23, ఆగస్టు 2020, ఆదివారం

వాతాపి గణపతిం భజేహం -- ముత్తుస్వామి దీక్షితుల వారు

 

వాతాపి గణపతిం భజేహం వారణాశ్యం వరప్రదం శ్రీ

భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం
వీత రాగిణం వినుత యోగినం విశ్వకారణం విఘ్నవారణం

పురా కుంభసంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతం
మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్ర స్థితం
పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూపం వక్ర తుండం
నిరంతరం నిటల చంద్ర ఖండం నిజ వామకర విధ్రుతేక్షు దండం
కరాంబుజ పాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారం
హరాది గురు గుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం

గజముఖుడు, వరములనొసగే దైవమైన వాతాపి గణపతిని నేను భజించుచున్నాను. సమస్త భూతగణములచే పూజించబడిన చరణములు కలవాడు, పంచభూతాత్మకమైన ప్రపంచమును భరించేవాడు, మమకారమునకు అతీతమైనవాడు, యోగులచే నుతించబడేవాడు, విశ్వానికి కారణమైన వాడు, విఘ్నములను నివారించే వాడు అయిన వాతాపి గణపతిని నేను భజించుచున్నాను. కుంభసంభవుడైన అగస్త్య మునిశ్రేష్ఠునిచే పూజించబడిన సనాతనుడు, త్రికోణాకార మధ్యమంలో జాగృతమై యుండేవాడు, విష్ణువు మొదలైన ప్రముఖులచే ఉపాసించిబడినవాడు, మూలాధార క్షేత్రములో స్థితుడైనవాడు, పర పశ్యంతి మధ్యమ వైఖరీ వాక్‌స్వరూపుడు, ఓంకార స్వరూపుడు, వక్రతుండుడు, ఎల్లప్పుడూ తలపై చంద్రవంక కలిగిన వాడు, ఎడమ చేతిలో చెరకు గడతో ప్రకాశించేవాడు, కలువలవంటి చేతులలో పాశము, బీజఫలములు కలిగినవాడు, కలుషములు లేనివాడు, పంచభూతాత్మకుడు, పరమశివుడు మరియు కుమారస్వామి సంతోషించే రూపము కలవాడు, హంసధ్వని రాగముచేత అలంకరించబడిన వాతాపి గణపతిని నేను భజించుచున్నాను.


దీక్షితులవారి క్షేత్ర ప్రాధాన్య కృతులలో వాతాపి గణపతిం భజేహం కూడా ఒకటి. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరుచెంకాట్టంకూడి సమీపంలోని గణపతీశ్వర క్షేత్రంలోని గణపతిని వాతాపి గణపతి అంటారు. ఈ గణపతిని వాతాపి అనటానికి కారణం ఇక్కడ ఉన్న రూపం ఒకప్పుడు చాళుక్యుల రాజధాని అయిన బాదామి (దాని అసలు పేరు వాతాపి) నుండి ఈ విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించటం వల్ల. ఈ క్షేత్రంలో గణపతి పరమశివుని కొలిచినందున దీనికి గణపతీశ్వరం అని పేరొచ్చింది. ఈ గణపతిపై దీక్షితులవారు రచించిన కృతిలో గణపతి తత్త్వాన్ని మొత్తం ఆవిష్కరించారు. ముఖ్యంగా చరణంలో త్రికోణమధ్య గతం మరియు మూలాధార క్షేత్ర స్థితం అన్నవి గణపతి ఉపాసనలో ఆ దేవతాస్వరూపం యొక్క ప్రత్యేకమైన యంత్ర తంత్ర స్వరూపాలను తెలిపేవి. అలాగే పరాది చత్వారి వాగాత్మకం, ప్రణవ స్వరూప అన్న పదాలలో పరమాత్మ తత్త్వాన్ని ఆవిష్కరించారు. పరావాణిగా మూలాధార క్షేత్రమైన వెన్నెముక చివరి భాగము నుండి, పశ్యంతీ వాణిగా తరువాత మణిపూర చక్ర స్థానమైన నాభి నుండి, తరువాత హృదయ స్థానమునుండి మధ్యమవాణిగా, కంఠమునుండి వైఖరీవాణిగా ప్రకటిమయ్యే నాదస్వరూపం పరమాత్మ తత్త్వం. ప్రణవస్వరూపునిగా గణపతిని వర్ణించటం ఆయన రూపంతో పాటు, ఆయన లక్షణాలు, మహత్తుకు కూడా సారూప్యత కలిగి ఉండటం వలనే. గణపతి అథర్వ శీర్షంలో పది అనువాకములలో గణపతి తత్త్వాన్ని ఆవిష్కరించబడింది. ఆ అథర్వశీర్షం సారాన్ని గణపతి రూపవర్ణనలోనూ, తత్త్వావిష్కరణలోనూ దీక్షితుల వారు తు.చ. తప్పకుండా ఈ కృతి ద్వారా మనకు తెలియజేశారు. త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి, త్వం వాఙ్మయస్త్వం చిన్మయః, త్వం భూమిరాపోऽనలోऽనిలో నభః, త్వం మూలాధారే స్థితోऽసి నిత్యం, త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం మొదలైన అథర్వశీర్ష వివరణలను యథాతథంగా వాతాపి గణపతిం భజేహం కృతిలో ఆవిష్కరించారు దీక్షితుల వారు. దీనిని బట్టి వారి ఆధ్యాత్మిక ఔన్నత్యం, వారి జ్ఞానం మనకు తేటతెల్లమవుతాయి. ఉపాసనా మార్గంలో పరిపూర్ణత్వాన్ని పొందే ప్రయాణంలో దీక్షితుల వారు ఇటువంటి యంత్ర మంత్ర స్వరూప లక్షణాలను ఆవిష్కరించే కృతులను ఆయా క్షేత్రాలలో దేవతలను ఉపాసిస్తూ రచించారు. అందుకే దీక్షితులవారి కృతులు కర్ణాటక సంగీత ప్రపంచంలో ఉన్నతమైన స్థానం కలవి.

(రెండవ చిత్రం తిరుచెంకాట్టంగూడి గణపతీశ్వరంలోని వాతాపి గణపతి మూర్తి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి