RightClickBlocker

24, జనవరి 2011, సోమవారం

త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు - ఘన రాగ పంచ రత్న కీర్తన - ఎందరో మహానుభావులు

సంగీత త్రిమూర్తులు ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజు, శ్యామ శాస్త్రి
పంచరత్న కీర్తనలలో ఆఖరిది ఎందరో మహానుభావులు. ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క ఆణిముత్యము. మరి చివరిది ఖచ్చితంగా అతి మధురమైనది, అత్యంత ప్రజాదరణ పొందినదే. ఎందుకంటే అందులో భక్తులు, భగవంతుడు - ఇద్దరినీ పూర్తి నిజ దాస భావనతో నుతించారు త్యాగరాజు.  కీర్తన సాహిత్యము, అర్థము, పరిశీలన.

ఎందరో మహానుభావులు అందరికి వందనములు

చందురు వర్ణుని అంద చందమును హృదయార
విందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారు (ఎందరో)

సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యులు (ఎందరో)

మానస వన చర వర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగనే వారు (ఎందరో)

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వారు (ఎందరో)

పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతోను
బాడుచును సల్లాపముతో స్వర లయాది రాగములు దెలియు వారు (ఎందరో)

హరి గుణ మణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో
చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వారు (ఎందరో)

హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచును పులక
శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు (ఎందరో)

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక కశిపుసుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక (ఎందరో)

నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవుయను
వచన సత్యమును, రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల
జేసినట్టి నీమది నెరింగి సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు వారు (ఎందరో)

భాగవత రామాయణ గీతాది శ్రుతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల
గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబుల నెరిగి భావ రాగ లయాది
సౌఖ్యముచే చిరాయువుల గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారు (ఎందరో)

ప్రేమ ముప్పిరి గొను వేళ నామము దలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైన వారు (ఎందరో)


అర్థము: 

ఎందరో మహానుభావులు. వారందరికీ నా నమస్కారములు.

పూర్ణ చంద్రుని వలె అందము చందము కల్గిన శ్రీ రాముని తమ హృదయ కమలమున కాంచి ఎల్లప్పుడూ ఆ బ్రహ్మానందమున మునిగి యుండు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

సామగాన లోలుడు, మన్మథుని సౌందర్యము కలిగిన వాడును అయిన శ్రీరాముని సౌందర్యమును చూసే ధన్యతను పొందిన ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

మనస్సు అనే కోతి యొక్క చంచలమైన స్వభావాన్ని, ఆలోచనలను స్థిరము చేసి, శ్రీరాముని దివ్య రూపమును దర్శనాన్ని బాగుగా పొందేవారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

వేరే ఆలోచన చేయక, తన హృదయమనే కమలమును ఆ శ్రీ రాముని పాదములకు సమర్పణ చేసే వారెందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

పతితపావనుడు, పరాత్పరుడు అయిన శ్రీ రామచంద్రుని పరమార్థమైన సన్మార్గముతో భక్తి కలిగి, స్వరము, లయ మొదలగు సంగీత జ్ఞానముతో కీర్తిస్తూ, భజన చేసే వారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

శ్రీహరి గుణ గణముల కీర్తనలనే మనులచే పొదగబడిన హారములను గళములో ప్రకాశింప చేసుకొనుచున్న భక్త కోతులు, ఈ భూమిపై కరుణతో, స్నేహ భావముతో ఈ జగమునంతా తీయని చల్లని చూపులచే రక్షించు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

సొగసుల, హొయల నడకలు కలిగినవాడు , సరసుడు, వెన్న వంటి హృదయము కలవాడు అయిన శ్రీరాముని ఎల్లప్పుడూ కన్నులతో చూస్తూ, శరీరము పులకించి, ఆనందమనే సాగరములో ఓలలాడుచు యశము కలవారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

పరమ భక్తులు, మునులు, మహర్షులు, సూర్య చంద్రులు, సనక సనందులు, దిక్పాలకులు, దేవతలు, కింపురుషులు, ప్రహ్లాద, నారద తుంబురులు, హనుమంతుడు, శివుడు, శుకుడు, బ్రహ్మ, బ్రాహ్మణులు, పరమ పవిత్రులు, శాశ్వతులు, ఘనులు, శ్రీరామ నామమును చేయుచు బ్రహ్మానందమును ఎల్లపుడు పొందేవారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

 నీ శరీరము, నామము యొక్క వైభవము, నీ శౌర్యము, ధైర్యము, శాంత హృదయము, దాన గుణము మొదలైన వేవ వాక్కుల వంటి నిజాములు నీ యందు అపారమైన భక్తిని కలుగ చేయునవి. నాస్తికులను సైతం ఆస్తికులుగా, శ్రీరామ భక్తులుగా మార్చుతున్నవి. అటువంటి నీ మనస్సును తెలిసి సంతోషముతో నీ గుణగణములను కీర్తించుచు, భక్తి పారవశ్యములో పాడుచు, భజనానందమున, సంతృప్తి పొందే వారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

భావతము, రామాయణము, భగవద్గీత, వేదములు, శాస్త్రములు, పురాణములు, వాటి రహస్యములు, శైవము, శాక్తేయము, కుమారము, గణపతి, విష్ణు, సూర్య మొదలగు దేవతా విధానములను పాటించే మతముల యొక్క పరమార్థములను, రహస్యములను తెలిసి, సకల దేవతల అంతరంగముల భావములను తెలిసి, సంగీతము, లయ భావముల ఆనంద సాగరములో మునకలు వేయుచు, చిరంజీవులై నిరవధికమైన సుఖము కలిగిన వారి, త్యాగరాజునికి ఆప్తులైన వారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

ప్రేమ పరిపూర్ణము చెందిన భక్తులు, శ్రీరాముని నామ స్మరణ చేయుచు, శ్రీ త్యాగరాజునిచే నుతింప బడిన, శ్రీ రాముని నిజదాసులైన  వారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.


పరిశీలన:

ఈ కీర్తన పూర్తిగా రామ భక్తి సామ్రాజ్యములోని దైవము, దాసుల మహత్త్వమును గురించే. ఆ రాముడి గుణాలు, మహిమల వర్ణన, ఆ రాముని కొలిచే భక్త కోటి యొక్క గొప్పతనం అద్భుతమైన పదజాలంతో, అసామాన్యమైన భక్తి, వినమ్ర భావనతో త్యాగయ్య ఈ కీర్తన రచించారు. రామభక్తిలో మునిగితేలే భక్తుల గుణాలను వివరముగా పది చరణాలలో వర్ణించారు త్యాగయ్య.

అనుపల్లవి, మొదటి చరణం - ఆ రాముని అందమును తమ హృదయములలో చూసి బ్రహ్మానందము పొందేవారు, ధన్యతను పొందేవారు కొందరట. హృదయాన్ని కమలముతో పోల్చటం కవులకు పరిపాటి. ఆ ఉపమానాన్ని అద్భుతంగా తన కీర్తనలలో ఉపయోగించారు కవి త్యాగరాజు. భక్తి పారవశ్యంలో మునిగితే మరి అటువంటి పదాలు ముత్యాల పేర వస్తాయేమో?

మూడవ చరణం గమనించండి. స్వాంతమను సరోజమును సమర్పణము - ఎంత అందమైన భావ వ్యక్తీకరణ? ఎంత మానసిక వికాసము, దైవానుభూతి ఉంటే ఈ పవిత్రమైన శరీరమును, దాని హృదయమును రాముని అర్పించగలము?

నాలుగవ చరణంలో - జీవన సత్యమైన, పరమార్థమైన ఆ రాముని గూర్చి పూర్తి శరణాగతితో రాగము, శృతి, లయలతో పాడుతూ, ఆడుతూ నుతించే వారు ఎంతోమంది. ఈ భావము మీకు ఇప్పుడు కూడా కొంత మంది కళాకారులలో స్పష్టంగా అగుపిస్తుంది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, బాలమురళీ కృష్ణ వంటి కళాకారులు గానం చేసిన దృశ్య శ్రవణం చూడండి. వారిలో ఇదే తాదాత్మ్యత, కదలికలు, సుస్వర శృతి బద్ధ లక్షణాలు నూరు శాతం కనిపిస్తాయి. అటువంటి మహానుభావులకు ఈ కీర్తన ద్వారా వందనాలు సమర్పించారు త్యాగయ్య వారు.

ఐదవ చరణంలో - ఇటువంటి మహానుభావులు తమ స్నేహ భావముతో, మేధస్సుతో, కరుణతో ఈ కల్లోలిత ప్రపంచముపై చల్లని చూపులు ప్రసరిస్తారుట. ఎంత నిజం చెప్పారు త్యాగయ్య?. భక్తి పారవశ్యంలో మునిగిన ఒక సుబ్బులక్ష్మి వంటి కళాకారిణి కళ్లలో, పాటలో శిలనైనా కరిగించే కరుణ, ప్రేమ కనిపిస్తుంది మనకు.

ఆరవ చరణంలో - సకల సుగుణాభిరాముని, సౌందర్య మూర్తియైన రాముని కదలికలు కళ్ళతో చూస్తూ, శరీరము పులకించి ఆనంద సాగరంలో మునిగి కీర్తి పొందేవారు ఎంతో మంది కళాకారులు. భక్తిలో ఇటువంటి భావన ఎంతో సులభం. సర్వం బ్రహ్మమయం అని భావించి నుతిస్తే ఆ ఆనందం వర్ణనాతీతం అని త్యాగయ్య ఈ చరణంలో హృద్యంగా చెప్పారు.

ఏడవ చరణంలో - ఇక ఎవరూ ఆ మహానుభావులు?  - భక్తులు, మునులు, ఋషులు, దేవతలు, దిక్పాలకులు, వివిధ దేవ సమూహము, స్వయముగా శివుడు, బ్రహ్మ మొదలగు వారు. వీరంతా ఆ శ్రీహరి భక్తి సామ్రాజ్యంలో సేవకులే. ఇటువంటి వారు మరి ఘనులు, శాశ్వతులు, బ్రహ్మానందులు అని మనోజ్ఞమైన పదములు, భావనతో నుతించారు త్యాగయ్య.

ఎనిమిది, తొమ్మిది చరణాలు - ఇంత గొప్ప వైభవమున్న ఆ పరమాత్ముని లక్షణములు ఆస్తికులకు, చెడ్డవారికి కూడా భక్తి భావన కలిగిస్తాయిట. దీనికి మన శృతి శాస్త్ర పురాణాలలోని ఎన్నో గాథలు నిదర్శనము. భాగవతము, రామాయణము, గీత మొదలైన శాస్త్రముల సారము, రహస్యములు, వివిధ మతముల రహస్యములు, ముక్కోటి దేవతల అంతరంగములు తెలుసుకుని రాగము, లయలతో కీర్తించి, నుతించే వారు దీర్ఘాయుష్షు కలిగి త్యాగరాజునికి ఆప్తులు.

మరి త్యాగయ్య, శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, వీరి కన్నా  ముందు పురందరదాసు, భక్త రామదాసు, వ్యాసరాయలు - ఇలా ఎంతో మంది పరమాత్మ గుణ కీర్తన చేస్తూ భక్తి సామ్రాజ్యంలో తరించారు. వారందరికీ ఈ కృతి ద్వారా వందనములు. ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో, అనిర్వచనీయమైన అనుభూతిలో, పదాలు ఆ రామునిచే రాయబడినవా అనేంత రమ్యంగా, శ్రావ్యంగా త్యాగరాజు కృతి రచన చేశారు. అందమైన శ్రీరాగంలో ఈ కీర్తన కూర్చబడినది.  హైదరాబాద్ సోదరులు శేషాచార్యులు, రాఘవాచార్యులు గారి గళంలో ఈ కీర్తన విని ఆనందించండి. ఎందరో మహానుభావులు అందరికి వందనములు.

3 వ్యాఖ్యలు: