మలోకము మొదలగు పైలోకాల వైభవమును చూడ కుతూహల పడు వారు ప్రాణములను బ్రహ్మరంధ్రము ద్వారా వదిలి, ఇంద్రియములతో కూడిన సూక్ష్మ శరీరముతో ఆయా లోకములలో విహరించు చున్నారు.

అగ్నివాసరవలర్క్షపక్షగైరుత్తరాయణజుషా చ దైవతైః|
ప్రాపితో రవిపదం భవత్పరో మోదవాన్ ధ్రువపదాంతమీయతే || ౪-౧౧||


స్వామీ! సాయుజ్యమును కోరేవారు అగ్ని, వాసర, శుక్ల పక్ష, ఉత్తరాయణ అధిష్టాన దేవతల ద్వారా సూర్యలోకమును పొందుదురు. అక్కడ ఎల్లప్పుడూ నీ పరాయణులై ధ్రువ పదమును చేరుతారు.

ఆస్థితోఽథ మహరాలయే యదా శేషవక్త్రదహనోష్మణాఽఽర్ద్యతే|
ఈయతే భవదుపాశ్రయస్తదా వేధసః పదమతః పురైవ వా || ౪-౧౨||


ఓ ప్రభూ! ధ్రువ మండలము చేరిన తర్వాత నిన్ను ఆశ్రయించి యున్న భక్తుడు మహర్లోకము చేరుకొనును. అక్కడినుంచి పోవునప్పుడు ఆదిశేషుని వేయి ముఖముల నుండి వెలువడే అగ్నిజ్వాలలు అతనిని దహించును. అలా మగ్గుతూ క్రమముగా బ్రహ్మదేవుడు నివశించే సత్యలోకమును చేరుకొనును. నీ అనుగ్రహము వలన ఆ భక్తుడు ఆదిశేషుని అగ్నిజ్వాలలో పడి బాధలు చెందకుండా ముందుగానే బ్రహ్మలోకమును కూడ చేరుకొనవచ్చు.

తత్ర వా తవ పదేఽథవా వసన్ ప్రాకృతప్రళయ ఏతి ముక్తతాం |
స్వేచ్ఛయా ఖలు పురాఽపి ముచ్యతే సంవిభిద్య జగదండమోజసా || ౪-౧౩


ఓ పరమాత్మా! బ్రహ్మలోకమగు సత్యలోకమున లేక నీవున్న విష్ణులోకములో ఉండి బ్రహ్మ ప్రళయము ఏర్పడినప్పుడు బ్రహ్మదేవునితో కలసి నీ భక్తుడు ముక్తిని పొందును. లేక బ్రహ్మాది లోకములందు అతడు విరక్తుడైనచో మహా ప్రళయమునకు ముందే యోగబలముచేత బ్రహ్మాండ భాండమును భేదించుకొని మోక్షమును పొందును.

తస్య చ క్షితిపయోమహోనిలద్యోమహత్ప్రకృతిసప్తకావృతీః |
తత్తదాత్మకతయా విశన్ సుఖీ యాతి తే పదమనావృతమ్ విభో || ౪-౧౪


ప్రభూ! యోగి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశమనే పంచభూతములు, మహాత్తత్వము మూల ప్రకృతి అను బ్రహ్మాన్డమునకు సంబంధించిన ఏడు ఆవరణములందు ఆయా ఆవరణ రూపమున ప్రవేశించును. అచ్చట పరమానందము అనుభవించి చివరకు ఎట్టి ఆవరణము లేని నీవు ఉండు ప్రదేశమును చేరుకొనును.

అర్చిరాదిగతిమీదృశీం వ్రజన్ విచ్యుతిం న భజతే జగత్పతే |
సచ్చిదాత్మక భవద్గుణోదయానుచ్చరంతమనిలేశ పాహి మామ్ || ౪-౧౫||


జగన్నాయకా! సచ్చిదానంద స్వరూపా! గురువాయురప్పా! శ్రీ కృష్ణా! ఈ విధముగా తేజో మార్గమున పోయిన యోగీశ్వరుడు అక్కడ చ్యుతి లేనివాడై పునర్జన్మను ఏ మాత్రము పొందడు. ఈ విధముగా నీ కళ్యాణ గుణగణములను గానము చేయుచున్న నన్ను రోగాది బాధలనుండి కరుణతో రక్షింపుము.

ఐదవ దశకము - విరాట్పురుషోత్పత్తి

వ్యక్తావ్యక్తమిదం న కించిదభవత్ప్రాక్ప్రాకృతప్రక్షయే
మాయాయామ్ గుణసామ్యరుద్ధవికృతౌ త్వయ్యాగతాయాం లయమ్|
నో మృత్యుశ్చ తదామృతం చ సమభూన్నాహ్నో న రాత్రేః స్థితి-
స్తత్రైకస్త్వమశిష్యథాః కిల పరానందప్రకాశాత్మనా || ౫-౧||


ప్రాకృత ప్రళయ సమయమందు త్రిగుణములు సమానమైన స్థితిలో ఉండును. ఆ సమయములో ప్రకృతి (మాయ) నీలో విలీనమగును. అప్పుడు కారణ రూపమైన అవ్యక్తము (సూక్ష్మ ప్రకృతి) కార్య రూపమైన వ్యక్తము (స్థూల ప్రపంచము) రెండు ఉండవు. అట్టి మహా ప్రళయ సమయమున మృత్యువు గానీ, అమృతం గానీ, పగలు రాత్రి గానీ ఏమి ఉండవు. కానీ, ఆ సమయమున నీవొక్కడవే పరబ్రహ్మ రూపమున ఉందువని వేదములు తెలుపుచున్నవి.

కాలః కర్మగుణాశ్చ జీవనివహా విశ్వం చ కార్యం విభోః
చిల్లీలారతిమేయుషి త్వయి తదా నిర్లీనతామాయయుః|
తేషాం నైవ వదంత్యసత్త్వమయి భో శక్త్యాత్మనా తిష్ఠతాం
నో చేత్ కిం గగనప్రసూనసదృశాం భూయో భవేత్సంభవః || ౫-౨||


ఓ స్వామీ! మహా ప్రళయ సమయమున కాలము, కర్మ, త్రిగుణములు, జీవులు, ప్రపంచము మొదలైనవన్నీ ఆత్మానుసంధానమున మునిగి యున్న నీలో విలీనమగుచున్నవి. అంత మాత్రమున అవి అసలు లేనే లేవు యన రాదు. అవి అన్నియు అమూర్తశక్తి రూపమున నీ లో అణగి యున్నవి. ఆకాశ పుష్పములవలె అవి ఏ మాత్రము లేవని అనినచో తరువాత అవి తిరిగి పుట్టుట అనునది ఏ విధముగానూ సంభవం కాదు కదా!

ఏవం చ ద్విపరార్ధకాలవిగతావీక్షాం సిసృక్షాత్మికాం
విభ్రాణే త్వయి చుక్షుభే త్రిభువనీభావాయ మాయా స్వయమ్|
మాయాతః ఖలు కాలశక్తిరఖిలాదృష్టం స్వభావోఽపి చ
ప్రాదుర్భూయ గుణాన్వికాస్య విదధుస్తస్యాస్యాస్సహాయక్రియామ్ || ౫-౩||


ఈ విధముగా మహాప్రళయము బ్రహ్మయొక్క ఆయుర్దాయమనదగిన ద్విపరార్ధ కాలముండును. ఆ ప్రళయ కాలము గడిచిన తర్వాత నీవు ఈ చరాచర సృష్టి చేయదలచి ఒక్కసారి చూచెదవు. ఆ సమయమున నీ మాయ విశ్వసృష్టికి తనంతట తాను క్షోభము చెందును. అనగా త్రిగుణముల సామ్యావస్థ (equilibrium) నశించును. అప్పుడు మాయవలన కాలము, శక్తి, పాపపుణ్య రూపమైన అదృష్టము, స్వభావమనునవి ఏర్పడి త్రిగుణములు వికసించి సృష్టి క్రియ యందు మాయకు తోడ్పడుచున్నవి.

మాయాసన్నిహితోఽప్రవిష్టవపుషా సాక్షీతి గీతో భవాన్
భేదైస్తాం ప్రతిబింబితో వివిశివాన్ జీవోఽపి నైవాపరః|
కాలాదిప్రతిబోధితాఽథ భవతా సంచోదితా చ స్వయం
మాయా సా ఖలు బుద్ధితత్వమసృజద్యోఽసౌ మహానుచ్యతే || ౫-౪||


ఓ భగవాన్! నీ మాయ సృష్ట్యాది కార్యక్రమములను నెరవేర్చును. కానీ నీవు మాత్రము ఆ మాయతో ఎట్టి సంబంధము లేక సర్వ సాక్షిగా ఉందువు. నీవే మాయ యందు  ప్రతిబింబించి జీవుడనే పేరుతో ప్రసిద్దుడవైనావు. జీవుడు నీ ప్రతిబింబమే తప్ప వేరే కాదు. కళాశక్తి, అదృష్టము మొదలగు వానిచే ప్రతిబోధింప బడిన మాయ, విశ్వసృష్టి చేయవలెనను నీ చూపు చేత ప్రేరేపించ బడి, మొట్ట మొదట బుద్ధి తత్త్వమును సృష్టించినది. దీనినే మహత్తత్త్వ మందురు. 

తత్రాసౌ త్రిగుణాత్మకోఽపి చ మహాన్ సత్వప్రధానః స్వయం
జీవేఽస్మిన్ ఖలు నిర్వికల్పమహమిత్యుద్బోధనిష్పాదకః|
చక్రేఽస్మిన్ సవికల్పబోధకమహంతత్వం మహాన్ ఖల్వసౌ
సమ్పుష్టం త్రిగుణైస్తమోఽతిబహులం విష్ణో భవత్ప్రేరణాత్ || ౫-౫||


ఓ విష్ణో! ఈ మహత్తత్త్వమున త్రిగుణములు ఉన్నప్పటికీ, అది సత్వగుణ ప్రధానమై జీవుని యందు నిర్వికల్పమైన "అహం" తత్త్వమును కలిగించినది. తరువాత మహత్తత్త్వము నీ ప్రేరణ వలన జీవునియందు సవికల్పమైన, తమోగుణ ప్రధానమైన "అహం" తత్త్వమును పుట్టించు చున్నది. ఈ తమోగుణ ప్రధానమైన అహం తత్త్వములో నేను నీవు అను భేద బుద్ధి కనిపించును.

సోఽహం చ త్రిగుణక్రమాత్ త్రివిధతామాసాద్య వైకారికో
భూయస్తైజసతామసావితి భవన్నాద్యేన సత్వాత్మనా|
దేవానింద్రియమానినోఽకృత దిశావాతార్కపాశ్యశ్వినో
వహ్నీంద్రాచ్యుతమిత్రకాన్ విధువిధిశ్రీరుద్రశారీరకాన్ || ౫-౬||


ఈ సవికల్పమైన అహంతత్త్వము సత్త్వ, రజస్, తమము అను త్రిగుణములను అనుసరించి, మూడు విధములగుచున్నది. వీటిలో మొదటిదైన సాత్త్విక అంశ వలన జ్ఞానేన్ద్రియములకు అధిదేవతలైన దిక్కు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు అనువారును, అట్లే కర్మేన్ద్రియములకు అధిదేవతలైన అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనువారును, మరియు మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అంతఃకరణ చతుష్టయమునకు అధిదేవతలైన చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షేత్రజ్ఞుడు అనువారు పుట్టిరి.

భూమన్మానసభుద్ధ్యహంకృతిమిళచ్చిత్తాఖ్యవృత్యన్వితం
తచ్చాంతఃకరణం విభో తవ బలాత్ సత్వాంశ ఏవాసృజత్|
జాతస్తైజసతో దశేంద్రియగణస్తత్తామసాంశాత్పున-
స్తన్మాత్రం నభసో మరుత్పురపతే శబ్దోఽజని త్వద్బలాత్ || ౫-౭||


ప్రభూ! గురువాయుపుర పతి! శ్రీ కృష్ణా! నీ ప్రేరణ వలన సత్త్వాంశ మైన సాత్త్వికాహంకారము వలన మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అను అంతఃకరణ చతుష్టయము పుట్టినది. అట్లే రాజసాంశము వలన జ్ఞానేంద్రియములైన త్వక్, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణ, చక్షుస్సులు, కర్మేన్ద్రియములైన వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలు కలిగినవి. తామసాంశము వలన ఆకాశము యొక్క తన్మాత్రమైన శబ్దము కలిగినది.

శబ్దాద్వ్యోమ తతః ససర్జిథ విభో స్పర్శం తతో మారుతం
తస్మాద్రూపమతో మహోఽథ చ రసం తోయం చ గంధం మహీమ్|
ఏవమ్ మాధవ పూర్వపూర్వకలనాదాద్యాద్యధర్మాన్వితం
భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్ || ౫-౮||


ఓ మాధవా! శబ్దము వలన శబ్ద గుణకమైన ఆకాశము పుట్టినది. ఆకాశము వలన స్పర్శ పుట్టినది. ఆ స్పర్శము నుండి శబ్ద స్పర్శ గుణకమైన వాయువు, వాయువు వలన రూపము, రూపము వలన శబ్ద స్పర్శ రూప గుణకమైన తేజస్సు, తేజస్సు వలన రసము, రసము వలన శబ్ద స్పర్శ రూప రస గుణకమైన నీరు, నీటి నుండి గంధము, గంధము వలన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గుణకమైన భూమి, ఇట్లు పంచభూతములను తత్తద్ధర్మ సమన్వితముగా నీవు సృష్టించితివి.

ఏతే భూతగణాస్తథేంద్రియగణా దేవాశ్చ జాతా పృథక్-
నో శేకుర్భువనాండనిర్మితివిధౌ దేవైరమీభిస్తదా|
త్వం నానావిధసూక్తిభిర్నుతగుణస్తత్వాన్యమూన్యావిశం-
శ్చేష్టాశక్తిముదీర్య తాని ఘటయన్ హైరణ్యమండం వ్యధాః || ౫-౯||


ప్రభూ! ఈ పృథివి మొదలైన పంచ భూతములు, జ్ఞాన కర్మేంద్రియములు, తదభిమాన దేవతలు ఒక్కొక్కరు ప్రత్యేకముగా పుట్టినప్పటికీ, వీరిలో ఎవ్వరు కూడా బ్రహ్మాండమును నిర్మించ లేకపోయినారు. అప్పుడు వారందరూ పరమాత్మవగు నిన్ను అనేక విధములగు స్తోత్రములచే స్తుతించిరి. అప్పుడు నీవు పృథివి మొదలైన సమస్త తత్త్వములందు ప్రవేశించి వాటి యందు క్రియాశాక్తిని జాగృతం చేసి వాటినన్నిటిని ఒక్క త్రాటి మీదికి తెచ్చితివి. ఆ విధముగా నీవు బ్రహ్మాండమును సృష్టించితివి.

అండం తత్ఖలు పూర్వసృష్టసలిలేఽతిష్ఠత్ సహస్రం సమాః
నిర్భిందన్నకృథాశ్చతుర్దశజగద్రూపం విరాడాహ్వయమ్|
సాహస్రైః కరపాదమూర్ధనివహైర్నిశ్శేషజీవాత్మకో
నిర్భాతోఽసి మరుత్పురాధిప స మాం త్రాయస్వ సర్వామయాత్ || ౫-౧౦||


గురువాయుపురాధీశా! శ్రీమన్నారాయణ! సృష్టికి పూర్వము ఆవరించిన కారణ జలమందు ఆ బ్రహ్మాండము అనేక వేల సంవత్సరములు ఉండినది. తరువాత ఆ బ్రహ్మాండమున నీవు ప్రవేశించి దానిని అనేక విధముల విభజించి విరాట్ సంజ్ఞకమైన పదునాలుగు భువనములను సృష్టించితివి. పిమ్మట నీవు అనేక వేల కరములతో, పాదములతో, సమస్త జీవుల రూపమున ప్రకాశించిటివి. గురువాయురప్పా! అట్టి నీవు నా సమస్త రోగములను కరుణతో తొలగించుము.

ఆరవ దశకము - విరాట్పురుషుని జగదాత్మ తత్త్వము

ఏవం చతుర్దశజగన్మయతాం గతస్య
పాతాళమీశ తవ పాదతలం వదంతి|
పాదోర్ధ్వదేశమపి దేవ రసాతలం తే
గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్ || ౬-౧||


పరమాత్మా! ఈ విధముగా చతుర్దశ భువన రూపుడవై యున్న నీ పాదముల యొక్క అథో భాగమే పాతాళము. అట్లే రసాతలము నీ పాదముల యొక్క పై భాగము. అదే విధముగా నీ యొక్క చీల మండలు మహాతలముగా పేర్కొనబడినది.

జంఘే తలాతలమథో సుతలం చ జానూ
కించోరుభాగయుగళం వితలాతలే ద్వే|
క్షోణీతలం జఘనమంబరమంగ నాభి-
ర్వక్షశ్చ శక్రనిలయస్తవ చక్రపాణే || ౬-౨||


చక్రపాణీ! శ్రీ కృష్ణా! నీ పిక్కలు తలాతలము, మోకాళ్ళు సుతలము, రెండు తొడలు వితలము మరియు అతలము, నీ పిరుదులు భూమి, నాభి భాగము ఆకాశము. అట్లే నీ వక్షస్థలము ఇంద్రనివాసమైన స్వర్గలోకముగా ఉన్నవి.

గ్రీవా మహస్తవ ముఖం చ జనస్తపస్తు
ఫాలం శిరస్తవ సమస్తమయస్య సత్యమ్|
ఏవం జగన్మయతనో జగదాశ్రితైర-
ప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్నమస్తే || ౬-౩||


ఓ జగత్స్వరూపా! శ్రీ కృష్ణా! నీవు సమస్త విశ్వరూపుడవు. అట్టి నీ యొక్క కంఠం మహర్లోకము. నీ ముఖము జనోలోకము. నీ నుదురు తపోలోకము. నీ శిరస్సు సత్యలోకము. ఈ విశ్వమందున్న ఇతర ప్రాంతములు నీ శరీరములోని ఇతర భాగములు. ఈ విధముగా జగన్మయరూపుడైన నీకు భక్తితో నమస్కరించెదను.

త్వద్బ్రహ్మరంధ్రపదమీశ్వర విశ్వకంద
ఛందాంసి కేశవ ఘనాస్తవ కేశపాశాః|
ఉల్లాసిచిల్లియుగళం దృహిణస్య గేహం
పక్ష్మాణి రాత్రిదివసౌ సవితా చ నేత్రే || ౬-౪||


ప్రపంచ సృష్టికి కారణమైన ఓ పరమేశ్వరా! కేశవా! నీ యొక్క బ్రహ్మ రంద్ర స్థానమే వేదములు. నీ కేశములు మేఘములు. నీ కనుబొమ్మలు బ్రహ్మదేవుడు ఉండు స్థానము. అట్లే రాత్రి, పగలు నీ కనురెప్పలు, సూర్యుడు నీ యొక్క నేత్రద్వాయము.

నిశ్శేషవిశ్వరచనా చ కటాక్షమోక్షః
కర్ణౌ దిశోఽశ్వియుగళం తవ నాసికే ద్వే|
లోభత్రపే చ భగవన్నధరోత్తరోష్ఠౌ
తారాగణశ్చ రదనాః శమనశ్చ దంష్ట్రా || ౬-౫||


ఓ శ్రీ కృష్ణా! నీ చూపు వలన ఈ సమస్త ప్రపంచము ఏర్పడినది. నీ యొక్క చెవులే దిక్కులు. నీ యొక్క నాసికారంధ్రములు అశ్వినీ దేవతలు. నీ పెదవులు లోభము మరియు సిగ్గు.  అట్లే నీ దంతములే నక్షత్ర రాసులు. అదే విధముగా యముడు నీ కోరలు.

మాయా విలాసహసితం శ్వసితం సమీరో
జిహ్వా జలం వచనమీశ శకున్తపంక్తిః|
సిద్ధాదయస్స్వరగణా ముఖరంధ్రమగ్ని-
ర్దేవా భుజాః స్తనయుగం తవ ధర్మదేవః || ౬-౬||


పరమాత్మా! మనోహరమైన నీ చిరునవ్వే మాయ. నీ నిట్టూర్పే గాలి. నీరు నీ నాలుక. పక్షుల యొక్క కలకలమే నీ వాక్కు. సిద్ధులు మొదలైన ఆకాశ సంచారులు సప్తస్వరములు. అగ్నియె నీ ముఖము. ఇంద్రాది దేవతలు నీ భుజములు. ధర్మ దేవత నీ స్తన ద్వయము.

పృష్ఠం త్వధర్మ ఇహ దేవ మనస్సుధాంశు-
రవ్యక్తమేవ హృదయాంబుజమంబుజాక్ష|
కుక్షిస్సముద్రనివహా వసనం తు సంధ్యే
శేఫః ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః || ౬-౭||


తామరల వంటి నేత్రములు గల శ్రీ కృష్ణ పరమాత్మా! అధర్మము నీ వీపు. చంద్రుడు నీ మనస్సు. అవ్యక్తమే నీ హృదయ పద్మము. సప్త సముద్రములు నీ యొక్క ఉదరము. ఉభయ సంధ్యలు నీ వస్త్రము. అట్లే నీ శ్నిశ్నము (foreskin of penis) ప్రజాపతి, మరియు మిత్రదేవత నీ వృషణములు. 

శ్రోణిస్థలం మృగగణాః పదయోర్నఖాస్తే
హస్త్యుష్ట్రసైంధవముఖా గమనం తు కాలః|
విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహు-
చారూరుయుగ్మచరణం కరుణాంబుధే తే || ౬-౮||


ఓ కరుణా సాగరా! మృగములు నీ యొక్క కటి భాగము. ఏనుగు, ఒంటె, గుఱ్ఱము వంటి వాహనములు నీ యొక్క కాలిగోళ్ళు. కాలము నీ గమనము. బ్రాహ్మణుడు మొదలైన నాలుగు వర్ణములవారి జన్మస్థానములు వరుసగా నీ ముఖ కమలము, బాహువులు, తొడలు మరియు నీ పాదములు.

సంసారచక్రమయి చక్రధర క్రియాస్తే
వీర్యం మహాసురగణోఽస్థికులాని శైలాః|
నాడ్యస్సరిత్సముదయస్తరవశ్చ రోమ
జీయాదిదం వపురనిర్వచనీయమీశ || ౬-౯||


చక్రధారీ! శ్రీ కృష్ణా! ఈ సంసార చక్రము యొక్క సృష్టి స్థితి లయములే నీ క్రియా కలాపములు, అసుర గణమే నీ పరాక్రమము. పర్వత పంక్తులే నీ ఆస్థి సమూహము, నదీ నదములే నీ నాడులు, వృక్షములే నీ రోమములు. ప్రభూ! అనిర్వచనీయమైన నీ విరాట్రూపమునకు జయము కలుగు గాక.

ఈదృగ్జగన్మయవపుస్తవ కర్మభాజాం
కర్మావసానసమయే స్మరణీయమాహుః|
తస్యాంతరాత్మవపుషే విమలాత్మనే తే
వాతాలయాధిప నమోఽస్తు నిరుంధి రోగాన్ || ౬-౧౦||


వాయుపురాధీశా! ఈ విధముగా ఈ సమస్త జగత్తు నీ రూపమే. శ్రవణ, మనన, కీర్తనాదులను చేసెడి భక్తులు నిత్య నైమిత్తిక కర్మలను, షోడశోపచారములను ఆచరించినపుడు, నీ దివ్య మంగళ విగ్రహమును విరాడ్రూపముగా భావించి స్మరించు చుండవలెను. స్వామీ! శుద్ధ సత్త్వ స్వరూపుడవైన నీవే ఈ సకల జగత్తునకు అంతరాత్మవు. అట్టి నీకు భక్తితో ప్రణమిల్లుదును . దయతో నా రోగ బాధలను నివారింపుము.

ఏడవ దశకము - హిరణ్య గర్భోత్పత్తి

ఏవం దేవ చతుర్దశాత్మకజగద్రూపేణ జాతః పున-
స్తస్యోర్ధ్వం ఖలు సత్యలోకనిలయే జాతోఽసి ధాతా స్వయమ్|
యం శంసంతి హిరణ్యగర్భమఖిలత్రైలోక్యజీవాత్మకం
యోఽభూత్ స్ఫీతరజోవికారవికసన్నానాసిసృక్షారసః || ౭-౧||


శ్రీ హరీ! నీవు ఈ విధముగా పదునాలుగు భువనముల రూపమున ఏర్పడితివి వీటిలో అన్నిటికంటే, పైన ఉన్న సత్యలోకమున నీవు బ్రహ్మదేవుడుగా వెలసితివి. నీ అంశయైన ఆ బ్రహ్మదేవుని హిరణ్యగర్భుడని కూడా అందురు. అతడు ముల్లోకములందున్న సమస్త జీవ రూపుడు. అతని యందు రజోగుణ ప్రేరణచే సుర,నర, తిర్యగాది ప్రాణులన్నిటికి శ్రేయస్సు గూర్చవలెనను సంకల్పము కలిగెను. అందువలన అనేక విధములైన సృష్టిరచన చేయవలెనను కోరిక అతనికి కలిగినది.

సోఽయం విశ్వవిసర్గదత్తహృదయస్సంపశ్యమానస్స్వయం
బోధం ఖల్వనవాష్య విశ్వవిషయం చింతాకులస్తస్థివాన్|
తావత్ త్వం జగతాంపతే తపతపేత్యేవం హి వైహాయసీం
వాణీమేనమశిశ్రవః శ్రుతిసుఖాం కుర్వంస్తపఃప్రేరణామ్ || ౭-౨||


ఆ బ్రహ్మదేవునకు విశ్వసృష్టి చేయవలెనను కోరిక కలిగి అందులకై బాగుగా ఆలోచించినాడు. కాని విశ్వసృష్టి ఏ విధముగా చేయవలెనో తెలియక అతడు చాలా కాలము చింతించెను. ఆ సమయమున జగన్నాథుడైన నీవు బ్రహ్మ దేవుని తపస్సు చేయుమని ప్రేరేపించుచు 'తప' 'తప' అను శ్రోత్ర మధురమైన ఆకాశవాణిని అతనికి వినిపించితివి.

కోఽసౌ మామవదత్పుమానితి జలాపూర్ణే జగన్మండలే
దిక్షూద్వీక్ష్య కిమప్యనీక్షితవతా వాక్యార్థముత్పశ్యతా|
దివ్యం వర్షసహస్రమాత్తపసా తేన త్వమారాధిత-
స్తస్మై దర్శితవానసి స్వనిలయం వైకుణ్ఠమేకాద్భుతమ్ || ౭-౩||


అప్పుడా బ్రహ్మ నీటిచే నిండిపోయిన జగన్మండలమున 'తప తప' అని అన్న వ్యక్తి ఎవ్వరని దిక్కులు చూచెను. ఎవ్వరు కానరాలేదు. అప్పుడు బ్రహ్మ తనకు వినిపించిన వాక్యార్థమును అనుసరించి అనే దివ్య సంవత్సరములు తప్పసు చేయుచు పరమాత్మవగు నిన్ను ఆరాధించెను. అందువలన నీవు సంతుష్టుడవై అతనికి నీవు నివసించే వైకుంఠమును చూపితివి. ఆ వైకుంఠమును  చూచుటకు అత్యద్భుతముగా ఉండెను.

మాయా యత్ర కదాపి నో వికురుతే భాతే జగద్భ్యో బహి-
శ్శోకక్రోధవిమోహసాధ్వసముఖా భావాస్తు దూరం గతాః|
సాంద్రానందఝరీ చ యత్ర పరమజ్యోతిఃప్రకాశాత్మకే
తత్ తే ధామ విభావితం విజయతే వైకుణ్ఠరూపం విభో || ౭-౪||


ప్రభూ! నీ ధామమైన వైకుంఠము చతుర్దశ భువనముల కంటే పైన ఉన్నది. అచ్చట మాయ యొక్క ప్రభావము కనిపించదు. అచ్చట దుఃఖము, కోపము, మోహము, భయము మొదలైన నీచ భావములేవియు ఉండనే ఉండవు. అది పరంజ్యోతి ప్రకాశించు స్థలము. అచ్చట బ్రహ్మానందము పొంగిపొరలు చుండును. అట్లు విరాజిల్లుతున్న నీ వైకుంఠ ధామమునకు జయము జయము. 

యస్మిన్నామ చతుర్భుజా హరిమణిశ్యామావదాతత్విషో
నానాభూషణరత్నదీపితదిశో రాజద్విమానాలయాః|
భక్తిప్రాప్తతథావిధోన్నతపదా దీవ్యంతి దివ్యా జనా-
స్తత్తే ధామ నిరస్తసర్వశమలం వైకుంఠరూపం జయేత్ || ౭-౫||


ఆ వైకుంఠమున యున్నవారు నాలుగు భుజములతో, ఇంద్ర నీలమణి వలె నల్లని కాంతి కలిగి నీ యందలి పరమభక్తి వలన అత్యున్నతమైన స్థానమును పొందియుందురు. వారి శరీరములు దివ్యమైనవి. వారుందు భవనములు గొప్ప గొప్ప విమానములతో ప్రకాశించు చుండును. అచ్చట మలినమైన భావములకే మాత్రము తావు లేదు. అట్టి విశిష్ట స్థానమైన వైకుంఠమునకు జయము జయము. 

నానాదివ్యవధూజనైరభివృతా విద్యుల్లతాతుల్యయా
విశ్వోన్మాదనహృద్యగాత్రలతయా విద్యోతితాశాంతరా|
త్వత్పాదాంబుజసౌరభైకకుతుకాల్లక్ష్మీః స్వయం లక్ష్యతే
యస్మిన్ విస్మయనీయదివ్యవిభవం తత్తే పదం దేహి మే || ౭-౬||


ఆ పరమ పదమున లక్ష్మీదేవి నీ పాదపద్మముల పరిమళములందు మిక్కిలి ఆసక్తి కలిగి స్వయముగా అచట వెలసి యుండును. అనేక మంది దివ్యాంగనలు ఆమె చుట్టూ చేరి సేవించు చుందురు. మెరుపు తీగ వలె సుందరమైన ఆమె మనోహర శరీరము విశ్వమంతటా కాంతులను విరజిమ్ముచుండును. ఆ శోభాలకు అందరును పరవశించు చుందురు. నీ వైకుంఠము దివ్య వైభవ శోభితము, ఆశ్చర్య జనకము, అట్టి దివ్యదామమును నాకు ప్రసాదించుము.

తత్రైవం ప్రతిదర్శితే నిజపదే రత్నాసనాధ్యాసితం
భాస్వత్కోటిలసత్కిరీటకటకాద్యాకల్పదీపాకృతి|
శ్రీవత్సాంకితమాత్తకౌస్తుభమణిచ్ఛాయారుణం కారణం
విశ్వేషాం తవ రూపమైక్షత విధిస్తత్తే విభో భాతు మే || ౭-౭||


ఓ నారాయణా! బ్రహ్మ దేవుడు అనే సంవత్సరములు తపస్సు చేసి నీ అనుగ్రహుమును పొందెను. అందువలన ఆయనకు వైకుంఠమున నున్న నీ దివ్యరూప దర్శన భాగ్యము కలిగెను. అక్కడ నీవు రత్నమయమైన సింహాసనమున ఆసీనుడవై కోటి సూర్యుల కాంతులు కల కిరీటము, కంకణములు మొదలైన దివ్యమైన ఆభరణములతో ప్రకాశించుచుందువు. నీ వక్ష స్థలముపై శ్రీ వత్స చిహ్నముండును. కౌస్తుభ మణి చాయలచే నీ మేఘ శ్యామల రూపము అరుణ కాంతులిడు చుండును. నీవు సమస్త లోకములకు కారణ భూతుడవు. అట్టి నీ దివ్యరూపమును దర్శించు అదృష్టమును భక్తుడనైన నాకు అనుగ్రహించుము.

కాళాంభోదకలాయకోమలరుచాం చక్రేణ చక్రం దిశా-
మావృణ్వానముదారమందహసితస్యందప్రసన్నాననమ్|
రాజత్కంబుగదారిపంకజధరశ్రీమద్భుజామండలం
స్రష్టుస్తుష్టికరం వపుస్తవ విభో మద్రోగముద్వాసయేత్ || ౭-౮||


ప్రభూ! నీ స్వరూపము నీల మేఘచ్చాయలతో, కలువల సౌకుమార్యములతో ఒప్పుచు అన్ని దిక్కుల యందును దివ్య శోభలను వెదజల్లు చున్నది. ప్రసన్నమైన నీ ముఖము కారుణ్యముతో నిండి చిరునవ్వు అందించు చున్నది. మనోజ్ఞములైన నీ చతుర్భుజములు శంఖ చక్ర గదా పద్మములతో విరాజిల్లు చున్నవి. నీ అద్భుత మూర్తి సృష్టి కర్త యైన బ్రహ్మకు ఆనందము కూర్చు చున్నది. అట్టి నీ దివ్య రూప దర్శన ప్రభావము నా వ్యాదులన్నిటినీ అంతరించ చేయు గాక.

దృష్ట్వా సంభృతసంభ్రమః కమలభూస్త్వత్పాదపాథోరుహే
హర్షావేశవశంవదో నిపతితః ప్రీత్యా కృతార్థీభవన్|
జానాస్యేవ మనీషితం మమ విభో జ్ఞానం తదాపాదయ
ద్వైతాద్వైతభవత్స్వరూపపరమిత్యాచష్ట తం త్వాం భజే || ౭-౯||


స్వామీ! బ్రహ్మదేవుడు నీ పాదపద్మముల వైభవమును చూసి ముగ్ధుడై తన్ను తాను మరచిపోయెను. పిదప అంతులేని ఆనందములో మునిగెను. అంతట, తాను కృతార్థుడైనట్లు భావించి, నీ పాదములపై వ్రాలెను. పిమ్మట అతడు "ఓ ప్రభూ! సృష్టి చేయుటకై నేను పడుచున్నవేదనను నీవు ఎరుగుదువు. ద్వైతాద్వైత పరమైన నీ స్వరూప జ్ఞానమును నాకు అనుగ్రహించుము" అని నిన్ను వేడుకొనెను. అట్టి పరమాత్మవైన నిన్ను నేను భజించుచున్నాను.  

ఆతామ్రే చరణే వినమ్రమథ తం హస్తేన హస్తే స్పృశన్
బోధస్తే భవితా న సర్గవిధిబిర్బంధోఽపి సంజాయతే|
ఇత్యాభాష్య గిరం ప్రతోష్యనితరాం తచ్చిత్తగూఢః స్వయం
సృష్టౌ తం సముదైరయస్స భగవన్నుల్లాసయోల్లాఘతామ్ || ౭-౧౦||


ప్రభూ! ఈ విధముగా బ్రహ్మదేవుడు ఎర్రని నీ పాదపద్మములకు నమస్కరించినప్పుడు నీ మృదువైన హస్తముతో ఆయనను స్ప్రుశించుచు ఇట్లంటివి - "విధాతా! నీవు కోరుకున్నట్లు సృష్టి సంబంధమైన జ్ఞానము నీకు లభించును. కానే నీవు కర్మ బంధములలో చిక్కుబడవు. " ఇట్లు పలికి ఆయనను సంతోషపరిచితివి. అంతేగాక, ఆయన హృదయమున చేరి, ఆ బ్రహ్మదేవుడు చేయు సృష్టి కార్యమునకు నీవు ప్రేరణ కూర్చితివి. శ్రీ కృష్ణ పరమాత్మా! నీవు నాపై దయదలచి నాకు ఆరోగ్యమును చేకూర్చుము.

శరణాగత రక్షణ బిరుదని - భద్రాచల రామదాసు కృతి

శరణాగత రక్షణ బిరుదని నే శరణంటిగదయ్యా వెరవకుమని అభయంబొసగవే నను గన్నతండ్రివయ్యా కరివరదా సిరులొసగను దశరథ నందన రావయ్యా నిరతము నీ నామము నా జిహ్వక...