వేదాలలో ఏ చిన్నపొరపాటూ రాకుండా ఉండటానికి మన పూర్వీకులు ఎన్నో పద్ధతులు అవలంబించారు. ఇవేవీ లిఖితరూపంలో కూడా లేవు. వేదమంత్రాల వలన పరిపూర్ణమైన లాభం పొందాలంటే ఆ మంత్రోచ్చారణలో ఏ పొరపాటూ రాకుండా ఉండాలి. అంటే, మంత్రాలను వల్లించేటప్పుడు ఏ పదమూ మారకూడదు, నియమానికి వ్యతిరేకంగా స్వరమూ మారకూడదు. అందువల్లే వేదాధ్యయనంలో అనేక కట్టుబాట్లున్నాయి.
ఒక్కొక్క పదాన్ని ఎంత కాలం పలకాలో తెలిసేటట్లు మాత్రలు కల్పించారు. మాత్ర అంటే ఒక్కొక్క హ్రస్వ అచ్చును పలికే కాలం. శరీరంలో ఏ భాగంలో ప్రకంపన కలగాలో, ఏ విధంగా శుద్ధమైన శబ్దం వస్తుందో తెలుపటానికి శ్వాసకు సంబంధించిన నియమాలను శీష అనే వేదాంగములో చెప్పారు. తైత్తిరీయోపనిషత్తు ఈ "శీక్ష"తో ప్రారంభమవుతుంది.
శీక్షాం వ్యాఖ్యాస్సామః వర్ణ స్వరః మాత్రాబలం సామసన్తానః
(శీక్ష, వర్ణము, స్వరము, మాత్ర, బలము, సామము, సన్తానములతో సంబంధము కలది వేద మంత్రోచ్చారణ)
ఒక్కొక్క మంత్రాన్ని వివిధ రీతులలో వివిధ గతులలో వల్లించటం నిర్దుష్టతకు దోహదం చేస్తుంది. ఇవి వాక్య, పద, క్రమ, జట, మాల, శిఖ, రేఖ, ధ్వజ, దండ, రథ, ఘన వంటివి. కొందరు పండితులను మనం ఘనాపాఠి అంటాము. అంటే, వాళ్లు వేదాలను ఘనమనే పద్ధతిలో వల్లించగల నిష్ణాతులని అర్థం. వారు వేదాన్ని వల్లిస్తుంటే పదాలను అనేకరకాలుగా ముందుకు వెనుకకు మారుస్తున్నది కనిపెట్టవచ్చు. ఇది వినటానికి సొంపుగా ఉండటమే కాక, మనస్సుకు ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తుంది. వేదమంత్రాలకు సహజంగానే గల శోభ ఇంకా పెంపొందినట్లు అనిపిస్తుంది. క్రమం, జట, శిఖ, మాల పద్ధతులలో వేదాలను వల్లించినా అలాగే అనిపిస్తుంది.
ఈ పద్ధతుల ముఖ్య ఉద్దేశం: అనాదిగా వస్తున్న పదాల అర్థం గాని, ఉచ్చారణ గాని మారకుండా పొరపడకుండా ఉండటమే.
మంత్రాలను ఒక వాక్యంలా వల్లె వేయటాన్ని వాక్య పాఠం లేదా సంహిత పాఠం అంటారు. ఒక వాక్యరూపంలో మంత్రాలను వల్లించేటప్పుడు కొన్ని కొన్ని పదాలను కలపవలసివస్తుంది. మంత్రాలలోని ప్రతి పదాన్నీ దేనికది విడిగా వల్లించటాన్ని పదపాఠమంటారు. పదపాఠంలో వాక్యాలకు పదవిభజన జరుగుతుంది. దీని వల్ల వేదాధ్యయనం చేసే వారికి ప్రతి పదమూ తెలుస్తుంది. దీని తరువాతది క్రమ పాఠం. ఈ పద్ధతిలో మొదటి పదాన్ని రెండవ పదానికి, రెండవ పదాన్ని మూడవ పదానికి చేర్చుకుంటూ వాక్యం పూర్తయ్యే వరకూ వల్లిస్తారు. ఈ పద్ధతి వల్ల విద్యార్థికి ప్రతి పదమూ అర్థమవటమే కాక రెండేసి పదాలను కలిపి ఏ విధంగా వల్లించాలో, ఆ కలపటంలో వచ్చే మార్పులేమిటో కూడా తెలుస్తాయి.
కొన్ని ప్రాచీన శాసనాలలో, ముఖ్యంగా దానాలకు సంబంధించిన వాటిలో, ఆ సంబంధిత వ్యక్తుల పేర్ల చివర "క్రమవిత్" అన్న పదముంటుంది. వేదవిత్ వలెనే క్రమవిత్ అంటే ఆ వ్యక్తికి క్రమ పద్ధతిలో వల్లించటం వచ్చని అర్థం. ఇటువంటి శిలాశాసనాలు దక్షిణ భారతంలో కోకొల్లలు.
జటాపాఠంలో మొదటి పదాన్ని, రెండవ పదాన్ని కలిపి వల్లిస్తారు. ఆ తరువాత రెండు పదాలను తిరగవేసి వల్లెవేస్తారు, తరువాత మామూలు వరుసలో చెబుతారు. క్రమపాఠంలో పదాల క్రమం 1-2, 2-3, 3-4, 4-5 ఇలా ఉంటే, జటాపఠంలో 1-2-2-1-1-2 ఇలా ఉంటుంది. ఈ క్రమాన్నే ముందుకు వెనుకకు వల్లిస్తూ ఉంటారు. శిఖాపాఠంలో మూడేసి పదాలను ఈ విధంగా కలుపుతారు.
ఘన పాఠం వీటి కంటే కష్టం. దీనిలో క్రమం 1-2-2-1-2-3-3-2-1-1-2-3;2-3-3-2-2-3-4-4-3-2-2-4 ఇలా ఉంటుంది. ఇవికాక ఇంకొక అయిదు పద్ధతులున్నాయి. పదాల వరుసను మారుస్తూ, రకరకాల జోడింపులు చేస్తూ వల్లెవేస్తారు.
ప్రాణాలను కాపాడే మందును ప్రయోగశాలలో ఎంత జాగ్రత్తగా భద్రపరస్తారో విశ్వకల్యాణానికి ఉపయుక్తమయ్యే వేదాలకు ఏవిధమైన మార్పు, క్షీణింపూ కలుగకుండా, లిఖితపూర్వకంగా కూడా కాకుండా, కేవలం వల్లె వేయించే పద్ధతులలో మన పూర్వీకులు వేదాలను భద్రపరచారు. పదాలను ముందుకు వెనుకకు వల్లె వేసేటప్పుడు విద్యార్థి స్వరాలకేమాత్రమూ భంగం రానీయకూడదు. పదాల సమ్మేళనం స్వరాలనే విధంగా ప్రభావితం చేస్తుందో కూడా విద్యార్థి నేర్చుకోవాలి.
మంత్రంలోని పదాలు సహజమైన వరుసలో వస్తాయి గనుక సంహితపాఠాన్ని, పదపాఠాన్ని ప్రకృతి పాఠమంటారు. మిగిలిన వాటిని వికృతి పాఠమంటారు. క్రమపాఠంలో వరుసగా 1-2-3 వలె రావు, కానీ 2 తరువాత 1, 3 వెనుక 2 తిరగవేసి వల్లించనక్కరలేదు. అందువల్ల దానిని వికృతి అనలేము. వికృతులు ఎనిమిది రకాలు:
జటా మాలా శిఖా రేఖా ధ్వజో దండో రథో ఘనః
ఇత్యష్టౌ వికృతయః ప్రోక్తా క్రమ పూర్వా మహర్షిభిః
పదాన్నీ, శబ్దాన్నీ, ఉచ్చారణను, స్థాయిని, వాటి వాటి సమ్మేళనాలను బట్టి వేదాలలో స్వచ్ఛంగా పరిరక్షించటం కోసమే వల్లె వేయించటంలో ఈ క్లిష్టమైన పద్ధతులు వచ్చాయి. రకరకాలుగా పదాలను పునశ్చరణ చేయటం వల్ల వాటి సంఖ్యను, నిర్మలత్వాన్ని కాపాడుకున్నారు. ఎంత క్లిష్టమైన పద్ధతిలో వల్లె వేస్తే అంత పుణ్యమని కూడా నిర్దేశించి, విద్యార్థులు వాటిని నేర్చుకునేట్లు చేశారు.మన పూర్వీకులు వేదమంత్రాల స్వచ్ఛతను నిలపటానికి అన్ని పద్ధతులనూ అవలంబించారు. అందువల్ల కాలక్రమేణా ఉచ్చారణలో కొంత మార్పులు వచ్చాయి. అవి ఎంత కాలంలో వచ్చాయి అంటూ ఆధునికులు పరిశోధనలు చేయటం సమర్థనీయం కాదు. వీటి వల్ల సత్యాన్వేషణలో ఒక్క అడుగు కూడ ముందుకు పడదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి