శ్రీమన్నారాయణీయం ద్వితీయ స్కంధము
నాలుగవ దశకము: అష్టాంగయోగ, యోగ సిద్ధి వర్ణనము
కల్యతామ్ మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా|
స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయాఽఽశు తవ తుష్టిమాప్నుయామ్ || ౪-౧
ఓ కృష్ణా! నిన్ను భక్తితో ఉపాసన చేయుటకు కావలసిన ఆరోగ్యమును నాకు ప్రసాదించుము. ఆష్టాంగ యోగమును సరియైన విధములో అనుష్ఠించుట చే నీ కృప త్వరగా పొందగలను అని విశ్వసిస్తున్నాను.
బ్రహ్మచర్యదృఢతాదిభిర్యమైరాప్లవాదినియమైశ్చ పావితాః|
కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః || ౪-౨
ప్రభూ! నీ భక్తులమైన మేము దృఢమైన బ్రహ్మచర్యము, స్నానము మొదలైన నియమములతో పవిత్రులమై, సుఖాసనము లేదా పద్మాసనము లో స్థిరముగా కూర్చొని యోగమును అభ్యసిస్తాము.
తారమంతరనుచింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః|
ఇంద్రియాణి విషయాదథాపహృత్యాఽఽస్మహే భవదుపాసనోన్ముఖాః || ౪-౩
ఓ కృష్ణా! మనసులో ఓంకారము ధ్యానించుచు ప్రాణాయామము చేయుచు ప్రాణవాయువును బంధించి నిర్మలమైన మనసుతో ఇంద్రియములను విషయములనుండి మరల్చి నీ ఉపాసన చేయుదుము.
అస్ఫుటే వపుషి తే ప్రయత్నతో ధారయేమ ధిషణాం ముహుర్ముహుః|
తేనభక్తిరసమంతరార్ద్రతాముద్వహేమ భవదంఘ్రిచింతకాః || ౪-౪
ఓ కృష్ణా! నీ స్వరూపమును మేము ధ్యానిస్తున్నాము. ఆ రూపము మాకు స్పష్టముగా కనుపించుట లేదు. కావున, బుద్ధి, ప్రయత్న పూర్వకముగా ధారణ చేసెదము. ఈ సాధన వలన, నీ పాదములను ఎల్లప్పుడూ స్మరించుట వలన భక్తి రసములో మునిగి తేలుతూ ఉంటాము.
విస్ఫుటావయవభేదసుందరం త్వద్వపుస్సుచిరశీలనావశాత్|
అశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగనిరతాస్త్వదాశ్రయాః || ౪-౫||
నీ పదములను ఆశ్రయించి, ఎంతో కాలము ధారణము చేయుచు, ధ్యానయోగములో ఉందుము. దాని వలన, ఎంతో మనోహరమైన నీ రూపము మా హృదయములలో స్థిరముగా నిలిచి యుండును. అప్పుడు ఎట్టి శ్రమ లేకుండానే నీ స్వరూపమును మనసులో ధ్యానించెదము.
ధ్యాయతాం సకలమూర్తిమీదృశీమున్మిషన్మధురతాహృతాత్మనామ్|
సాంద్రమోదరసరూపమాంతరం బ్రహ్మరూపమయి తేఽవభాసతే || ౪-౬||
ఓ పరబ్రహ్మా! అన్ని కళలతో శోభిల్లుతున్న నీ మూర్తిని ధ్యానించు వారి హృదయములలో అది కనిపించుటచే వారు పరవశులగుదురు. అప్పుడు సచ్చిదానందమైన నీ పరబ్రహ్మ స్వరూపము వారి హృదయములలో ప్రకాశించును.
తత్సమాస్వదనరూపిణీం స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక|
ఆశ్రితాః పునరతః పరిచ్యుతావారభేమహి చ ధారణాధికమ్ || ౪-౭||
ఓ విశ్వనాయకా! సర్వాంగ శోభితమైన నీ స్వరూపమునందే మా మనస్సులు ఎల్లప్పుడూ లగ్నమై యుండుటచే సమాధి స్థితిని పొందెదము. ఏ కారణం వల్లనైన ఆ స్థితి నుండి జారినచో మరల నీ పాదములను ఆశ్రయించు, ధారణ ధ్యానము మొదలగు వాటిని ఆరంభించెదము.
ఇత్థమభ్యసననిర్భరోల్లసత్వత్పరాత్మసుఖకల్పితోత్సవాః|
ముక్తభక్తకులమౌలితాం గతాః సంచరేమ శుకనారదాదివత్ || ౪-౮||
ఓ కృష్ణా! అనన్యమైన భక్తితో సాధన చేయటం వలన అమితమైన సుఖమనే అనుభూతిలో ఓలలాడుతాము. అప్పుడు జీవించే ముక్తిని పొంది శుకుడు, నారదుని వలె సంచరిస్తాము.
త్వత్సమాధివిజయే తు యః పునర్మంక్షు మోక్షరసికః క్రమేణ వా|
యోగవశ్యమనిలం షడాశ్రయైరున్నయత్యజ సుషుమ్నయా శనైః || ౪-౯
ఓ పరమాత్మా! ఈ విధముగా సమాధి స్థితిని పొందటంలో పూర్తిగా సఫలమైన తర్వాత లేక కాలక్రమములో మోక్షగాముల మగుదుము. అప్పుడు ఆష్టాంగ యోగము ద్వారా ప్రాణ వాయువును స్వాధీనమునకు తెచ్చుకొని మూలాధారము మొదలగు చక్రములను, సుషుమ్న అను నాడి ద్వారా మెలమెల్లగా శిరస్సులో ఉన్న బ్రహ్మరంద్రము వరకు తీసుకొని వచ్చెదము.
లింగదేహమపి సంత్యజన్నథో లీయతే త్వయి పరే నిరాగ్రహః|
ఊర్ధ్వలోకకుతుకీ తు మూర్ధతస్సార్ధమేవ కరణైర్నిరీయతే || ౪-౧౦||
ఓ కృష్ణా! ఇట్టి సమాధి స్థితిలో ముక్తిని కోరుకునే వారు సూక్ష్మ శరీరమును కూడ విడిచి, పరమాత్మవైన నీలో లీనమగుదురు. అదే సాయుజ్యము. ఈ విధముగా కాకుండా మరికొందరు బ్రహ్మలోకము మొదలగు పైలోకాల వైభవమును చూడ కుతూహల పడు వారు ప్రాణములను బ్రహ్మరంధ్రము ద్వారా వదిలి, ఇంద్రియములతో కూడిన సూక్ష్మ శరీరముతో ఆయా లోకములలో విహరించు చున్నారు.
అగ్నివాసరవలర్క్షపక్షగైరుత్తరాయణజుషా చ దైవతైః|
ప్రాపితో రవిపదం భవత్పరో మోదవాన్ ధ్రువపదాంతమీయతే || ౪-౧౧||
స్వామీ! సాయుజ్యమును కోరేవారు అగ్ని, వాసర, శుక్ల పక్ష, ఉత్తరాయణ అధిష్టాన దేవతల ద్వారా సూర్యలోకమును పొందుదురు. అక్కడ ఎల్లప్పుడూ నీ పరాయణులై ధ్రువ పదమును చేరుతారు.
ఆస్థితోఽథ మహరాలయే యదా శేషవక్త్రదహనోష్మణాఽఽర్ద్యతే|
ఈయతే భవదుపాశ్రయస్తదా వేధసః పదమతః పురైవ వా || ౪-౧౨||
ఓ ప్రభూ! ధ్రువ మండలము చేరిన తర్వాత నిన్ను ఆశ్రయించి యున్న భక్తుడు మహర్లోకము చేరుకొనును. అక్కడినుంచి పోవునప్పుడు ఆదిశేషుని వేయి ముఖముల నుండి వెలువడే అగ్నిజ్వాలలు అతనిని దహించును. అలా మగ్గుతూ క్రమముగా బ్రహ్మదేవుడు నివశించే సత్యలోకమును చేరుకొనును. నీ అనుగ్రహము వలన ఆ భక్తుడు ఆదిశేషుని అగ్నిజ్వాలలో పడి బాధలు చెందకుండా ముందుగానే బ్రహ్మలోకమును కూడ చేరుకొనవచ్చు.
తత్ర వా తవ పదేఽథవా వసన్ ప్రాకృతప్రళయ ఏతి ముక్తతాం |
స్వేచ్ఛయా ఖలు పురాఽపి ముచ్యతే సంవిభిద్య జగదండమోజసా || ౪-౧౩
ఓ పరమాత్మా! బ్రహ్మలోకమగు సత్యలోకమున లేక నీవున్న విష్ణులోకములో ఉండి బ్రహ్మ ప్రళయము ఏర్పడినప్పుడు బ్రహ్మదేవునితో కలసి నీ భక్తుడు ముక్తిని పొందును. లేక బ్రహ్మాది లోకములందు అతడు విరక్తుడైనచో మహా ప్రళయమునకు ముందే యోగబలముచేత బ్రహ్మాండ భాండమును భేదించుకొని మోక్షమును పొందును.
తస్య చ క్షితిపయోమహోనిలద్యోమహత్ప్రకృతిసప్తకావృతీః |
తత్తదాత్మకతయా విశన్ సుఖీ యాతి తే పదమనావృతమ్ విభో || ౪-౧౪
ప్రభూ! యోగి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశమనే పంచభూతములు, మహాత్తత్వము మూల ప్రకృతి అను బ్రహ్మాన్డమునకు సంబంధించిన ఏడు ఆవరణములందు ఆయా ఆవరణ రూపమున ప్రవేశించును. అచ్చట పరమానందము అనుభవించి చివరకు ఎట్టి ఆవరణము లేని నీవు ఉండు ప్రదేశమును చేరుకొనును.
అర్చిరాదిగతిమీదృశీం వ్రజన్ విచ్యుతిం న భజతే జగత్పతే |
సచ్చిదాత్మక భవద్గుణోదయానుచ్చరంతమనిలేశ పాహి మామ్ || ౪-౧౫||
జగన్నాయకా! సచ్చిదానంద స్వరూపా! గురువాయురప్పా! శ్రీ కృష్ణా! ఈ విధముగా తేజో మార్గమున పోయిన యోగీశ్వరుడు అక్కడ చ్యుతి లేనివాడై పునర్జన్మను ఏ మాత్రము పొందడు. ఈ విధముగా నీ కళ్యాణ గుణగణములను గానము చేయుచున్న నన్ను రోగాది బాధలనుండి కరుణతో రక్షింపుము.
ఐదవ దశకము - విరాట్పురుషోత్పత్తి
వ్యక్తావ్యక్తమిదం న కించిదభవత్ప్రాక్ప్రాకృతప్రక్షయే
మాయాయామ్ గుణసామ్యరుద్ధవికృతౌ త్వయ్యాగతాయాం లయమ్|
నో మృత్యుశ్చ తదామృతం చ సమభూన్నాహ్నో న రాత్రేః స్థితి-
స్తత్రైకస్త్వమశిష్యథాః కిల పరానందప్రకాశాత్మనా || ౫-౧||
ప్రాకృత ప్రళయ సమయమందు త్రిగుణములు సమానమైన స్థితిలో ఉండును. ఆ సమయములో ప్రకృతి (మాయ) నీలో విలీనమగును. అప్పుడు కారణ రూపమైన అవ్యక్తము (సూక్ష్మ ప్రకృతి) కార్య రూపమైన వ్యక్తము (స్థూల ప్రపంచము) రెండు ఉండవు. అట్టి మహా ప్రళయ సమయమున మృత్యువు గానీ, అమృతం గానీ, పగలు రాత్రి గానీ ఏమి ఉండవు. కానీ, ఆ సమయమున నీవొక్కడవే పరబ్రహ్మ రూపమున ఉందువని వేదములు తెలుపుచున్నవి.
కాలః కర్మగుణాశ్చ జీవనివహా విశ్వం చ కార్యం విభోః
చిల్లీలారతిమేయుషి త్వయి తదా నిర్లీనతామాయయుః|
తేషాం నైవ వదంత్యసత్త్వమయి భో శక్త్యాత్మనా తిష్ఠతాం
నో చేత్ కిం గగనప్రసూనసదృశాం భూయో భవేత్సంభవః || ౫-౨||
ఓ స్వామీ! మహా ప్రళయ సమయమున కాలము, కర్మ, త్రిగుణములు, జీవులు, ప్రపంచము మొదలైనవన్నీ ఆత్మానుసంధానమున మునిగి యున్న నీలో విలీనమగుచున్నవి. అంత మాత్రమున అవి అసలు లేనే లేవు యన రాదు. అవి అన్నియు అమూర్తశక్తి రూపమున నీ లో అణగి యున్నవి. ఆకాశ పుష్పములవలె అవి ఏ మాత్రము లేవని అనినచో తరువాత అవి తిరిగి పుట్టుట అనునది ఏ విధముగానూ సంభవం కాదు కదా!
ఏవం చ ద్విపరార్ధకాలవిగతావీక్షాం సిసృక్షాత్మికాం
విభ్రాణే త్వయి చుక్షుభే త్రిభువనీభావాయ మాయా స్వయమ్|
మాయాతః ఖలు కాలశక్తిరఖిలాదృష్టం స్వభావోఽపి చ
ప్రాదుర్భూయ గుణాన్వికాస్య విదధుస్తస్యాస్యాస్సహాయక్రియామ్ || ౫-౩||
ఈ విధముగా మహాప్రళయము బ్రహ్మయొక్క ఆయుర్దాయమనదగిన ద్విపరార్ధ కాలముండును. ఆ ప్రళయ కాలము గడిచిన తర్వాత నీవు ఈ చరాచర సృష్టి చేయదలచి ఒక్కసారి చూచెదవు. ఆ సమయమున నీ మాయ విశ్వసృష్టికి తనంతట తాను క్షోభము చెందును. అనగా త్రిగుణముల సామ్యావస్థ (equilibrium) నశించును. అప్పుడు మాయవలన కాలము, శక్తి, పాపపుణ్య రూపమైన అదృష్టము, స్వభావమనునవి ఏర్పడి త్రిగుణములు వికసించి సృష్టి క్రియ యందు మాయకు తోడ్పడుచున్నవి.
మాయాసన్నిహితోఽప్రవిష్టవపుషా సాక్షీతి గీతో భవాన్
భేదైస్తాం ప్రతిబింబితో వివిశివాన్ జీవోఽపి నైవాపరః|
కాలాదిప్రతిబోధితాఽథ భవతా సంచోదితా చ స్వయం
మాయా సా ఖలు బుద్ధితత్వమసృజద్యోఽసౌ మహానుచ్యతే || ౫-౪||
ఓ భగవాన్! నీ మాయ సృష్ట్యాది కార్యక్రమములను నెరవేర్చును. కానీ నీవు మాత్రము ఆ మాయతో ఎట్టి సంబంధము లేక సర్వ సాక్షిగా ఉందువు. నీవే మాయ యందు ప్రతిబింబించి జీవుడనే పేరుతో ప్రసిద్దుడవైనావు. జీవుడు నీ ప్రతిబింబమే తప్ప వేరే కాదు. కళాశక్తి, అదృష్టము మొదలగు వానిచే ప్రతిబోధింప బడిన మాయ, విశ్వసృష్టి చేయవలెనను నీ చూపు చేత ప్రేరేపించ బడి, మొట్ట మొదట బుద్ధి తత్త్వమును సృష్టించినది. దీనినే మహత్తత్త్వ మందురు.
తత్రాసౌ త్రిగుణాత్మకోఽపి చ మహాన్ సత్వప్రధానః స్వయం
జీవేఽస్మిన్ ఖలు నిర్వికల్పమహమిత్యుద్బోధనిష్పాదకః|
చక్రేఽస్మిన్ సవికల్పబోధకమహంతత్వం మహాన్ ఖల్వసౌ
సమ్పుష్టం త్రిగుణైస్తమోఽతిబహులం విష్ణో భవత్ప్రేరణాత్ || ౫-౫||
ఓ విష్ణో! ఈ మహత్తత్త్వమున త్రిగుణములు ఉన్నప్పటికీ, అది సత్వగుణ ప్రధానమై జీవుని యందు నిర్వికల్పమైన "అహం" తత్త్వమును కలిగించినది. తరువాత మహత్తత్త్వము నీ ప్రేరణ వలన జీవునియందు సవికల్పమైన, తమోగుణ ప్రధానమైన "అహం" తత్త్వమును పుట్టించు చున్నది. ఈ తమోగుణ ప్రధానమైన అహం తత్త్వములో నేను నీవు అను భేద బుద్ధి కనిపించును.
సోఽహం చ త్రిగుణక్రమాత్ త్రివిధతామాసాద్య వైకారికో
భూయస్తైజసతామసావితి భవన్నాద్యేన సత్వాత్మనా|
దేవానింద్రియమానినోఽకృత దిశావాతార్కపాశ్యశ్వినో
వహ్నీంద్రాచ్యుతమిత్రకాన్ విధువిధిశ్రీరుద్రశారీరకాన్ || ౫-౬||
ఈ సవికల్పమైన అహంతత్త్వము సత్త్వ, రజస్, తమము అను త్రిగుణములను అనుసరించి, మూడు విధములగుచున్నది. వీటిలో మొదటిదైన సాత్త్విక అంశ వలన జ్ఞానేన్ద్రియములకు అధిదేవతలైన దిక్కు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు అనువారును, అట్లే కర్మేన్ద్రియములకు అధిదేవతలైన అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనువారును, మరియు మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అంతఃకరణ చతుష్టయమునకు అధిదేవతలైన చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షేత్రజ్ఞుడు అనువారు పుట్టిరి.
భూమన్మానసభుద్ధ్యహంకృతిమిళచ్చిత్తాఖ్యవృత్యన్వితం
తచ్చాంతఃకరణం విభో తవ బలాత్ సత్వాంశ ఏవాసృజత్|
జాతస్తైజసతో దశేంద్రియగణస్తత్తామసాంశాత్పున-
స్తన్మాత్రం నభసో మరుత్పురపతే శబ్దోఽజని త్వద్బలాత్ || ౫-౭||
ప్రభూ! గురువాయుపుర పతి! శ్రీ కృష్ణా! నీ ప్రేరణ వలన సత్త్వాంశ మైన సాత్త్వికాహంకారము వలన మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అను అంతఃకరణ చతుష్టయము పుట్టినది. అట్లే రాజసాంశము వలన జ్ఞానేంద్రియములైన త్వక్, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణ, చక్షుస్సులు, కర్మేన్ద్రియములైన వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలు కలిగినవి. తామసాంశము వలన ఆకాశము యొక్క తన్మాత్రమైన శబ్దము కలిగినది.
శబ్దాద్వ్యోమ తతః ససర్జిథ విభో స్పర్శం తతో మారుతం
తస్మాద్రూపమతో మహోఽథ చ రసం తోయం చ గంధం మహీమ్|
ఏవమ్ మాధవ పూర్వపూర్వకలనాదాద్యాద్యధర్మాన్వితం
భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్ || ౫-౮||
ఓ మాధవా! శబ్దము వలన శబ్ద గుణకమైన ఆకాశము పుట్టినది. ఆకాశము వలన స్పర్శ పుట్టినది. ఆ స్పర్శము నుండి శబ్ద స్పర్శ గుణకమైన వాయువు, వాయువు వలన రూపము, రూపము వలన శబ్ద స్పర్శ రూప గుణకమైన తేజస్సు, తేజస్సు వలన రసము, రసము వలన శబ్ద స్పర్శ రూప రస గుణకమైన నీరు, నీటి నుండి గంధము, గంధము వలన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గుణకమైన భూమి, ఇట్లు పంచభూతములను తత్తద్ధర్మ సమన్వితముగా నీవు సృష్టించితివి.
ఏతే భూతగణాస్తథేంద్రియగణా దేవాశ్చ జాతా పృథక్-
నో శేకుర్భువనాండనిర్మితివిధౌ దేవైరమీభిస్తదా|
త్వం నానావిధసూక్తిభిర్నుతగుణస్తత్వాన్యమూన్యావిశం-
శ్చేష్టాశక్తిముదీర్య తాని ఘటయన్ హైరణ్యమండం వ్యధాః || ౫-౯||
ప్రభూ! ఈ పృథివి మొదలైన పంచ భూతములు, జ్ఞాన కర్మేంద్రియములు, తదభిమాన దేవతలు ఒక్కొక్కరు ప్రత్యేకముగా పుట్టినప్పటికీ, వీరిలో ఎవ్వరు కూడా బ్రహ్మాండమును నిర్మించ లేకపోయినారు. అప్పుడు వారందరూ పరమాత్మవగు నిన్ను అనేక విధములగు స్తోత్రములచే స్తుతించిరి. అప్పుడు నీవు పృథివి మొదలైన సమస్త తత్త్వములందు ప్రవేశించి వాటి యందు క్రియాశాక్తిని జాగృతం చేసి వాటినన్నిటిని ఒక్క త్రాటి మీదికి తెచ్చితివి. ఆ విధముగా నీవు బ్రహ్మాండమును సృష్టించితివి.
అండం తత్ఖలు పూర్వసృష్టసలిలేఽతిష్ఠత్ సహస్రం సమాః
నిర్భిందన్నకృథాశ్చతుర్దశజగద్రూపం విరాడాహ్వయమ్|
సాహస్రైః కరపాదమూర్ధనివహైర్నిశ్శేషజీవాత్మకో
నిర్భాతోఽసి మరుత్పురాధిప స మాం త్రాయస్వ సర్వామయాత్ || ౫-౧౦||
గురువాయుపురాధీశా! శ్రీమన్నారాయణ! సృష్టికి పూర్వము ఆవరించిన కారణ జలమందు ఆ బ్రహ్మాండము అనేక వేల సంవత్సరములు ఉండినది. తరువాత ఆ బ్రహ్మాండమున నీవు ప్రవేశించి దానిని అనేక విధముల విభజించి విరాట్ సంజ్ఞకమైన పదునాలుగు భువనములను సృష్టించితివి. పిమ్మట నీవు అనేక వేల కరములతో, పాదములతో, సమస్త జీవుల రూపమున ప్రకాశించిటివి. గురువాయురప్పా! అట్టి నీవు నా సమస్త రోగములను కరుణతో తొలగించుము.
ఆరవ దశకము - విరాట్పురుషుని జగదాత్మ తత్త్వము
ఏవం చతుర్దశజగన్మయతాం గతస్య
పాతాళమీశ తవ పాదతలం వదంతి|
పాదోర్ధ్వదేశమపి దేవ రసాతలం తే
గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్ || ౬-౧||
పరమాత్మా! ఈ విధముగా చతుర్దశ భువన రూపుడవై యున్న నీ పాదముల యొక్క అథో భాగమే పాతాళము. అట్లే రసాతలము నీ పాదముల యొక్క పై భాగము. అదే విధముగా నీ యొక్క చీల మండలు మహాతలముగా పేర్కొనబడినది.
జంఘే తలాతలమథో సుతలం చ జానూ
కించోరుభాగయుగళం వితలాతలే ద్వే|
క్షోణీతలం జఘనమంబరమంగ నాభి-
ర్వక్షశ్చ శక్రనిలయస్తవ చక్రపాణే || ౬-౨||
చక్రపాణీ! శ్రీ కృష్ణా! నీ పిక్కలు తలాతలము, మోకాళ్ళు సుతలము, రెండు తొడలు వితలము మరియు అతలము, నీ పిరుదులు భూమి, నాభి భాగము ఆకాశము. అట్లే నీ వక్షస్థలము ఇంద్రనివాసమైన స్వర్గలోకముగా ఉన్నవి.
గ్రీవా మహస్తవ ముఖం చ జనస్తపస్తు
ఫాలం శిరస్తవ సమస్తమయస్య సత్యమ్|
ఏవం జగన్మయతనో జగదాశ్రితైర-
ప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్నమస్తే || ౬-౩||
ఓ జగత్స్వరూపా! శ్రీ కృష్ణా! నీవు సమస్త విశ్వరూపుడవు. అట్టి నీ యొక్క కంఠం మహర్లోకము. నీ ముఖము జనోలోకము. నీ నుదురు తపోలోకము. నీ శిరస్సు సత్యలోకము. ఈ విశ్వమందున్న ఇతర ప్రాంతములు నీ శరీరములోని ఇతర భాగములు. ఈ విధముగా జగన్మయరూపుడైన నీకు భక్తితో నమస్కరించెదను.
త్వద్బ్రహ్మరంధ్రపదమీశ్వర విశ్వకంద
ఛందాంసి కేశవ ఘనాస్తవ కేశపాశాః|
ఉల్లాసిచిల్లియుగళం దృహిణస్య గేహం
పక్ష్మాణి రాత్రిదివసౌ సవితా చ నేత్రే || ౬-౪||
ప్రపంచ సృష్టికి కారణమైన ఓ పరమేశ్వరా! కేశవా! నీ యొక్క బ్రహ్మ రంద్ర స్థానమే వేదములు. నీ కేశములు మేఘములు. నీ కనుబొమ్మలు బ్రహ్మదేవుడు ఉండు స్థానము. అట్లే రాత్రి, పగలు నీ కనురెప్పలు, సూర్యుడు నీ యొక్క నేత్రద్వాయము.
నిశ్శేషవిశ్వరచనా చ కటాక్షమోక్షః
కర్ణౌ దిశోఽశ్వియుగళం తవ నాసికే ద్వే|
లోభత్రపే చ భగవన్నధరోత్తరోష్ఠౌ
తారాగణశ్చ రదనాః శమనశ్చ దంష్ట్రా || ౬-౫||
ఓ శ్రీ కృష్ణా! నీ చూపు వలన ఈ సమస్త ప్రపంచము ఏర్పడినది. నీ యొక్క చెవులే దిక్కులు. నీ యొక్క నాసికారంధ్రములు అశ్వినీ దేవతలు. నీ పెదవులు లోభము మరియు సిగ్గు. అట్లే నీ దంతములే నక్షత్ర రాసులు. అదే విధముగా యముడు నీ కోరలు.
మాయా విలాసహసితం శ్వసితం సమీరో
జిహ్వా జలం వచనమీశ శకున్తపంక్తిః|
సిద్ధాదయస్స్వరగణా ముఖరంధ్రమగ్ని-
ర్దేవా భుజాః స్తనయుగం తవ ధర్మదేవః || ౬-౬||
పరమాత్మా! మనోహరమైన నీ చిరునవ్వే మాయ. నీ నిట్టూర్పే గాలి. నీరు నీ నాలుక. పక్షుల యొక్క కలకలమే నీ వాక్కు. సిద్ధులు మొదలైన ఆకాశ సంచారులు సప్తస్వరములు. అగ్నియె నీ ముఖము. ఇంద్రాది దేవతలు నీ భుజములు. ధర్మ దేవత నీ స్తన ద్వయము.
పృష్ఠం త్వధర్మ ఇహ దేవ మనస్సుధాంశు-
రవ్యక్తమేవ హృదయాంబుజమంబుజాక్ష|
కుక్షిస్సముద్రనివహా వసనం తు సంధ్యే
శేఫః ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః || ౬-౭||
తామరల వంటి నేత్రములు గల శ్రీ కృష్ణ పరమాత్మా! అధర్మము నీ వీపు. చంద్రుడు నీ మనస్సు. అవ్యక్తమే నీ హృదయ పద్మము. సప్త సముద్రములు నీ యొక్క ఉదరము. ఉభయ సంధ్యలు నీ వస్త్రము. అట్లే నీ శ్నిశ్నము (foreskin of penis) ప్రజాపతి, మరియు మిత్రదేవత నీ వృషణములు.
శ్రోణిస్థలం మృగగణాః పదయోర్నఖాస్తే
హస్త్యుష్ట్రసైంధవముఖా గమనం తు కాలః|
విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహు-
చారూరుయుగ్మచరణం కరుణాంబుధే తే || ౬-౮||
ఓ కరుణా సాగరా! మృగములు నీ యొక్క కటి భాగము. ఏనుగు, ఒంటె, గుఱ్ఱము వంటి వాహనములు నీ యొక్క కాలిగోళ్ళు. కాలము నీ గమనము. బ్రాహ్మణుడు మొదలైన నాలుగు వర్ణములవారి జన్మస్థానములు వరుసగా నీ ముఖ కమలము, బాహువులు, తొడలు మరియు నీ పాదములు.
సంసారచక్రమయి చక్రధర క్రియాస్తే
వీర్యం మహాసురగణోఽస్థికులాని శైలాః|
నాడ్యస్సరిత్సముదయస్తరవశ్చ రోమ
జీయాదిదం వపురనిర్వచనీయమీశ || ౬-౯||
చక్రధారీ! శ్రీ కృష్ణా! ఈ సంసార చక్రము యొక్క సృష్టి స్థితి లయములే నీ క్రియా కలాపములు, అసుర గణమే నీ పరాక్రమము. పర్వత పంక్తులే నీ ఆస్థి సమూహము, నదీ నదములే నీ నాడులు, వృక్షములే నీ రోమములు. ప్రభూ! అనిర్వచనీయమైన నీ విరాట్రూపమునకు జయము కలుగు గాక.
ఈదృగ్జగన్మయవపుస్తవ కర్మభాజాం
కర్మావసానసమయే స్మరణీయమాహుః|
తస్యాంతరాత్మవపుషే విమలాత్మనే తే
వాతాలయాధిప నమోఽస్తు నిరుంధి రోగాన్ || ౬-౧౦||
వాయుపురాధీశా! ఈ విధముగా ఈ సమస్త జగత్తు నీ రూపమే. శ్రవణ, మనన, కీర్తనాదులను చేసెడి భక్తులు నిత్య నైమిత్తిక కర్మలను, షోడశోపచారములను ఆచరించినపుడు, నీ దివ్య మంగళ విగ్రహమును విరాడ్రూపముగా భావించి స్మరించు చుండవలెను. స్వామీ! శుద్ధ సత్త్వ స్వరూపుడవైన నీవే ఈ సకల జగత్తునకు అంతరాత్మవు. అట్టి నీకు భక్తితో ప్రణమిల్లుదును . దయతో నా రోగ బాధలను నివారింపుము.
ఏడవ దశకము - హిరణ్య గర్భోత్పత్తి
ఏవం దేవ చతుర్దశాత్మకజగద్రూపేణ జాతః పున-
స్తస్యోర్ధ్వం ఖలు సత్యలోకనిలయే జాతోఽసి ధాతా స్వయమ్|
యం శంసంతి హిరణ్యగర్భమఖిలత్రైలోక్యజీవాత్మకం
యోఽభూత్ స్ఫీతరజోవికారవికసన్నానాసిసృక్షారసః || ౭-౧||
శ్రీ హరీ! నీవు ఈ విధముగా పదునాలుగు భువనముల రూపమున ఏర్పడితివి వీటిలో అన్నిటికంటే, పైన ఉన్న సత్యలోకమున నీవు బ్రహ్మదేవుడుగా వెలసితివి. నీ అంశయైన ఆ బ్రహ్మదేవుని హిరణ్యగర్భుడని కూడా అందురు. అతడు ముల్లోకములందున్న సమస్త జీవ రూపుడు. అతని యందు రజోగుణ ప్రేరణచే సుర,నర, తిర్యగాది ప్రాణులన్నిటికి శ్రేయస్సు గూర్చవలెనను సంకల్పము కలిగెను. అందువలన అనేక విధములైన సృష్టిరచన చేయవలెనను కోరిక అతనికి కలిగినది.
సోఽయం విశ్వవిసర్గదత్తహృదయస్సంపశ్యమానస్స్వయం
బోధం ఖల్వనవాష్య విశ్వవిషయం చింతాకులస్తస్థివాన్|
తావత్ త్వం జగతాంపతే తపతపేత్యేవం హి వైహాయసీం
వాణీమేనమశిశ్రవః శ్రుతిసుఖాం కుర్వంస్తపఃప్రేరణామ్ || ౭-౨||
ఆ బ్రహ్మదేవునకు విశ్వసృష్టి చేయవలెనను కోరిక కలిగి అందులకై బాగుగా ఆలోచించినాడు. కాని విశ్వసృష్టి ఏ విధముగా చేయవలెనో తెలియక అతడు చాలా కాలము చింతించెను. ఆ సమయమున జగన్నాథుడైన నీవు బ్రహ్మ దేవుని తపస్సు చేయుమని ప్రేరేపించుచు 'తప' 'తప' అను శ్రోత్ర మధురమైన ఆకాశవాణిని అతనికి వినిపించితివి.
కోఽసౌ మామవదత్పుమానితి జలాపూర్ణే జగన్మండలే
దిక్షూద్వీక్ష్య కిమప్యనీక్షితవతా వాక్యార్థముత్పశ్యతా|
దివ్యం వర్షసహస్రమాత్తపసా తేన త్వమారాధిత-
స్తస్మై దర్శితవానసి స్వనిలయం వైకుణ్ఠమేకాద్భుతమ్ || ౭-౩||
అప్పుడా బ్రహ్మ నీటిచే నిండిపోయిన జగన్మండలమున 'తప తప' అని అన్న వ్యక్తి ఎవ్వరని దిక్కులు చూచెను. ఎవ్వరు కానరాలేదు. అప్పుడు బ్రహ్మ తనకు వినిపించిన వాక్యార్థమును అనుసరించి అనే దివ్య సంవత్సరములు తప్పసు చేయుచు పరమాత్మవగు నిన్ను ఆరాధించెను. అందువలన నీవు సంతుష్టుడవై అతనికి నీవు నివసించే వైకుంఠమును చూపితివి. ఆ వైకుంఠమును చూచుటకు అత్యద్భుతముగా ఉండెను.
మాయా యత్ర కదాపి నో వికురుతే భాతే జగద్భ్యో బహి-
శ్శోకక్రోధవిమోహసాధ్వసముఖా భావాస్తు దూరం గతాః|
సాంద్రానందఝరీ చ యత్ర పరమజ్యోతిఃప్రకాశాత్మకే
తత్ తే ధామ విభావితం విజయతే వైకుణ్ఠరూపం విభో || ౭-౪||
ప్రభూ! నీ ధామమైన వైకుంఠము చతుర్దశ భువనముల కంటే పైన ఉన్నది. అచ్చట మాయ యొక్క ప్రభావము కనిపించదు. అచ్చట దుఃఖము, కోపము, మోహము, భయము మొదలైన నీచ భావములేవియు ఉండనే ఉండవు. అది పరంజ్యోతి ప్రకాశించు స్థలము. అచ్చట బ్రహ్మానందము పొంగిపొరలు చుండును. అట్లు విరాజిల్లుతున్న నీ వైకుంఠ ధామమునకు జయము జయము.
యస్మిన్నామ చతుర్భుజా హరిమణిశ్యామావదాతత్విషో
నానాభూషణరత్నదీపితదిశో రాజద్విమానాలయాః|
భక్తిప్రాప్తతథావిధోన్నతపదా దీవ్యంతి దివ్యా జనా-
స్తత్తే ధామ నిరస్తసర్వశమలం వైకుంఠరూపం జయేత్ || ౭-౫||
ఆ వైకుంఠమున యున్నవారు నాలుగు భుజములతో, ఇంద్ర నీలమణి వలె నల్లని కాంతి కలిగి నీ యందలి పరమభక్తి వలన అత్యున్నతమైన స్థానమును పొందియుందురు. వారి శరీరములు దివ్యమైనవి. వారుందు భవనములు గొప్ప గొప్ప విమానములతో ప్రకాశించు చుండును. అచ్చట మలినమైన భావములకే మాత్రము తావు లేదు. అట్టి విశిష్ట స్థానమైన వైకుంఠమునకు జయము జయము.
నానాదివ్యవధూజనైరభివృతా విద్యుల్లతాతుల్యయా
విశ్వోన్మాదనహృద్యగాత్రలతయా విద్యోతితాశాంతరా|
త్వత్పాదాంబుజసౌరభైకకుతుకాల్లక్ష్మీః స్వయం లక్ష్యతే
యస్మిన్ విస్మయనీయదివ్యవిభవం తత్తే పదం దేహి మే || ౭-౬||
ఆ పరమ పదమున లక్ష్మీదేవి నీ పాదపద్మముల పరిమళములందు మిక్కిలి ఆసక్తి కలిగి స్వయముగా అచట వెలసి యుండును. అనేక మంది దివ్యాంగనలు ఆమె చుట్టూ చేరి సేవించు చుందురు. మెరుపు తీగ వలె సుందరమైన ఆమె మనోహర శరీరము విశ్వమంతటా కాంతులను విరజిమ్ముచుండును. ఆ శోభాలకు అందరును పరవశించు చుందురు. నీ వైకుంఠము దివ్య వైభవ శోభితము, ఆశ్చర్య జనకము, అట్టి దివ్యదామమును నాకు ప్రసాదించుము.
తత్రైవం ప్రతిదర్శితే నిజపదే రత్నాసనాధ్యాసితం
భాస్వత్కోటిలసత్కిరీటకటకాద్యాకల్పదీపాకృతి|
శ్రీవత్సాంకితమాత్తకౌస్తుభమణిచ్ఛాయారుణం కారణం
విశ్వేషాం తవ రూపమైక్షత విధిస్తత్తే విభో భాతు మే || ౭-౭||
ఓ నారాయణా! బ్రహ్మ దేవుడు అనే సంవత్సరములు తపస్సు చేసి నీ అనుగ్రహుమును పొందెను. అందువలన ఆయనకు వైకుంఠమున నున్న నీ దివ్యరూప దర్శన భాగ్యము కలిగెను. అక్కడ నీవు రత్నమయమైన సింహాసనమున ఆసీనుడవై కోటి సూర్యుల కాంతులు కల కిరీటము, కంకణములు మొదలైన దివ్యమైన ఆభరణములతో ప్రకాశించుచుందువు. నీ వక్ష స్థలముపై శ్రీ వత్స చిహ్నముండును. కౌస్తుభ మణి చాయలచే నీ మేఘ శ్యామల రూపము అరుణ కాంతులిడు చుండును. నీవు సమస్త లోకములకు కారణ భూతుడవు. అట్టి నీ దివ్యరూపమును దర్శించు అదృష్టమును భక్తుడనైన నాకు అనుగ్రహించుము.
కాళాంభోదకలాయకోమలరుచాం చక్రేణ చక్రం దిశా-
మావృణ్వానముదారమందహసితస్యందప్రసన్నాననమ్|
రాజత్కంబుగదారిపంకజధరశ్రీమద్భుజామండలం
స్రష్టుస్తుష్టికరం వపుస్తవ విభో మద్రోగముద్వాసయేత్ || ౭-౮||
ప్రభూ! నీ స్వరూపము నీల మేఘచ్చాయలతో, కలువల సౌకుమార్యములతో ఒప్పుచు అన్ని దిక్కుల యందును దివ్య శోభలను వెదజల్లు చున్నది. ప్రసన్నమైన నీ ముఖము కారుణ్యముతో నిండి చిరునవ్వు అందించు చున్నది. మనోజ్ఞములైన నీ చతుర్భుజములు శంఖ చక్ర గదా పద్మములతో విరాజిల్లు చున్నవి. నీ అద్భుత మూర్తి సృష్టి కర్త యైన బ్రహ్మకు ఆనందము కూర్చు చున్నది. అట్టి నీ దివ్య రూప దర్శన ప్రభావము నా వ్యాదులన్నిటినీ అంతరించ చేయు గాక.
దృష్ట్వా సంభృతసంభ్రమః కమలభూస్త్వత్పాదపాథోరుహే
హర్షావేశవశంవదో నిపతితః ప్రీత్యా కృతార్థీభవన్|
జానాస్యేవ మనీషితం మమ విభో జ్ఞానం తదాపాదయ
ద్వైతాద్వైతభవత్స్వరూపపరమిత్యాచష్ట తం త్వాం భజే || ౭-౯||
స్వామీ! బ్రహ్మదేవుడు నీ పాదపద్మముల వైభవమును చూసి ముగ్ధుడై తన్ను తాను మరచిపోయెను. పిదప అంతులేని ఆనందములో మునిగెను. అంతట, తాను కృతార్థుడైనట్లు భావించి, నీ పాదములపై వ్రాలెను. పిమ్మట అతడు "ఓ ప్రభూ! సృష్టి చేయుటకై నేను పడుచున్నవేదనను నీవు ఎరుగుదువు. ద్వైతాద్వైత పరమైన నీ స్వరూప జ్ఞానమును నాకు అనుగ్రహించుము" అని నిన్ను వేడుకొనెను. అట్టి పరమాత్మవైన నిన్ను నేను భజించుచున్నాను.
ఆతామ్రే చరణే వినమ్రమథ తం హస్తేన హస్తే స్పృశన్
బోధస్తే భవితా న సర్గవిధిబిర్బంధోఽపి సంజాయతే|
ఇత్యాభాష్య గిరం ప్రతోష్యనితరాం తచ్చిత్తగూఢః స్వయం
సృష్టౌ తం సముదైరయస్స భగవన్నుల్లాసయోల్లాఘతామ్ || ౭-౧౦||
ప్రభూ! ఈ విధముగా బ్రహ్మదేవుడు ఎర్రని నీ పాదపద్మములకు నమస్కరించినప్పుడు నీ మృదువైన హస్తముతో ఆయనను స్ప్రుశించుచు ఇట్లంటివి - "విధాతా! నీవు కోరుకున్నట్లు సృష్టి సంబంధమైన జ్ఞానము నీకు లభించును. కానే నీవు కర్మ బంధములలో చిక్కుబడవు. " ఇట్లు పలికి ఆయనను సంతోషపరిచితివి. అంతేగాక, ఆయన హృదయమున చేరి, ఆ బ్రహ్మదేవుడు చేయు సృష్టి కార్యమునకు నీవు ప్రేరణ కూర్చితివి. శ్రీ కృష్ణ పరమాత్మా! నీవు నాపై దయదలచి నాకు ఆరోగ్యమును చేకూర్చుము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి