సంగీతత్రయంలో ఒక్కరైన ముత్తుస్వామి దీక్షితుల వారి తండ్రి గారి పేరు రామస్వామి దీక్షితులు. వీరు సంగీతకారులుగా, శాస్త్రజ్ఞులుగా ఎంతో పేరు పొంది తంజావూర్ మహారాజా వారి ఆదరం పొందారు. తంజావూరు సమీపంలోని తిరువారూరు (సద్గురువులు త్యాగరాజస్వామి వారి జన్మస్థలం) త్యాగరాజస్వామి వారి దేవస్థానంలో నాదస్వర కచేరీలు చేయటానికి రామస్వామి దీక్షితుల వారిని నియమించారు. కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతమైన రాగం హంసధ్వనిని కనిపెట్టింది రామస్వామి దీక్షితుల వారే. ఈ రామస్వామి దీక్షితుల వారు చిదంబరనాథస్వామి అనే సన్న్యాసి వద్ద శ్రీవిద్యా ఉపదేశమును పొందారు. ఎన్నో ఏళ్లు రామస్వామి-సుబ్బలక్ష్మి అమ్మాళ్ దంపతులకు సంతానం కలుగకపోవడంతో వారి వైదీశ్వరన్ కోయిల్ వెళ్లి అక్కడ బాలాంబికాదేవికి ఆగమోక్తంగా నవావరణ పూజలు, భజనలు చేస్తూ మండల దీక్ష చేశారు. 40వ దినమున రాత్రి రామస్వామి దీక్షితుల వారికి స్వప్నములో అమ్మవారు స్వప్నసాక్షాత్కారమిచ్చి ముత్యాలహారాన్ని ప్రసాదించింది. ఎంతో సంతోషించి ఆ దంపతులు తిరిగి తిరువారూరుకు వచ్చారు. 1776వ సంవత్సరం మార్చి 24న కృత్తికా నక్షత్రములో తిరువారూరు త్యాగరాజస్వామి వారికి వసంతోత్సవములు జరుగుతుండగా ఆ దంపతులకు పుత్రసంతానం కలిగింది. బాలాంబిక అనుగ్రహంతో కృత్తికా నక్షత్రములో జన్మించాడు కాబట్టి ఆ బాలునికి కార్తికేయుని నామంగా వారు ముత్తుకుమారస్వామి దీక్షితులు అని నామకరణం చేశారు.
ఆ తరువాత కొంతకాలానికి రామస్వామి దీక్షితుల వారు చెన్నై సమీపంలోని మణలి సంస్థానం వారి వద్ద సంగీత విద్వాంసులుగా పనిచేయటానికి తరలి వెళ్లారు. అక్కడికి ఒకసారి వారి శ్రీవిద్యా గురువైన చిదంబరనాథ యోగీంద్రులు వచ్చారు. వారికి రామస్వామి దీక్షితుల వారు, ఆయన కుమారులు నిరంతర శుశ్రూష చేశారు. యోగీంద్రులు రామస్వామి దీక్షితులతో తన కామ్యమొకటి తీర్చమని కోరారు. ఏమిటో తెలుపమని రామస్వామి దీక్షితుల వారు అభ్యర్థించగా "నీ కుమారుడైన ముత్తుస్వామిని నాతో కాశీయాత్రకు పంపండి" అని వారు కోరారు. దానికి రామస్వామి వారు కొంత జంకగా మణలి జమీందారు వెంకటకృష్ణ మొదలియార్ గారు వారికి రామాయణంలో దశరథుడు-విశ్వామిత్రుడు-రామలక్ష్మణుల వృత్తాంతాన్ని గుర్తుచేసి యోగుల వెంట కుమారుడిని పంపమని చెప్పగా రామస్వామి దీక్షితుల వారు అంగీకరించి పంపారు.
ఆ చిదంబరనాథ యోగీంద్రులు అప్పట్లో ఎంతో ప్రసిద్ధులు. దేశమంతటా ఆయనకు శిష్యులుండేవారు. కాశీలో యోగీంద్రులు ముత్తుస్వామి దీక్షితుల వారికి శ్రీవిద్యోపదేశం చేశారు. అలాగే యోగాభ్యాసము కూడా నేర్పించారు. శంకరభగవత్పాదుల అద్వైత సిద్ధాంత గ్రంథాలను శ్రవణము చేయించారు. కాశీలో దీక్షితుల వారి దినచర్య చాలా కఠినతరంగా జరిగింది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి గంగాస్నానం చేసి, యోగాభ్యాసము, అనంతరం శ్రీవిద్యార్చన చేసి యోగీంద్రుల వద్ద వేదాంత శ్రవణం చేశారు. తరువాత కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి, అన్నపూర్ణ దేవాలయాలకు వెళ్లి దర్శనం చేసుకునే వారు. అప్పుడు యోగీంద్రుల వారు శ్రీచక్రార్చన చేస్తున్నప్పుడు వేదం పఠించటం, శాస్త్రీయ సంగీత జ్ఞానం చేయటం, వీణావాదనం చేయటం నిత్యవిధి. సాయంత్రం మరల దేవాలయ దర్శనం, వేద సంగీతాభ్యాసం, భజనలు. ఈ విధంగా కొన్నేళ్లు గడిచాయి.
ఒకరోజు చిదంబరనాథ యోగీంద్రులు దీక్షితుల వారిని అన్నపూర్ణాంబిక దేవాలయానికి తోడ్కొనివెళ్లి ఆదేవికి దీక్షితులవారిపై పరిపూర్ణమైన అనుగ్రహం కలిగినదని, ఆ తల్లి ఆతని కాపాడి తుదకు మోక్షము కూడా ఇస్తుందని, ఆమెను జీవితాంతం పూజించమని చెప్పారు. మరునాడు ప్రాతఃకాలమున దీక్షితులవారు గంగాస్నానం చేయుటకు వెళ్లే సమయంలో యోగీంద్రులు వారితో "మనం విడిపోయే సమయమాసన్నమైంది. నీవు స్వస్థలానికి వెళ్ళి తల్లిదండ్రులను, సోదరులను కలుసుకో" అని చెప్పి "గంగానదిలో దిగినప్పుడు నాలుగైదు అడుగులు వేసి అక్కడ నీకాలికేమి తగిలితే దానిని తీసుకుని రా" అని ఆజ్ఞ ఇచ్చారు. దీక్షితుల వారికి గంగానదిలో వీణ దొరికింది. దానిపై దేవనాగరిలో "రామ" అని రాసి ఉంది. దానిని తీసుకువచ్చి దీక్షితుల వారు యోగీంద్రులకిచ్చారు. యోగీంద్రులు ఆ వీణను తన ఆశీస్సులతో మరల దీక్షితులవారికిచ్చి "ఇది గంగాదేవి అనుగ్రహ ప్రసాదము. నువ్వు చాలా గొప్ప వైణికుడవు కాగలవు" అని ఆశీర్వదించారు. అవే ఆయన చివరి మాటలు. యోగీంద్రులు గంగానదిలో మునిగి ప్రాణత్యాగం చేశారు. ఆయన దేహాన్ని దీక్షితులవారు హనుమాన్ ఘాట్‌లో సమాధిచేశారు. అక్కడ దీక్షితుల వారు స్థాపించిన లింగం ఇప్పటికీ ఉంది. గంగానదీ జలాలలో లభించిన వీణ నేటికీ దీక్షితుల వారి వంశీకుల వద్ద ఉంది.
ఇదీ ముత్తుస్వామి దీక్షితుల వారు-చిదంబరనాథ యోగీంద్రుల అద్భుత వృత్తాంతం.
(చిత్రాలు దీక్షితుల వారికి గంగానదిలో లభించిన వీణ, కాశీలోని చిదంబరనాథ యోగి సమాధి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి