ప్రముఖ వాగ్గేయకారులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారు దుర్గాదేవిని శ్రీరంజని రాగంలో తిరువారూరు సమీపంలోని కధిరమంగళం వనదుర్గామాతను కొనియాడుతూ ఓ అద్భుతమైన కృతిని రచించారు. ఈ కృతి దుర్గాదేవి మూల మంత్రం యొక్క బీజాక్షరాలతో ఆరంభమవుతుంది. ముత్తుస్వామి దీక్షితుల వారు సిద్ధపురుషులు. మంత్రసాధన చేసి, అమ్మను దర్శించి ఎన్నో కృతులను రచించారు. ఇది కూడా అటువంటిదే. దాని వివరాలు:
శ్రీ దుం దుర్గే శివ సంసర్గే చిద్రస వర్గే స్థిరే ఆపవర్గే శ్రీ వనదుర్గే
ఓ వనదుర్గా మాతా! శివుని సహచారిణీ! సచ్చిదానంద స్వరూపిణీ! శాశ్వతమైన సుఖాలను ప్రసాదించే తల్లీ! వివిధరకములైన వాద్యముల నాదములతో ఆనందించే తల్లీ! వీణావాదనము చేసే తల్లీ! నీవు సర్వాంతర్యామివి! భేదింప శక్యము కావు! మనోజ్ఞమైన రూపము కలదానవు! శ్రీమహాలక్ష్మిని అలరించే తల్లీ! దోషరహితవు! అమ్మా! నీకు జయము! కరుణకు నిలయము నీవు, ఈ కలిదోషాలను హరించే తల్లివి, చేతిలో వికసించిన కమలము కలదానవు, అడవులలో నివసించే తల్లివి! చిగురులవలె మృదువైన పాదములు కల తల్లివి! స్వర్ణకంకణములు ధరించిన మాతవు! కార్తికేయుని తల్లివి! దయామూర్తివి, విజయవు, మాకు అభయమునిచ్చే తల్లివి! మృదువైన స్వభావము కల అమ్మవు! ఆరు మతములకు మూలము మరియు కాలానివి నీవు! అంతటా ఉన్న అమ్మవు!
దీక్షితుల వారి సాహిత్యంలో ఉండే దేవతా వైభవం మహోన్నతమైనది. పూర్తిగా దేవతానుగ్రహం పొంది, ఆ దేవతా స్వరూపంతో అనుసంధానమై ఆయన సంకీర్తనలను రచించారు. అందుకే ఆయన రచనలలో పరిపూర్ణత్వం కనబడుతుంది. ప్రస్తుత కాలంలో వనదుర్గ ఆలలయాలు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, మన సనాతన వాఙ్మయం ఈ వనదుర్గ మన కర్మభూమిలో అంతటా కొలువబడినదని చెబుతున్నాయి. తమిళనాడులోని కధిరమంగళం, తెలంగాణాలోని ఏడుపాయల, కర్ణాటకలోని దేంతడ్క, కేరళలోని పోయిల్కవే మొదలైన ప్రాంతాలలో వనదుర్గ వైభవంగా కొలువబడుతోంది. ఈ క్షేత్రాలు మహిమాన్వితమైనవి.
ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి | తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||
కాత్యాయనీ దేవిని తెలుసుకుందాము. దాని కోసం ఆ కన్యకుమారి యైన దుర్గాదేవిని ధ్యానిద్దాం. ఆ దుర్గాదేవి మనకు ప్రేరణ నిచ్చుగాక! శ్రీరంజని రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి