31, జులై 2020, శుక్రవారం

సీతారామ కల్యాణం - లోకకల్యాణార్థం విశ్వామిత్ర జనకుల పాత్ర


శ్రీమద్రామయణంలో సీతారామ కల్యాణం అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే, అది లోకకల్యాణార్థం రాముని అయనానికి నాంది. అందులో ముఖ్యమైన పాత్రలు విశ్వామిత్ర మహర్షి, రాజర్షి జనకుడు. వివరాలను పరిశీలిద్దాం.

విశ్వామిత్రుడు
===========

పిల్లలకు పెండ్లి చేస్తే బాగుండునని దశరథుడు అనుకుంటూ ఉండే సమయంలో విశ్వామిత్రుడు ప్రవేశిస్తాడు. సీతారాముల వివాహమైన మరునాడే విశ్వామిత్రుడు ఉత్తరగిరికి బయలుదేరి వెళతాడు. ఆ తరువాత మరల విశ్వామిత్రుని ప్రసక్తి రాదు. దీనిని బట్టి సీతారాముల కలయికకు, విశ్వామిత్రుని యాగసంరక్షణకు ఏదో అలౌకికమైన సంబంధం ఉన్నట్లు తోచుతుంది. యాగం అనే నెపంతో ఆయన రామకార్యార్ధమై వచ్చాడని కులగురువులు వశిష్ఠుల వారు దశరథునికి సూచనప్రాయంగా ఈ విషయం చెబుతాడు. ఈ రహస్యాన్ని తనంతట తాను విప్పి చెప్పటం ఇష్టం లేకనే విశ్వామిత్రుడు దశరథునితో అంటాడు - "మీ కుమారుడు ఎంతటి మహనీయుడో నాకు తెలుసు, అతనిలో దాగియున్న సత్య పరాక్రమాన్ని మీ వాత్సల్యం అవగాహనం చేసుకోలేకుండా ఉన్నది. కావాలంటే వశిష్ఠుణ్ణి లేదా మరో తపస్సంపన్నుణ్ణి అడుగు. వాళ్లకు తెలుసు" అని అంటాడు.

అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం
వశిష్ఠశ్చాపి ధర్మాత్మా యేచేమే తపసి స్థితాః

సీతారాముల కల్యాణమే విశ్వామిత్రుని ధ్యేయం. మధ్యలో యాగ సంరక్షణ, రాక్షస వధ, అహల్యా శాపవిమోచనం అన్నీ ఈ పరమ కల్యాణ సంరంభానికి హంగులు. తమోగుణ ప్రధానమైన తాటకను సంహరించి, రజోలీనయై అదృశ్యగానున్న అహల్యను ఆవిష్కరించి, నిత్య సత్య సందీప్తమైన సాత్త్విక తేజస్సుతో అయోనిజగా జనకుని వాత్సల్యంతో పెరుగుతున్న జానకిని చేపట్టటమే రామభద్రుడు విశ్వామిత్రుని అనుసరించటంలో సాధించిన సత్త్వసిద్ధి. విశ్వామిత్రుడు గాయత్రీమంత్ర ద్రష్ట. రామాయణం గాయత్రీ బీజ సంహిత. ఇరవై నాలువు వేల శ్లోకాలలో వేదమాతను బీజరూపంగా ప్రతిబింబింపజేసిన వాల్మీకి రచనకు మూలాధారం విశ్వామిత్రుని పాత్ర. ఈ మహర్షి సాధించిన సీతారామ సమాగమం సీతాసమేత అయిన రాముని అయనానికి మొదటి మెట్టు.

జనకుడు
=======

ఈ సమాగంలో రహస్యం, దీనికి గల ప్రాశస్త్యం జనకుడు పాణిగ్రహణ సందర్భంలో సూత్రప్రాయంగా సూచిస్తాడు. రామభద్రునికి సీతమ్మను అప్పగిస్తూ, ఆ రాజర్షి అన్న మాటలు మంత్రభావంతో మననం చేయదగినవి.

ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా

ఇదిగో మా అమ్మాయి సీత, నీకు ధర్మకార్య నిర్వహణలో సహచరిగా ఉపకరిస్తుంది. ఈమెను స్వీకరిస్తే నీకు శుభం చేకూరుతుంది, ఈమెను పాణిగ్రహణం చేసి చేదోడు వాదోడుగా జీవితం సాగించండి. ఇదీ జనకుని సందేశ సారం. ఇందులో రామాయణ మహాయనమంతా సూక్షంగా గోచరిస్తుంది. వాల్మీకి వర్ణించిన సీతాకల్యాణ ఘట్టానికి ప్రాణప్రాయమైనది ఈ శ్లోకం. మొదటి పంక్తిలో ఇయం (ఈమె), మమ (నా), తవ (నీ) మూడు సర్వనామాలున్నాయి. ఇవి కేవలం సీత, జనకుడు, రాముడికే కాక జీవధానిలోని జీవధారులందరికీ వర్తించే సర్వనామాలు. మా అమ్మాయి సీత, మా ఇంట్లో పెరిగి మీ ఇంటికి వెళుతున్నది, ఎందుకు? ధర్మం నిలబెట్టేందుకు. ఈమె యందు నీకు పరిపూర్ణమైన అనురాగం (ఇచ్ఛ) ఉంటే నీకు శుభం కలుగుతుంది. ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని ఆపదలు ముంచుకు వచ్చినా మీ యిరువురి మధ్య ఈ ఇచ్ఛాశక్తి దృఢంగా ఉంటే మీకేమి అపాయం లేదు, ఇచ్ఛకు, ప్రతీచ్ఛకు మధ్య చిన్న పెద్దలు, హెచ్చు తగ్గులు, హాని వృద్ధులు ఉండేందుకు అవకాశం లేదు. సమరస భావం సహచరుల జీవితానికి సంతోషం, సార్థకత సమకూర్చగలుగుతుంది అని జనకుని భావం. సాక్షాత్తూ జగన్మాత తన యింట పెరిగినందుకు, అలాంటి సీతమ్మను పరమేష్ఠి స్వరూపుడైన రాముని చేతుల్లో పెడుతూ జనకుడు ఎంతగా ఏ దిక్కున పొంగిపోయి ఉంటాడో "మమ సుతా" అనే వాక్యం చెబుతుంది. "ఇయం సీతా" అనటంలో సీతాదేవి పుట్టుపూర్వోత్తరాలు, "తవ" అన్న మాటలో దశరథనందనుని ఘనత వేయి విధాల వ్యక్తమవుతున్నట్లు భావించాలి.

శ్రీ గురుభ్యోనమః. శ్రీసీతారామచంద్ర పరబ్రహ్మణే నమః.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి