RightClickBlocker

12, డిసెంబర్ 2010, ఆదివారం

గోవిందాష్టకం - తాత్పర్యము

గోవిందం పరమానందం అంటూ ఆదిశంకరులు ఆ లీలామానుష రూపమైన శ్రీ కృష్ణుని పరి పరి వర్ణించే స్తోత్రము గోవిందాష్టకం. ఆ మన మోహనుని సుందర రూపము చూడ వేయి కన్నులు చాలవు. ముఖ్యంగా ఇస్కాన్ మరియు ఉత్తర భారత దేశంలోని మందిరాలలో రాధాకృష్ణుల మూర్తులు వర్ణనకు అందని సౌందర్యము, లావణ్యము, ప్రశాంతతతో శోభిల్లుతుంటాయి. ఆ విగ్రహాలను చూస్తే మనసులో ప్రేమ, భక్తి పొంగిపొరలుతుంది. అదే ఆ రాధాకృష్ణుల తత్త్వములో ఉన్న  సమ్మోహనా శక్తి.

ఈ గోవిందాష్టకంలో శంకరులు కృష్ణావతార  లీలలను, వాటిలోని ఆధ్యాత్మికతను మనోహరంగా నుతించారు. కృష్ణ భక్తిలో ఉన్న ప్రేమ తత్త్వము, కొంటెతనము చాటున దాగి ఉన్న ఆధ్యాత్మిక సంపద,  సామాన్య మానవులకు పరమార్థాన్ని, కర్తవ్యాన్ని బోధించే స్పష్టత, విపులత మరే అవతారము లోను కనిపించదు. మీలో ఒకడిని అంటూ జీవన రథ సారథిగా నిలిచిన ఆ పరమాత్మ అందుకే జగద్గురువుగా  కొలవబడ్డాడు.

శంకర  భగవత్పాద విరచిత గోవిందాష్టకం సాహిత్యం, తాత్పర్యము, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి మధుర స్వరంలో శ్రవణం.


సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం
గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసం
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారం
క్ష్మాయా నాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం

మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసం
వ్యదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిం
లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకం
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం

త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నం
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారం
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసం
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందం

గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలం
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలం
గోభిర్నిగదిత గోవిందస్ఫుతనామానం బహునామానం
గోపీగోచరపథికం ప్రణమత గోవిందం పరమానందం

గోపీమండలగోష్ఠిభేదం భేదావస్థమభేదాభం
శశ్వద్గోఖురనిర్ఘూతోద్ధతధూలీధూసరసౌభాగ్యం
శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావం
చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందం

స్నానవ్యాకులయోశిద్వస్త్రముపాదాయాగముపారూఢం
వ్యదిత్సంతిరథ దిగ్వస్త్రా హ్యుపుదాతుముపాకర్షంతం
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థం
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందం

కాంతం కారణకారణమాదిమనాదిం కాలమనాభాసం
కాలిందీగతకాలియశిరసి ముహుర్నృత్యంతం నృత్యంతం
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నం
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందం

బృందావనభువి బృందారకగణబృందారాధ్యం వందేఽహం
కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందం
వంద్యాశేషమహామునిమానసవంద్యానందపదద్వంద్వం
వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందం

గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యో
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి
గోవిందాంఘ్రిసరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘో
గోవిందం పరమానందామృతమంతఃస్థం స తమభ్యేతి

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం శ్రీగోవిందాష్టకం సంపూర్ణం

తాత్పర్యము:

 సత్యము, జ్ఞానము, అనంతము, నిత్యము, ఆకాశాన్ని మించిన వాడు,  అన్నిటినీ మించిన వాడు, గోకులములో సంచరించే వాడు, ఎటువంటి ప్రయత్నమూ అవసరము లేని వాడు, అన్నిటికన్నా ఎక్కువ శ్రమ ఐన వాడు, మాయా రూపములో వివిధ రూపములలో ఉండేవాడు, ఆకారము లేని వాడు,  విశ్వాకారుడు, భూమి మీద అవతరించిన వాడు, నాథుడు లేని వాడు, పరమానందము అయిన గోవిందుని నుతించుము.

యశోద దెబ్బలకు భయపడి పారిపోబోయి, దొరికినంత, మన్ను తిన్నావా అని తల్లి అడిగినంత, నోటంతా పదునాలుగు భువనాలను చూపించిన, ముల్లోకాలకు మూల స్తంభమైన వాడు, లోకప్రకాశకుడు, లోకానికి అధిపతి, పరమేశ్వరుడు,  పరమానందము అయిన గోవిందుని నుతించుము.

రాక్షసులను సంహరించే వాడు, భూ భారాన్ని తగ్గించే వాడు, భవ రోగములను తగ్గించే వాడు, ముక్తిని ప్రసాదించే వాడు, వెన్నను తినే వాడు, ఆహారము అక్కర లేని వాడు, లోకానికి ఆహారమైన వాడు (ఆహార రూపుడు), విమలమైన మనస్సులలోని విశేషమైన స్థితిలో కనిపించే వాడు, పూర్తిగా దృశ్యము కాని వాడు,  శివుని ప్రస్తుతించే వాడు, ఎల్లప్పుడూ శాంతముగా, పవళించి ఉండే వాడు,   పరమానందము అయిన గోవిందుని నుతించుము.

గోపాలుడు, లీలామానుష విగ్రహుడు, యదువంశములో జన్మించిన వాడు, గోపికలతో ఆడి , గోవర్ధన గిరిని ఎత్తి గోకులాన్ని తన లీలలలో ముంచెత్తిన వాడు,  కామధేనువుచే మచ్చలేని 'గోవింద' అనే నామము పొందిన వాడు, అనేక నామములు కలవాడు, గోపికల గోచరానికి అందని వాడు,   పరమానందము అయిన గోవిందుని నుతించుము.

గోపికల సమూహంలోకి వెళ్లే వాడు, సచ్చిదానందమై వారికందని స్థితిలో వారిమధ్య ఉండే వాడు, గోధూళి వలన ద్విగుణీకృతమైన సౌందర్యము కలవాడు, భక్తిని ఆనందముగా స్వీకరించే వాడు, కారణానికి అందని వాడు, సద్బుద్ధికి కారణమైన వాడు, మహిమలలో చింతామణి వంటి వాడు, పరమానందము అయిన గోవిందుని నుతించుము.

చెట్టుపై కూర్చుని స్నానమాడుతున్న గోపికల వస్త్రములు దోచిన వాడు, వస్త్రముల కొరకు తన దగ్గరకు రమ్మనిన వాడు, శోకము, వ్యామోహం లేని వాడు, జ్ఞాని, జ్ఞానుల హృదయములో నివసించువాడు, సత్తమాత్రమైన వాడు, పరమానందము అయిన గోవిందుని నుతించుము.

కాంతియైన వాడు, కారణానికే కారణుడు, విశ్వానికి కారకుడు, మొదలు లేని వాడు, కాలానికి గతి అయిన వాడు, అప్రకాశుడు, కాళింది మడుగున కాళీయుని పై నర్తించిన వాడు, కాలుడు, మరణానికి అతీతుడు (కాలాతీతుడు), నిరాకారుడు, కలియుగ దోషాలను పోగొట్టే వాడు, భూత, భవిష్యద్వర్తమానములకు   కారణమైన వాడు, పరమానందము అయిన గోవిందుని నుతించుము.

బృందావనములో వ్రజ భూమి యొక్క గణముల సమూహములో విలసిల్లే వాడు, దేవతలు, బృందచే ప్రార్ధించ బడిన వాడు, మల్లె పూవు వంటి చిరునవ్వుతో అమృతమును చిందించే వాడు, స్నేహితులకు ఆనందము కలిగించే వాడు, అందరికీ వంద్యమైన పాదపద్మములు కలవాడు, సర్వ లక్షణ సంపన్నుడు, పరమానందము అయిన గోవిందుని నుతించుము.

ఎవరైతే గోవిందునికి మనసు సమర్పించి,  గోవింద, అచ్యుత, మాధవ, విష్ణు, గోకులనాయక, కృష్ణ అనే నామములతో నుతించి, ఆయన పాదపద్మములను పూజించుట వలన పాప ప్రక్షాళనము పొంది, గోవిందాష్టకం నుతిస్తారో, వారు గోవిందునితో ఏకమై పరమానందమును పొందుదురు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి