RightClickBlocker

5, అక్టోబర్ 2015, సోమవారం

కేయూరాణి న భూషయంతి పురుషం - వాగ్భూషణమే సుభూషణమునీతి శతకాన్ని మొదట సంస్కృతంలో భర్తృహరి రచించితే దానిని కొందరు కవులు తెలుగులోకి అనువదించే ప్రయత్నం చేశారు. అందులో ఏనుగు లక్ష్మణ కవి ప్రసిద్ధులు. 20వ శతాబ్దం ఆరంభానికి చెందిన ఏనుగు లక్ష్మణ కవి ఈ సుభాషితాలను మూలాన్ని సంపూర్ణంగా ప్రతిబింబించేలా అనువదించారు. భర్తృహరి సుభాషితాలలో నాకిష్టమైనది కేయూరాణి న భూషయంతి అనే శ్లోకం. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు సంస్కృతము రెండవ భాష. దానిలో భాగంగా సుభాషితాని అని ఒక పాఠ్యాంశం ఉండేది. దాదాపు ఇరవైఏళ్ల క్రితం చదివింది. బాగా మనసులో పాతుకు పోయింది.

సంస్కృత మూలం:

కేయూరాణి న భూషయంతి పురుషం  హారాః న చంద్రోజ్జ్వలాః
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతేऽఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం

దీనిని ఏనుగు లక్ష్మణకవి గారు తెలుగులో ఉత్పలమాలగా ఆవిష్కరించారు:

భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తార హారముల్
భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు గావు పురుషుని భూషితు జేయు పవిత్రవాణి వా
గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్

అర్థం:

చేతులకు ఆభరణాలు (భుజకీర్తులు), మెరిసే హారములు, అలంకరించబడిన కేశములు, పుష్పములు, సుగంధ జలములతో స్నానములు మనిషికి నిజమైన ఆభరణములు కావు. అతని పవిత్రమైన మాటలే నిజమైన అలంకారము, అదే అత్యుత్తమైనది. మిగిలినవన్నీ నశించును, కాని మనిషి యొక్క మంచి వాక్కు మాత్రం ఎప్పటికీ నిలుస్తుంది.

వివరణ:

సుభాషితాలు మానవుని జీవన విధానానికి మార్గదర్శకాలు. మనసు దారి తప్పకుండా ఉంచే కాపలాదార్లు. ఈ సుభాషితం నేటి సమాజానికి ఎంత ఉపయోగకరమో ఆలోచించండి. చక్కగా దుస్తులు వేసుకొని అలంకరించుకున్న పిల్లలను, పెద్దలను చూస్తున్నాము, కానీ వారు నోరు విప్పితే? చెప్పనక్కరలేదు. ఎన్నో డిగ్రీలు పొందిన ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఉన్నారు. కనీ, వారు బోధించేది? చెప్పనలవి కాదు. ఎంతో పేరుపొంది, ఎంతో సంపాదిస్తున్న తల్లిదండ్రులున్నారు. కానీ వారు నోరు విప్పితే? శమదమాది గుణములే కరువు. అరిషడ్వర్గాలే మెండు. రోజుకో స్వామి, ఒక సంస్థ, డబ్బులు, నగలు, వంధిమాగధ గణం, ఆర్భాటాలు మొదలైనవి సనాతన ధర్మానికి ఎంత చెడ్డ పేరు తెస్తున్నాయో. కారణం? అసలు విషయంపై దృష్టిలేకపోవటం. చెప్పే మాట నలుగురినీ ఆలోచింపజేయాలి. అది లేకుండా ఎన్ని హంగులుంటే ఏమి ఉపయోగం? అలాగే రాజకీయ నేతలు, ప్రజలు కూడా.

మంచి మాట మన నోట రావాలంటే దాని గురించి ఎంతో సాధన జరిగి ఉండాలి. మంచికి మూలం అంతర్ముఖం కావటం. దానిలో మన ప్రశ్నలకు సమాధానం దొరకటం. ఒకవేళ ఏదైనా పుస్తకం చూసి నాలుగు మాటలు చెప్పగలిగినా, ఐదో మాటలో స్పష్టత లోపించి అది ఒక తత్త్వంగా ఆవిష్కరించబడదు. అందుకే మన మాటలు మన వ్యక్తిత్వానికి, మన ఆత్మశుద్ధికి ప్రతిబింబాలు. అందుకే త్రికరణములుగా చెప్పబడిన మనస్సు, వాక్కు, కర్మలలో వాక్కు మధ్యది. త్రికరణ శుద్ధి అంటే ముందు మనశ్శుద్ధి ఉండాలి. అది కలిగినప్పుడు వాక్శుద్ధి కలుగుతుంది. ఈ రెండూ ఉన్నప్పుడు కర్మలో నిర్మలత్వం తప్పకుండా ప్రస్ఫుటమవుతుంది. త్రికరణ శుద్ధిగా చేసేది ప్రతిదీ పరమాత్మ స్వీకరిస్తాడు. కాబట్టి మనం త్రికరణ శుద్ధితో చేసేవే మనకు నిజమైన ఆభరణాలు అని ఈ శ్లోకం సూచిస్తుంది.

సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం - ప్రతి విషయంలోనూ మనకు శాశ్వతము అశాశ్వతముల మధ్య తేడాను స్పష్టంగా తెలిపి శాశ్వతమువైపు మనలను నడిపించటం. ఆత్మ-దేహము, అంతఃకరణ శుద్ధి-ఆభరణములు, విద్యా వినయ సద్గుణములు- ధన కనక వస్తు వాహనాది సంపదలు...ఇలా ప్రతి అడుగులోనూ మనకు శాశ్వతమైన వాటి గురించి గుర్తు చేస్తుంది సనాతన ధర్మం. భర్తృహరి నీతి శతకం కూడా సనాతన ధర్మంలో ఈ కోవకు చెందినవే.

సనాతన ధర్మం పాటించినంత కాలమూ సుభాషితాలు,శతకాలు మొదలైనవి మన విద్యాభ్యాసంలో ముఖ్యమైన స్థానం కలిగి ఉండేవి. ఎప్పుడైతే చదువులు ఉద్యోగాల నిమిత్తం సనాతన ధర్మా సాంప్రదాయానికి దూరమయ్యాయో అప్పటినుండీ మన సమాజంలో వ్యక్తిత్వ వికాసంపై దృష్టి లేదు. అందుకే నేటి సమాజంలో మనుషులలో విలువలు తక్కువగా కనిపిస్తాయి. పెద్దబాలశిక్షను చూస్తే అందులో వ్యక్తిత్వవికాసం ఎంత అద్భుతంగా ఒక ప్రణాలికగా పిల్లలకు నేర్పబడేదో అర్థమవుతుంది. ఒకప్పుడు ప్రాథమిక విద్య అంటే పెద్దబాలశిక్ష మాత్రమే. ఇప్పుడు అలాగే ఉండాలని కాదు. ఆ అంశాలు వేర్వేరు సబ్జెక్టులలో పాఠ్యాంశాలుగా తప్పకుండా ఉండాలి. కొంతవరకు ఉన్నాయి, కానీ వాటిని ఐచ్ఛికం చేసి, వాటికి సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా చేశాయి నేటి విద్యావ్యవస్థలు. కనీసం తల్లిదండ్రులైనా పిల్లలకు సుభాషితాలు, శతకాలు నేర్పిస్తే పిల్లలకు దృఢమైన, నిశ్చలమైన, నిర్మలమైన వ్యక్తిత్వం అలవరుతుంది.

నీతి, నిజాయితీ, నిర్మలత్వం, క్రమశిక్షణ ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే. వీటిని మన ధర్మంలో చెప్పినంత చక్కగా ఎక్కడా చెప్పబడలేదు. మన స్మృతి శ్రుతి పురాణములలో చెప్పినంత వివరంగా ఎక్కడా తెలుపబడలేదు. మన ధర్మంలో వీటిని ఉదహరించినంత మరెక్కడా జరుగలేదు. మన గురువులు దీనిపై చూపినంత ధ్యాస ఇంకే విద్యావ్యవస్థలోనూ చూపలేదు. ఒక నీతివంతుడైన మగవాడు, ఒక క్రమశిక్షణ కలిగిన మగవాడు నేటి సమాజంలో బహు అరుదు. కారణం? జీవనోపాధి పేరిట మన మూలాలు ఇచ్చిన దారిని తప్పి ఇంకో దారి పట్టాము. పూర్తిగా ఆ మూల దారులు కనుమరుగు కాక మునుపే మనం వాటిని కాపాడుకొని పునరుద్ధరించాలి. దానికి ఇంట్లో తల్లిదండ్రులు-పిల్లల మధ్య అంకురార్పణ కావాలి. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి