29, ఆగస్టు 2020, శనివారం

నీలాయతాక్షి- శ్యామశాస్త్రి


 

నీలాయతాక్షి! నీవే జగత్సాక్షి!

ఫాలాక్షుని రాణి! పాలిత శ్రిత శ్రేణి!

దీనరక్షకి! అభయదానమీయవే! సామ
గానలోలే! అభిమానమీయవే! దేవీ!

ఆదిశక్తి! కౌమారి! మేదినిలో నిను పొగడ
ఆదిశేషునికైన రాదికనేమిజెప్పుదు! దేవీ!

కామపాలిని విను! నీ నామములే ధర్మార్థ
కామ మోక్షమిచ్చేది! శ్యామకృష్ణ పాలిని! దేవీ!

నల్లని కలువల వంటి కన్నులు గల పార్వతీదేవీ! ఈ జగత్తుకు నీవే సాక్షివి. మూడవ కన్ను కలిగిన పరమశివుని రాణీ! ఆశ్రిత సమూహాన్ని పాలించే తల్లివి నీవు. దీనజన రక్షకివి! నాకు అభయమునొసగుము! సామగానములో లీనమై యుండే దేవీ! నాపై నీ వాత్సల్యము చూపుము. ఓ ఆదిపరాశక్తీ! కౌమారీ! ఈ భువిపై నిన్ను పొగడ ఆదిశేషుని కూడా తరము కాదు, ఇంక నీ మహిమలను నేనేమి జెప్పెదను? మన్మథుని రక్షించిన దేవీ! నా మాటలు ఆలకింపుము! నీ నామములు చతుర్విధ ఫలములిచ్చేవి! శ్యామకృష్ణుని పాలించిన దేవీ! నాకు అభయమొసగుము.

ఈ కృతిని పరజు రాగంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి