20, ఆగస్టు 2020, గురువారం

భరత వాక్యం


మనం చాలా సార్లు భరత వాక్యం పలికారు అన్నది వింటూంటాము. ఇది రామాయణం నుండి వచ్చిందే.

శ్రీరాముడు లంకలో రావణుని సంహరించి సీతాలక్ష్మణ సమేతుడై విజయుడై అయోధ్యకు తిరిగి వస్తున్నాడన్న వార్త హనుమంతుని ద్వారా భరతునికి తెలుస్తుంది. ఆనందపడి రాముని స్వాగతానికి ఏర్పాట్లు చేస్తాడు భరతుడు. పధ్నాలుగు సంవత్సరాల ముందు జరుగవలసిన పట్టాభిషేకం ఇప్పుడు జరిపించేందుకు ఏర్పాట్లకు యంత్రాంగాన్ని పురమాయిస్తాడు. పితృవాక్య పరిపాలనకై అన్న తనకిచ్చిన రాజ్యాన్ని మళ్లీ అన్నకు అప్పగించే సమయంలో భరతుడు చెప్పిన మాటలను భరతవాక్యం అంటారు. ఈ మాటలు రామరాజ్యానికి నాంది, రామాయణ మహాయనానికి మంగళ వాక్యము పలుకుతాయి. ఇదే భరత వాక్యంగా ప్రసిద్ధి చెందింది.

ఏమిటీ భరత వాక్యం?

పూజితా మామికా మాతా దత్తం రాజ్యమిదం మమ
తద్దదామి పునస్తుభ్యం యథా త్వమదదా మమ

అమ్మ చెప్పిన మాటను ఆదరించి ఆమెను ఆరాధించాము, ఆమె కోరిన ప్రకారం నీవు నాకిచ్చిన రాజ్యాన్ని మళ్లీ నీకు యథాతథంగా అప్పజెబుతున్నాను అంటాడు భరతుడు. మాటదాటని భరతుడు, తండ్రి మాట నెరవేర్చిన రాముడు ఇక్ష్వాకు వంశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. తన కోసం కాకపోయినా ప్రజల అభీష్టం మేరకు రాముడు సింహాసనాన్ని అధిష్టించాలని భరతుని మనసులోని మాట.

జగదద్యాభిషిక్తం త్వామనుపశ్యతు రాఘవ
ప్రతపంతమివాదిత్యం మధ్యాహ్నే దీప్తతేజసం

మధ్యాహ్నవేళ పరిపూర్ణమైన వెలుగుతో జ్యోతిర్మండలం మధ్య ప్రకాశించే సూర్యునిలా శ్రీరాముడు అయోధ్యకు రాజుగా పట్టాభిషిక్తుడు కావటం లోకానికి ఆనందకరం. దీనికోసం ఈ లోకం ఎదురు చూస్తోంది. అంతటితో ఆగలేదు భరతుడు. చివరగా ఇలా పలికాడు:

యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా
తావత్ త్వమిహ లోకస్య స్వామిత్వమనువర్తయ

రామరాజ్యం ఎలా ఉంటుందో ఈ శ్లోకం చాలా చక్కగా చెబుతుంది. కాలచక్రం సక్రమంగా తిరుగుతున్నంత వరకు, ఈ కాలగమనంలో భూమి వికాసంతో వర్ధిల్లుతున్నంత వరకూ, అన్నగారు లోకానికి స్వామిగా ఉండి లోక కల్యాణం సాధించాలి అని ఈ భరత వాక్యంలోని అర్థం. బాగుంది, కానీ, పై శ్లోకాలలో నిగూఢమైన అర్థముంది:

ఇక్కడ కీలకమైన పదాలు మధ్యాహ్నం, చక్రం, వసుంధర, లోకం, అనువర్తయ. వీటిని జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రతి సంవత్సరం మనం శ్రీరామనవమి ఉత్సవాలలో సీతారాముల కల్యాణము, పట్టాభిషేకోత్సవం జరుపుకుంటాము. ఈ రామనవమి ఉత్సవాలలో గొప్ప రహస్యం దాగి ఉంది. అదే రహస్యం ఈ భరత వాక్యంలో కూడా ఉంది. సూర్యుడు మేషరాశిలో ఉండగా చంద్రుడు కర్కాటాకరాశిలోనూ పునర్వసు నక్షత్రంలో ప్రవేశించిన శుభ ముహూర్తమే శ్రీరామనవమి. అలాగే సూర్యుడు సింహరాశిలో ఉండగా చంద్రుడు వృషభరాశిలో రోహిణీ నక్షత్రంలో ప్రవేశించిన పుణ్యదినాన్ని జన్మాష్టమిగా జరుపుకుంటాము. తాత్త్విక దృష్టితో చూస్తే, సూర్యచంద్రుల పరస్పర సంబంధాన్ని పురస్కరించుకొని ఈ రెండు పండుగలు ఏర్పడ్డాయి. సూర్యమండలంలోని ప్రతి గ్రహానికి ఒక రాశి ఉచ్చస్థానంగా ఉంటుంది. అలాగే, మరో రాశి స్వక్షేత్రమవుతుంది. ఈ దృష్టితో చూస్తే మేషం సూర్యుడికి ఉచ్చరాశి, సింహం స్వక్షేత్రం. వృషభం చంద్రుడికి ఉచ్చరాశి, కర్కాటకం స్వక్షేత్రం. అంటే సూర్యుడు ఉచ్చంలో ఉండగా చంద్రుడు స్వక్షేత్రంలో పునర్వసులోకి వచ్చినప్పుడు సూర్యవంశపు రాజైన రామచంద్రుని పర్వకాలం, అలాగే సూర్యుడు స్వక్షేత్రంలో ఉండగా చంద్రుడు ఉచ్చలో రోహిణీ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు చంద్రవంశపు రాజైన శ్రీకృష్ణ పర్వదినం వస్తుంది. సూర్యవంశ ప్రభువైన రాముడు మధ్యాహ్నం అవతరిస్తే చంద్రవంశప్రభువైన కృష్ణుడు అర్థరాత్రి ఆవిర్భవించాడు. దీనిని బట్టి రామకృష్ణుల జ్యోతిర్మయ స్వరూపం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. సంవత్సర పరిమితిలో సంభవించే సూర్యచంద్రుల ఈ పరస్పర సన్నివేశాలను మహర్షులు ప్రత్యక్షంగా భావించి అనుభూతి చెంది వీటికి మహత్తర రూపకల్పన చేశారు. కాలస్వరూపుడైన పరమాత్మ చైత్రంలో రామునిగా, శ్రావణంలో కృష్ణునిగా సాక్షాత్కరించాడు. ఒకే పరతత్త్వం కాలగతిని బట్టి రెండు రూపాలలో తన ఆరాధ్యస్వరూపాన్ని కాలజ్ఞులకు అవగత చేస్తుంది. కాలచక్రంలోని ఈ బిందువునే వసుంధర కలకాలం ధరిస్తుందని, దానికి ప్రభువుగా రాముడు లోకాలోకాన్ని అనువర్తిస్తూ ఉంటాడని భరతుని వాక్యంలోని అంతరార్థం. ఈ భరత వాక్యమే రామాయణ పరమార్థం.

1 కామెంట్‌: