24, నవంబర్ 2010, బుధవారం

వందే శివం శంకరం స్తోత్రము, తాత్పర్యము

శివుని పరి పరి విధాల స్తుతించే ఈ వందే శివం శంకరం స్తోత్రము శివ వందనముగా కూడా పేరొందింది. దీని రచయిత వివరాలు ఎక్కడ దొరకలేదు. శ్రవణం కూడ దొరకలేదు. మీకు ఎక్కడైనా దొరికితే నాకు తెలియ చేయండి. ఈ స్తోత్రములోని శ్లోకాలు శివోపాసన మరియు నిత్య పూజలో విస్తృతమైన ప్రాచుర్యం పొందాయి. స్తోత్రము, తాత్పర్యము మీకోసం.

జ్ఞాన ప్రసూనా సమేత శ్రీ కాళహస్తీశ్వరుడు


వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే సర్వజగద్విహారమతులం వందేఽంధకధ్వంసినం
వందే దేవశిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభం
వందే నాగభుజంగభూషణధరం వందే శివం చిన్మయం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే దివ్యమచింత్యమద్వయమహం వందేఽర్కదర్పాపహం
వందే నిర్మలమాదిమూలమనిశం వందే మఖధ్వంసినం
వందే సత్యమనంతమాద్యమభయం వందేఽతి శాంతాకృతిం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే భూరథమంబుజాక్షవిశిఖం వందే శ్రుతీఘోటకం
వందే శైలశరాసనం ఫణిగుణం వందేఽబ్ధితూణీరకం
వందే పద్మాజసారథిం పురహరం వందే మహాభైరవం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే పంచముఖాంబుజం త్రియనం వందే లలాటేక్షణం
వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్ధగంగాధరం
వందే భస్మకృతత్రిపుండ నిటలం వందేఽష్ట మూర్త్యాత్మకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం
వందే సర్వగతం దయామృతనిధిం వందే నృసింహాపహం
వందే విప్రసురార్చితాంఘ్రికమలం వందే భగాక్షాపహం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే మంగళరాజతాద్రి నిలయం వందే సురాధీశ్వరం
వందే శంకరమప్రమేయమతులం వందే యమద్వేషిణం
వందే కుండలిరాజకుండలధరం వందే సహస్రాననం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే హంసమతీంద్రియం స్మరహరం వందే విరూపేక్షణం
వందే భూతగణేశమవ్యయమహం వందేఽర్థ రాజ్యప్రదం
వందే సుందరసౌరభేయ గమనం వందే త్రిశూలాయుధం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే సూక్ష్మమనంతమాద్యమభయం వందేఽంధకారాపహం
వందే రావణనందిభృంగివినతం వందే సుపర్ణావృతం
వందే శైలసుతార్ధభాగవపుషం వందేఽభయం త్ర్యంబకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే పావనమంబరాత్మవిభవం వందే మహేంద్రేశ్వరం
వందే భక్తజనాశ్రయామరతరుం వందే నతాభీష్టదం
వందే జహ్నుసుతాఽంబికేశమనిశం వందే గణాధీశ్వరం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

తాత్పర్యము:  

ఆనందానికి మూలము (శంభు), ఉమాపతి, దేవతలకు అధిపతి, జగత్తుకు కారణమైన వాడు, సర్పములు ఆభరణములుగా కలవాడు, జింకను చేత కలవాడు, జీవ గణములకు అధిపతి (పశుపతి), సూర్య చంద్రులు, అగ్ని మూడు నేత్రములుగా కలవాడు, విష్ణువునకు ప్రియుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

జగత్తు అంతా విహరించే వాడు, సాటి లేని వాడు, అంధకాసురుని నాశనము చేసిన వాడు, దేవతలలో ఉత్తమమైన వాడు, చంద్రుని ధరించిన వాడు, విష్ణువునకు ప్రియుడు, సర్పములు, నాగరాజు ఆభరణములుగా కలవాడు, చిదానందుడు, శుద్ధ ప్రకాశుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

దివ్యమైన వాడు, అచింత్యుడు (మన ఆలోచనకు అందని వాడు), రెండవ సాటి లేని వాడు,   సూర్యుని దర్పమును నాశనము చేసిన వాడు, మచ్చలేని వాడు, ఆరంభమునకు మూలమైన వాడు, నాశనములేని వాడు, దక్షుని యజ్ఞమును నాశనము చేసే వాడు, సత్యమైన వాడు, అనంతమైన వాడు, మూలమైన వాడు, భయము లేని వాడు, శాంత స్వరూపుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

భూమిని రథముగా, విష్ణువును బాణముగా, వేదములను కీటకముగా, మేరు పర్వతమును ధనుస్సుగా, నాగరాజును తీగగా,   బ్రహ్మను సారథిగా కలిగి త్రిపురములను నాశనము చేసిన వాడు, మహా భైరవుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

ఐదు అందమైన ముఖములు, మూడు కన్నులు  కలవాడు,  నుదుట మూడవ కన్ను కలవాడు, అమ్బరమును దాటి వ్యాపించిన వాడు, ముడులు వేసిన జటా ఝూటములలో గంగ, చంద్రుడు కలవాడు, భస్మము నుదుట త్రిపుండ్రములు గా (మూడు విభూతి రేఖలు) కలవాడు, నిటలమైన వాడు, అష్ట మూర్త్యాత్మకమైన వాడు (శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, ఈశాన, మహాదేవ రూపములు),  భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

యముని హరించే వాడు, హరుడు, విషాన్ని ధరించే వాడు, దయామయుడు, పెద్ద ముళ్ళు వేయబడిన ఝూటములు కలవాడు, అంతటా వెళ్ళినవాడు, దయ అనే అమృతానికి నిధియైన వాడు, నరసింహ స్వామిని వశం చేసుకొన్నవాడు,  బ్రాహ్మణుల, దేవతలచే పూజించబడిన పాదపద్ములు కలవాడు,  భగుని కన్ను నాశనము చేసినవాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

వెండికొండపై వెలసి యున్నవాడు, దేవతలకు అధిపతి, శుభకరుడు, కొలతకు అందని వాడు, సాటిలేని వాడు, యమునిచే ద్వేషించ బడేవాడు, మెలికలు తిరిగిన సర్పములు కర్ణ కుండలములుగా కలవాడు, వేయి తలలు కలవాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.


హంస వంటివాడు, ఇంద్రియాలకు అతీతమైనవాడు, మన్మథుని నాశనం చేసిన వాడు, బేసి సంఖ్య కన్నులు కలవాడు (మూడు), భూత గణములకు అధిపతి, మార్పు లేని వాడు, రాజ్యము, సంపద ఇచ్చేవాడు, అందమైన నందీశ్వరుని వాహనముగా కలవాడు, త్రిశూలము ధరించు వాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

సూక్ష్మమైనవాడు, అనంతమైన వాడు, మొదటి వాడు, భయము లేని వాడు, అంధకాసురుని చంపిన వాడు, రావణుడు, నంది, భ్రుంగి చే వందితుడు, స్వర్ణ పుష్పముల రేకులు చుట్టూ కలవాడు, పార్వతిని అర్ధ భాగముగా కలవాడు, త్ర్యంబకుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

శుద్ధమైన, అంబరములను మించిన  ఆత్మ శక్తి కలవాడు, ఇంద్రునికి అధిపతి, భక్తులపాలిటి కలవృక్షము వంటి వాడు, మ్రొక్కే వారి కోరికలు తీర్చే వాడు, జహ్ను మహర్షి కుమార్తె అయిన గంగకు, పార్వతికి పతియైన వాడు, నాశనము లేని వాడు, గణములకు అధిపతి అయిన వాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.


3 కామెంట్‌లు:

  1. SASIKALA VOLETY, Visakhapatnam.30 నవంబర్, 2015 9:27 AMకి

    వందే శివం శంకరం చాలా బాగుంది. అనంత మయిన వాడు, మొదటి వాడు, వేదాలను కీటకములుగా, విష్ణుని ధనుస్సుగ ధరించిన వాడు, యమునిచే ద్వేషించ బడే వాడు అంటూ శివుని కొత్తగా స్తోత్రించిన ఈ శ్లోక వాజములు కార్తీక మాస శుభ సమయాన స్మరించు కోవడం సుకృతం. ధన్యవాదములండి

    రిప్లయితొలగించండి
  2. చాలా చాల కృతజ్ఞతలు మీకు !

    రిప్లయితొలగించండి