సూర్యుడు మేషరాశిలో ఉండగా, చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో ప్రవేశించిన ముహూర్తమే శ్రీరామనవమి. అలాగే, సూర్యుడు సింహరాశిలో ఉండగా, చంద్రుడు వృషభరాశిలో రోహిణి నక్షత్రంలో ప్రవేశించిన పుణ్యదినాన్ని జన్మాష్టమి లేదా శ్రీజయంతి అంటాము. చాంద్రమానానికి ప్రచారం వచ్చిన తరువాత నవమి మరియు అష్టమి ఈ రెండు పండుగులకు ప్రధాన తిథులైనాయి. కానీ, తాత్విక దృష్టితో చూస్తే సూర్యచంద్రుల పరస్పర సంబంధాన్ని పురస్కరించుకొని ఈ రెండు పండుగలు ఏర్పడ్డాయి. సూర్యమండలంలోని ప్రతి గ్రహానికీ ఒక రాశి ఉచ్చస్థానంలో ఉంటుంది. అలాగే, మరో రాశి స్వక్షేత్రమవుతుంది. ఈ దృష్టితో చూస్తే మేషం సూర్యుడికి ఉచ్చరాశి, సింహం స్వక్షేత్రం. వృషభం చంద్రుడికి ఉచ్చరాశి, కర్కాటకం స్వక్షేత్రం. అంటే సూర్యుడు ఉచ్చంలో ఉండగా, చంద్రుడు స్వక్షేత్రంలో పునర్వసులోకి వచ్చినప్పుడు సూర్యవంశపు రాజైన రామచంద్రునికి పర్వకాలమవుతుంది. అలాగే సూర్యుడు స్వక్షేత్రంలో ఉండగా చంద్రుడు ఉచ్చంలో రోహిణీ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు చంద్రవంశ ప్రభువైన శ్రీకృష్ణుని జయంతి వస్తుంది. సూర్యవంశ ప్రభువు మధ్యాహ్నం అవతరిస్తే చంద్రవంశపు ప్రభువు అర్ధరాత్రి ఆవిర్భవించాడు. దీనిని బట్టి రామకృష్ణుల జ్యోతిర్మయ స్వరూపం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. సంవత్సర పరిమితిలో సంభవించే సూర్యచంద్రుల ఈ పరస్పర సన్నివేశాలను మహర్షులు ప్రత్యక్షంగా భావించి వీటికి మహత్తరమైన రూపకల్పన చేశారు. కాలస్వరూపుడైన పరమాత్ముడు చైత్రంలో రామస్వామిగా, శ్రావణంలో కృష్ణపరమాత్మగా సాక్షాత్కరిస్తాడు. ఒకే పరతత్త్వం కాలగతిని బట్టి రెండు రూపాలలో తన ఆరాధ్య స్వరూపాన్ని కాలజ్ఞులకు అవగతం చేస్తుంది. కాలచక్రంలోని ఈ బిందువునే వసుంధర కలకాలం ధరిస్తుందని, దానికి ప్రభువుగా పరమాత్మ లోకాలోకాన్ని అనువర్తిస్తూ ఉంటాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి