వాగ్గేయకారుల గొప్పతనం సాహిత్యంలో నిగూఢమైన భావాలను పొందుపరచటం. అందులోనూ అన్నమాచార్యుల వారు ఇటువంటి భావగర్భితమైన సాహిత్యాన్ని అందించినవారిలో అగ్రగణ్యులు. చేరి యశోదకు శిశువితడు అందరికీ తెలిసిన అన్నమాచార్యుల వారి కృతి. అందులో చివరి చరణం
ముంగిట పొలసిన మోహనమాత్మల పొంగించే ఘన పురుషుడు
సంగతి మావంటి శరణాగతులకు అంగము శ్రీ వేంకటాధిపుడితడు
మొదటి పంక్తిని పరిశీలిద్దాం. దీనిని రెండు రకాలుగా విశ్లేషణ చేయవచ్చు. పైపైన చూస్తే ఆయనను మోహించిన గోపికలను ఆనందపరచిన ఘన పురుషుడని భావించవచ్చు. కాస్త లోతుగా వెళితే, ఆయన సాన్నిధ్యాన్ని ఆశ్రయించిన వారిని తన్మయులను చేసి వారి ఆత్మలను ఉద్ధరించే పరమాత్మ అని అన్నమయ్య భావన. అప్పుడే రెండవపంక్తి సంపూర్ణమవుతుంది. మా వంటి శరణాగతులకు నిరంతరం చర్చాంశమైన స్వామే మాకు ఉపాయము అన్నారు అన్నమయ్య. ఇక్కడ అంగము అన్నదానికి ఉపాయము అన్న అర్థం ఎందుకు తీసుకోవాలి?
కలియుగంలో భక్తులకు వెతలెక్కువ, అనేక రకాల భావనలతో, కామ్యములతో స్వామిని శరణు కోరతారు. ఆయన వారిలో పరిశీలించేది అహంకారాన్ని ఎలా సమర్పిస్తున్నారు, ఎంత శరణార్తితో ఉన్నారు అన్నది. అందుకే కదా ముడుపులు, మొక్కులు, తలనీలాలు మొదలైనవి? భక్తుల పాపప్రక్షాళనకు అనేక మార్గాలు సూచించాడు కాబట్టే ఆయన ఉపాయమైనాడు. మీరు భగవద్బంధువుల చర్చలు గమనిస్తే స్వామిని కొలిచేవారిలో ప్రధానంగా మూడు రకాలు - 1. కామ్యార్థులై వెళ్లేవారు 2. కామ్యము నెరవేరిన తరువాత మొక్కు చెల్లించుకునేందుకు వెళ్లేవారు 3. స్వామి సాన్నిధ్యంలోని ఆనందాన్ని మరల మరల రుంచి చూడాలని వెళ్లేవారు. ఏ రకానికి చెందినా, ఒక్కసారి ఆ ఆనంద నిలయంలోకి వెళ్లగానే కలిగేది తన్మయత్వమే. ఎక్కడలేని ప్రశాంతత, స్వామిపై అవ్యాజమైన ప్రేమ కలుగుతాయి. కొద్ది సెకన్లకైనా మోహాలు పటాపంచలవుతాయి. ఎంతో మందికి ఆనందభాష్పాలు, మరెందరికో ప్రాపంచైక విషయాల పట్ల వైరాగ్యం, దాదాపుగా అందరికీ శరణాగతి భావన ఉప్పొంగి గోవిందా గోవిందా అని అప్రయత్నంగానే ఘోషిస్తారు. నామస్మరణంతో ఆనందనిలయం నిరంతరం మారుమ్రోగుతూనే ఉంటుంది. అందుకే అన్నమాచార్యుల వారు ముంగిట నిలచిన మోహనమాత్మల పొంగించే ఘన పురుషుడు అన్నాడు.
వాగ్గేయకారుల సంకీర్తనలు సాఫల్యం పొందేది ఇటువంటి సాహిత్యంతోనే. అవేవీ అల్లాటప్పా పాటలు కావు, మంత్రసమానమైనవి, మోహవికారాలను తొలగించేవి. కావలసింది అర్థం చేసుకునే చిత్తశుద్ధి, పరమాత్మ దివ్యానంద వైభవాన్ని సాహిత్యం ద్వారా అనుభవించగలిగే సంకల్పం. ఇంతటి మహత్తరమైన సాహిత్యాన్ని అందించారు కాబట్టే అన్నమయ్య వారసులు ఆయనను "హరియవతారమీతడు అన్నమయ్య అరయ మా గురుడీతడు అన్నమయ్య" అని నుతించారు. వైకుంఠనాథునికి వడి పాడుచున్నవానిగా అభివర్ణించారు. అది అక్షరసత్యం. స్వామి రూప గుణ విభవములను అనుభూతి చెంది మనకోసం అక్షర రూపంలో ఆవిష్కరించారు అన్నమయ్య. అందుకే ఆయన సద్గురువులు, అవతారపురుషులు.
ఓం నమో వేంకటేశాయ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి