ఒకప్పుడు పెళ్ళికాని యువకులందరూ హనుమంతుని ఆదర్శంగా తీసుకుని ఆరాధించమని, వారి వద్ద హనుమంతుని రూపంతో మెడలో బిళ్ల గాని, విగ్రహం గానీ, ఫోటో గాని ఉంచమని పెద్దలు చెప్పేవాళ్లు. అలాగే హనుమాన్ చాలీసా పఠించటం, హనుమంతుని దేవాలయాలలో ప్రదక్షిణలు చేయటం, హనుమాన్ వ్యాయామశాల పేరిట శరీర దారుఢ్యంపై దృష్టిపెట్టటం జరిగింది. చాలామంది వీటిని పాటించేవారు కూడా. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దానిని పునరుద్ధరించవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే యువకులు మానసిక దౌర్బల్యంతో, అనేక రకాల అసంతులనలతో అనేక రకాలుగా బాధ పడుతున్నారు. అది వారినే కాదు వారి కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ పోస్టులో కింది శ్లోకాలు అనేక అంశాలలో ప్రస్తావనకు వాస్తాయి, వాటి అర్థాన్ని ముందు తెలుసుకుందాం.
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్
హనుమంతుని స్మరించటం వలన బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వం, ఆరోగ్యము, జాగరూకత, మాటలలో బలం కలుగుతాయి
మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి
మనస్సు అంత వేగము, వాయువుతో సమానమైన వేగము కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, బుద్ధిమంతుడు, శ్రేష్ఠుడు, వాయుసుతుడు, వానరసేనకు ప్రముఖుడు, శ్రీరామదూత అయిన హనుమంతునికి శిరసు వంచి నమస్కరించుచున్నాను.
హనుమంతుని ద్వాదశ నామావళి ఫలశ్రుతిలో
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠైర్నిత్యం యాత్రే కాలే విశేషతః
తస్య మృత్యు భయం నాస్తి సర్వతర విజయీ భవేత్
కపీంద్రుడైన హనుమంతుని ద్వాదశనామావళిని నిదురించే సమయంలో, నిద్ర నుండి మేల్కొన్నప్పుడు, ప్రయాణ సమయంలో పఠించిన వారికి మృత్యు భయం తొలగి అన్నిటా విజయం కలుగుతుంది అని చెప్పారు.
వీటిని దృష్టిలో పెట్టుకుని హనుమంతుని గుణగణాలను, మహత్తును పరిశీలిద్దాం.
హనుమంతుడు యువకులకు ఏ విధంగా ఆదర్శం? ఎందుకు వారు హనుమంతుని పూజించాలి?
1. ప్రప్రథమంగా హనుమంతుడు సకలవిద్యాపారంగతుడు, జ్ఞాని. తులసీదాసు జ్ఞానగుణ సాగర అని చాలీసాలో కీర్తించాడు. భవిష్యద్బ్రహ్మ హనుమంతుడే. విద్యాభ్యాస్యంలో కావలసిన శ్రద్ధకు, ఏకాగ్రతకు, పరిశ్రమకు హనుమంతుడు అన్నివిధాలా ఆదర్శవంతుడు, ఆరాధ్య దైవం కూడాను.
2. హనుమంతుడు అమిత బలవంతుడు. రామకార్యార్థియై శతయోజనముల సాగరాన్ని లంఘించాడు, సంజీవని పర్వతాన్ని ఎత్తుకు వచ్చాడు. దేహబలానికి రామభక్తి తోడైతే ఇక ఎదురులేదు అన్నది మనకు శ్రీమద్రామాయణంలోని సుందరకాండ, యుద్ధకాండ తెలుపుతాయి. కాబట్టి యుక్త వయసులో దేహదారుఢ్యంపై దృష్టి కలిగితే తరువాత జీవితమంతా ఆరోగ్యకరంగా ఉంటుందని, హనుమంతుని స్మరణ వలన బలము, ఆరోగ్యము కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఈనాడు యువతలో అనేక రకాల దౌర్బల్యాలు, తద్వారా సమాజం ఎన్నో దుష్పరిణామాలను ఎదుర్కొంటోంది. హనుమంతుని స్మరణ ఇటువంటి దౌర్బల్యాలనుండి ముక్తిని కలిగిస్తుంది.
3. యుక్తవయసులో ఉద్రేకాలను, ఆకర్షణల వల్ల కలిగే మానసిక మార్పులను నియంత్రణలో ఉంచుకుని ధ్యాస విద్యాభ్యాసం మీద, బుద్ధిర్బలాలు పెంచుకోవటానికి హనుమంతుని ఆరాధన ఎంతో తోడ్పడుతుంది. ఆ వయసులో నిగ్రహంగా ఉంటే తరువాతి జీవితం పూలబాటే. హనుమంతుడు శ్రీరామభక్తితో జితేంద్రియుడైనాడు. బుద్ధిమంతుడు, జితేంద్రియుడు, శ్రేష్ఠుడు అయిన ఆ హనుమను స్మరిస్తే ఆ దిశగా యువతకు స్ఫూర్తి కలుగుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగిన ప్రతి యువకునికి అమితమైన తేజస్సు, యశస్సు కలుగుతాయి.
4. భక్తి ఎంత తొందరగా దృఢ పడితే అంత జీవితం రమ్యమవుతుంది. బ్రహ్మచర్యంలో నిగ్రహానికి భక్తి ఓ గొప్ప సాధనం. హనుమంతుడు భక్తికి నిర్వచనం. రామచంద్రునిపై పరిపూర్ణమైన విశ్వాసంతో కార్యసాధకుడైనాడు, సీతారాములకు ప్రీతిపాత్రుడై, రామభక్తితోనే భక్తులకు అభయాంజనేయుడైనాడు.
5. హనుమంతుడు ఎంత బలవంతుడో, అంతటి వినయసంపన్నుడు. వినయము కలవారు ప్రపంచానికి ప్రీతిపాత్రులవుతారు. ఈ వినయం వల్ల జ్ఞానం సార్థకత పొందుతుంది. అందుకే విద్యాభ్యాస సమయంలో వినయం ఎంతో అవసరం. అటువంటి విద్యార్థులకు గురువులు ప్రీతితో విద్యను ఉపదేశిస్తారు.
6. హనుమంతుడు సమస్త శాస్త్ర కోవిదుడు, ఉత్తమ దూత, వ్యవహారవేత్త మరియు అసమాన కార్యదక్షుడు. ఇది మనకు కిష్కింధకాండ,సుందరకాండలలో స్పష్టంగా తెలుస్తుంది. స్వయంగా శ్రీరామచంద్రుడే వేనోళ్ల హనుమంతుని శుభలక్షణాలను లక్ష్మణునికి వర్ణిస్తాడు. దూతగా హనుమంతుడు సుందరకాండలో కనబరచిన కుశలత, వాక్చాతుర్యం మనకు ఆదర్శం. యుక్త వయసులో ఉన్నవారికి వాక్పటిమ ఎంతో ముఖ్యం. వృత్తిలో, సమాజంలో వాక్పటిమ కలిగిన వారిని ప్రజలు అనుసరిస్తారు. హనుమంతుని ఆరాధన వల్ల వాక్ఛక్తి పుష్కలంగా కలుగుతుంది.
ఈ విధంగా హనుమంతుడు యువకులకు ఆరాధ్యుడు, సమస్త శుభలక్షణాలను కలిగించే దైవం. హనుమాన్ చాలీసా, సాఠికా, బజరంగ్ బాణ్ వంటి మహిమాన్విత స్తోత్రాలు భక్తులను ఉద్ధరిస్తూనే ఉన్నాయి.
ఈ హనుమద్భక్తి మార్గంలో నన్ను ప్రవేశపెట్టిన గురువు గారికి నేను సర్వదా కృతజ్ఞుడను.
శ్రీగురుభ్యోనమః. సియావర్ రామచంద్ర కీ జై! పవన సుత హనుమాన్ కీ జై!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి