12, ఆగస్టు 2020, బుధవారం

శంభో మహాదేవ శంకర గిరిజా రమణ - త్యాగరాజస్వామి


 శంభో మహాదేవ శంకర గిరిజా రమణ

శంభో మహాదేవ శరణాగత జన రక్షక
అంభోరుహ లోచన పదాంబుజ భక్తిం దేహి|

పరమ దయాకర మృగధర గంగాధర ధరణీ
ధర భూషణ త్యాగరాజ వర హృదయ నివేశ
సురబృంద కిరీట మణివర నీరాజిత పద గో
పురవాస సుందరేశ గిరీశ పరాత్పర భవహర

శంభో! మహాదేవా! పార్వతీపతీ! శరణాగత జనులను రక్షించే వాడా! పద్మముల వంటి నేత్రములు కలవాడా! నీ చరణకమలముల యందు భక్తిని ప్రసాదించుము. పరమ దయాకరా! జింకను చేతియందు కలవాడా! గంగను శిరసున ధరించినవాడా! భూమిని ధరించినట్టి శేషుడు అలంకారముగా కలవాడా! త్యాగరాజుని హృదయము నివాసముగా కలవాడా! దేవతా సమూహము యొక్క కిరీటములలోని మణుల కాంతులచే నీరాజనము ఇవ్వబడిన పాదములు కలవాడా! గోపురమునందు వెలసిన సుందరేశా! గిరీశా! పరమేశ్వరా! సంసార చక్రములో పాపములను హరించే పరమశివా! నీ చరణకమలముల యందు భక్తిని ప్రసాదించుము.

(మృగధరుడు అంటే చంద్రుడని నిఘంటువు ప్రకారం అర్థం, కానీ, మృగము అంటే జింక. జింక చేతిలో కలవాడన్న అర్థమే సరైనది అనిపించింది. గోపురము అనగా తమిళనాడులోని కోవురు. అక్కడ సుందరేశ్వరుడంటే త్యాగరాజస్వామికి ఎంతో భక్తి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి