శుభాశుభ లక్షణాలు కలగలుపుగా కనిపిస్తున్న కాననసీమల్లో రామలక్ష్మణులు ముందుకు సాగుతుండగా కబంధుడు కనిపిస్తాడు. నడుము నుండి మెడవరకు అన్ని అవయవాలనూ కుదించుకుని విశాలబాహువులతో ఆ అరణ్యంలో విహరిస్తున్న భయంకరాకారాన్ని చూచి లక్ష్మణుడు భయపడతాడు. కానీ, రాముడు ధైర్యంతో కబంధుడు వాళ్లిద్దరినీ కబళించబోయే వరకు వేచి చూస్తాడు. చివరకు ఆత్మరక్షణ కోసం రామలక్ష్మణులిద్దరూ చెరొక చేయిని ఛేదిస్తారు. కబంధుడు నిజంగా రాక్షసుడు కాడు. శాపగ్రస్తుడైన సుందరాంగుడు. బాహువులు తెగిపోగానే అతనికి స్వస్వరూపం గోచరిస్తుంది. తన పార్థివ శరీరాన్ని దహనం చేస్తే ఆపదలో ఉన్న రామలక్ష్మణులకు ఆప్తులైన మిత్రులను చేరే దారి తెలుపగలనని అంటాడు. అలాగే దహనం చెయ్యగానే అతడు దివ్యరూపంలో రామలక్ష్మణులకు సాక్షాత్కరించి పంపాతీరంలో ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుడనే వానరరాజున్నాడనీ, అతనితో సఖ్యం చేస్తే తమ కార్యం నెరవేరుతుందనీ సూచిస్తాడు. పరమ రమణీయమైన పంపాసరోవరం యొక్క ప్రాశస్త్యాన్ని పారవశ్యంతో వివరిస్తూ ఆ సరస్సు ఒడ్డునే ఉన్న మతంగవనాన్ని, ఆ వనంలో ఉన్న శబరిని కూడా వర్ణిస్తాడు. ఈ వర్ణనలు కబంధుని నోట వింటుంటే అతనికి తెలిసిన రహస్యాలు మరెవ్వరికీ తెలియవని తోస్తుంది.
అసలు కబంధ వృత్తాంతమే ఒక అద్భుతమైన గాథ. మరణించిన తరువాతనే అతనికి రహస్యాలన్నీ తెలుస్తాయి. పార్థివబంధం నుండి ముక్తి లభించిన తరువాతనే అతని దివ్యత్వం వ్యక్తమవుతుంది. ఈ ఘట్టాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఇది రామాయణ మహాయనంలో అనాహత నాదాన్ని వినిపించే మహత్తర సోపానంగా గోచరిస్తుంది. కబంధుడు రామలక్ష్మణులకు కనిపించే ముందు అతని శబ్దం వాళ్లకు వినిపిస్తుంది.
సంజజ్ఞే విపులః శబ్దః ప్రభంజన్నివ తద్వనం
సంవేష్టితమివాత్యర్థం గహనం మాతరిశ్వనా
దట్టమైన అరణ్యాన్ని చీల్చుకొని స్వయంగా వాయుదేవుడే ప్రవేశించినట్లుగా నలువైపులా విస్తరించిన మహారవం వినిపించిందట. మహారవంతో ప్రవేశించిన కబంధుడు మహానాదంతో నిష్క్రమిస్తాడు. అతని శరీరం నశించినా అతని నాదం నశించదు. అదే రామకథలోని అనాహత తత్త్వం. కైక వరాలలో మూలాధారాన్ని వదలిన కుండలినీ యానం పాదుకా పట్టాభిషేకంలో స్వాధిష్ఠానాన్ని చేరి, అత్రి-అనసూయ-అగస్త్యుల వంటి మహర్షుల మన్ననలతో మణిపూర మాధుర్యాన్ని ఆస్వాదించి, కబంధ శాపవిమోచనంతో అనాహత నాదాన్ని వింటుంది. మూలాధారంలోని శుద్ధ పార్థివ తత్త్వం స్వాధిష్ఠాన మణిపూరాల్లో నీటినీ, నిప్పునూ మాటు పెట్టుకొని అనాహత నాదంలో వాయుయానాన్ని అధిరోహిస్తుంది. ఇక చేరవలసిన విశుద్ధి చక్రంలోని ఆకాశతత్త్వం. దానికి కబంధుని అనాహతనాదమే దారి చూపిస్తుంది. పంపాసరోవరం-సుగ్రీవ మైత్రి-హనుమత్సమాగం అన్నీ పవన సంభవమైన పావన వాగ్విభూతికి సూచనలు. ఇది సామాన్యమైన వాక్సంపద కాదు, ఋషి భాషితమైన ఋష్యమూకం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి