3, మే 2015, ఆదివారం

బాలమురళీరవం - ఓంకార ప్రణవ నాదోద్భవ



మంగళంపల్లి బాలమురళీకృష్ణ - పేరు వినగానే చిద్విలాసమైన మోము, అలవోకగా స్వరరసామృతాన్ని పలికించే నిత్యయవ్వన గళం, ఆయన తిల్లానాలు, ప్రయోగాలు, సుస్ఫష్టమైన తెలుగు ఉచ్ఛారణ - గుర్తుకు వస్తాయి. ఆయన 1930 జులై 6వ తేదీన ఇప్పటి తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా శంకరగుప్తం గ్రామంలో పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు మురళీకృష్ణ అని నామకరణం చేశారు. తండ్రి పట్టాభిరామయ్య  వేణువు, వీణ, వయోలిన్ వాయించేవారు. తల్లి కూడా వీణా ప్రావీణ్యం కలిగిన వారు. ఆ పిల్లవాడు జన్మించిన 15రోజులకే తల్లి మరణించటంతో తండ్రి పట్టాభిరామయ్య గారు పిల్లవాడితో విజయవాడ వెళ్లారు. బాలుడిలో ఉన్న సంగీత జిజ్ఞాస చూసి తండ్రి అతనిని ప్రఖ్యాత సంగీత విద్వాంసులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి వద్ద శిక్షణకు చేర్పించారు. 

ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల వయసులోనే బాలుడు మురళి విజయవాడ త్యాగరాజ ఆరాధనోత్సవాలలో కచేరీ చేశాడు. అతనిలోని ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత హరికథా కళాకారులు శ్రీ ముసునూరి సూర్యనారాయణమూర్తి భాగవతార్ గారు ఆయన పేరు ముందు బాల చేర్చారు. అప్పటినుండి బాలమురళీకృష్ణ ఆయన పేరుగా చెప్పుకోబడింది. ఆరవ తరగతితో విద్యాభ్యాసం ఆపివేసి పూర్తిగా సంగీతాభ్యాసంపై దృష్టిపెట్టిన బాలమురళీకృష్ణ గారు 15 ఏళ్ల వయసుకే 72 మేళకర్త రాగాలనూ నేర్చుకుని వాటిలో కృతులను స్వరపరచారు. గాత్ర సంగీతంతో పాటు వయోలిన్, మృదంగం, కంజీరలో కూడా ఆయన ప్రావీణ్యం పొందారు. లబ్ధప్రతిష్ఠులైన భీంసేన్ జోషీ, హరిప్రసాద్ చౌరాసియా వంటి హిందూస్థానీ విద్వాంసులతో జుగల్‌బందీ కచేరీలు చేశారు. ఇప్పటి వరకు ఆయన ప్రపంచం నలుమూలలా దాదాపుగా 25000 కచేరీలు చేశారు. 400కు పైగా అద్భుతమైన కృతులను రచించారు. ఎన్నో కొత్త రాగాలను కనిపెట్టారు. 

కర్ణాటక సంగీత ప్రస్థానంతో పాటు బాలమురళి గారు సినీ నటునిగా, నేపథ్య గాయకునిగా కూడా పేరొందారు. సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ సినిమా రంగాలలో 400కు పైగా పాటలను పాడారు. ఎన్నో అవార్డులను పొందారు. 1960 దశకంలో విజయవాడ, హైదరాబాదు ఆకాశవాణి కేంద్రాలలో సంగీత దర్శకునిగా పనిచేస్తూ భక్తిరంజని కార్యక్రమం ద్వారా ఎన్నో అద్భుతమైన గీతాలను మనకు అందించారు. విజయవాడ సంగీత కళాశాలలో, తదుపరి చెన్నై సంగీత కళాశాలలో పని చేసి చెన్నైలో స్థిరపడ్డారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఆస్థాన విద్వాంసునిగా, తిరుమల తిరుపతి దేవస్థానం, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం  మరియు  శృంగేరి శారదా పీఠంలో ఆస్థాన విద్వాంసునిగా పని చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయము, చెన్నై విశ్వవిద్యాలయము నుండి గౌరవ డాక్టరేట్ పట్టా పొందారు. ఎన్నో ప్రఖ్యాత విద్యాసంస్థలనుండి డి. లిట్  పట్టా పొందారు. 

నర్తకి, సునాదవినోదిని వంటి మరుగున పడ్డ ఎన్నో రాగాలను పునరుద్ధరించారు. మహతి, లవంగి, మనోరమ, మురళి, ఓంకారి, ప్రతిమధ్యమావతి, రోహిణి, సర్వశ్రీ, సుముఖం, సుష్మ, గణపతి, సిద్ధి, పుష్కర గోదావరి వంటి ఎన్నో కొత్త రాగాలను కనిపెట్టి స్వరపరచారు. మిలే సుర్ మేరా తుమ్హారా అనే అద్భుతమైన గీతం ద్వారా భారతీయ సమైక్యతను చాటారు. దూరదర్శన్‌లో స్వరరాగసుధ అనే కార్యక్రమం ద్వారా సినీ సంగీతంలో శాస్త్రీయ సంగీత పాత్రను వివరించి ప్రజలను అలరించారు. 

భారత ప్రభుత్వం వారి పద్మశ్రీ అవార్డును 1971లో, సంగీత కళానిధి బిరుదును 1978లో, పద్మవిభూషణ్ అవార్డును 1991లో పొందారు. అంతే కాకుండా, రోటరీ కాంటినెంటల్ సెంటినరీ అవార్డు 2004లో, భారత ప్రభుత్వం వారి నేషనల్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా అవార్డును 2004లో, కంచి కామకోటి పీఠం వారి జీవిత సాఫల్య పురస్కారాన్ని 2004లో, మాధవపెద్ది సత్యం అవార్డును 2003లో, మహారాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తమ వాగ్గేయకార అవార్డు 2003లో,నాదలయ శిరోమణి అవార్డు 2003లో, ఒడిషా ప్రభుత్వం వరి దేశ్ రత్న అవార్డును 2002లో,మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వారి కాళిదాస్ సమ్మాన్ అవార్డును 2001లో, 2001లో తెలుగు విశ్వవిద్యాలయం వారి విశిష్ట పురస్కారాన్ని, గానయోగి పంచాక్షరేశ్వర అవార్డు 1999లో, బెజవాడ గోపాలరెడ్డి అవార్డు 1999లో, ఇందిరా ప్రియదర్శిని అవార్డు 1998లో, గాన కళాప్రపూర్ణ బిరుదును 1991లో, భారత రాష్ట్రపతి స్వర్ణ పతకాన్ని 1953లో పొందారు.  

సంగీత నాటక అకాడెమీ ఫెలోషిప్, కేంద్ర సంగీత నాటక అకాడెమీ, ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ  ప్రభుత్వాల సంగీత నాటక అకాడెమీ అవార్డులు, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, హృదయనాథ్ మంగేష్కర్  అవార్డు, మహారాష్ట్ర గవర్నర్‌చే నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు, యునెస్కో వారి గాంధీ మెమోరియల్ అవార్డు, కర్నాటక ప్రభుత్వం వారి పురందర ప్రశస్తి అవార్డు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిచే ఆత్మ గౌరవం అవార్డు, జాతీయ స్థాయిలో ఉత్తమ నేపథ్య గాయకుడు (కన్నడ చిత్రం హంసగీతె), ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు (సంస్కృత  చలన చిత్రం మధ్వాచార్య), ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ ప్రభుత్వం వారి ఉత్తమ నేపథ్య గాయకుని అవార్డు తమ సుధీర్ఘమైన సంగీత ప్రస్థానంలో పొందారు. సంగీత యోగి శిరోమణి, సంగీత కళా శిఖామణి, భారత కళారత్న, ఇసై పెరరిఙ్గార్, గాన సార్వభౌమ, సంగీత కళా విశారద, భారత జ్యోతి, సంగీత  విద్యానిధి, మొట్టమొదటి సమకాలీన వాగ్గేయకారుడు, సంగీత కళారత్న,కళారత్న, సంగీత సాగర, నాదబ్రహ్మాం, గాయకరత్న, ఇసైసెల్వం, గంధర్వ గాన విశారద, గాన సుధాకర, సంగీత కళానిధి, సంగీత భూపతి, మధుర గాన రవళీకృష్ణ, సంగీత సార్వభౌమ, సంగీత మహోపాధ్యాయ, అన్నమాచార్య విద్వన్మణి, నాదయోగి, నాద సుధార్ణవ, అద్వితీయ శతాబ్ది గాయక, గంధర్వ గాన కళానిధి, వాగ్గేయకార వాచస్పతి, గాయక శిఖామణి,పుంభావ శారద, సంగీత సామ్రాజ్య సార్వభౌమ, సంగీత రత్నాకర, సంగీత విద్యా భాస్కర, సంగీత కళాసాగర, స్వరవిలాస,  సప్తస్వర సామ్రాట్, సంగీత కళా నిపుణ, కళా సేవా నిరత, సంగీత శారద వంటి 
ఎన్నో ప్రతిస్ఠాత్మకమైన బిరుదులను పొందారు, ఉన్నతమైన పదవులను అలంకరించారు. 

బాలమురళీకృష్ణగారి సంగీత ప్రస్థానంలో కొన్ని విశేషమైన సేవలు:

1. ఆయన రచించి స్వరపరచిన 10 తిల్లానాలు. ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. అద్భుతమైన లయగతులతో, రాగలక్షణాలతో రచించబడిన ఈ తిల్లానాలు కర్ణాటక సంగీత సాంప్రదాయంలో తిల్లానాకు నిఘంటువులైనాయి.

2. త్యాగరాజస్వామి వారి పంచరత్న మరియు ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు - ఘనరాగ పంచరత్న కీర్తనలను ఆయన ఆలపించిన పద్ధతి ప్రత్యేకమైనది. అలాగే, స్వామికి వివిధసేవలను వివరించే కీర్తనలు  బాలమురళి గారి అమృతగళంలో బహుళప్రాచుర్యం పొందాయి. 

3. భద్రాచల రామదాసు కీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావటంలో ఆయన పాత్ర విశేషమైనది. ఆయన ఆలపించిన రామదాసు కీర్తనలు దక్షిణాదిన ప్రతి యింటా వినబడతాయి. ఏ తీరుగ నను, పలుకే బంగారమాయెనా, తారకమంత్రము కోరిన దొరికెను, ఇదిగో భద్రాద్రి, పాభిరామప్రభో మొదలైనవి ఇంటిటా మారుమ్రోగుతూనే  ఉన్నాయి. 

4. సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తనలు వీరి గాత్రంలో అమృతరస గుళికలలా జాలువారాయి. పిబరే రామరసం, స్థిరతా నహి నహిరే, గాయతి వనమాలి, చేతః శ్రీరామం, తుంగతరంగే మొదలైనవి ఎంతో పేరుపొందాయి. 

5. అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశంతో సామాన్యులకు కూడా అర్థమయ్యే పదాలతో రచించబడిన తత్త్వాలు ఆయన గానంలో శాశ్వతత్వం పొందాయి. ఏమి సేతురా లింగా, వస్తా వట్టిదే పోతా వట్టిదే, నిని విడిసి యుండలేనయా మొదలైన తత్త్వాలు ఆయన పాడినవే. 

6. పురందరదాసుల వారి ఎన్నో కీర్తనలను ఆయన ప్రచారంలోకి తెచ్చారు. అలాగే, కొన్ని అన్నమాచార్యుల వారి కృతులను కూడా అద్భుతంగా గానం చేశారు. నారాయణ తీర్థుల తరంగాలను కూడా ఆయన పాడి జనబాహుళ్యంలోకి తెచ్చారు. 

7. అలాగే, కోలారు సమీపంలో గల కైవార అమరనారేయనుని కీర్తనలను, తమ మాతామహులైన ప్రయాగ రంగదాసు గారి కీర్తనలను ప్రచారంలోకి తీసుకు వచ్చారు. అమరనారేయనుని శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి, చూడు చూడు అదిగో చుక్క, ప్రయాగ రంగదాసు గారి రాముడుద్భవించినాడు, రామరామ యనరాదా, కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా మొదలైన ఎన్నో అద్భుతమైన సంకీర్తనలను ప్రచారం చేశారు. 

వీరు పాడిన కొన్ని ప్రముఖ సినీ గేయాలు: భక్త ప్రహ్లాద చిత్రంలో ఆది అనాదియు నీవే దేవా, సిరిసిరిలాలి చిన్నరి లాలి, నర్తనశాలలో సలలిత రాగసుధారస సారం, గుప్పెడు మనసు చిత్రంలో మౌనమే నీ భాష ఓ మూగ మనసా, మేఘసందేశం చిత్రంలో పాడనా వాణి కళ్యాణిగా, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథలో వసంతగాలికి వలపులు, అందాలరాముడులో పలుకే బంగారమాయెనా, శ్రీరామాంజనేయ యుద్ధంలో మేలుకో శ్రీరామ, ముత్యాల ముగ్గులో శ్రీరామ జయరామ సీతారామ. 

86 ఏళ్ల వయసులో కూడా అద్భుతమైన గాత్రసంపదల కలిగిన బాలమురళీకృష్ణ గారి సంగీత ప్రతిభ అనన్య సామాన్యం, అనుపమానం. ఇప్పటికీ పసిపిల్లాడిలా నవ్వుతూ పాడే శైలి ఆయనది. ప్రిన్స్ రామవర్మ, డీవీ మోహనకృష్ణ గారు, కృష్ణకుమార్-బిన్నీ కృష్ణకుమార్ మొదలైన ఎందరో ప్రముఖ కళాకారులు వీరి శిష్యులు. వారికి భగవంతుడు శతాధిక వర్షముల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించి భారతీయ సంగీతానికి మరింత మార్గదర్శకులుగా ఉండే అవకాశం కలిగించాలని ప్రార్థన. బాలమురళీకృష్ణ  గారు రచించిన వర్ణాలలో ఒకటి ఓంకార ప్రణవ. దీని వివరాలు వారి వాగ్గేయకార ప్రతిభకు ఉదాహరణగా మీకోసం. 


ఓంకార ప్రణవ నాదోద్భవ శృతి లయ స్వర 
సాంకేతిక త్రిభువన శక్తి మురళీ గాన స్వరూపి

ప్రళయ జల వలయ పుటలలలో తేలెనదే వటపత్రం
శయనించు వరదుని నాభిని వదలిన కమల సంజనిత విధి ముఖ జనిత

పద నీరజములే నమ్మితి శాశ్వతమై సుఖమైనది 

గౌరీశ శ్రీశ విధీంద్ర త్యాగరాజాదివర్య సపర్యలందు

ప్రభవము విభవము లీనములు దశ దిశలు భూమి గగన పవనము 
సలిలమగ్ని నగ ఖగ తరు మృగాది సకలము కలుగు నీ దయవలన 

నీ నా యనెడు తారతమ్యములు మానగా సుగుణమిచ్చి
సహనము విరళ వితరణము నిజమును పల్కుటలు సదా తెలియగ
భరత భువిని జనులు కలిసి మెలసి సుఖముగా మరలుటే
మా ధ్యేయముగ సత్కర్మాచరణము భక్త్యానంద వరమిడు 

ఓంకారమనే ప్రణవ నాదం నుండి ఉద్భవించినవి సంగీత లక్షణాలు శృతి, లయ, స్వరము. ఈ సాంకేతిక అద్భుతంతో మూడు లోకాలకు శక్తిగా నిలిచి గాన రూపం యొక్క పద కమలాలనే నమ్మినాను. ప్రళయ సమయంలో  వటపత్రం ఆ సాగరాల కెరటాలలో నిలిచింది. దానిపై శ్రీమహావిష్ణువు వటపత్రశాయి రూపంలో శయనించి ఉన్నాడు. ఆతని నాభినుండి జనించిన కమలంలోనుండి బ్రహ్మ ఉద్భవించాడు. ఆతని ముఖమునుండి జనించినది నాద స్వరూపిణి సరస్వతి. శాశ్వతమైనది, సుఖమైనది అయిన ఆ నాద స్వరూపి పద చరణములను నేను నమ్మినాను. 

శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, త్యాగరాజు మొదలైన వారి సేవలందుకున్న ఆ నాదస్వరూపిణి పద కమలాలనే నేను నమ్మినాను. 

ప్రభవాది అరవై సంవత్సరములు, లీనములు, పది దిక్కులు, భూమి, ఆకాశము, వాయువు, నీరు, అగ్ని, భూమి, వృక్షజాతి, జీవరాశి అన్నీ నీ వలనే కలుగును. నీ నా అనే తారతమ్యము లేకుండా ఉండే సుగుణాన్ని ఇచ్చి, సహనము, విరాళంగా దానం చేసే బుద్ధి, ఎల్లప్పుడూ నిజమును పలుకుట తెలిపేది నీవు. ఈ భరత భూమిలో జనులు కలిసి మెలిసి మెలగుటే ధ్యేయంగా సత్కర్మను ఆచరించే బుద్ధిని, భక్తిని ఆనందాన్ని ప్రసాదించు నీ పదకమలములనే నమ్మితిని. 

డాక్టర్ బాలమురళీకృష్ణ గారి స్వీయ రచన ఇది. వర్ణ రూపంలో మనకు అందించారు ఆయన. అద్భుతమైన సాహిత్యం, సృష్టిలో నాదోద్భవం, మానవ జన్మ ధ్యేయము, శ్రేయము చాల సూక్ష్మంగా తెలిపారు ఆయన. శాశ్వతమైనది, సుఖమైనది ఏమిటో వివరించారు. వాగ్గేయకారుల లక్షణం ఆధ్యాత్మికతతో పాటు కర్తవ్య బోధ, సత్యప్రచారం కూడా. ఈ లక్షణాలన్నీ ఈ కృతిలో గుప్పించారు ఈ మహానుభావుడు. భరతభూమి గర్వించ దగ్గ మహోన్నత కళాకారులు బాలమురళి గారు. ఆయన రచనలను మరింత ప్రచారంలోకి తీసుకు రావలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. సంగీత ప్రపంచంలో గానంతోనే కాదు సాహిత్యంతో కూడా సరస్వతీ సేవలో ముందున్నారు ఆయన. వారిలోని బహుముఖ ప్రజ్ఞకు శతసహస్ర వందనాలు. 

స్వీయరచన, వారి గాత్రంలో వినండి

బాలమురళి గారి గురించి నేను ఇదివరలో ప్రస్తావించిన వ్యాసాలు:

  1. తిల్లానాలు - బాలమురళీరవం
  2. నర్తనశాల  - సలలితరాగసుధారససారం 
  3. బాలమురళీరవం - శ్రీ సకల గణాధిప పాలయ మాం అనిశం
  4. కలినరులకు మహిమలు దెలిపిమి ఫలమనలేదా
  5. నిరవధి సుఖద నిర్మల రూప నిర్జిత ముని శాప
  6. తత్త్వము - ఏమి సేతురా లింగా
  7. ఎనభై ఏళ్ల బాలుడు బాలమురళి
  8. శ్రీకృష్ణాయను నామ మంత్ర రుచి 
  9. రామరామ యనరాదా 
  10. క్షీరసాగర విహారా  - ఉత్సవ సాంప్రదాయ కీర్తన 
  11. శ్రీనీలోత్పల నాయికే 

1 కామెంట్‌: