1, ఆగస్టు 2020, శనివారం

మనవి ఆలకించరాదటే - త్యాగరాజస్వామి


మానవునిగా జన్మించి నడతతో లోకారాధ్యుడైనాడు రాముడు. త్యాగరాజ స్వామి ఈ రహస్యాన్ని మనవి ఆలకించరాదటే అన్న కృతిలో తెలిపారు. అదే ఆ అవతార రహస్యం అన్నది త్యాగరాజస్వామి మనోగతము. మారి ఆ రాముడెలాంటి వాడు? ఘనుడు, కరుణాంతరంగుడు, రామో విగ్రహవాన్ ధర్మః. ధర్మాచరణే మానవ జన్మకు సోపానమన్నది అడుగడుగునా మనకు నిరూపించినవాడు. ఆ ధర్మాచరణే మానవుడైన రాముని పరమపురుషునిగా చేసింది. నళినకాంతి రాగంలో త్యాగరాజస్వామి ఈ కృతిని స్వరపరచారు.

మనవి ఆలకించరాదటే మర్మమెల్ల దెల్పెదనే మనసా

ఘనుడైన శ్రీరామచంద్రుని కరుణాంతరంగము తెలిసి నా

కర్మకాండ మతాకృష్టులై భవ గహనచారులై గాసి చెందగా
కని మానవావతారుడై కనిపించినాడే నడత త్యాగరాజు

ఓ మనసా! నా మనవిని ఆలకించుము, శ్రీరాముని అవతార రహస్యమును తెల్పెదను. శ్రేష్ఠుడైన శ్రీరాముని కరుణాహృదయమును తెలిసిన నా మనవిని ఆలకించుము. కర్మకాండలనే మతములలో చిక్కుకున్న వారై భవసాగరమనే అరణ్యములో అలసిపోయిన మానవులను చూసి మానవావతారమునెత్తి ధర్మాచరణ వంటి ఉత్తమ లక్షణములను తన నడవడికచే నిరూపించి మనకు దారి చూపాడు. ఈ మర్మము తెలిసిన త్యాగరాజుని మనవిని ఆలకించుము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి