హిందూ మతం బౌద్ధ, జైన మతాల దాడికి గురయ్యి, అంతర్గత శైవ/వైష్ణవ పోరులో నలిగి నాశనము అవుతున్న దశలో దక్షిణామూర్తి అవతారముగా కేరళలోని కాలడిలో ఆర్యాంబ మరియు శివగురు దంపతులకు జన్మించారు శంకరులు. పిన్న వయసులోనే భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు. పామరులనుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి, ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు. ఆయన తర్వాత, శిష్యులు ఈ పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.
శంకర భగవత్పాదులు |
ఆ శంకరుని శిష్యులలో ఒకడైన ఆనందగిరి తన గురువులను స్తుతిస్తూ రచించిన ఈ తోటకాష్టకం ఆ శంకరుల లక్షణాలను, వైభవాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది.ఆనందగిరి ఈ స్తోత్రాన్ని తోటక ఛందములో రాయటం వలన దీనికి తోటకాష్టకం అని పేరు వచ్చింది. దీని వెనక ఒక చిన్న కథ ఉంది.
శంకరుల శిష్యులలో ఆనందగిరి కొంత మంద బుద్ధి. కానీ, అమితమైన గురు భక్తి కలవాడు. నిరంతర గురు సుశ్రూషలో ఉండేవాడు గిరి. ఒక రోజు, శంకరులు తన ప్రాతః కాల దినచర్యలో భాగంగా ఉపనిషత్ ప్రవచనం ఆరంభించారు. ఆ సమయంలో శిష్యులంతా శాంతి పాఠం మొదలు పెట్టారు. కానీ, గిరి మాత్రం అక్కడ లేదు. గురువు గారి వస్త్రములు ఉతకటానికి నది దగ్గరకు వెళ్ళాడు. శంకరులు ఇది గమనించి మిగిలిన శిష్యులను గిరి వచ్చేదాకా వేచి ఉండమని పలుకుతారు. అప్పుడు పద్మపాదుడనే శిష్యుడు గర్వముతో 'వాడు మూర్ఖుడు, వానికి శాస్త్రములు నేర్వవలసిన అర్హత లేదు. వానికోరకు ఎందుకు వేచి ఉండటం' అని అంటాడు. శంకరులు పద్మపాదుని గర్వము అణచుటకు, తన దైవ శక్తితో ఆనందగిరికి సకల శాస్త్ర పరిజ్ఞానమును క్షణకాలములో కలిగేలా చేస్తారు. నది వద్దనుండి తిరిగి వచ్చిన ఆనందగిరి గురువుగారిని నుతిస్తూ తోటకాష్టకాన్ని ఆశువుగా పఠించాడు.
మిగిలిన శిష్యులకు సిగ్గు, విస్మయం కలిగించేలా అతి కష్టమైనా తోటక ఛందములో ఎనిమిది శ్లోకాలతో అద్భుతంగా సాగుతుంది తోటకాష్టకం. అటు తర్వాత, ఆనందగిరి శృతి సార సముద్ధరణ అనే ఇంకొక రచన కూడ తోటక ఛందములో చేస్తాడు. శంకరుల నలుగురు ముఖ్య శిష్యులలో ఒకడై , తోటకాచార్యులుగా పిలవబడి, గురువులచేత బదరీలోని జ్యోతిర్మఠం నడపటానికి నియమించబడతాడు. తోటకాష్టకం, తాత్పర్యము, యూట్యూబ్ శ్రవణం బొంబాయి సోదరీమణులు
విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే
హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణం
కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖవిదూనహృదం
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణం
భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే
కలయేశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణం
భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా
మమ వారయ మోహమహాజలధిం భవ శంకర దేశిక మే శరణం
సుకృతేఽధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా
అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణం
జగతీమవితుం కలితాకృతయో విచరన్తి మహామహసశ్ఛలతః
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణం
గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కోఽపి సుధీః
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణం
విదితా న మయా విశదైకకలా న చ కించన కాంచనమస్తి గురో
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణం
తాత్పర్యము:
శాస్త్ర సాగరమనే నిధిని తెలిసిన, ఉపనిషద్ సంపద యొక్క సారాన్ని తెలిసిన, ఓ శంకర దేశికా! నీ చరణ పద్మముల నా హృదయమున ధ్యానిస్తున్నాను. నాకు శరణు నిమ్ము.
భవ సాగరమనే దుఖముచే పీడింప బడుతున్న హృదయము కలిగిన నన్ను రక్షించుము. నీ కృపచే నాకు సకల శాస్త్రముల సారము అవగతము చేయుము. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.
ఆత్మజ్ఞానము సంప్రాప్తి యందు ఆసక్తి యున్న వారు నీ కృప వలన ఆనందాన్ని పొందుతున్నారు. నాకు జీవాత్మ, పరమాత్మ జ్ఞానము కలిగేలా అనుగ్రహించు. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.
నీవే శివుడవని తెలుసి నా మనసు అనంతమైన ఆనందముతో నిండినది. నా మోహమనే మహా సాగరమును అంతము చేయుము. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.
ఎన్నో సుకృతములు (మంచి పనులు) చేయుట వలన నీ ద్వారా ఆత్మ జ్ఞానము పొందే వాంఛ, భాగ్యము కలుగును. నిస్సహాయుడ నైన నన్ను కాపాడుము. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.
ఈ జగత్తును రక్షించుటకు నీ వంటి మహాత్ములు వేర్వేరు రూపములలో, మారు వేషములలో తిరుగుచుంటారు. వారిలో నీవు సూర్యుని వంటి వాడవు. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.
గురువులలో శ్రేష్ఠుడా! వృషభము పతాకముపై చిహ్నముగా కలిగిన శివా! నీవు జ్ఞానులలో అసమానుడవు. శరణు కోరే వారిపాలిట దయామయుడవు. తత్వ నిధీ! ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.
ఇంకా జ్ఞానములో ఒక్క ఆకును కూడ అర్థం చేసుకోలేదు నేను. నా వద్ద ఎటువంటి సంపదలు లేవు. ఓ గురు దేవా! నీ కృపను నా పై వెంటనే ప్రసరింపుము. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.
జగద్గురువులకు వందనాలు. గురు శుశౄష చేసి, గురువు అనుగ్రహం బాసిన ఆనంద గిరి ఎంత అదృష్ట వంతుడో. గురువనుగ్రహం ఉంటే మూఢ మతులు మహా జ్ఞానులవతారు అనడానికి ఇది తార్కాణం. మంచి విషయాలు అందిస్తున్న మీకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండివ్రాసినది తోటకాచార్యులు కదా...
రిప్లయితొలగించండిఅవునండీ. వేరేగా ఎక్కడుంది ఇందులో?
రిప్లయితొలగించండితోటక ఛందములో వ్రాయడం వల్ల తోటకాష్టకమా? తోటకాచార్యులు వ్రాయడం వల్ల తోటకాష్టకమా?
రిప్లయితొలగించండిధన్యవాదాలు
రిప్లయితొలగించండి