27, ఆగస్టు 2020, గురువారం

సుబ్రహ్మణ్య తత్త్వ పరిశీలన


సుబ్రహ్మణ్యుడు శివుని శక్తితో జన్మించిన వాడే. ఈ స్కందుని జననం అంతర్ముఖులమై దివ్యత్వాన్ని పొందే మార్గాల యొక్క సూత్రాలను విశదీకరించేది. ఈ అవతారం అనాదిగా ఉన్న అవిద్య మరియు జ్ఞానముల మధ్య ఉండే సంఘర్షణను తెలిపేది. ఈ సంఘర్షణ దేవతలు-అసురుల మధ్య జరిగినదిగా భావించవచ్చు లేదా ఒక వ్యక్తిలో జరిగేది కావచ్చు. ఆ సంఘర్షణలో దివ్యశక్తుల విజయమే స్కందలీలలు.

పరమశివుని ఆజ్ఞాచక్రము నుండి తేజస్సు వెలువడి స్కందుని రూపం దాల్చింది. ఆ విధంగా స్కందుడు జ్ఞానజ్యోతి. పార్వతిచే రెల్లుగడ్డిపై (శరవణములు) ఆరు కమలముల నుండి స్వీకరించబడినవాడు శరవణభవుడు. షడ్చక్రముల ఛేదన ద్వారా అపరోక్షానుభూతి కలుగుతుంది అన్నది మనకు శాస్త్రాలు చెబుతాయి. క్రిందనున్న ఆరు చక్రములలోని కమలములనుండి ఎదిగి జీవాత్మ సహస్రారము నందు పూర్ణయోగ స్థితిని పొందుతాడు. ఈ విధంగా స్కందుడు ఆరు కమలములనుండి ఆవిర్భవించిన సర్వోన్నతమైన దివ్య జ్ఞానశక్తికి సంకేతము. అజ్ఞానాన్ని నాశనము చేసే సర్వోత్కృష్ట జ్ఞానజ్యోతి. ఆ అజ్ఞానమే విరాడ్విశ్వ వ్యవస్థలో అసురులు రూపం. వారిని సంహరించిన వాడు స్కందుడు. దివ్యత్వాన్ని కలిగిన దేవతలకు సేనాధిపతిగా కొలువబడ్డాడు.

ఈ భూమిపై మనకు అవిద్యపై పోరాటంలో సాయపడేవారు గురువులు. అందుకే గురువును మూర్తీభవించిన స్కందశక్తిగా భావిస్తాము. ఈ జగత్తులోని సాధనా శక్తి లేదా యోగశక్తికి రూపము స్కందుడు. ఈ శక్తితోనే మానవుడు అజ్ఞానముపై దండెత్తి పూర్ణజ్ఞానాన్ని పొందగలడు. సాధకుడు పునీతుడై సాధనా చతుష్టయాన్ని పొంది గురువు అనుగ్రహాన్ని పొందే అర్హతను సాధిస్తాడు. అప్పుడు గురువును స్కందుని రూపముగా భావించటం ద్వారా అజ్ఞానం త్వరగా తొలగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి..

స్కందుని అవతారంలో చాలా ముఖ్యమైన విషయం దేవతలు మొట్టమొదటి అడుగులోనే పరమేశ్వరుని వద్దకు వెళ్లి దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతోంది మీరు కాపాడాలి అని కోరలేదు. మొట్టమొదట వారు ఓ నకారాత్మక శక్తి ఉందని, దానిని వ్యతిరేకించాలన్నది గ్రహించారు. ఆ శక్తి దివ్యత్వానికి వ్యతిరేకమైనదని కాబట్టే దానిని అధిగమించాలి అన్నది తెలుసుకున్నారు. ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గంలోని సాధకుడు కూడా తాను అధిగమించవలసిన అవరోధాలను గుర్తించి, అది ఏ విధంగా అవరోధమో తెలుసుకొని, అది సహజ ప్రవృత్తికి ఏ విధంగా భిన్నమైనదో గ్రహించాలి. మనలను మనం దివ్యశక్తులతో అనుసంధానం చేసుకొన్న తరువాత నకారాత్మక శక్తులపై పోరాటం చేయాలి. కేవలం గ్రహింపు వల్ల ఉపయోగం ఉండదు. దానిని ఆచరణలో పెడితేనే ఫలితం. త్రికరణ శుద్ధిగా సంకల్పిస్తేనే అనుగ్రహం కోరటానికి అర్హులమవుతాము. ఈ సిద్ధాంతాన్ని నిరూపించటానికే దేవతలు దానవులపై నిరంతరం యుద్ధాలు చేశారు. ఎన్ని మార్లు చేసినా దుష్ట శక్తులు ఆవిర్భవిస్తూనే ఉన్నాయి కాబట్టే వారు పరమ గురువైన పరమాత్మను ప్రార్థించారు. అటువంటి అత్యవసర పరిస్థితులలోనే పరమాత్మ అనుగ్రహించాడు.

సాధనా శక్తి అనేది జీవుని అజ్ఞానాంధకారము నుండి దీక్ష ద్వారా మేల్కొలపడం. ఈ దీక్ష గురువు ఇస్తాడు. దీక్ష అంటే ఓ మంత్రోపదేశమో వస్త్రధారణో కాదు, గురువు యొక్క సత్సంకల్పాన్ని శిష్యునికి అందజేయడం. ఎటువంటి కర్మలు లేకుండా గురువు యొక్క అనుగ్రహ వీక్షణతో, కొన్ని మాటలతో లేదా కేవలం గురువు యొక్క ఆలోచనతో అందించేది దీక్ష. ఇది ఏ విధంగా చేయాలి అన్నది గురువుకే తెలుసు. ఈ దీక్షను ఆచరణలోకి పెట్టవలసిన బాధ్యత సాధకునిదే. అభ్యాసము అనేది సాధనకు అతి ముఖ్యమైన ప్రాతిపదిక. అభ్యాసమే అనుభూతికి దారి. దేవతలు ఆ విధంగా తమ యుద్ధాలను కొనసాగిస్తూ, విజయం సాధించలేని స్థితిలో పరమేశ్వరుని ప్రార్థించారు, వేడుకున్నారు. అందుకే సనాతనధర్మంలో ప్రార్థన ఓ ముఖ్యమైన అంతర్భాగమైంది.

ప్రార్థనకు అర్థం ఏమిటి? పరమాత్మపై పరిపూర్ణమైన నమ్మకంతో పలికే మాటలు. అహంకారాన్ని, కామ్యములను పరమాత్మ పాదాలవద్ద సమర్పించగలిగే నిజాయితీ ప్రార్థన యొక్క సాఫల్యానికి ఎంతో ముఖ్యం. కాబట్టి శ్రద్ధ, శరణాగతి అనేవి ప్రార్థనకు మూలస్థంభాలయ్యాయి. ఇవి ఉన్నప్పుడు వినమ్రత అలవడుతుంది. కాబట్టి పరమశివుని వద్ద దేవతల ప్రార్థన ఏమిటి? మేము నిమిత్త మాత్రులము, మమ్మలను ముందుకు నడిపించే నాయకుని అనుగ్రహించు స్వామీ అని. ఈ విధంగా కర్తృత్వాన్ని పరమేశ్వరునిపై ఉంచి, తానొక సాధనగానే భావించటం. ఈ విధంగా సాధన భారాన్ని పరమేశ్వరునిపైనే ఉంచటం కూడా. ఇక్కడ దేవతలు లేదా సాధకుడి పురోగతి మొదలవుతుంది. లక్ష్యం దివ్యమైనది, కర్తృత్వం పరమేశ్వరునిది, ఆ దేహము ఒక సాధనము మాత్రమే అన్న స్థితిలో ఆధ్యాత్మిక వికాసం ఆరంభం. కాబట్టి ప్రార్థన యొక్క ప్రధాన లక్ష్యం ఈ దేహములో నివసించి, దివ్యమైన కార్యమునకు పనిముట్టుగా ఉపయోగించమని కోరటం.

ఇక స్కందావతారానికి తిరిగి వద్దాము. స్కంద షష్టి అనగా సుబ్రహ్మణ్యుని యొక్క అజ్ఞానాన్ని తొలగించే దివ్యశక్తిని ఆరాధించటమే. అదే అసురులపై దేవతల విజయం. స్కంద లీలలలోని అత్యద్భుతమైన ఘట్టం తారక, సింహముఖ, శూరపద్ములపై స్వామి విజయం. ఈ అసురులు కర్మ, కామ, అవిద్యలకు ప్రతినిధిత్వం వహిస్తారు. తొలుత తారక సింహముఖులు హతం కాగా, శూరపద్ముడు యుద్ధానికి వస్తాడు. స్కందుని వేలాయుధం ముందు ఎవ్వరు నిలువలేకపోయారని గ్రహించి అతడు వేర్వేరు రూపాలతో మాయాజాలం చేసి స్వామిపై దాడి చేస్తాడు. స్కందుడు ఆతని మాయలను కట్టడి చేసి అతని రథాన్ని విరగ్గొట్టి అతడిని నిరాయుధుడిని చేస్తాడు. శూరపద్ముడు ఓటమి అంగీకరించి తన అహంకారాన్ని స్వామికి అర్పణం చేస్తాదు. స్వామి వేలాయుధంతో అతని అహంకారాన్ని నాశనం చేస్తాడు. అదే శూరపద్ముడనే అవిద్య యొక్క అంతం. వేలాయుధం అనగా బల్లెం. దానికి పైవైపు చివరన చాలా వాడిగల మొనతో ఉంటుంది. ఇది ఏకాగ్రతకు చిహ్నం. ఇది బ్రహ్మాకార వృత్తికి సంకేతం. ఎప్పుడైతే ఈ బ్రహ్మాకార వృత్తి జీవాత్మ యొక్క ప్రవృత్తులను సంహరిస్తుందో అప్పుడా జీవాత్మ అజ్ఞానము, మాయ లేని తురీయావస్థకు చేరుకుంటాడు.

స్కందావతరణం ఎలా జరిగింది?
-----------------------------------------

తనకు తపోభంగం కలిగించిన మన్మథుని దహించటానికి శివుని మూడో కన్ను తెరచుకున్నప్పుడు ఆ అగ్ని కణికలను అగ్ని, వాయుదేవులు గంగానదిలో పడవేయగా ఆ తల్లి ఆ అగ్నికణికలను భరించలేక తన ఒడ్డున ఉన్న రెల్లుగడ్డి పైకి నెడుతుంది. ఈ విధంగా అగ్ని, వాయు, జల, పృథివీ ఆకాశ తత్త్వములు రెల్లుగడ్డిపై కణికల రూపములో ఉన్న శివుని తేజస్సుతో కలిసి ఆరు ముఖములు కల బాలునిగా ఉద్భవించాడు. ఈ విధంగా స్కందుడు జ్ఞానతేజోస్వరూపుడైనాడు.

సారాంశమేమిటి?

1. శివుని తేజస్సు యొక్క అంశ మరియు పంచభూతముల తత్త్వము కలసి షణ్ముఖుడైనాడు. రెల్లుగడ్డిపై జన్మించాడు కాబట్టి శరవణభవుడైనాడు. గంగ ఆ అగ్ని కణికలను ధరించి ఒడ్డుకు నెట్టింది కాబట్టి గాంగేయుడైనాడు, ఆ రెల్లుగడ్డిపై ఆరుముఖములతో ఉన్న బాలుని పార్వతి స్వీకరించింది కాబట్టి పార్వతీ కుమారుడైనాడు.

2. శివుని మూడో నేత్రం నుండి వచ్చిన తేజస్సు యొక్క రూపము కాబట్టి జ్ఞానస్వరూపుడైనాడు.

3. అజ్ఞానాన్ని తొలగించే వాడు కాబట్టి గురు స్వరూపుడైనడు.

4. రహస్యమైన అవతరణ కలిగిన వాడు కాబట్టి గురుగుహుడైనాడు.

5. ఏకాగ్రగత కలిగిన జ్ఞానస్వరూపుడు కాబట్టి సుబ్రహ్మణ్యుడైనాడు.


వల్లీ దేవసేనలు, స్వామి కల్యాణం, ఇతర వివరాలు
---------------------------------------------------------------

తమిళ వాఙ్మయం ప్రకారం శూరపద్మునిపై విజయం తరువాత సుబ్రహ్మణ్యుడు తిరుచెండూరులో కొన్నాళ్లు నివసించాడు. ఇంద్రాది దేవతలు స్వామిని అక్కడ కొలిచారు.

తొలుత కైలాసంలో తల్లిదండ్రుల వద్ద ఉన్నప్పుడు కుమారుడు శ్రీమహావిష్ణువు పుత్రికలైన అమృతవల్లి, సుందరవల్లిలను చూస్తాడు. సుబ్రహ్మణ్యుని అందాన్ని, యశస్సును చూసి వారు అతనిని కోరుకుంటారు. సుబ్రహ్మణ్యుడు వారిని మరల జన్మ ఎత్తవలసిందిగా సలహా ఇస్తాడు. అప్పుడు అమ్మృతవల్లి ఇంద్రుని కుమార్తెగా జన్మించి దేవసేన అని పేరొందగా సుందరవల్లి దక్షిణ భారతాన కొండ జాతిలో నంబిరాజు కుమార్తెగా జన్మించి వల్లిగా పేరొందింది. ఇంద్రుడు తిరుచెండూరులో స్వామిని కొలుస్తూ పెరిగిన తన బిడ్డ దేవసేనను వివాహం చేసుకోవలసిందిగా స్వామి కోరతాడు. స్వామి ఇంద్రుని కోరిక మన్నించి మదురై సమీపంలోని తిరుపురకుండ్రంలో బస చేస్తాడు. ఇంద్రాది దేవతలు, గౌరీశంకరులు, గణపతి మొదలైన వారి సమక్షాన సుబ్రహ్మణ్యుడు-దేవసేనల వివాహం వైభవంగా జరుగుతుంది.

విష్ణుమూర్తి అవతారమైన ఉపేంద్రుడు ఒకసారి వైకుంఠంలో స్వామి దర్శనానికై వెళ్లగా, అదే సమయానికి కణ్వమహర్షి అక్కడికి వస్తాడు. ఆ మహర్షిని విష్ణు దంపతులు, ఉపేంద్రుడు పట్టించుకోకపోవటంతో కణ్వుడు వారిని ఈ విధంగా శపిస్తాడు - విష్ణువు మాటల్లేని ఋషిగా మరల మరల జన్మించాలని, లక్ష్మీదేవి అడవుల్లో తిరిగే జింకగా జన్మించాని, ఉపేంద్రుడు వన్యమృగాలను వేటాడే వేటగానిగా జన్మించాలని. విష్ణువు మునిగా జన్మించి శివునికై తపస్సు చేసి ఆయనను మెప్పించగా శివుడు ఆ శాపాన్ని బహు జన్మల నుండి ఒక జన్మకు ఉపశమనం కలిగిస్తాడు.

విష్ణువు మూగవాడైన శివమునిగా భువిపైన జన్మించి ఓ అడవిలో నివసించాడు. ఉపేంద్రుడు అదే అడవిలో వేటగానిగా జన్మించాడు. లక్ష్మీదేవి అక్కడే జింకగా జన్మించింది. శివముని ఆ జింకను చూసి చలితుడవుతాడు. ఆతని మోహానికి జింక ప్రతిస్పందనకు ఫలితంగా ఓ ఆడబిడ్డ జన్మిస్తుంది. ఆ బిడ్డ తనలా లేదని చూసిన జింక ఆమెను త్యజిస్తుంది. వేటగాడు ఆ ఆడబిడ్డను ఓ తీగలున్న చెట్టు గుబురులో ఏడుస్తూ చూస్తాడు. ఆమెకు వల్లి అని నామకరణం చేసి పెంచుతాడు. ఆ వేటగాడే కొండజాతి రాజైన నంబిరాజు. నారదుడు సుబ్రహ్మణ్యునికి సుందరవల్లిని వివాహమాడతానన్న కైలాస నివాసము నాటి మాటను గుర్తు చేయగా స్వామి ఆమె జాడను తెలుసుకుంటాడు. ఆమె ఒక పర్వతముపై తనకై తపస్సు చేస్తున్నదని గ్రహిస్తాడు. ఒక వేటగాని మారువేషంలో ఆమె వద్దకు వెళ్లి అక్కడకు జింక ఏమైనా వచ్చిందా అని ప్రశ్నిస్తాడు. వల్లి సేవిక లేదు అని సమాధానమిచ్చి అనుచితంగా ఆ ప్రాంతంలో ప్రవేశించినందుకు దూషిస్తుంది. వల్లి ఆ వేటగాని బారి నుండి రక్షించమని తన సోదరులను కోరుతుంది. వేటగాడి వెనుకాడక తనను వివాహం చేసుకోమని వల్లిని కోరతాడు. వల్లి సోదరులు ఆమెను రక్షించాలని అక్కడికి రాగా వేటగాడు వృక్షరూపంలోకి మారిపోతాడు. వారు తిరిగి వెళ్లగానే వేటగాడు మరల తన రూపం పొంది ఆమెను వివాహము చేసుకోవలసిందిగా కోరతాడు. ఆమె అతనిని అడవి చెట్టు కొమ్మతో తరుముతుంది. వేటగాడు ఈమారు వృద్ధుని రూపంలో ఆమెవద్దకు వచ్చి తనను వివాహం చేసుకోవలసిందిగా కోరతాడు. ఆమె తాను షణ్ముఖుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని చెబుతుంది. అప్పుడు అక్కడకు ఓ మదపుటేనుగు వస్తుంది. అది చూసి ఆమె భయంతో ఆ ముసలివాని ఆశ్రయిస్తుంది. ముసలివాడు తనను వివాహం చేసుకుంటే ఆమెను రక్షిస్తానని అంటాడు. ఆమె వేరే దిక్కు లేక ఒప్పుకుంటుంది. ముసలివాడు ఆ ఏనుగును తరిమివేస్తాడు. వల్లి తన మాట మీద నిలబడదు. అప్పుడు మళ్లీ ఆ ఏనుగు రాగా వేటగాడు తరిమికొడతాడు. అప్పుడు వల్లి అతనిని వివాహం చేసుకోవటానికి అంగీకరిస్తుంది. స్వామి అప్పుడు తన అసలు రూపంలో వేలాయుధుడై దర్శనమిస్తాడు. తన అజ్ఞానానికి వల్లి సిగ్గు పడుతుంది. స్వామి ఆమెను తన భార్యగా స్వీకరిస్తాడు. నంబిరాజు ఎవరో తన కుమార్తెను తీసుకువెళుతున్నాడని గ్రహించి అతనిపై యుద్ధానికి రాగా స్వామి ఆగ్రహించి వారిని సంహరిస్తాడు. వల్లి కోరగా మరల వారిని బ్రతికిస్తాడు. స్వామి అప్పుడు వారికి తన నిజరూప దర్శనమిస్తాడు. నారదముని, ఇంద్రాది దేవతలు, దేవసేన సమక్షంలో స్వామి వల్లిని వివాహమాడతాడు.

సరే, వీరి గాథలు తెలుసుకున్నాము. 

మరి ఈ దేవతామూర్తుల అంతరార్థం ఏమిటి?
--------------------------------------------------------

స్కాంద పురాణంలో స్కందుని లీలలు జీవునిపై మాయ యొక్క నాటకం, జీవుని కష్టనష్టాలు, చివరకు వేలాయుధుడైన షణ్ముఖుని అనుగ్రహంతో ఆ మాయ బారి నుండి విముక్తి. ముందు చెప్పుకున్నట్లు వేలాయుధం స్వామి జ్ఞానశక్తికి ప్రతీక.

ఇక వల్లీదేవసేనలు. వల్లి ఇచ్ఛాశక్తికి ప్రతీక, దేవసేన క్రియాశక్తికి ప్రతీక. ఈ విధంగా దివ్యత్వాన్ని పొందాలని అభిలషిస్తున్న జీవుడు ఇచ్ఛా శక్తిని పొంది, క్రియాశక్తి ద్వారా పోరాడుతూ గమ్యం చేరుకోగలడు. ఈ విధంగా వేలాయుధం - జ్ఞాన శక్తి, వల్లి - ఇచ్ఛా శక్తి, దేవసేన - క్రియాశక్తి - ఈ మూడు షణ్ముఖుని అవతారంలో అంతర్భాగాలై పరిపూర్ణ దివ్యత్వాన్ని సూచిస్తాయి.

పరమాత్మయైన సుబ్రహ్మణ్యుని సన్నిధినుండి దూరమైన జీవాత్మ వల్లి అవిద్య మూలంగా అజ్ఞానపుటడవుల్లో సంచరిస్తూ ఉండగా గురువు నారదుని రూపంలో వచ్చి జీవాత్మ పరమాత్మల కలయికను సిద్ధి చేస్తాడు. వల్లి అనే జీవాత్మ పరమాత్మపై అకుంఠితమైన విశ్వాసం కలదు కాబట్టే ఎన్ని అవరోధాలు వచ్చినా చివరకు స్వామికే చెందింది. వైరాగ్య వివేకములనే రెండు సాధనాలతో వల్లి అనే జీవాత్మ మాయ బంధనం నుండి విముక్తి పొంది స్వామితో ఐక్యమవుతుంది.

సుబ్రహ్మణ్యుని ఆరు ముఖాలలో నాలుగు నలుదిక్కులా, ఒకటి ఊర్ధ్వముఖము మరొకటి అధోముఖముగా ఉంటాయి. ముఖములో ఉండే జ్ఞానేంద్రియాలతో బుద్ధి కలసి ఆరు ముఖాల ద్వారా అంతరాత్మ వస్తువులను భావిస్తాడు. ఈ ఆరు ముఖాల ద్వారానే ఆత్మజ్యోతి బయటకు ప్రసరిస్తుంది. ఈ విధంగా అంతరాత్మకు ఆరు ముఖాలు, అలాగే సుబ్రహ్మణ్యునికి కూడా. ఈ విధంగా ఆయన పరబ్రహ్మ స్వరూపం. అదే విధంగా నిన్న చెప్పినట్లు ఆరుముఖాలు ఆరు చక్రాలను సూచిస్తాయి. వాటి అధిష్ఠాన దేవతల యొక్క రూపమే ఒక్కొక్క ముఖము. ఈ విధంగా కూడా సుబ్రహ్మణ్యుడు పరబ్రహ్మమే. కాబట్టే ఆ స్వామిని ధ్యానించటం బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని కలిగిస్తుంది.

చిట్ట చివర సుబ్రహ్మణ్యుని వాహనమైన నెమలి, కుక్కుట ధ్వజము గురించి. నెమలి యొక్క ప్రత్యేకత తన అంతరానందాన్ని నృత్యం చేస్తూ తన పింఛాలను ప్రదర్శిస్తు వ్యక్తపరస్తుంది. అలా చేసినప్పుడు అత్యద్భుతమైన సంతులనను కనబరుస్తుంది. సుబ్రహ్మణ్య తత్త్వానికి ఇది ఓ కీలకమైన ప్రాతిపదిక. రజస్తమో గుణములపై సత్త్వ గుణము యొక్క ఆధిపత్యాన్ని తన స్థితప్రజ్ఞత ద్వారా నెమలి సూచిస్తుంది. ఈ సత్త్వ గుణము వలన కలిగే సంతులన వలన ఆత్మ సంతృప్తి, ఆనందము కలుగుతాయి. స్వానందానికి ప్రతీక నెమలి నృత్యము. ఈ సత్త్వ గుణ ప్రేరితమైన స్వానందము బ్రహ్మజ్ఞానానికి అతి ముఖ్యమైనది కాబట్టి, బ్రహ్మజ్ఞానమునకు సుబ్రహ్మణ్యుడు ప్రతీక కాబట్టి నెమలి స్వామి వాహనమైంది. సుబ్రహ్మణ్యుడు కుక్కుట ధ్వజుడు. అనగా కోడి అతని పతాకముపై చిహ్నము. కోడికూత సూర్యోదయాన్ని సూచిస్తుంది కాబట్టి, జ్ఞానోదయానికి సూచికగా స్వామి ఆ కుక్కుట ధ్వజుడైనాడు.

సుబ్రహ్మణ్యునికి మరొక రూపము కూడా ఉంది, వల్లీ దేవసేనలు లేని దండపాణి రూపము. ఈ రూపము ఇచ్ఛా మరియు క్రియాశక్తి లేని జ్ఞానశక్తికి ప్రతీక. ఈ రూపము కూడా ఉపాసనా మార్గంలో సాఫల్యాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్యుడు వల్లిని గాంధర్వ వివాహం చేసుకున్నాడు కాబట్టి వల్లి స్వామి ఇచ్ఛాశక్తి. అలాగే, దేవసేనతో వివాహం అసురులపై ఆయన విజయం సందర్భంగా ఇంద్రుని కృతజ్ఞతకు సూచికగా వేదోక్తంగా జరిగింది. ఆ విధంగా దేవసేన ఆయన క్రియాశక్తికి సూచన.

దండాయుధము సుబ్రహ్మణ్యునికి శివుని శక్తి రూపమైన పార్వతీ దేవి ఇచ్చినది. పరాశక్తి అయిన పార్వతి నుండి వచ్చిన బ్రహ్మజ్ఞానముగా దండాయుధమును భావించవచ్చు. దీని ఆకారము గమనిస్తే, జ్ఞానము జ్యోతిస్వరూపమై మూలాధార చక్రము (ఆయుధము యొక్క క్రింది చివరి భాగము) నుండి మొదలై మధ్యలో ఉన్న నాడులలో ప్రవహిస్తూ (అనగా ఆయుధము యొక్క మధ్యభాగము) సహస్రకమలములున్న బ్రహ్మరంధ్రము (ఆయుధము యొక్క పై చివరి భాగము) ద్వారా వెలువడి అనంతమైన కాంతితో ప్రకాశిస్తుంది.

మరో ఆధ్యాత్మిక విశేషమేమిటంటే, స్వామి వాహనమైన నెమలి యొక్క రూపము. తన పింఛములను విప్పినపుడు ప్రణవరూపము కలిగి ఉంటుంది. దానిమధ్యలో పరబ్రహ్మ బిందురూపమై, జ్యోతిప్రకాశమై ఉంటాడు. అదే సుబ్రహ్మణ్యుని రూపము. నెమలి కాళ్ల కింద ఆధీనములో ఉన్న సర్పము ప్రణవము ఆధీనములో ఉన్న మాయకు ప్రతీక. అలాగే, కుక్కుటము (కోడి) ప్రణవ నాదానికి ప్రతీక. నిన్న చెప్పినట్లు సూర్యోదయాన కోడికూత జ్ఞానోదయానికి ప్రతీక, ప్రణవ నాదం జాగృతమైన జ్ఞానానికి ప్రతీక కదా!

అసురులు తారక, సింహముఖ, శూరపద్ములు. వీరు మాయా జనితులు. దేవతలను హింసించి దేవకుమారులను బంధించిన వీరిని స్వామి తన దండాయుధముతో చంపి దేవకుమారులకు ముక్తి కలిగిస్తాడు. తరువాత దేవసేనను వివహాము చేసుకుంటాడు. దీని అంతరార్థం - మాయ యొక్క ఆ మువ్వురు పుత్రులు సత్త్వ, రజస్తమో గుణాలకు ప్రతెవ్క. త్రిగుణాలకూ మూలం మాయే. జీవుడు నిరంతరం ఈ మాయ యొక్క ప్రభావానికి లోబడి వారి నాటకంలో పాత్రధారి అవుతాడు. పరబ్రహ్మమైన సుబ్రహ్మణ్యుడు జీవాత్మ యొక్క ప్రార్థన విని, వానిని ఈ త్రిగుణములనే మువ్వురు శత్రువుల బారి నుండి కాపాడతాడు, చివరకు ఆ జీవాత్మను పరిణయమనే కర్మ ద్వారా తనలో ఐక్యం చేసుకుంటాడు.

వల్లి తత్త్వము గురించి తెలుసుకుందాము.

ఆమె దట్టమైన అడవిలో వేటగాళ్ల మధ్య తన ధాన్యాన్ని పక్షుల నుండి రక్షించుకునేందుకు రాళ్లు/వడిసెల విసురుతూ ఉన్నా నిరంతరం సుబ్రహ్మణ్యుని ధ్యాసే. సుబ్రహ్మణ్యుడు వచ్చి ఆమెను పరి పరి విధాల (ఏనుగు వినాయకుని రూపము) పరీక్షించి, చివరకు తన రూపాన్ని బహిర్గతం చేసి, ఆమెను తీసుకువెళ్లే సమయంలో ఆమె తల్లిదండ్రుల నుండి వ్యతిరేకత రాగా, వారిని సంహరించి మరల వల్లి కోరగా వారిని బ్రతికిస్తాడు. ఇక్కడ ఆ దట్టమైన అడవి తమస్సు. వేటగాళ్లు రాజసము. వల్లి ఈ రెండిట గుప్పిట ఉన్న జీవాత్మ. ధాన్యాన్ని కాపాడే వృత్తి ఆమె పరబ్రహ్మను కనుగొనే సాధన. వచ్చే పక్షులు ఆమె సాధనకు అవరోధాలు. పక్షులనుండి కాపాడుకునేందుకు ఆమె చేతిలో ఉన్న వడిసెల, రాళ్లు వివేక వైరాగ్యములు. వానిని ఉపయోగించి ఆమె సాధనలోని అవరోధాలను పారద్రోలుతుంది. ఆమె సాధనను పరీక్షించటానికి స్వామి మారు వేషంలో వస్తాడు. ఏనుగు రూపం ద్వారా ఆమెకు ప్రణవాన్ని బోధిస్తాడు. అప్పుడు ఆమె చుట్టూ ఉన్న వేటగాళ్లు అనే రాజస గుణాలు నశిస్తాయి. ఆమె అప్పుడు శుద్ధ సత్త్వమవుతుంది, జీవాత్మ ముక్తిని పొంది పరబ్రహ్మతత్త్వంతో ఏకమవుతుంది.

ఇదీ సుబ్రహ్మణ్య తత్త్వంలోని విశిష్టత. అత్యంత నిగూఢమైన అవతారం కాబట్టే ఆయన గురుగుహుడైనాడు, వల్లీదేవసనలతో కలిసి ఇచ్చాక్రియా మరియు జ్ఞానశక్తులకు ప్రతీక పరిపూర్ణ దివ్య పరబ్రహ్మమైనాడు.

ఓం శరవణభవ! శ్రీ గురుభ్యోనమః!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి