నగు మోము గలవాని నా మనోహరుని
జగమేలు శూరుని జానకీవరుని
దేవాది దేవుని దివ్య సుందరుని
శ్రీవాసుదేవుని సీతారాఘవుని
సుజ్ఞాన నిధిని సోమ సూర్య లోచనుని
అజ్ణాన తమమును అణచు భాస్కరుని
నిర్మలాకారుని నిఖిలాఘహరుని
ధర్మాది మోక్షములు దయ చేయు ఘనుని
బోధతో పలుమారు పూజించి నేనా
రాధింతు శ్రీ త్యాగరాజసన్నుతుని
చిరునవ్వు మోము కలిగిన, నా మనస్సును హరించిన, జగములనేలే శూరుడైన, జానకి వరించిన శ్రీరాముని నేనారాధించెదను. దేవాది దేవుడు, దివ్య సుందర స్వరూపుడు, వాసుదేవుడైన సీతారాముని నేనారాధించెదను. సుజ్ఞానమునకు నిధియైన వాడు, సూర్యచంద్రులు కన్నులుగా కలవాడు, అజ్ఞానాంధకారాన్ని అణచి వేసే సూర్యుడైన రాముని నేనారాధించెదను. నిర్మలమైన రూపము కలవాడు, సమస్త పాపములను నాశనము చేసే వాడు, ధర్మార్థ కామ మోక్షములను అనుగ్రహించే ఘనుడైన శ్రీరాముని నేనారాధించెదను. శివునిచే నుతించబడిన శ్రీరాముని నేను జ్ఞానముతో అనేక విధముల పూజించి ఆరాధించెదను.
మధ్యమావతి రాగంలో కూర్చబడిన ఈ ఉత్సవ సాంప్రదాయ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు (ఆల్బంలో 54వ నిమిషం దగ్గర ఈ కృతి మొదలవుతుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి