త్యాగరాజస్వామి వారి భక్తి సామ్రాజ్యం అనంతమైన ఆయామం గల క్షీరసాగరం వంటిది. అందులో తోడిన కొద్దీ రామామృతము, తరచి తరచి చూసిన కొద్దీ మహాద్భుతమైన భావసంపద. అనుక్షణం అత్యంత కఠినమైన పరీక్షలను దాటుతూ రామభక్తిలో రమించి తరించిన యోగి త్యాగయ్య. ఒక పక్క పేదరికం మరొక పక్క విద్యకు గుర్తింపుగా వచ్చే సంపదలు..ఈ రెండూ కూడా ఆయన శీలాన్ని ఎంతో పరీక్షించినవే. అయినా, అకుంఠిత రామభక్తితో వాటిని జయించగలిగారు. కడుపు కాలుతున్నప్పుడు భక్తిలో తాదాత్య్మం చెందాలంటే ఎంతటి నిగ్రహశక్తి ఉండాలో ఊహించండి. రామయ్యే వచ్చి త్యాగయ్యను పట్టుకు ముందుకు నడిపించాడు. కానీ, ఆ ఆలంబన ఆయనకు సులభంగా లభించలేదు. జ్ఞానంలో మొదటి మెట్టుగా రాముని కీర్తించటం, వర్ణించటం, తరువాత నిందించటం, ఆ తరువాత వేడుకొనటం, చివరకు పరబ్రహ్మగా దర్శించి తరించి దాటిపోయారు త్యాగయ్య. ఆయన జీవిత ప్రయాణంలోని ప్రతి ఒక్క అనుభూతి కూడా ఆయన కీర్తనలో మనకు ప్రత్యక్షంగా అక్షర రూపం పొందినవే. అవును కదా, మనకు కూడా ఇటువంటి భావనలు కలిగాయి కదా అనిపించేలా ఆయన కృతులు ఉంటాయి. మన హృదయ స్పందనలు, మన బుద్ధి చాంచల్యాలు, మన మనోవికారాలు, శాంతాశంత వైనాలు ఆధ్యాత్మిక సాధనలో శుద్ధి చేయబడి విద్యుల్లేఖయై భాస్వరించే ఆత్మజ్యోతి యొక్క వెలుగు రేఖలు ఆయన కృతులు. నిరాకార అక్షర పరబ్రహ్మానికి సాకార ప్రతిమలు ఆయన కృతులు.
క్షీర సాగర విహార అపరిమిత ఘోర పాతక విదార
క్రూరజన గణ విదూర నిగమ సంచార సుందర శరీర!
క్షీర సాగరంలో విహరించే స్వామి అపరిమితమైన ఘోరమైన పాతకాలు నాశనము చేసేవాడు, క్రూరజన సమూహానికి దూరంగా ఉండేవాడు, వేదాలలో సంచరించేవాడు, సుందరమైన శరీరము కలవాడు ఆ రముడు అని త్యాగయ్య తన కృతిలో పలికారు. పరబ్రహ్మ తత్త్వము పాతకాలను ఎలా దూరం చేస్తుంది? నామంలో ఉంది అసలైన కీలకం. శరీరంలోని అణువణువును శుద్ధి చేసి గ్రంథులను చేతనం చేసి, పాపసంచయాల నుండి ఆత్మకు ముక్తిని కలిగించేది నామము. ఆ రాముని నామాన్ని అనేక విధాల తలచిన వారిని ఎలా తరింపజేశాడో అన్నది రామాయణంలో అడుగడుగునా మనకు తెలుస్తుంది. ఆ సారమంతా నాలుగు పదాలలో క్రోడీకరించారు త్యాగయ్య. ఆ తరువాత నిగమ సంచారుడు అన్నారు. వేదాలలో సంచరించమేమిటి? దైవిక శక్తి మంత్రద్రష్టల నోట శబ్ద రూపంగా వెలువడటమే వేదరూపం. అనగా విశ్వవ్యాప్తమైన శక్తి అవసరాన్ని బట్టి ఋషి యొక్క సాధనను బట్టి వారి జన్మకారణాన్ని బట్టి, వారి పదవిని బట్టి అపౌరుషేయంగా వెలువడినవి. ఆ శక్తే సత్యం. ఆ సత్యమే పరబ్రహ్మము. ఆ శబ్ద ప్రవాహంలో సంచరించే పరమాత్మ తత్త్వమే రాముడు అని త్యాగరాజస్వామి వేదవేదాంతాల సారాన్ని మనకు తెలియజేశాడు. వెంటనే, సుందర శరీర అన్నారు. అంతటా ఉన్న పరబ్రహ్మము అద్భుతమైన రూపాన్ని పొంది భక్తి సామ్రాజ్యములోని ఆత్మానురక్తులను అలరించాడు. దీనిని అనుభవించి రాశారు కాబట్టే త్యాగయ్య భవసాగర తారణంలో సఫలమైనాడు, ముముక్షువుగా నిలిచారు.
నిరంతరం సంగీత సాధనలో రాముని గురించి పాడుతూ, ఆ కంపనల ద్వారా పాపసంచయాలను తొలగించుకొంటూ, మహదానందాన్ని పొంది జీవాత్మను పరమాత్మతో ఏకం చేసి మానవ జన్మను సార్థకం చేసుకున్న భక్తాగ్రేసరులు త్యాగరాజస్వామి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి