13, డిసెంబర్ 2010, సోమవారం

రామ రామ రామ రామ - పట్టాభి రాముని వర్ణన

శ్రీ రాముని నుతించటం అంటే అది త్యాగరాజునికే చెల్లు. ఆ నీల మేఘ శ్యాముని మానవావతారాన్ని త్యాగయ్య అనుభూతి పొందినట్లు బహుశ ఎవ్వరు పొంది ఉండక పోవచ్చు. అంతే అనుభూతితో సంగీతకారులు శ్రీ ఎం.డీ. రామనాథన్ గారు ఒక మంచి రచన చేశారు. సులువుగా అర్థమయ్యే పదాలతో, ఉయ్యాలలూపే నీలాంబరి రాగంలో ఈ రామ రామ రామ రామ అనే కీర్తన కూర్చారు ఎం.డీ.ఆర్.

కేరళలోని పాల్ఘాట్ జిల్లాలో జన్మించిన ఎం.డీ.ఆర్ రుక్మిణి దేవి అరుండేల్, మరియు టైగర్ వరదాచారి వద్ద శిష్యరికం చేసి శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులైనారు. ఆయన ఎన్నో అద్భుతమైన కీర్తనలను రచన చేశారు. పద్మశ్రీ, సంగీత కళానిధి బిరుదులను, సంగీత నాటక అకాడెమీ మరియు కలైమామణి పురస్కారములను పొందారు.  నేటికీ ఒక మంచి వాగ్గేయకారునిగా నిలిచిపోయారు రామనాథన్ గారు. 


పట్టాభిషిక్తుడైన శ్రీరాముని వర్ణించే ఈ కీర్తనలో లాలనా భావం చాలా కనిపిస్తుంది. శ్రీ రాముని పట్టాభిషేక సమయంలో వానరులు, విభీషణుడు, సనక సనందాదులు, బ్రహ్మ, శివుడు మొదలగు వారంతా దిగి వచ్చారుట. అంతంటి శుభ ఘట్టంలో మరి ఆ రాముని వైభవము ఎట్టిదో ఊహించండి.

నీలాంబరి రాగం ఊయలలూపే లాలిత్యము, ప్రశాంతత, మృదుత్వము ఉంటుంది. స్తుతికి, నుతికి ఇదొక అద్భుతమైన రాగం. ఈ కీర్తన శ్రవణం ఎం.డీ. రామనాథన్ గళంలో , రామ వర్మ గళంలో. రెండు, కొన్ని కొన్ని చరణాలు కలిగి ఉన్నాయి. ఎవరి శైలిలో వాళ్లు ఓలలూగించారు. నీలాంబరి వైశిష్ట్యాన్ని శాస్త్రీయంగా చూపించారు ఈ కళాకారులు. సాహిత్యం క్రింద.

రామ రామ రామ రామ  రాగం: నీలాంబరి తాళం: ఆది

రామ రామ రామ రామ రామ కోదండరామా రామ పట్టాభిరామ రామ రాఘవా

భామా  శ్రీ జానకీ భరత లక్ష్మణ రిపుఘ్న పవమాన సుత సహిత రామ రాఘవా
దశరథ రాజకుమార దశ ముఖాది సంహార విశదీకృత చరిత రామ రాఘవా
కౌసల్యా వర తనయ శ్రీ కౌశిక ముని తప పాల అచల  గరళ పూజ్య రామ రాఘవా
గుహ శబరీ ఆంజనేయ కపివర శ్రీ సుగ్రీవ రిపు సోదరాదుల బ్రోచిన రామ రాఘవా
సాకేత ధామ శ్రీ సీతా మనోల్లాస చాల భేదన నిపుణ రామ రాఘవా
త్యాగరాజాది నిజ దాసులు పొగడగ నాగశయన శ్రీ రామ రాఘవా

తాత్పర్యము:

శత్రున్జయుడైన, కోదండము ధరించిన పట్టాభిరాముడు భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమత్ సమేతుడై ఉన్నాడుట. ఆయనను కృతి కర్త, దశరథ తనయునిగా, రావణ సంహారిగా, గొప్ప చరిత్ర కలవానిగా, కౌసల్య వరపుత్రునిగా, విశ్వామిత్రుని తపము కాచిన వానిగా, బ్రహ్మ, శివులచే పూజించిన వానిగా, గుహుని, శబరిని, ఆంజనేయుని, ఇతర వానరులను, సుగ్రీవుడు, విభీషణుడు మొదలగు వారిని బ్రోచిన వానిగా, సాకేత పురాధిపునిగా, సీతా మనోల్లాసునిగా, తాటిచెట్ల వరుసను ఒకే బాణముతో కూల్చిన వానిగా, త్యాగరాజు మొదలగు నిజ దాసులు పొగడిన రాముని, రాఘవునిగా వర్ణించాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి