21, ఆగస్టు 2020, శుక్రవారం

నా జీవాధార - త్యాగరాజస్వామి కృతి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గానంలో

 

త్యాగయ్య చిత్రంలో  బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన కృతులలో నా జీవాధార ఎంత ఉత్కృష్టమైనదో చెప్పలేను. బిలహరి రాగం ఆరోగ్యదాయిని అని కర్నాటక సంగీత విద్వాంసులు ఎన్నో మార్లు నిరూపించారు. దానికి ఆద్యం ఈ త్యాగయ్య కృతికి వేదికయే. అకాల మరణం చెందిన ఒక వ్యక్తి కుటుంబం యొక్క దుఃఖాన్ని చూసి కరిగిపోయి త్యాగరాజస్వామి తన నాదోపాసనను ధారపోసి ఆ రామచంద్ర ప్రభువును ప్రార్థించగా సమస్త జీవులకు ఆధారమైన ఆ పరబ్రహ్మం కరుణించి త్యాగయ్య భక్తికి మెచ్చి ఆ వ్యక్తిని పునర్జీవునిగా చేశారు. 

త్యాగరాజస్వామి భావాన్ని, బిలహరి రాగంలోని మహత్తును యథాతథంగా అద్భుతమైన ఉపాసనా రీతిలో ఆలపించి త్యాగయ్య పాత్రకు జీవం పోశారు. ఆలాపనలో ఎంతటి ఆర్ద్రత, భక్తి, శరణాగతి ఉన్నాయో వర్ణించనలవి కానిది. రామునిపై త్యాగరాజస్వామికి గల విశ్వాసాన్ని పరిపూర్ణంగా ఈ కృతి ఆలాపన ద్వారా బాలసుబ్రహ్మణ్యం గారు ఆవిష్కరించారు. ఒక గాయకుని యొక్క ఔన్నత్యాన్ని, ప్రతిభను పతాక స్థాయిలో ఆవిష్కరించాలి అంటే దానికి బాపు వంటి దర్శకులు, మహదేవన్ వంటి సంగీత దర్శకులు కావాలి. ఆ కృతి చివరి పంక్తి యొక్క ఆలాపన రాముడు సాక్షాతకరించాడా అన్న రీతి ఉంటుంది. 

ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారు జీవన్మరణాల మధ్య చేస్తున్న పోరాటంలో ఆయన ఆలపించిన ఈ గీతం ఆయన మనసు ఆలపించి ఆ శ్రీరామచంద్రుడు కరుణించి మనకు గానామృతాన్ని పంచుతున్న బాలు గారు కోలుకునేలా చేయాలని ప్రార్థిస్తూ...

నా జీవాధార! నా నోము ఫలమా!

రాజీవ లోచన! రాజ రాజ శిరోమణి!

నా జూపు ప్రకాశమా! నా నాసికా పరిమళమా!
నా జప వర్ణ రూపమా! నాదు పుజాసుమమా! త్యాగరాజనుత!

కర్మేంద్రియాల ప్రతిస్పందనలను, రసానుభూతులను, కర్మానుష్ఠానముల ఫలాన్ని, జపము చేసే అక్షరాల రూపాన్ని, పూజించే పూవులను రామునిగా భావించి రమించిన యోగి కాకర్ల త్యాగరాజస్వామి. ఆ భావంతో ఈ విధంగా రాముని నుతించి అకాల మృత్యువు పాలైన ఓ వ్యక్తిని  బ్రతికించింది ఓ రెండు వందల సంవత్సరాల లోపే. అదీ భక్తి యొక్క మహిమ. ఆ రామనామాన్ని కోట్లాది మార్లు జపించిన తరువాతే త్యాగయ్య కీర్తనలు వ్రాయటం మొదలు పెట్టారు. అందుకే అవి శాశ్వతమైనాయి. రమయనే సుమర్మము రామయనే శర్మము!

త్యాగయ్య భావనను బాపు గారు ఎంత పవిత్రంగా ఆవిష్కరించారో, బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత ఆర్తితో, సర్వస్య శరణాగతితో పాడారో వినండి!

https://www.youtube.com/watch?v=w0oUr1bDlHE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి