శరవణ భవ! సమయమిదిరా! సరగున నన్ను బ్రోవరా!
పరమ పురుష! పశుపతి ప్రియ! సుర సేవిత! సుకుమారా!
రెల్లుగడ్డిలో జన్మించిన ఓ కుమారా! నన్ను బ్రోచుటకిది సమయము. శివునకు ప్రియకుమారుడవైన,దేవతలచే సేవించబడిన, సుకుమారుడవైన ఓ పరమ పురుషా! నన్ను బ్రోవుము. ఓ హరికేశపురమునకు అధినాయకుడవైన కుమారా! చిన్ననాటి నుండి నిన్నే స్మరించుచున్న వాడను. మరల మరల నీ మహిమలనే పలుకుచున్నాను. నన్ను ఈ సాగరాన్ని దాటించుకుటకు ఇది సమయము. వచ్చి బ్రోవుము.
కర్ణాటక సంగీత త్రయమైన త్యాగయ్య, దీక్షితులు, శ్యామశాస్త్రి తరువాత వాగ్గేయకారునిగా పేరొందిన వారిలో ముత్తయ్య భాగవతార్ గారు అగ్రగణ్యులు. 1877వ సంవత్సరంలో తమిళనాడులోని తిరునల్వేలిలో జన్మించిన వీరు పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు గారి ప్రభావంతో సంగీత సాధనలో ముందుకు వెళ్లారు. సంస్కృతము, తెలుగు, తమిళము, కన్నడ భాషలలో ప్రావీణ్యులు వీరు. మదురై, మైసూరు, ట్రావెన్‌కోర్‌లలో జీవించిన వీరు సంగీతంలో అసమాన ప్రతిభ కలవారు. 1927 ప్రాంతంలో మైసూరు మహారాజ జయచామరాజ వడయార్ వారి ఆస్థానంలో విద్వాంసునిగా ఎంతో పేరొందారు. 1938లో ట్రావెన్‌కోర్ వెళ్లి స్వాతి తిరునాళ్ సంగీత అకాడెమీకి తొలి ప్రధాన అధ్యాపకునిగా పని చేశారు. మహారాజా స్వాతి తిరునాళ్ వారి కీర్తనలను స్వరపరచి ప్రచారంలోకి తీసుకు వచ్చారు. ఎన్నో కీర్తనలను రచించి 1945లో పరమపదించారు. వీరి ముద్ర ఇంటి పేరైన హరికేశనల్లూరులోని "హరికేశ". వీరి రచనలలో హిమగిరి తనయే హేమలతే, సుధామయి సుధానిధి, అంబ వాణి నన్నాదరించవే, గం గణపతే మొదలైనవి. వీరు కూడా ముత్తుస్వామి దీక్షితుల వారివలెనే సుబ్రహ్మణ్య స్వామిని ఉపాసన చేసిన వారు.
పశుపతిప్రియ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రంజని-గాయత్రి సోదరీమణులు గానం చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి