మన మతంలోనే యజ్ఞాలు ఉండటానికి కారణం విశ్లేషించే ముందు మానవ జీవితం ఎలా సాగుతుందో గమనిద్దాం. ఒక ప్రాంతంలో ఏ పదార్థమైనా ఎక్కువగా లభిస్తే దానిని ఆ పదార్థం సమృద్ధిగా లేని ప్రాంతానికి పంపి ఆ రెండో ప్రాంతం నుంచి మనకు లేని దానిని తెచ్చుకుంటాం. వడ్రంగులు, మేస్త్రీలు మనకు పని చేసి పెడితే వారి జీవనాధారానికి మనం డబ్బులిస్తాం. ఆవుకి మేత పెడతాం అది పాలు ఇస్తుంది. ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తాం, మనకు భద్రత, ఇతర అవసరాలన్నీ ప్రభుత్వం చూసుకుంటుంది. ఆ విధంగానే పరలోకాలలో కూడా ఇచ్చి పుచ్చుకోవటాలున్నాయి. ఇంజనీర్లు వర్షపు నీటీని కాలువద్వారా పారనీయగలరు, జలాశ్రయాలలో నిలువ చేయగలరు. అంతే కానీ, వర్షాన్ని కల్పించటం చాలా కష్టం. మనకు వర్షాలు కావాలంటే దేవలోకానికి కొన్ని పదార్థాలను పంపాలు. ఈ పరస్పర సంబంధాలనే గీత ఇలా సూచిస్తుంది:
సహయజ్ఞాః ప్రజాసృష్టా పురోవాచ ప్రజాపతిః
అనేన ప్రసవిష్యద్వమేషవోऽస్త్విష్టకామధుక్
దేవాన్ భావయతానేన తేదేవా భావయంతునః
పరస్పరం భావయంతః శ్రేయఃపరమవాప్స్యథ
యజ్ఞాల వలన దేవతలను సంతుష్టపరచుచు, దేవతలు వర్షాలు మొదలైన వాటితో నిన్ను షంతుష్టుని చేయనీ. ఈ విధంగా ఒకరికొకరు సహాయపడుతూ అందరూ వర్ధిల్లు గాక!
క్లుప్తంగా చెప్పాలంటే, ప్రతిదేవతకీ మంత్రసమేతంగా ఉపహారం సమర్పించటమే యజ్ఞం. ఒకవిధంగా చెప్పాలంటే సామవేద మంత్రాలే దేవతా స్వరూపాలు., యజ్ఞంలో సమర్పించిన ఆహార దినుసులవలె ఈ మంత్రాలలోని పదాలే ఆయా దేవతలకు పోషకాలై వారికి పుష్టిని కలిగిస్తాయి. కాబట్టి మంత్రాలకు అనేక ప్రయోజనాలున్నాయి. ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించేందుకు మనం వివిధ రకాల పన్నులు కడతాము. ఒక్కో పన్ను ఒక్కో చోట కట్టాలి - అంటే ఆదాయపు పన్ను, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, వాహనాల పన్ను మొదలైనవి. ఒక్కో అధికారి ఒక్కో రకమైన రసీదు ఇస్తాడు. అలాగే ప్రతి క్రతువుకూ ఒక ప్రత్యేకమైన మంత్రము, దేవత, ఉపహారము, సమయము ఉన్నాయి. ఒక్కో యజ్ఞానికి ఒక్కో నియమావళి ఉన్నా అన్నిటి ధ్యేయమూ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవటమే. మనం ఎక్కడ చెల్లించినా, పన్ను ప్రభుత్వాదాయంలోనే జమ అవుతుందని మనకు తెలుసు కదా. అలాగే, వేరువేరు దేవతలకై మనం చేసే వివిధమైన యజ్ఞాలు ఆ దేవతల ద్వారా పరమేశ్వరునికి చేరుతాయనే అనుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి