మనసులోని మర్మమును తెలుసుకో! మానరక్షకా! మరకతాంగ! నా
ఇనకులాప్త నీవేగాని వేరెవరు లేరు ఆనంద హృదయ!
భక్తుల గౌరవమును కాపాడే, మరకతము వంటి దేహపు ఛాయగల శ్రీరామా! నా మనసులోని రహస్యమును తెలుసుకొనుము. సూర్యవంశ తిలకుడవు, ఆనందహృదయుడవైన శ్రీరామ! నీవు తప్ప నాకు వేరెవ్వరు లేరు. పరమశివునిచే నుతించబడిన శ్రీరామా! ఇంతకు మునుపు ప్రేమగల ప్రభువుగా నన్ను వాత్సల్యముతో ఏలుకున్నది గొప్ప కాదు, కనికరము చూపించి ఈ రోజు చేయిపట్టుకు నడిపించు.
సృష్టి స్థితి లయ కారకుడైన పరమాత్మకు మానవ జన్మ ఎత్తిన ఈ జీవి మనసులోని మాట తెలియదా? అసలు ఆ మనసు, సంకల్పం, కోరిక అన్ని కూడా ఆయన ప్రేరితమైనవే కదా! మరి ఆయనకు మనం చెప్పేదేమిటి? ఇక్కడ చెప్పవలసింది విశ్వాత్ముడైన పరమాత్మ తత్త్వాన్ని గుర్తించి దానితో అనుసంధానం చేసుకొని ఈ భవసాగరాన్ని దాటే శక్తిని పొందటం. అదే వాగ్గేయకారుల కృతులలో సింహభాగం ఉన్న భావన. త్యాగరాజస్వామి శ్రీరామునితో ఎన్ని రకాలా భావనలను వ్యక్తపరచారో! వాటిలో మనసులోని మర్మమును తెలుసుకో అన్న కృతిలో "ఇంతకు మునుపు నన్ను కాపాడవు, అదేమీ గొప్ప కాదు, ఇప్పుడు నన్ను చేయిపట్టుకు నడిపించు" అని ప్రశ్నించటంలో అంతరార్థం మానవునికి ఆధ్యాత్మికయానంలో కలిగే అనేక రకాల స్పందనలకు అక్షర రూపం ఇవ్వటమే. పిల్లలు తల్లిదండ్రులు గతంలో వారి ఆనందం కొరకు చేసిన పనులను, కొన్న వస్తువులను గుర్తు పెట్టుకొని అది చాలు అన్న భావనలో ఉండరు, మళ్లీ మళ్లీ తల్లిదండ్రులు అలానే చేస్తూ ఉండాలని కోరుకుంటారు. అలాగే, భగవంతుని మాత్రమే నమ్ముకున్న భక్తునికి ఆ స్వామి మళ్లీ మళ్లీ కాపాడలన్న భావన బలంగా ఉంటుంది. దానినే త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా వ్యక్తపరచారు. ఈ కృతిలో ముఖ్యంగా మనం గమనించవలసింది "నీవే గాక వేరెవెరు లేరు" అన్న శరణాగతి.
హిందోళ రాగంలోని ఈ కృతిని సుగంధా కాలమేఘం గారు ఆలపించారు.
చాలా మంచి వివరణ. అంతే కదా... ఇంతవరకు చేసింది చేసినా, ఇప్పుడు నాకు దారి చూపు అని ఆడగటం భక్తుల హక్కు. బాగుంది భావన. ఈ కృతిని "వారము" అనే రాగంలో ఉందని కొన్ని చోట్ల అన్నారు.నేను హిందోళం లోనే విన్నాను.
రిప్లయితొలగించండి