12, డిసెంబర్ 2010, ఆదివారం

భావయామి గోపాలబాలం - అన్నమయ్య గోపాలుని నుతి


శ్రీకృష్ణుడు అనే సరికి పదాలు, వర్ణనలు, ఉపమానాలు, అలంకారాలు, ప్రాసలు, విశేషణాలు అన్నీ ముత్యాల వరసలా రూపొందుతాయి. ఎందుకో?. సౌందర్యము, అలంకారము, భోగము, యోగము, భక్తి, ప్రేమ - అన్నిటికీ ఆయన మూర్తి కాబట్టే.  సాకార సగుణోపాసన అనే అధిభౌతిక తత్త్వములో అగ్ర్యము, నిరాకారము, నిరామయము అనే పారలౌకిక ఆధ్యాత్మిక తత్త్వము లో యోగ్యము కృష్ణ తత్త్వము. నలుగురిలో ఒకడై, వారికి చెందని వాడై,  కర్మ యోగ సిద్ధాంతకర్త గా కృష్ణుని అవతారము పరిపూర్ణమైనది. అందుకనే ఆయన వర్ణన కూడా ఒక రకంగా పరిపూర్ణమే.

మరి పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుని నోట ఆ శ్రీ కృష్ణుని వర్ణన జరిగితే? అది ఈ వెన్నదొంగ చేత ఉన్న నవనీతంలా మధురాతి మధురంగా ఉంటుంది. అదే భావయామి గోపాల బాలం అనే కృతి. అచ్చ తెలుగులో కీర్తనలు రాసిన అన్నమయ్య ఈ కీర్తనకు ప్రాకృత సంస్కృతాన్నిఉపయోగించటం ఆయన పొందిన పారలౌకికానుభూతికి నిదర్శనం. భావనలో, చింతనలో ఆ గోపాల బాలుని ఆరాధించుమని ఆయన మనో భావన. దానికి ఆ చిన్నికృష్ణుని మేని వర్ణన కూడి చిరస్మరణీయమైన కీర్తన గా నిలిచిపోయింది ఈ భావయామి గోపాలబాలం.  స్వర మహాలక్ష్మి సుబ్బులక్ష్మి గళంలో ఈ కీర్తన యమన్ కల్యాణి రాగంలో భక్తి పారవశ్యంలో సాగుతుంది.


భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా

కటిఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా పటల నినదేన విభ్రాజమానం
కుటిల పదఘటిత సంకుల సింజితే నతం చటుల నటనా సముజ్జ్వల విలాసం

నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది సురనితర భావనా శోభిత పదం
తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం పరమ పురుషం గోపాల బాలం


ఆ బాల కృష్ణుడు నడుముకు కట్టుకున్న మేఖలము, అలంకరించ బడిన మణి ఘంటిక, మృదువైన శబ్దాలు చేస్తూ విలసిస్తున్నాయిట. కొంటె పదములు వేస్తూ, పెన వేసుకుంటూ, దూరమవుతూ, అద్భుతమైన నటన చేస్తూ ఉన్నాడుట. ఎల్లప్పుడూ చేతులకు వెన్న కలిగి ఉండే దొంగ కృష్ణుడు, బ్రహ్మ మొదలగు దేవతల భావనలలో ఆయన పాదాలు శోభిల్లుతాయిట. ఆయనే శ్రీ హరి, పరమపురుషుడు, వేరే ఉపమానము లేని వాడు, శ్రీ వేంకటాచలముపై వెలసిన శ్రీనివాసుడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి