29, ఆగస్టు 2020, శనివారం

జయతి శివా భవానీ - ముత్తుస్వామి దీక్షితులు

జయతి శివా భవానీ జగజ్జననీ నిరంజనీ

దయా రస ప్రవాహినీ దండితాసుర వాహినీ
భయకృద్భండమర్దినీ భాసమాన కపర్దినీ
శ్రీగురుగుహ రంజనీ జననాది ఖేద భంజనీ

జగజ్జననియైన, నిర్మలమైన, శివునితో యున్న భవానికి జయము జయము. దయారసాన్ని ప్రవహింపజేసే తల్లికి, అసుర సేనను దండించి సంహరించిన జగన్మాతకు జయము జయము. భయోత్పాతము సృష్టించిన భండాసురుని సంహరించిన తల్లికి, పరమశివునితో ప్రకాశించే అమ్మకు, కుమారస్వామికి ఆనందము కలిగించే మాతకు, జనన మరణ ఖేధములను తొలగించే అమ్మకు జయము జయము

దీక్షితుల వారు శ్రీవిద్యా ఉపాసకులు. ఆ అమ్మను అనేక రూపాలలో కొలిచారు. అందులో జగన్మాతను భవాని, దుర్గ, మహిషాసుర మర్దనిగా కూడా అద్భుతంగా కొనియాడారు. మహానవమి అమ్మ మహిషాసురుని సంహరించిన శుభముహూర్తం. అమ్మ కరుణామయి మాత్రమే కాదు, లోకాన్ని పీడించే దుష్టులను దండించగల రౌద్రరూపిణి కూడా. నవరాత్రులలో అనేక రూపములలో వైభవంగా కొలువబడిన అమ్మ ముగురమ్మలు, త్రిమూర్తులు, సమస్తదేవతా సమూహము యొక్క శక్తి కూటమియై దానవ సంహారం చేసి లోకానికి ఆనందం కలిగించింది. ఆ అమ్మను దీక్షితుల వారు ఈ కృతిలో అమ్మ దయారూపమును, అసురులను సంహరించిన రౌద్రరూపమును ఏకకాలములో వర్ణించారు. సిద్ధయోయి అయిన దీక్షితుల వారు అమ్మ సమస్త రూపములను దర్శించి వర్ణించి తరించిన అరుదైన నాదస్వరూపులు.

ముత్తుస్వామి దీక్షితుల వారి కృతిని కావలం శ్రీకుమార్ గారు అద్భుతంగా పాడారు. ఈ కృతి భవాని (భవప్రియ) రాగంలో కూర్చబడింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి