19, ఆగస్టు 2020, బుధవారం

సీతారామ వైభవం - కన్యాదాన మంత్రం


ఒక్క మారు మన వివాహ వ్యవస్థకు మూలమైన సీతారాముల కల్యాణ ఘట్టంలోని కన్యాదాన మంత్రాన్ని స్మరించుకుని మనకు అన్వయించుకుందాం.

సీతారాముల కల్యాణం మనకందరికీ మహదానందకరమైనది. నిజమే, లోకాభిరామునికి, లోకపావనికి జరిగే కల్యాణం కదా! మరి, ఆ కల్యాణ సమయంలో కన్యాదాన మంత్రం నేడు సనాతన ధర్మ ప్రకారం జరిగే ప్రతి వివాహంలోనూ పఠించబడుతుంది. వివాహానికి మంత్రాలు పవిత్రతను చేకూర్చుతాయి, అది ఒక మహత్తరమైన కర్మ అవుతుంది. రెండు జీవులు ఒక ధర్మబద్ధమైన నడవడికకు ఆనాడు అంకురార్పణ చేసే శుభ సమయం అది. అర్థం తెలుసుకుంటే మన వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో అర్థమవుతుంది. అందులో వధువు తండ్రి తన బిడ్డను వరునికి అప్పగిస్తూ చెప్పే శ్లోకం అత్యంత ముఖ్యమైనది.

కన్యాదాన మంత్రం:

ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా

ఇదుగో మా అమ్మాయి సీత. నీకు ధర్మకార్య నిర్వహణలో సహచరిగా ఉపకరిస్తుంది. ఈమెను స్వీకరిస్తే నీకు శుభం కలుగుతుంది. ఈమెను పాణిగ్రహణం చేసి చేదోడు వాదోడుగా ఇద్దరూ జీవించండి.

సీతారామ సమాగమం సీతా సమేత అయిన రాముని అయనానికి మొదటి మెట్టు. ఈ సమాగమంలో రహస్యం, దీనికి గల ప్రాశస్త్యం జనకుడు పాణిగ్రహణ సమయంలో పై శ్లోకం ద్వారా చెప్పాడు. రాజర్షి జనకుడు చెప్పిన మాటలు మంత్రభావంతో మననం చేయదగినవి.

ఇందులో రామాయణ మహాయనమంతా సూక్ష్మంగా గోచరిస్తుంది. వాల్మీకి వర్ణించిన సీతారామ కల్యాణ ఘట్టానికి ప్రాణప్రాయమైంది ఈ శ్లోకం. ఇందులోని మొదటి పంక్తిలో ఇయం (ఈమె), మమ (నా), తవ (నీ) అని మూడు సర్వనామాలున్నాయి. ఇవి కేవలం సీత, జనకుడు, రామునికే కాదు సమస్త మానవాళికి వర్తిస్తాయి. మా అమ్మాయి సీత, మా ఇంట్లో పెరిగి మీ ఇంటికి వచ్చుచున్నది. ఎందుకు? ధర్మం నిలబెట్టేందుకు. ఈమె యందు నీకు పరిపూర్ణమైన అనురాగం (ఇచ్ఛ) ఉంటే నీకు శుభం కలుగుతుంది. ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, మీ ఇరువురి మధ్య ఇచ్ఛాశక్తి దృఢంగా ఉంటే మీకేమీ అపాయం లేదు. ఇచ్ఛకు, ప్రతీచ్ఛకు మధ్య చిన్న పెద్ద, హెచ్చు తగ్గులు, హానివృద్ధులు ఉండే అవకాశం లేదు. సమరసభావం సహచరుల జీవితానికి సంతోషం, సార్థక్యం సమకూర్చగలుగుతుంది. ఇదీ జనకుని మాటల ఆంతర్యం.

సాక్షాత్తూ పరమేశ్వరి తన యింట పెరిగినందుకు, అలాంటి సీతమ్మను పరమేష్ఠి స్వరూపుడైన రాముని చేతుల్లో పెడుతూ జనకుడు ఎంతగా పొంగిపోయి ఉంటాడో, మమ సుతా అన్న చిన్న వాక్యం చెబుతుంది. ఇయం సీతా అనటంలో సీతాదేవి పుట్టుపూర్వోత్తరాలు, తవ అనే మాటలో దశరథనందనుని ఘనత వెయ్యి విధాల వ్యక్తమవుతున్నట్లు భావించాలి.

ఇక్కడ పారమార్థం ఏమిటి?

ఇది ఒక లోకోత్తరమైన భావ భూమిక. ఇందులో పార్థివమైన సౌందర్యానికి, సంతోషానికి తావులేదు. అది మహానంద నిలయము. సీతారాముల అద్వైత రససిద్ధికి ఆధారభూతమైన జీవధార. మట్టిలో పుట్టి మట్టిలో లయమైన జానకి జీవితమంతా ఆ జీవధారకే అంకితమైంది. సూర్యవంశంలో ప్రభవించిన శ్రీరామచంద్రమూర్తి వెలుగులకు వెలుగును ప్రసాదించిన వేవెలుగైతే, భూసారం నుండి ప్రభవించిన సీతాదేవి ఆ వెలుగులో వెలసిన వెలలేని వేల్పు. ఆకాశం శూన్యం, ధరణి పరిపూర్ణం. శూన్యాన్ని పరిపూర్ణంతో సమీకరించే సుందర సన్నివేశం సీతారామ సమాగం.

దీనిని మనం ఎలా అన్వయించుకోవాలి?

పురుషుని కర్తవ్య నిర్వహణలో స్త్రీది ఎంతటి ముఖ్యమైన పాత్రో ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవాలి. పురుషార్థములలో అత్యంత ముఖ్యమైన ధర్మాచరణకు స్త్రీ, ఆ స్త్రీ సాహచర్యంలో తాను ధర్మాన్ని నిర్వర్తిస్తూ అభ్యున్నతి పొందే అద్భుతమైన మార్గం ఈ వివాహ వ్యవస్థ. కన్యాదాత బిడ్డను మనకు అమ్మటమూ లేదు, మనము కొనుక్కోవటమూ లేదు. సమస్త విద్యలను, ధర్మాలను బోధించి శక్తి స్వరూపిణి అయిన ఒక కన్యను పురుషార్థియై వచ్చిన వరునికి అప్పగించి, కర్తవ్య నిర్వహణ, ధర్మాచరణ చేయటానికి మహోపకారం చేస్తున్నాడు వధువు తండ్రి, అనగా మామగారు. మరి అటువంటి కన్యాదాతను ఎలా గౌరవించాలి? నిరంతరం కృతజ్ఞతతో వ్యవహరించాలి. అలాగే, ధర్మాచరణలో సహాయకారి అయిన భార్యను ఎలా చూసుకోవాలి? జనకుడు చెప్పినట్లు అన్యోన్య భావనతో, పరస్పరేచ్ఛాచరణతో. స్త్రీలేని పురుషునికి ధర్మాచరణలో పరిపూర్ణత ఎక్కడ? కర్మ సాఫల్యమెక్కడ?

ఇదే మన వివాహ వ్యవస్థ గొప్పతనం. దీనిని వక్రీకరించి, వివాహమంటే ఒక ఆడంబరం చేసి, మంత్రార్థం మరచి, పవిత్రతను కాలరాసి, దారుణాలకు ఒడిగడుతున్న స్త్రీపురుషులకు ఈ మంత్రమొక కనువిప్పు. ఈ ఒక్క మంత్రార్థం తెలుసుకుంటే చాలు, ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొనగలరు. ఇదే మన వివాహ వ్యవస్థకు, కేవలం ఒడంబడికలైన ఇతర వ్యవస్థలకు తేడా. ఇందులో స్త్రీలకున్న స్థానం, గౌరవం మరెక్కడా లేదు. దానిని వికృతం చేసే వ్యవస్థను సనాతన ధర్మ వ్యవస్థగా చిత్రీకరించే వారికి సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతో ఉంది.

సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి