21, ఆగస్టు 2020, శుక్రవారం

ధర్మము-సత్యము-రామం


రామాయణమంతా గమనిస్తే, వాల్మీకి అత్యంత ఎక్కువగా ఉపయోగించిన పదాలు ధర్మము, సత్యము. ధర్మాత్మ, సత్యసంధ, ధర్మ పరాయణ, సత్య పరాక్రమ, సత్య ధర్మ పరాయణ...వీటి చుట్టూనే రామాయణమంతా. ఎందుకు? 

ఆడినమాట తప్పకుండా ఉండటం ఇక్ష్వాకు వంశస్థుల లక్షణమైతే, ధర్మానికి కట్టుబడి ఉండటం రాముని జీవనం. వాల్మీకితో రాముని గుణగణాలను, రూపలావణ్యాలను వేనోళ్ల పొగడిన నారదుడు, చివరకు "సత్యే ధర్మ ఇవాపరః" అంటాడు. ఇది చాలా అర్థం కలిగిన మాట. సత్యనిష్ఠలో సాక్షాత్తూ ధర్మదేవతగా రాముడు వ్యవహరిస్తాడని నారదుని భావన. తమేవ గుణ సంపన్నం రామం సత్యం పరాక్రమం అని నారదుడు నొక్కి వక్కాణించాడు. నారదుడు సూచించిన ఈ రామ లక్షణాలను వాల్మీకి రామాయణమంతా వినియోగించాడు. పరిపరి విధాల సత్య ధర్మ సమన్వయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటారు. రాముడు మూర్తీభవించిన ధర్మ దేవత అని మారీచుడు కూడా రావణుని మందలిస్తాడు. కానీ, సత్యానికి, ధర్మానికి షష్టాష్టకమైన రావణునికి ఆ మాటలు బోధ పడవు.

సత్య పరాక్రమ అనే శబ్దంలో ఎంతో అర్థముంది. సత్యమే పరాక్రమముగా కలవాడన్నది అంతరార్థం. సత్యానికి, నిజానికి కాస్త తేడా ఉన్న విషయం మనం గమనించాలి. మూడు కాలాలలో నిజమైనది సత్యమని వ్యవహారించటం మనం గమనించాలి. భూత భవిష్యద్వర్తమానాలకు వర్తించే శాశ్వత సనాతన సత్యమే రాముని పరాక్రమం అని నారద వాల్మీక ప్రోక్తమైన శ్లోకాల అంతరార్థం. సత్యము, ధర్మము రెండు పాదాలుగా చేసుకొని రాముని అయనం ముందుకు సాగింది కాబట్టే సత్య ధర్మ పరాక్రమః అని వారు ఘోషించారు. 

మనం నడిచేటప్పుడు ఎలాగైతే ఒక కాలు మరొక కాలుకు ఆధారమవుతుందో, అలాగే సత్య ధర్మాలు రాముని నడవడికలో ఒకదానికొకటి ఆధారమైనాయి. ఈ రెండిటినీ సమన్వయ పరచుకుంటూ సన్మార్గంలో ముందుకు  సాగినవాడు రాముడు. 

రామాయణంలో అనుక్షణం మనకు సత్యధర్మ సమన్వయం మనకు గోచరిస్తుంది. మొదటి ఉదాహరణ:

ప్రజల మేలు కోరి ప్రజల అభీష్ఠం, ఆమోదం మేరకు జ్యేష్ఠ కుమారునికి పట్టాభిషేకం చేయాలనుకున్న దశరథుని సంకల్పం ధర్మ సమ్మతము, కాబట్టే దానికి వశిష్ఠుని ఆమోదం లభించింది. కానీ, దశరథుడు కైకకు మాట ఇచ్చింది నిజం. ఇది కేవలం దశరథుడికే తెలుసు. ఆడిన మాట తప్పడం రఘువంశంలో లేదు, కాబట్టే, సత్యసంధుడైన దశరథుడు ధర్మ సందేహంలో పడిపోతాడు. దశరథుని మనోరథం ధర్మ సమ్మతం, కైకకోరిక సత్యనిష్ఠకు పరీక్ష. సత్యాన్ని పాలిస్తే ధర్మం కుంటుబడుతుంది, ధర్మం నెగ్గాలంటే సత్యం అసత్యమవుతుంది. కైక పెట్టిన ఈ పరీక్షకు కారణం మంథర. కైక మంథరకు లొంగిపోయింది. సత్యం సాకుతో ఆమె తన దౌర్బల్యాన్ని బయటపెట్టుకుని కుటుంబంలో అల్లకల్లోలం సృష్టించింది. కానీ, సత్య పరాక్రముడైన రాముడు తన కర్తవ్యాన్ని వెంటనే గుర్తించి మంథర నాటిన విషవృక్షాన్ని మందారవనంగా మార్చాడు, సత్య ధర్మాలకు సామరస్యం కూర్చాడు. 

రాముని నిర్ణయం ఎంత దృఢమైనదంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కైక మాటను శిరసావహించాడు. నీకీ మాట ఎలా చెప్పాలో అని నాన్నగారు జంకుతూ మగతగా పడుకున్నారు అని కైక చెప్పగానే

అనుక్తోహ్యత్రభవతా భవత్యా వచనాదహం
వనే వత్స్యామి విజనే వర్షాహీణ చతుర్దశ

అమ్మా, ఈ మాట నాన్నగారు చెప్పాలా? నువ్వు చెబితే చాలదా? నాన్నగారు చెప్పినా చెప్పకపోయినా నీ మాట మీద నేను పదునాలుగు సంవత్సరాలు అరణ్యంలో ఆనందంగా గడుపుతాను అన్నాడు. భరతుడు వచ్చేలోగా రాముడు అడవికి వెళ్లకపోతే కథ అడ్డం తిరుగుతుందని కంగారు పడుతున్న కైక ముఖకవళికలను చూసి రాముడు తన దృఢ సంకల్పాన్ని ఇలా చెబుతాడు:

నాహమర్థపరో దేవి లోకమావస్తుముత్సుహే
విద్ధి మాం ఋషిభిస్తుల్య విమలం ధర్మమాశ్రితం

నాకు ధన కనక వస్తు వాహనాది అర్థములపై ఆసక్తి లేదు. నాకు కావలసింది రాజ్యం కాదు, రాష్ట్రం. లోకం నాకోసం ఎదురు చూస్తున్నాయి. నిర్మలమైన ధర్మ నిర్వహణతో ఋషుల మధ్య జీవితం గడపాలని నా మనస్సు ఉవ్విళ్లూరుతున్నది అని పలుకుతాడు. ఇదీ ధర్మ పరాయణత్వం, సత్య వాక్పరిపాలనంటే. ఈ మాటలలోని రహస్యం కైకకు బోధపడితేగా? ఎంతమంది ఏమి చెప్పినా, కన్నతల్లి కౌసల్య చెప్పినా రాముడు దృఢచిత్తుడై నిలిచాడు. 

నాస్తి శక్తిః పితుర్వాక్యం సమతిక్రమమితుం మమ

అమ్మా - నాన్న గారి మాట కాదనేనంత సామర్థ్యం నాకు లేదు అన్నాడు. రాజ్యం అక్కరలేదు నాయనా, నా కళ్లెదుట ఉండు చాలు, అది ధర్మ లోపం కాదు అని కౌసల్య చెప్పినా, సత్యసంధుడు, ధర్మ పరతంత్రుడు అయిన రాముడు ఆమెకు తన నిర్ణయాన్ని నచ్చజెబుతాడు:

త్వయా మయా చ వైదేహ్యా లక్ష్మణేన సుమిత్రయా
పితుర్నియోగే స్థాతవ్యం ఏష ధర్మః సనాతనౌ

అమ్మా - తండ్రి ఆజ్ఞకు నేనే కాదు, నీవు, సీత లక్ష్మణుడు, సుమిత్రాదేవి అందరమూ బద్ధులమే. ఇదే సనాతన ధర్మం అంటాడు. 

కైక మనసులో ఉన్నట్టుంది చెలరేగిన కీర్తి దుమారానికి రాజవంశమంతా చలించింది. కానీ, సత్య ధర్మ పరాక్రముడైన రాముడు ఝంఝానిలాన్ని మలయమారుతంగా మారుస్తాడు. 

రామో విగ్రహవాన్ ధర్మః! సత్య ధర్మ పరాయణః!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి