త్యాగరాజస్వామి వారి ఘనరాగ పంచరత్న కీర్తనలలో అత్యంత ప్రజాదరణ పొందింది శ్రీ రాగం లోని ఎందరో మహానుభావులు. ఈ కృతి ఆయన ఎప్పుడు, ఎలా ఆలపించారు అన్న విషయంలో ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క రకంగా చెబుతున్నాయి. కానీ, 1927లో ఆంగ్లంలో ఎం.ఎస్. రామస్వామి అయ్యరు గారు రచించిన "Thiagaraja, a great musician saint" అన్న పుస్తకంలో ఉన్న సందర్భమే చాలా సముచితం అనిపించింది. ఆ వివరాలు.
కేరళలోని రామమంగళంలో 1798లో జన్మించి అతిపిన్న వయసులోనే సంగీతం నేర్చుకుని మహావిద్వాంసులైన వారు గోవింద మారర్ గారు. ఆయన శాస్త్రీయ సంగీతాన్ని ఆరు కాలాలలో పాడి ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆరుకాలాలలో ఆలపించటమంటే స్వరాలపై ఎంతటి పట్టుండాలో ఊహించండి. ఇప్పటి వారు మూడు కాలాలకే ఇబ్బంది పడతారు. అందుకే ఆయనకు షడ్కాల గోవింద మారర్ అని పేరు వచ్చింది. వీరు కీళ్లవాతంతో అంగవైకల్యం పొందినా, ఒక చేత తంబుర మరొక చేత కంజీర మీటుతూ ఆలపించిన ఘనులు. వీరు త్యాగరాజస్వామి వారి సమకాలీకులు. త్యాగయ్య సంగీత వైభవం గురించి విన్న ఆయన వారి గాత్రాన్ని ప్రత్యక్షంగా విని ఆనందించాలని కోరుకున్నారు. తిరువనంతపురం రాజాస్థానంలో పనిచేసే నల్లతంబి ముదలియార్ అనే ఆయన ఓపికగా మారర్ గారిని 1838వ సంవత్సరంలో తిరువాయూరు తీసుకువెళ్లారు. ప్రతిరోజూ లాగనే త్యాగరాజస్వామి వారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో శిష్యులను పిలిచి ఆలపించమన్నారు. శిష్యులు సాధన మొదలు పెట్టారు. ఆ ఊరి ప్రజలంతా అక్కడకు చేరుకున్నారు. గోవింద మారర్, నల్లతంబి ముదలియారులను వడివేలు అనే వ్యక్తి త్యాగరాజస్వామి వారి నివాసానికి తీసుకు వెళ్లారు. వారు త్యాగరాజస్వామి వారికి నమస్కరించి అక్కడ కూర్చున్నారు. శిష్యులు గానం ఆపేశారు. కొన్ని నిమిషాల మౌనం.
త్యాగరాజస్వామి వారు ఒకరు పాడమంటే పాడేవారు కాదు. తన అంతరాత్మ చెబితేనే ఆలపించేవారు. అందుకే ఆయనను శిష్యులు ఎప్పుడూ ఆలపించమనే సాహసం చేసేవారు కాదు. కానీ, ఆరోజు, గోవింద మారర్ గారు ఆయనను ఆలపించమని కోరారు. అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. త్యాగరాజస్వామి వారు కూడా ఆశ్చర్యపోయి "నన్ను పాడమని అడుగుతున్న వీరెవరు? అందులోనూ 79ఏళ్ల వృద్దుడనైన నన్ను ఆలపించమని అడిగే ధైర్యం ఈయనకు ఎక్కడిది" అని స్వరం పెంచి అన్నారు. వడివేలు అప్పుడు "మీకు ఆసక్తి లేకపోతే, మారర్ గారిని ఆలపించమంటాను" అన్నారు. "ఈ వాతరోగంతో బాధపడుతున్న వ్యక్తి ఏమి ఆలపించగలడు" అని ప్రశ్నించారు త్యాగయ్య. "కొద్దిగా" అని సమాధానం చెప్పారు వడివేలు. "సరే" అని తల ఊపారు త్యాగయ్య. అప్పుడు గోవింద మారర్ గారు ఆలాపన మొదలు పెట్టారు.
వ్రేళ్లు వంగిపోయిన మారర్ తన ప్రత్యేకమైన తంబురను తీసి శృతి చేశారు. ఆ తంబుర త్యాగయ్యను ఆకర్షించింది. మారర్ రాగమాలిక ఆలాపన చేశారు - తొలుత తోడి, తరువాత అసావేరి, కీరవాణి రాగాలలో తన మనోభావనలను, అక్కడున్న వారి మానసిక స్థితికి అనుగుణంగా ఆరు కాలాలలో అద్భుతంగా ఆలపించారు. తరువాత ఆయన అద్భుతమైన సంగతులతో పంతువరాళి రాగంలో ఆలపించారు. తరువాత జయదేవుని అష్టపది "చందన చర్చిత నీల కళేబర" అని షడ్కాలములలో అత్యంత తక్కువ గతిలో పాడటం మొదలు పెట్టి నెమ్మదిగా గతిని పెంచి అక్కడున్నవారిని మంత్రముగ్ధులను చేశారు, వారి కంట ఆనందభాష్పాలు అసంకల్పితంగా వెలువడ్డాయి. త్యాగరాజస్వామి వారు ధ్యానస్థితికి వెళ్లిపోయారు.
మారర్ గారి గానం ముగియగానే, త్యాగయ్య అద్భుతం, సుందరం, మధురం అని ఎన్నో విధాలా ఆయన గాత్రాన్ని ప్రశంసించారు. మీ సంగీతం వెండితీగలాగా మా రామునివలె మనోహరమైనది, వైభవమైనది అని ఆయనను కొనియాడారు. వడివేలు మీరు కొద్దిగా పాడతారు అని చెప్పి తప్పు చేశారు, మరి సంగీత గురువులు, సిద్ధులు. మీరు ఇకనుండి గోవింద మారర్ కాదు, గోవిందస్వామి అని అందరికి వినబడేలా పెద్దగా పలికారు. మారర్ గారు వినయంగా "నాకు గోవిందస్వామి కన్నా గోవిందదాసునిగా మిగలటమే ఇష్టం" అని చెప్పి త్యాగరాజస్వామికి నమస్కరించారు.
త్యాగరాజస్వామి వారిలో తొణికిన కించిత్ అహంకారం గోవింద మారర్ గానామృతంతో పటాపంచలైంది. ఆయన గళంలో "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" అన్న అద్భుత భక్తి సుమం శ్రీరామచంద్రుని పాదాల వద్ద వ్రాలింది. "సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము చేయువారెందరో మహానుభావులు" అని త్యాగయ్య తన కళ్లతో శిష్యులను గోవింద మారర్ వైపు చూపి వారికి చేతులెత్తి నమస్కరించారు. ఆనాడు ఇద్దరు నాదయోగుల సత్సంగములో తిరువాయూరు తరించింది.
తరువాత, త్యాగయ్య గోవింద మారర్ గారి వర్ణాల స్ఫూర్తితోనే మిగిలిన నాలుగు పంచరత్న కీర్తనలు రచించారని చరిత్ర చెబుతోంది. గొవింద మారర్ తరువాతి కాలంలో గోవిందస్వామిగా, ఆయన వర్ణాలు గోవిందస్వామి వర్ణాలుగా ఎంతో పేరొందాయి. గోవింద మారర్ తన జీవిత చరమాంకంలో పండరిపూర్ వెళ్ళి అక్కడి విఠలుని సేవలో తరించి గోవిందదాసునిగా పేరు మార్చుకుని 1843వ సంవత్సరంలో ముక్తిని పొందారు. తరువాత నాలుగేళ్లకు త్యాగయ్య రామునిలో ఐక్యమైనారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి