రాగ సుధా రస పానము జేసి రాజిల్లవే ఓ మనసా
యాగ యోగ త్యాగ భోగఫలమొసంగే
ఓ మనసా! రాగములనే అమృత రసాన్ని గ్రోలి ప్రకాశించుము! యజ్ఞ యాగాదులు, త్యాగము, ఐహిక భోగములనిచ్చేది ఈ రాగామృతము. స్వరరాగ యుక్తమైన ఈ ఓంకార జనితమైన, శివతత్త్వముతో నిండిన నాదోపాసన మనలను జీవన్ముక్తులను చేయును అని త్యాగరాజు ఎఱిగినాడు, దానిని పానము చేసి ప్రకాశించుము.
నాదోపాసన యొక్క మహత్తును త్యాగరాజస్వామి పలికినట్లు ఇంకే వాగ్గేయకారులూ వివరించలేదు. నాదతనుమనిశం శంకరం, శోభిల్లు సప్తస్వర, నాదసుధారసంబిలను, నాదలోలుడై వంటి ఎన్నో కృతుల ద్వారా ఈ సంగీతోపాసన వైభవాన్ని మనకు తెలిపారు. అటువంటి కృతే రాగ సుధారస పానము జేసి. నాదోపాసన చేసిన వారికి సమస్త ఫలములు లభినుచునని ఆయన తెలిపారు. ఓంకారమునుండి ఉద్భవించిన సప్తస్వరాలు నాదోపాసనకు మూలము. పరమశివుడు ఈ నాదాన్ని తనువంతా కలిగిన వాడు. అందుకే నాదములో శివతత్త్వము జాగృతమై యున్నది అన్న భావనను త్యాగరాజస్వామి ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేశారు. నిజమే! భావయుక్తమైన సాహిత్యానికి రాగ యుక్తమైన స్వరములు శృతిలయలతో మేళవించి పాడితే కళాకారుడు తనను తానే మరవటం కాదు శ్రోతలకు కూడా అదే భావన కలిగిస్తాడు. ఆ తాదాత్మ్యత భక్తి మార్గంలో ప్రధానమైన ప్రాతిపదిక. ఎందరో మహాభక్తులు నామ సంకీర్తన ద్వారా జీవన్ముక్తిని పొందారు. ఆ సిద్ధిని పొందిన యోగి త్యాగరాజస్వామి నాదోపాసనా మార్గంలోని గొప్పతనాన్ని ఈ కీర్తన ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. జీవన్ముక్తి కన్నా మానవ జన్మకు సార్థకత ఏముంది? ముక్తి అంటే శరీరాన్ని వీడటం కాదు. మనమెవరో ఎఱిగి ఆ ఆనందంలో నిరంతరం జ్ఞాన సంపన్నులమై ఉండటమే. దానికి నాదోపాసన ఒక ప్రభావవంతమైన మార్గమని త్యాగరాజస్వామి పలికారు. ఆ మహానుభావునికి ఈ భూమి ఎంతో ఋణపడి ఉంది.
ఆందోళిక రాగంలోని ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి