30, ఆగస్టు 2020, ఆదివారం

సిద్ధివినాయకం అనిశం - దీక్షితుల వారి కృతి


కర్నాటక సంగీత వాగ్గేయకారులు ముత్తుస్వామి దీక్షితుల వారి గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. ఆయన మన పండుగలు, వ్రతాల ప్రస్తావన తన కృతులలో చేశారు. అటువంటి కృతులలో ఒకటి సిద్ధి వినాయకం అనిశం అన్నది. షణ్ముఖప్రియ రాగంలో కూర్చబడిన ఈ కృతిలో వినాయక చతుర్థి ప్రస్తావన ఉంది. దీక్షితులవారి కృతులలో ప్రత్యేకతలు - రాగ ప్రస్తావన, ఆయా దేవతల తంత్రము, స్వరూపమును ప్రస్తావించటం. ఈ కృతిలో చామర అన్న పదంలో రాగ ప్రస్తావన చేశారు. షణ్ముఖప్రియ రాగానికి చామరం అని కూడా పేరుంది. అలాగే, మూలపంకజ మధ్యస్థం అని అనుపల్లవిలో ప్రస్తావించి మూలాధార చక్రములో నివసించే గణపతి రహస్యాన్ని తెలిపారు. మోదక హస్తం, పాశాంకుశ ధరం, చతుర్భుజం అన్న పదాల ద్వారా గణపతి స్వరూపాన్ని ఆవిష్కరించారు. అలాగే, వినాయకచవితి ప్రస్తావన, అద్రిరాజ సుతాత్మజం అని గణపతి ఆవిర్భావం, రౌహిణేయనుజార్చితం అన్న పదం ద్వారా శ్రీకృష్ణునిచే పూజించబడిన వాడని శమంతకోపాఖ్యానం గురించి ప్రస్తావించారు. ఈ విధంగా మొత్తం గణపతి తత్త్వాన్ని దీక్షితుల వారు ఈ కృతి ద్వారా మనకు అద్భుతంగా తెలియజేశారు. వినాయకచవితి సందర్భంగా ఈ కృతి సాహిత్యం, భావం.

సిద్ధి వినాయకం అనిశం చింతయామ్యహం ప్రసిద్ధ గణనాయకం విశిష్టార్ధ దాయకం వరం

సిద్ధ యక్ష కిన్నెరాది సేవితమఖిల జగత్ప్రసిద్ధ మూల పంకజ మధ్యస్థం మోదక హస్తం

భాద్రపద మాస చతుర్ధ్యాం బ్రాహ్మణాది పూజితం పాశాంకుశ ధరం ఛత్ర చామర పరివీజితం
రౌద్రభావ రహితం దాస జనహృదయ విరాజితం రౌహిణేయానుజార్చితం ఈషణ వర్జితం
అద్రిరాజ సుతాత్మజం అనంత గురుగుహాగ్రజం భద్రప్రద పదాంబుజం భాసమాన చతుర్భుజం

గణాధిపతిగా ప్రసిద్ధుడై విశిష్టమైన ఫలములనొసగే సిద్ధి వినాయకుని నేను ఎల్లప్పుడూ ధ్యానించుచున్నాను. సిద్ధులు, యక్షులు, కిన్నెరులు మొదలైన వారిచే పూజించబడేవాడు, జగత్ప్రసిద్ధుడైనవాడు, మూలాధార చక్రములో నాలుగు దళముల పద్మములో స్థితుడైనవాడు, చేతిలో మోదకము కలిగిన సిద్ధి వినాయకుని నేను ఎల్లప్పుడూ ధ్యానించుచున్నాను. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు బ్రాహ్మణులచే పూజించబడేవాడు, పాశము, అంకుశము ధరించినవాడు, ఛత్ర చామరములచే వీచబడేవాడు, రౌద్ర భావము లేనివాడు, భక్తుల హృదయములలో వెలసి ఉండేవాడు, బలరాముని సోదరుడైన కృష్ణునిచే పూజించబడినవాడు, రాగమును త్యజించినవాడు, హిమవంతుని కుమార్తె అయిన పార్వతి పుత్రుడు, నాశనము లేనివాడు, సుబ్రహ్మణ్యుని అగ్రజుడు, రక్షణనొసగే పాదపద్మములు కలిగినవాడు, నాలుగు హస్తములతో ప్రకాశించే సిద్ధివినాయకుని నేను ఎల్లపుడూ ధ్యానించుచున్నాను.

షణ్ముఖప్రియ రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి