శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే
శ్రీ సారస పదే రసపదే సపదే పదే పదే
భావజ జనక ప్రాణ వల్లభే సువర్ణాభే
భానుకోటి సమాన ప్రభే భక్త సులభే
సేవకజన పాలిని శ్రిత పంకజ మాలిని
కేవల గుణశాలిని కేశవ హృత్కేళిని
శ్రావణ పౌర్ణమీ పూర్వస్థ శుక్రవారే
చారుమతీ ప్రభ్రుతిః పూజితాకారే
దేవాది గురు గుహ సమర్పిత మణిమయ హారే
దీనజన సంరక్షణ నిపుణ కనక ధారే
భావనాభేద చతురే భారతీ సన్నుత వరే
కైవల్య వితరణపరే కాంక్షిత ఫలప్రదకరే
సకల సంపదలను కలిగించే వరమహాలక్ష్మికి నమస్కారములు. కలువల వంటి అందమైన పాదములు కలిగిన, తీయని పలుకులు పలికే ఆ తల్లికి పదే పదే నమస్కారములు. మన్మథుని తండ్రియైన శ్రీమహావిష్ణువు పత్నియైన, బంగారు కాంతితో కోటి సూర్యుల ప్రకాశం కలిగిన, భక్తులకు సులభయమైన, సేవక జనులను పాలించే, భక్తులచే కలువల మాలలతో పూజించబడే, సకల శుభ గుణసంపన్నురాలైన, కేశవుని హృదయములో ఆటాడే ఆ వరమహాలక్ష్మికి నమస్కారములు. శ్రావణ పౌర్ణమి ముందటి శుక్రవారమునాడు చారుమతి మొదలైన వారిచే పూజించబడిన, దేవతలు, కుమారస్వామిచే మణిఖచితమైన హారములను స్వీకరించిన, దీనులను రక్షణలో నిపుణురాలైన, దారిద్య్రంలో ఉన్నవారికి కనకధారను కురిపించే, విచక్షణలో చతురురాలైన, సరస్వతిచే కొలువబడిన, మోక్షాన్ని ప్రసాదించే పరదేవతయైన, కోరిన కోర్కెలు తీర్చే వరమహాలక్ష్మికి నమస్కారములు.
ముత్తుస్వామి దీక్షితుల వారి ఈ కృతి వరలక్ష్మి గురించి ప్రత్యేకంగా వ్రాయబడింది. శ్రీరాగంలో అందంగా కూర్చబడిన ఈ కృతిలో వరలక్ష్మీ వ్రతం శ్రావణ పౌర్ణమి ముందటి శుక్రవారం నాడు జరుపుకోవటం గురించి ప్రస్తావన ఉంది. దీక్షితులవారు సిద్ధులు. అందుకే వారి నోట వచ్చిన పలుకులు దేవతా నివాసాలైనాయి. అటువంటిదే ఈ మహాలక్ష్మి స్తుతి. పల్లవి-అనుపల్లవిలోనే ఆయన పొందిన అనుభూతిలోని ఆధ్యాత్మిక ఔన్నత్యం మనకు అర్థమవుతుంది. వసుప్రదే, శ్రీ సారస పదే, సపదే, పదే పదే అన్న పదప్రయోగంలో దీక్షితులవారి ఉపాసనా శక్తి ప్రతిబింబిస్తుంది. చరణాలలో ఆయన సంస్కృత భాషా వైభవం సువర్ణమయమై ప్రకాశిస్తుంది. నన్ను బాగా ప్రభావితం చేసిన పదాలు కేశవ హృత్కేళిని మరియు భావనాభేద చతురే అన్నవి. శ్రీమహావిష్ణువు హృదయంలో ఆడుకునే తల్లిగా దీక్షితులవారు అమ్మను వర్ణించారు. నిజమే. ఆ పరమాత్మ హృదయస్థానంలో నిలిచి ఆయనను నిత్యం రమింపజేసే తల్లికి ఆ పదం ఎంత సముచితం కదా? భావనలలో భేదాన్ని చూపించటం చతురత కలిగిన తల్లిగా వాగ్గేయకారులు స్తుతించారు. అంటే భక్తుల భావనలను బట్టి అనుగ్రహించే తల్లి అని నా అభిప్రాయం. అలాగే దుష్టశిక్షణలో పరమాత్మకు తోడుగా, భక్తసులభగా, స్వామికి హృదయేశ్వరిగా నిత్యం సేవించే తల్లికి ఎన్ని లక్షణాలో. అందుకే గుణశాలిని అని మొదటి చరణంలో చెప్పి రెండవ చరణంలో భావనా భేద చతురే అని సంపూర్ణం చేశారు. కృతి ఆఖరి పంక్తిలో కైవల్య వితరణ పరే కాంక్షిత ఫలప్రదకరే అని పలికి పరము ఇహము రెండితా మన కోరికలను తీర్చే కల్పవల్లిగా ఆ వరమహాలక్ష్మిని కొనియాడారు. ఇటువంటి భావనలు ఉపాసనలో సిద్ధి పొందిన వారి నోట మాత్రమే ఆవిష్కరించబడుతాయి. దీక్షితుల వారి ఆధ్యాత్మిక సంపదకు శతసహస్ర వందనాలు.
అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు. శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం అనే కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఆలపించగా వినండి.
మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నీచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్!
ప్రసాద్ గారు. అమృత తుల్యమైన కీర్తన. వివరణ బాగుంది.
రిప్లయితొలగించండికొన్ని సవరణలు : శ్రిత పంకజ మాలిని, కేశవ హృత్కేళిని అని ఉండాలి. కీర్తనలో అంతటా సంబొధనా ప్రథమా విభక్తిలో అమ్మవారిని స్తుతించబడింది. గమనించాలి.
బాలమురళి గానం మధురం.
ధన్యవాదాలండీ. సరిచేశాను.
రిప్లయితొలగించండి