4, ఆగస్టు 2020, మంగళవారం

లంకాధిపతి - రావణ రాక్షస ప్రవృత్తి రహస్యం


సంసారమగ్నుడైన జీవుని లాగా సముద్ర మధ్యంలో నిలిచి యున్న నగరం లంక. దానికి పాలకుడు రావణుడు. అతిభయంకరుడు, దశగ్రీవుడు. గ్రీవం భోగాశకు చిహ్నం. దశేంద్రియాలతో అనుభవించాలని ఆరాటపడే జీవుడు రావణుడు. ఆ ఇచ్ఛయే అతణ్ణి ముల్లోకాలను జయింపజేసింది, దిశాధిపతులచే దాస్యం చేయించుకున్నది. అనుభవేచ్ఛ అహంకారపూరితమైనది. అహంకారి ముల్లోకాలను జయించినా తన ప్రకృతిని జయించలేడు. అందువల్లే సీతమ్మను వశం చేసుకోలేకపోయాడు. రావణుడు రాక్షస ప్రవృత్తి కలవాడు, పరమాత్మను మెప్పించటానికి తనువులోని పంచభూత ప్రకృతిని తపింపజేయటం రాక్షస తపస్సుకు ముఖ్యలక్షణం. అలాగే నారాయణుడైన రాముణ్ణి పొందటానికి సీతమ్మను తపింపజేశాడు. దశరథుడు తన ఆర్తితో భగవంతుణ్ణి భూతలానికి దింపాడు. అది సాత్త్వికమైన ఆర్తి. దశకంఠుడు అహంకారి కావటం చేత తాను ఆర్తిని ప్రకటించడు; సీతయందు ఆర్తిని సృష్టిస్తాడు. ఆ రాముడు లంకకు వస్తాడని ఆ జీవుని తపన. ఉద్ధతుడైన రావణుని గూఢాహంకార వైరభక్తి విశేషమది.

సీతను దశకంఠుడు చెరపట్టి అశోకవనంలో ఉంచుతాడు. తనను గూర్చి ఘనంగా చెప్పుకొని తనను స్వీకరించమని అడుగుతాడు. పరిచారికల చేత ప్రబోధం చేయిస్తాడు. ఫలితం లేదని తెలిసి సమయం కొరకు నిరీక్షిస్తాడు. సీతను కామించిన రావణుడు ఆమెను బలాత్కారం చేయలేదు, చేయలేడు కూడా. సీతాసౌముఖ్యం లేకపోతే అతని తల వేయి వ్రక్కలవుతుంది. అందుకే, ఆమె సౌముఖ్యాన్ని కోరతాడు. ఆమె వశమైతే ప్రకృతిని జయించిన పురుషుడవుతాడు. ఆమె వశం కాకపోతే ఆమెను రాముడే రక్షించుకుంటాడు. తాను ప్రకృతిని జయించలేని నాడు పరమాత్మ సాన్నిధ్యం పొందటానికి సీత కారణమవుతుంది. ఆ పని భక్తితో చేస్తే భగవంతుడు రక్షిస్తాడు, అహంకారంతో చేస్తే తగినట్లు శిక్షిస్తాడు. ఆ శిక్ష అహంకారానికి ఆధారమైన అతని శరీరాన్ని కూల్చటం. మరణం అతని దైహికానుభవేచ్ఛకు సమాప్తి; అతని జీవుని వేదన అతని ముక్తికి సాధనం. అందుకే రాముని చేతిలో రావణునికెంత శిక్షో అంత వరం. వైరభక్తిలో శిక్షయే వరంగా మారుతుంది. వైరభక్తి మార్గంలో రాముణ్ణి పొందే ప్రవృత్తికి లంక ప్రతీక.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి