29, ఆగస్టు 2020, శనివారం

రావే హిమగిరి కుమారి - శ్యామశాస్త్రి వారి స్వరజతి



రావే హిమగిరి కుమారి కంచి కామాక్షి వరదా
మనవి వినవమ్మ శుభమిమ్మ మాయమ్మ

నతజన పరిపాలినివనుచు నమ్మితిని సదా బ్రోవ
మదమత్త మహిష దానవ మర్దని వెతదీర్చవె దురముగను

కామపాలిని నీవే గతియని కోరితి కొనియాడితి వేడితి
కామితార్ధ ఫలదాయకియనేటి బిరుదీ మహిలో నీకే తగు

కమలముఖి దరగళ ఘన నీల కచభార మృగ విలోచన మణిరదనా
గజగమనా మదిలో నిను సదా తలుచుకొని నీ ధ్యానమే తల్లి
శ్యామకృష్ణ వినుత నా చింతను వేవేగ దీర్చభయమీయవే కళ్యాణి కంచి కామాక్షి నీ పాదమే దిక్కు

హిమవంతుని పుత్రికయైన, వరములనొసగే కంచి కామాక్షీ! రావే మాయమ్మా! నా మనవిని విని శుభములొసగుము. నుతించినవారిని పాలించే తల్లివని నిన్ను నమ్మినాను, నన్ను ఎల్లప్పుడూ బ్రోచుటకు రమ్ము. మదోన్మత్తుడైన మహిషాసురుని సంహరించిన తల్లివి, నా వెతలను వేగమే తీర్చుము. మన్మథుని కాపాడిన తల్లివి, నీవే నాకు గతియని కోరి నిన్ను నుతించినాను, వేడుకున్నాను. కామ్యములనొసగే తల్లివన్న బిరుదు ఈ భువిపై నీకే తగును.ఓ కంచి కామాక్షీ అమ్మా! కమలము వంటి ముఖము, సన్నని కంఠము, ఒత్తైన నల్లని కురులు, జింక వంటి కన్నులు, మణులవలె ప్రకాశించే పలువరుస కలిగి, ఏనుగువలె అందముగా నడిచే నిన్ను నేను మనసులో ఎల్లప్పుడూ తలచుకుంటూ ధ్యానము చేస్తున్నాను. శ్యామకృష్ణునిచే నుతించబడిన తల్లీ! నా చింతలను వేగముగా దీర్చగా అభయములీయుము, సమస్త శుభములు కలిగించే తల్లీ, నీ పాదములే నాకు దిక్కు.

తోడి రాగంలోని ఈ స్వరజతిని ఆలపించినవారు బాంబే జయశ్రీ గారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి