వేదాలకు పురాణాలు భూతద్దాలనవచ్చు. చిన్నచిన్నవాటిని పెద్దవిగా చేస్తాయి గనుక. వేదాలలోని సూక్తులు క్లుప్తంగా ఉంటాయి - వాటిని కథలుగా, ఆఖ్యానాలుగా పెంచి చూపుతాయి పురాణాలు. ఒక భావాన్ని క్లుప్తంగా చెబితే అది మనస్సులో నాటుకోక పోవచ్చు. దాని ఫలితమూ కనబడక పొవచ్చు. దానినే ఒక కథగానో ఉపాఖ్యానంగానో చెబితే మనసులో నిలిచిపోతుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. వేదాలు "సత్యం వద" అంటాయి. అంటే, "సత్యాన్ని పలుకు" అని. సత్యవ్రతాన్ని పాటించటం ఎంతటి మహనీయతకు దారితీస్తుందో హరిశ్చంద్రుని కథలోని వృత్తాంతాల వల్ల తెలియజేయబడింది. "ధర్మం చర" అంటే ధర్మాన్ని పాటించి. రెండు ముక్కలలో వేదాలు చెప్పిన దానిని మహాభారతంలోని పాండవుల వృత్తాంతం ద్వారా తెలియవస్తుంది. "మాతృదేవో భవ", "పితృదేవోభవ" అంటే తల్లిని, తండ్రిని దైవముగా ఆరాధించు - ఇది వేదవాక్కు. ఈ వైదిక నిర్దేశాలను భూతద్దంలో చూపినట్లు రామాయణంలో తెలుస్తుంది. వైదిక నియమాలైన నిగ్రహం, క్షమ, కరుణ, పవిత్రత వంటి ధర్మాలన్నిటినీ తమ తమ జీవితాలలో ఎందరో స్త్రీ పురుషులు పాటించి చూపుతారు. ఇవన్నీ పురాణేతిహాసాల ద్వారా తెలుస్తాయి. వాటిని వినటం వల్ల చదవటం వల్ల ఆ మహనీయులు పాటించిన ధర్మాలలో మనం కూడా నిమగ్నులమవుతాం. ఆ మహనీయులకు సంభవించిన కష్టాలు, విపత్తులు తెలిసినప్పుడు మన మనస్సు కరుణతో కరిగిపోతుంది. మన అంతరాంతరాలలోని సంశయాలు తొలగి మన దోషాలు క్షాళనమైనట్లు అనిపిస్తుంది. వారి అంతిమ విజయం, ఖ్యాతి మన మనస్సులలో ధర్మాన్ని నిలుపుతాయి. పురాణగాథలు చేసేదిదే.
మన దేశ చరిత్ర లిఖిత పూర్వకంగా లేదని అంటూ ఉంటారు. పురాణాలు ముమ్మాటికీ మన చరిత్రే. మానవుణ్ణి ఉన్నతునిగా చేయటం వాటి లక్ష్యం. అందువల్లే పురాణాలను చదవాలి. చరిత్ర చదువవలసిన అవసరముండటానికి కారణం అది పునరావృతమవటం. పరిస్థితులు, సంఘటనలు, తిరిగి తిరిగి రావటం సహజం. అందుచేత, గతం తెలిస్తే భవిష్యత్తును తెలుసుకోగలం. గతం నుండి గుణపాఠాలను కూడా నేర్చుకోగలం. ఒక పరిస్థితిని ఉపేక్షిస్తే యుద్ధానికో, సంఘవిచ్ఛిత్తికో నాగరికత ధ్వంసానికో దారి తీయగలదని చరిత్ర చెబుతుంది. అటువంటి పరిస్థితే మళ్లీ పొడచూపితే మనం ముందు జాగ్రత్తలు తీసుకొని ఈ దుర్ఘటనలు తప్పించుకోవచ్చు. పురాణాలకు ఇటువంటి చారిత్రకత ఉంది. ఇంకో ముఖ్యమైన అంశం - ప్రజలను సన్మార్గవర్తులను చేయటానికి ఉపకరించే సంఘటనల గురించే అవి చెబుతాయి. పురాణ పఠనం వలన కలిగే ప్రయోజనాలు - 1. పూర్వానుభవం ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనటానికి ఉపకరిస్తుంది 2. సద్వర్తన వలన సత్ఫలితాలను పొందిన సత్పురుషుల జీవితాల అధ్యయనం మనకు మార్గదర్శకమవుతుంది 3. దుష్టకార్యాలను చేసి ఎందరికో ఎన్ని విధాలుగానో కీడు చేసి తత్ఫలితాలను తామే ఇంకా ఎక్కువగా అనుభవించిన వారి జీవితాలను తెలుసుకోవటం మనం పెడదారిలో పడకుండా చేస్తుంది. మనిషి మనస్సును మలచి అతనికీ, సమాజానికీ ఉన్నతమైన జీవితాన్ని కలిగించటం పురాణాల ప్రధాన ప్రయోజనం.
పురాణాల్లో అక్కడక్కడ కల్పనలున్నాయేమో. అవి కూడా కాలక్రమేణా చోటుచేసుకున్న మార్పులు చేర్పులే. కానీ, వాటిలో ఏది కల్పనో, ఏది చేర్పో, ఏది వాస్తవమో ఎవరికి తోచినట్లు వారు విసర్జించటం సరి కాదు. అలా చేస్తే మూల కథ మిగలకపోవచ్చు. మనకు లభించిన రీతిలో పురాణాలను కాపాడుకోవటం మన విధి. కొన్ని కట్టుకథలుంటే ఏమి? ఎంత కాదన్నా పురాణాలు మనల్ని దైవాన్ని దగ్గరగా చేర్చి మనశ్శాంతినిస్తాయి కదా? నవీన శాస్త్రాలు సాధించలేని ప్రయోజనమొకటి పురాణాలకు ఉంది - అది పరమాత్మ తత్త్వం, భక్తి, ధర్మం - గురించి మనకు అధ్యయనం కల్పించటం. ధర్మాచరణపరాయణులు ఆనందంగా ఉంటారని, అధర్మ వర్తనులు దుఃఖిస్తారనీ, అటువంటి వారికి కూడా భగవంతుని క్షమ, భిక్ష, అనుగ్రహం లభిస్తాయనే భావాలు చదివే వారి మనసుల్లో గాఢమైన ముద్రవేయటం వల్ల పురాణాల లక్ష్యం తీరినట్లేగా?
పురాణానికి ఐదు లక్షణాలుండాలి.
1. సర్గ - సృష్ట్యాదికి సంకేతం
2. ప్రతిసర్గ - సృష్టి జరిగిన తరువాత కాలక్రమేణ ప్రపంచంలో వచ్చిన వికాసానికి సంకేతం
3. వంశ - అంటే ఆ వంశ చరిత్ర - ఒక తరం నుండి వేరొక తరానికి రావటం
4. మన్వంతరం - మానవాళి అంతటికీ ఆద్యులైన మనువులు, వెయ్యి యుగక్రమాలు (ఒక్కొక్క యుగక్రమంలో నాలుగు యుగాలు) వీటి చరిత్ర
5. వంశానుచరిత్ర - దేశపాలకుల వంశ చరిత్రలు అంటే సూర్యవంశము, చంద్రవంశము వంటి వివరాలు.
ఇవి కాకుండా అంతరిక్షం యొక్క వర్ణనా ఉండాలి. అంటే పురాణం చరిత్రగానే కాక భూగోళశాస్త్రంగా కూడా వ్యవహరిస్తుందన్నమాట.
ఇతిహాసమంటే?
ఇతి-హా-అసం - అంటే ఈ విధంగా జరిగింది అని అర్థం. మధ్యలో ఉన్న హా అంటే నిజంగానే, నిస్సంశయంగానే అని అర్థం. ఇతిహాసంలో యదార్థ వృత్తాంతమే ఉంటుంది కాని ఊహాగానానికి, కాల్పనికతకు తావులేదు. ఆ వృత్తాంతం జరిగిన కాలంలో వ్రాయించబడినది ఇతిహాసం. రాముడు జీవించి ఉన్నప్పుడు వాల్మీకి రామాయణాన్ని రచించాడు, వ్యాసుడు పంచపాండవులతో పాటు మహాభారతంలో చెప్పబడిన సంఘటనలను స్వయంగా చూశాడు. పురాణం కాబట్టి ప్రాచీన విషయాల గురించి వ్రాసినా ఆయన తన దివ్యశక్తితో ఆయా వృత్తాంతాలను స్మరణకు తెచ్చుకొని ఉంటారు. అయినా ఆ కథనంలోని వృత్తాంతాల యదార్థతను ఆయన సమకాలీకులు గ్రహించలేకపోయి ఉండవచ్చు. కానీ, రామాయణ మహాభారతాలు ఆ కోవకు చెందవు. వాటిని ప్రచురించినప్పుడే అప్పటి వారికి వాటిలోని వ్యక్తులు, వృత్తాంతాలు తెలుసు. మన సందేహాలన్నీ నివృత్తి చేయటానికి వాటి ఇతిహాసాలన్నారు - హా అన్న అక్షరం సత్యాన్ని స్థాపిస్తుంది.
ఇతిహాసాలను వేదాలకు సమానమైన ఘనత కలవి అంటారు. మహాభారతాన్ని పంచమవేదమని ఘోషించారు. వేదాలవల్లనే విదితమయ్యే పురుషుడు దాశరథిగా జన్మనెత్తినపుడు వేదాలు కూడా వాల్మీకి బిడ్డల వలె రామాయణ రూపంలో బయటపడ్డాయంటారు.
ప్రతి పురాణంలోనూ పెద్దవీ, చిన్నవీ అనేక ఉపాఖ్యానాలుంటాయి. ప్రతి కథా ధర్మానికి సంబంధించిన ఒక అంశానికి ప్రాధాన్యతనిస్తుంది. ఇతిహాసం ఆరంభం నుండి చివరి వరకు ఒకే కథ. మధ్య మధ్య వేరే కథలున్నా, వాటికి కూడా మూల కథతో ఏదో సంబంధముంటుంది. పురాణాలలో ఒక్కొక్క ధర్మం గురించి ఒక్కొక్క కథ అయితే ఇతిహాసంలో మొత్తం ధర్మమంతా మూల కథలోనే నిక్షిప్తమై ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి