24, ఆగస్టు 2020, సోమవారం

అనేక రూపాలలో ఒకడు - కంచి పరమాచార్యుల వారు


ఒకే ఒక పరమాత్మ విభిన్న దేవతలుగా కనబడతాడు. ఒక్కొక్క భక్తుడు భగవంతుని ఒక్కొక్క రూపానికి అంకితమవుతాడు. భక్తుని భక్తి అధికం చేయటానికి ఆ దేవత యొక్క లక్షణాన్నే ఎక్కువ చేసి, ఇతర లక్షణాలను అణచి ఉంచుతాడు. సారూప్యాలతో వివరాలు తెలుసుకుందాం.

పూర్వం వీధులలో లాంతర్లుండేవి. దీపం చుట్టూ నాలుగు గాజు పలకలుండేవి. కొన్నింటికి మూడు పలకలుండేవి. దీపపు కాంతి మూడు వైపులా విరజిమ్మేది. ఒక్కొక్కసారి ఆ మూడు పలకలకు అలంకారానికై మూడు రంగులు వేసేవారు. దాని ఫలితంగా ఒక్కొక్క గాజు పలక ద్వారా వచ్చే కాంతి ఒక్కొక్క రంగులో ఉండేది. ఒకే పరమాత్మ సృష్టిస్థితిలయములకు కారణం. చైతన్యమే అన్నిటికీ మూలం. ఆ చైతన్యమే మూడు పార్శ్వాలు గల లాంతరులో ఉన్నదనుకోండి. మూడు రంగులలో ఒకటి ఎరుపు - అదే సృష్టి. స్పెక్ట్రోస్కోప్‌లో ఎరుపు రంగును మాత్రమే మొత్తం కాంతి నుండి విడదీస్తే మిగిలినవన్నీ కూడా విరిగిపోతాయి. సృష్టి ఏకం నుండి అనేకమవటమంటే ఇదే. ఈ కారణం చేతనే సృష్టికర్త అయిన బ్రహ్మది ఎరుపు వర్ణమంటారు.

లాంతరులో ఇంకొక రంగు ఊదా. స్పెక్ట్రంలో ఇది ఆఖరి రంగు. మొదటిది ఎరుపు చివరిది నీలం. సృష్టింపబడిన జగత్తును సంస్థితం చేసేటప్పుడు విష్ణువు జ్ఞానంతో ఇలా చెబుతున్నట్లుంటుంది - "ఈ జగత్తు మిథ్య. దీనిని పరమాత్మతో సమానమనుకోకూడదు. ఇదంతా పరమాత్ముని లీల". ఆ జ్ఞానజ్యోతిలో దృశ్యమానమైన జగత్తంతా దగ్ధమైపోతుంది - కాలిన బొగ్గులా మారిపోతుంది. వస్తువు తగలబడిపోయినా రూపమాత్రావశిష్టమై ఉండే దశ అది - అదే, వస్తువు ఇంకా ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది. రూపమైతే ఉండవచ్చు, కానీ, రంగు పోతుంది. జగత్తు ఉండవచ్చు, కానీ, అది సత్యమన్న భ్రమ పోతుంది. "సర్వం విష్ణుమయం జగత్" అంతా నీలి రంగు గల విష్ణువే. నీలమేఘశ్యామల - నీలం, నలుపు, ఊదా - అన్నీ మూడు పలకలు గల లాంతరు వలె రూపాన్ని ధరిస్తాడు. నీలిరంగు అద్దం నుండి బయటకు వచ్చే కాంతిని విష్ణువంటాము.

మూడవ పలకకు ఏ రంగూ లేదు. అంతా జ్ఞానమనే జ్వాలలో దగ్ధమైతే - మొదట బొగ్గులా నల్లగా ఉంటుంది, ఇంకా అగ్నికి గురైతే అది బూడిద అవుతుంది. అస్తికగా మారుతుంది. అది కూడా దగ్ధమై అసలు రూపాన్నే కోల్పోతుంది. మొదట్లో ఉన్న నల్లరంగు పోయి అంతా తెలుపవుతుంది. తెలుపు కూడా స్వచ్ఛమైన కాంతే. పరమాత్మ నుండి వచ్చిన అన్ని రంగులూ అస్తిత్వాన్ని కోల్పోయి మళ్లీ పరమాత్మే అవుతాయి. ప్రతి ఒక్క రంగుకు భ్రమకొల్పే ఉనికి పోతుంది. అదే మహాభస్మం. అదే పరమశివుడు. పైకి చాలా క్రూరమైన కార్యంగా ఈ సంహారం తోస్తుంది. కానీ, దీనితోనే ఆగడు పరమశివుడు. ఆ పని జగత్తుకు తన మూలంతో అనుసంధానం కలిగించే కరుణామయ కార్యమే. తన లీలలో దృశ్యమానమైన జగత్తుకు జ్ఞానం కలిగించినప్పుడు "జగత్సర్వం" ప్రేక్షకునికి బొగ్గులా కనబడింది. అందువల్లే "సర్వం విష్ణుమయం జగత్" అన్న వర్ణన వచ్చింది. లీల ముగిసిన తరువాత, పరమ జ్ఞానం వల్ల సంహారమైనప్పుడు "జగత్సర్వం" లేదు. అందువల్లే అంతా శివమయం అంటాము.

ఒకే లాంతరు - బ్రహ్మ చైతన్యం - ఎరుపు గాజులోంచి చూచినప్పుడు బ్రహ్మగా (సృష్టికర్తగా), నీలపు గాజు ద్వారా చూచినప్పుడు విష్ణువుగా, ఏ రంగూ లేని గాజుపలక ద్వారా చూచినప్పుడు శివునిగా కనబడుతుంది. ఒకే మూర్తి త్రిమూర్తులుగా కనబడే వానిగా పరమాత్మను ఋషులు కొనియాడారు. ఏ సిద్ధాంతానికీ కట్టుబడకుండా విశాలదృక్పథం అలవరచుకున్న కవులు పరమాత్మను త్రిమూర్త్యాత్మకంగానే వర్ణించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి