25, జులై 2020, శనివారం

గోపికలకు శ్రీకృష్ణుని సందేశం


కృష్ణుడు గోకులం వీడిన తరువాత మరల గోపికల చెంతకు భౌతికంగా వెళ్లలేదు. ఆ స్వామి సందర్శనముకై వేచి యున్న గోపికలు ఉద్ధవుని వద్ద స్వామి గురించి నిష్ఠూరాలు పలుకుతారు. అప్పుడు ఉద్ధవుడు కృష్ణుని సందేశం వినిపిస్తాడు.

ఎల్ల కార్యములకు నేను ప్రధాన కారణముగావున మీకు రమణులార
కలుగదు మద్వియోగ చరాచర రూపములలో మహాభూతములు వసించు
కరణి నుండుదు సర్వగతుడనై నే మనః ప్రాణబుద్ధి గణేందిర్యాశ్రయుండ
నాత్మయందాత్మచేనాత్మ బుట్టింతు రక్షితును ద్రుంతు హృషీక భూత

గణ గణాకారమాత్మకు గొమరు మిగులు
నిబిడ మాయానుభవమున నిత్య శుద్ధ
మాత్మ విజ్ఞానమయమునై యమరు గుణము
బ్రకృతి కార్యమనోవృత్తి బట్టిపొందు

జగత్తులో జరిగే సమస్త కార్యాలకు తానే కారణమంటూ ప్రతి కార్యములోనూ తనను దర్శించమని తెలిపాడు. చరాచర రూపాలన్నిటిలోనూ అంతర్గతంగా జీవం ఎలా ఉంటుందో అదే విధంగా తాను అన్నిటా చర్మచక్షువులకు కనిపించకుండా మనస్సు, ప్రాణము, బుద్ధి, గుణములు, ఇంద్రియములను ఆశ్రయించి ఉన్నానని చెబుతాడు. ఆత్మలో ఆత్మ ద్వారా ఆత్మను పుట్టించి రక్షించి త్రుంచెదనని తెలిపాడు. బాహ్యదృష్టి వీడి ఇంద్రియ నిగ్రహులై అంతర్ముఖులైనట్లయితే ఆత్మనే అంటి ఉన్న తనను దర్శించగలుగుతారని స్పష్టం చేశాడు.

ఒక విధంగా గోపికలకు కంటికి దూరమైన తనను ఆత్మలో దర్శించమనడంలో సగుణారాధనం నుండి నిర్గుణారాధనకు చేరుకునే స్థాయిని, స్థితిని తెలియజేశాడు. సాధకులు ఆరంభంలో తమ దృష్టికి ఆకర్షణీయమైన దేవతా స్వరూపాలను ఎంచుకుని దానిపై దృష్టిని కేంద్రీకరించి ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ఆలయాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఆయా రూపాలను దర్శిస్తూ ఉండి రాను రాను కేవలం బాహ్య దృష్టికి మాత్రమే పరిమితం కాక ఆంతర్యంలో పరమాత్మ రూపాన్ని దర్శించగలిగే స్థాయికి చేరుకునే విధానం గోపికలు శ్రీకృష్ణుడు ఇచ్చాడు. కంటికి కనబడుతున్న వెలుగును అంతరాంతరాలలో నింపుకోగలగాలి. కంటికి కనబడేది సత్యమే అయినా అది శాశ్వతం కాదు. ఆ శాశ్వతం కాని దానిని అంతరంగంలో నిలుపుకుని శాశ్వతం చేసుకోవచ్చు. కనుకనే గోపికలతో ఎన్నో లీలలు చూపి మధురకు వెళ్లిన కృష్ణుడు తిరిగి ఎన్నడూ శారీరికంగా గోపికల దగ్గరకు బృందావనానికి రాలేదు.

ఎప్పుడూ నన్ను మీరలు చింతించుచునుండ గోరి యిటు దూరస్థత్వముంబొందితిం దలకం బోలదు నన్ను గూడెదరు నిత్యధ్యాన పారీణలై అని కృష్ణుడు గోపికలకు బోధిస్తాడు. కృష్ణుని సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు కనుకనే గోపికలు కృష్ణలీలలను మననం చేసుకుంటూ గడిపారు. అంతరంగంలో భగవంతుని ఏనాటికీ బంధించకపోతే సాధకుల సాధనకు అర్థం లేదు. అది సాధించిన వారు గోపికలు.

శ్రీకృష్ణపరమాత్మను ఊరకే జగద్గురుం అని బోధించలేదు. తల్లిదండ్రులకు, మిత్రులకు, సఖులకు, సతులకు, బంధుగణానికి, శత్రువులకు, సమస్త మానవాళికి ఎలా జీవించాలో ఎలా తరించాలో అద్భుతంగా బోధించి జగద్గురువైనాడు.

కులుకక నడవరో కొమ్మలాలా - అన్నమాచార్యుల వారు


అన్నమాచార్యుల వారు అమ్మవారిపై ఎన్నో కృతులను రచించారు, అందులో ఒకటి కులుకక నడవరో కొమ్మలాలా అన్నది ఒకటి. డాక్టర్ శోభారాజు గారు అద్భుతంగా ఆలపించిన కృతి ఇది. కుసుమ కోమలి అయిన అమ్మను జాగ్రత్తగా మోయమని అద్భుతంగా వర్ణించారు అన్నమయ్య.

కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీనీ జాజులు మాయమ్మకు

ఒయ్యనె మేను కదలీనొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాద తాకు కాంతలాలా
పయ్యెద చెరగు జారి భారపు గుబ్బల మీద
అయ్యో చెమరించీ మాయమ్మకు నెన్నుదురు

చల్లడి గందవొడి మైజారి నిలువరో
పల్లకి పట్టిన ముద్దు పణతులారా
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
ఘల్లనుచు కంకణాలు కదలీ మాయమ్మకు

జమళి ముత్యాల తోడి చమ్మాళిగలిడరో
రమణికి మణుల ఆరతులెత్తరో
అమరించి కౌగిట అలమేలుమంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మాయమ్మకు

సఖులారా, అలమేలుమంగమ్మ ధరించిన జాజులు జల జలా రాలుతాయి, ఎక్కువగా కులుకకుండా నిదానంగా నడవండి. మృదువైన అమ్మ దేహమును నొప్పించకుండా మెల్లగా నడవండి. అమ్మ పాదాలను తాకే కాంతలారా,ఆమె పాదాలు నొచ్చుకుంటాయి,స్తన్యములపై నుండి చీర తొలగుతుంది, ఇప్పటికే అమ్మకు అలసటతో చెమటలు పట్టాయి,నెమ్మదిగా నడవండి. అమ్మ పల్లకీని మోసే ఓ అందమైన స్త్రీలారా! అమ్మపై చల్లని గంధపు పొడి చల్లి అలరించండి, అమ్మ ధరించిన బంగారు మరియు ముత్యాల సరులు కలిగిన చీర కుచ్చెలు అదరకుండా జాగ్రత్తగా మోయండి. అమ్మకు ముత్యాల వరుసలు కలిగిన పాదరక్షలు ధరింపజేసి, మణులతోటి హారతులు ఇవ్వండి, ఎంతో అందముగా అమ్మను శ్రీనివాసుడు కౌగిట చేర్చుకున్నాడు, కులుకకుండా నడవండి!

24, జులై 2020, శుక్రవారం

నను పాలింప నడచి వచ్చితివో - త్యాగరాజస్వామి


నను పాలింప నడచి వచ్చితివో నా ప్రాణనాథ

వనజ నయన మోమును జూచుట జీ
వనమని నెనరున మనసు మర్మము దెలసి

సురపతినీలమణినిభ తనువుతో
ఉరమున ముత్యపు సరుల చయముతో
కరమున శర కోదండ కాంతితో
ధరణి తనయతో త్యాగరాజార్చిత

నా ప్రాణేశ్వరుడవైన శ్రీరామా! కలువల వంటి కన్నులు గలిగిన నీ మోమును జూచుటే నా జీవనమని నమ్మిన మనసులోని మర్మమును తెలుసుకొని నా పై దయతో నన్ను పాలించుటకు నడచి వచ్చితివా! శివునిచే అర్చించబడిన శ్రీరామా! ఇంద్రనీలమణి కాంతితో మెరిసే శరీరముతో, వక్షస్థలములో ముత్యాల హార సమూహముతో, చేతిలో కోదండము, బాణముల కాంతితో, సీతమ్మతో కూడి నన్ను పాలించుటకు నడచి వచ్చితివా!

త్యాగరాజస్వామి వారి కుమార్తె వివాహ సమయంలో శిష్యులు కొందరు సీతారాముల చిత్రపటాన్ని బహుకరించగా ఆయన ఆనందంతో ఆలపించ కృతి ఇది. మోహన రాముని మోహన రాగంలో నుతించారు త్యాగరాజస్వామి.

(చిత్రం వడ్డాది పాపయ్య గారు గీచినది)

గురు లేక ఎటువంటి గుణికి తెలియగబోదు - త్యాగరాజస్వామి


గురు లేక ఎటువంటి గుణికి తెలియగబోదు

కరుకైన హృద్రోగ గహనమును గొట్ట సత్

తనువు సుత ధన దార దాయాది బాంధవులు
జనియించి చెదరు జాలిని కరుణతో
మనసునంటక మంచి మందనుచు తత్వబో
ధన చేసి కాపాడు త్యాగరాజాప్తుడగు

ఎంతటి సద్గుణ సంపన్నుడైనా గురువు లేకుండా పరతత్త్వము బోధపడదు. హృదయములో జన్మించిన కర్కశమైన అజ్ఞానపు ఆలోచనలనే అరణ్యమును ఛేదించుట గురువులు లేకుండా సాధ్యము కాదు. శరీరము, బిడ్డలు, ధనము, భార్య, దాయాదులు మొదలైన బంధువులు ఇవన్నీ శాశ్వతము కాదు అనే సత్యాన్ని మనపై కరుణతో, ఆ సంసార వాసనలను మన మనసులకు అంటకుండా మంచి మందు లాగా తత్త్వబోధ చేసి కాపాడే సుజ్ఞానము గురువు లేకుండా ఎంతటి సద్గుణ సంపన్నునికైనా బోధపడదు.

శ్రీగురుభ్యోనమః _/\_

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప - తాళ్లపాక అన్నమాచార్యుల వారు


నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప!
నగరాజ ధరుడా! శ్రీ నారాయణా!

దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యమునీయ
నోపక కదా నన్నునొడబరచుచు
పైపైని సంసార బంధముల గట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణా!

చీకాకు పడిన నా చిత్తశాంతము సేయ
లేకనా నీవు బహులీల నన్ను
కాకు సేసెదవు బహు కర్మముల బడు వారు
నా కొలది వారలా నారాయణా!

వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను
భవ సాగరముల తడ బడ జేతువా
దివిజేంద్ర వంద్య!` శ్రీ తిరువేంకటాద్రీశ!
నవనీత చోరా! శ్రీ నారాయణా!

ఓ నారాయణా! శ్రుతి స్మృతి పురాణములలో వర్ణించబడిన మనోహరమైన రూపము కలవాడవు, మందర పర్వతమును మోసిన వాడవు! నాకు ప్రకాశించే వైరాగ్య సుఖమును ప్రసాదించక నన్ను ఒప్పించి మరీ మరీ సంసార బంధములలో కట్టివేస్తావు, నా మాటలు చెల్లునా నారాయణా! అశాంతములోనున్న నా మనసును శాంతపరచ గలిగే నీవే నన్ను అనేక లీలలతో మరింత అలజడికి గురిచేసెదవు, అనేక కర్మలలో మునిగియున్న వారితో నాకు పోలికా నారాయణా! ఇంద్రాది దేవతలకు పూజ్యుడవైన ఓ శ్రీవేంకటేశ్వరా! వెన్నను దొంగిలించిన శ్రీకృష్ణా! అనేక పాశముల నుండి నన్ను రక్షించక మరిన్ని భవ సాగరములలో కొట్టుమిట్టాడేలా చేసెదవా నారాయణా!

స్వామి వైభవాన్ని నిత్యం కనులారా గాంచి, ఆయనపై అనేక వేల ఆధ్యాత్మిక శృంగార సంకీర్తనలు రచించి, పరమాత్వ తత్త్వాన్ని అనేక విధాల అనుభూతి చెంది, జీవితంలో మలిదశలో అడుగిడే సమయంలో అన్నమాచార్యుల వారు తనకు శాశ్వత సుఖాన్ని కలిగించే వైరాగ్యాన్ని, ప్రశాంతతను, భవబంధములనుండి ముక్తిని కలిగించమని ఆ శ్రీనివాసుని ఈ సంకీర్తనలో అద్భుతంగా వేడుకున్నారు. సాహిత్యాన్ని నిశితంగా పరిశీలిస్తే, ప్రతి ఒక్క పదం కూడా అర్థవంతమై పరిపూర్ణత్వానికి తోడ్పడేల ఉంటాయి. మానవ జన్మలో పరమాత్మ లీలలే ఈ బంధనాలన్నీ అని మనకు మూడు చరణాలలో అన్నమయ్య ఉదాత్తమైన ఆధ్యాత్మిక తత్త్వాన్ని బోధించారు. అన్నిటికీ సూత్రధారి, అన్నీ తెలిసిన స్వామే తన అంతరంగము తెలుసుకొని ఈ బంధనాల నుండి రక్షించగలడని మనకు మార్గం చూపించారు అన్నమయ్య. అందుకే ఆయన సద్గురువు.

ఓ నమో నారాయణాయ!

రామాయణ వైభవం


రామ శబ్దం రం అనే ధాతువునుండి ఏర్పడింది. దీని అర్థం రమించుట, ఆనందపడుట, హాయినిచ్చుట. అయనం అనగా కదలుట, నడచుట, పయనించుట. కాబట్టి రామాయణం అంటే రాముని చలనం, గమనం, స్పందనం అని అర్థం. కాబట్టి రామాయణం అంటే కేవం రాముని కథ కాదు, రాముని నడవడికను సూచించేది అని తేలింది. రామ శబ్దంలోని రమణీయతకు ఆయన శబ్దం కమనీయమైన గమనాన్ని, వేగాన్ని జోడిస్తుంది.

రామాయణంలో ప్రపంచంలో రెండు విధాలైన భౌతిక శక్తుల సమ్మేళన మనకు స్ఫురిస్తుంది - స్థితిజ (potential), గతిజ (kinetic). తదేజతి, తన్నైజతి - అది చలిస్తుంది, చలించదు అనే ఉపనిషత్సూక్తి రామాయణంలో ధ్వనిస్తుంది. నిజానికి రాముడు పుట్టింది మొదలు పట్టాభిషేకం వరకు ఆయన జీవితంలో అయనత్వం, నిరంతర నిర్విరామ నియమనిష్ఠ కనిపిస్తుంది. రాముని జననాన్ని వర్ణించగానే వాల్మీకి మహర్షి అదే సర్గలో విశ్వామిత్రుని ఆగమనాన్ని సూచిస్తాడు. పదహారేండ్లు కూడా నిండని పసివయస్సులో క్రూర రాక్ష సంహారం, యాగ సంరక్షణ, అహల్యా శాపవిమోచనం, శివ ధనుర్భంగం, సీతా స్వయంవరం, పెండ్లి చేసుకు రాగానే అడవులకు పయనం, నానా బాధలు, మహర్షుల మన్ననలు, నెలకో నెలవు. చివరకు పర్ణశాల అంటూ ఒకటి ఏర్పడితే కలలో కూడా ఊహించని సీతాపహరణం, తదుపరి అన్వేషణం, సేతుబంధనం, రావణ సంహారం. ఇలా, ఒక్క క్షణం కూడా జీవితంలో స్థాయి, హాయి లేకుండా సత్య ధర్మాలను మాత్రం వదలకుండా సాగిన రాముని జీవన యాత్ర ఒక గొప్ప ఆయనం. అదే రామాయణం. ఇంతటి సంచలనం, సంక్షోభం జరుగుతున్న రాముడు చలించడు, హిమవత్పర్వతంలా ధైర్యంగా నిలబడి అన్నిటినీ సమర్థించుకుంటాడు. అదే రామాయణంలోని రమణీయత.

మరి రాముడి అయనం రామాయణం కదా? అయితే సీతమ్మదేమీ లేదా అని ప్రశ్నించే వారికి సమాధానం. రామాయణం అన్న దానికి రామస్య అయనం, రామాయాః అయనం అని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. రామా అనగా సీతమ్మ. ఇదే రామాయణ శబ్దంలోని చమత్కారం. వాల్మీకి తన రచనకు పెట్టుకున్న పేరులోని పరమరహస్యం కూడా ఇదే. మరి సీతమ్మను రామా అని ఎందుకు పిలవరు? అన్న ప్రశ్నకు సమాధానం, స్వయంగా వాల్మీకే రామాయణంలో అనేకమార్లు రామా అన్న శబ్దాన్ని అమ్మను సంబోధించటం ద్వారా తెలిపారు. సుమంత్రుడు దశరథునికి సీతాదేవి గురించి చెప్పిన సందర్భంలో:

బాలేవ రమతే సీతా బాలచంద్ర నిభాననా
రామా రామేహ్యదీనాత్మా విజనేऽపి వనే సతీ

బాలచంద్రునివంటి ముఖముతో శోభిల్లుతున్న సీతమ్మ పసిపిల్లలా (బాలాత్రిపురసుందరిలా) మహారణ్యంలో కూడా దైన్యత లేకుండా నిబ్బరంగా సంతోషంగా ఉంది అంటాడు. ఇంతటి శక్తి ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది? రామ పక్కన రాముడుండగా దిగులెందుకు అంటాడు వాక్యవిశారదుడైన వాల్మీకి. ఇక్కడ రామ శబ్దం రామా శబ్దం వెంట వెంటనే జంటగా కనిపిస్తాయి. అందులో కూడా రామ, తరువాత రాముడు. నిజానికి రామాయణానికి వివరణ రామారామయోరయనం రామాయణం (రామా రాముల అయనమే రామాయణం) అని చెప్పటమే సరైనది.

సీతాదేవికి రామచంద్రుని పేరులోనే కాదు, ,తీరులో కూడా సామ్యముంది. హనుమంతుడు లంకనంతా గాలించి చివరకు అశోకవనంలో సీతాదేవి రూపలావణ్యం చూచి నివ్వెరపోతాడు. కారణం ఆమె అతిలోక సుందరి అయినందుకు కాదు, ఆమె ముమ్మూర్తులా రామచంద్రునిలా కనిపించటం వల్ల. ప్రపంచంలో తోబుట్టువులు, తల్లీ పిల్లలు, తండ్రీ బిడ్డలు ఒకలా ఉండటం సహజం. కానీ, ఇక్కడ భార్యాభర్తలు ఒకే రూపున ఉండటం అనేది విశేషం. అక్కడ రామయ్యను చూసి ఇక్కడ సీతమ్మను చూస్తే ఆ రాముడే స్త్రీ రూపంలో ఉన్నట్లు గమనించిన ఆంజనేయుడు మనస్సులో ఇలా అనుకున్నాడు:

అస్యా దేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం
రమస్య చ యథారూపం తస్యేయమసితేక్షణా!

ఆ దేవి నిజరూపం - పోలికలు, అవయవములు, వాటి సౌష్టవం అన్నీ ఆ రాముని రూపానికి ప్రతిరూపంగా అన్నట్టుగా ఉంది.

ఎంత అద్భుతం కదా? ఇది ఎలా సాధ్యమైంది? అదే రామాయణంలోని అద్వైత రససిద్ధి. సీతారాములకు రూపంలోనే కాదు, గుణగణాల్లో, ఆలోచనల్లో, ఆనందంలో, ఆవేదనలో దేనిలో కూడా వ్యత్యాసం లేదు.

అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యచాస్యాం ప్రతిష్ఠితం

ఆమె మనస్సు ఆయనలో లీనమైనట్టుగానే ఆయన మనస్సు ఆమె మనస్సులో లయించి ఉన్నదట. ఇలా ఒకరికొరికరు బింబ ప్రతిబింబంగా ఉన్న సీతారాముల ఆత్మ మనశ్శరీర సామరస్యాన్ని చూసి హనుమంతుడు స్థంభించిపోతాడు. సీతారాముల మధ్య ఉన్న ఈ అన్యోన్యతను, అభిన్నతను, అనుబంధాన్ని అక్షరరూపంలో నిరూపించటమే రామాయణ పర్మావధి. శ్రీరాముడు పరమాత్మ స్వరూపుడైతే సీతాదేవి పరమాత్మ యందలి పరమ కళ. ఈ కళ ముల్లోకాలకూ మూలాధారాన్ని ప్రసాదిస్తుంది.

రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజా
త్రైలోక్య రాజ్యం సకలం సీతాయావాప్నుయాత్ కలాం!

వాల్మీకి మహర్షి యొక్క అంతర్దృష్టి, అంతరార్థం, రామాయణం మహత్తు, సీతారాముల అభేద్య తత్త్వం ఇంతకన్నా విప్పిచెప్పేదేముంది?

"వందే వాల్మీకి కోకిలం"

భారమైన వేపమాను పాలువోసి పెంచినాను - అన్నమాచార్యుల వారు


భారమైన వేపమాను పాలువోసి పెంచినాను
తీరని చేదే గాక తీయనుండీనా

పాయదీసి కుక్క తోక బద్దలు వెట్టి బిగిసి నాను
చాయకెంత గట్టినాను చక్కనుండీనా
కాయపు వికారమిది కలకాలము జెప్పినా
పోయిన పోకలే కాక బుద్ధి వినీనా

ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా
మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యీనా
పంచ మహా పాతకాల బారిబడ్డ చిత్తమిది
దంచి దంచి చెప్పినాను దాగి వంగీనా

కూరిమితో తేలుదెచ్చి కోకలోన బెట్టుకున్నా
సారె సారె కుట్టుగాక చక్కనుండీనా
వేరు లేని మహిమల శ్రీ వేంకటవిభుని కృప
ఘోరమైన ఆస మేలుగోర సోకీనా

తాత్పర్యం:

ఎంతో పెద్దదైన వేపమాను తెచ్చి పాలు పోసి పెంచినా కూడా అది తీర్చలేని చేదు రుచే ఉంటుంది కానీ తీయగా మారుతుందా? పాయలుగా తీసి చెక్కబద్దలు పెట్టి బిగించి కొయ్యకు ఎంత కాలం కట్టినా వంకర పోయి చక్కగా ఉండునా? నీటిలో మరింత ముంచి మడుగున ఎంత నాన బెట్టినా పెద్ద గొడ్డలి ఏనాటికైనా మెత్తబడుతుందా? పంచమహాపాతకాల (బంగారాన్ని దొంగిలించటం, కల్లు తాగటం, గురుపత్నితో సంగమం, బ్రాహ్మణ హత్య, ఇలాంటివి చేసిన వానితో స్నేహం చేయటం) బారిన పడ్డ మనసిది, ఎంత గట్టిగా చెప్పినా మారి తన గుణాన్ని మార్చుకుంటుందా? ఎంతో ప్రేమగా తేలును తీసుకు వచ్చి చీరలో పెట్టుకుంటే మళ్లీ మళ్లీ కుడుతుందే కాని హానిచేయకుండా ఉంటుందా? ఘోరమైన ఆశలు కలిగిన మనసు లోతు తెలియని మహిమలు గల శ్రీవేంకటేశ్వరుని కృపను కోరనిస్తుందా?

వివరణ:

మాయావశమైన చిత్త ప్రవృత్తిని సద్గురువులు ఈ కృతి ద్వారా అన్నమాచార్యుల వారు అద్భుతంగా ఆవిష్కరించారు. వేప సహజ గుణం చేదు. దానికి నీళ్ల బదులు పాలు పోసి పెంచినా ఆ చేదు పోదు. దీనికి సారూప్యం ఏమిటి? మన మనస్సు. దాని సహజ గుణం చేదైనా విషయాలలో మునిగి యుండటం. ఇక్కడ చేదు అంటే రుచి అని కాదు, మనకు శ్రేయస్కరమైనవి కానివి అని. ఏది మనకు శ్రేయస్కరం? పరమాత్మయందు ధ్యాసే. కానీ, అలా నిలువదే మనసు? నిరంతరం పాప విషయ లంపటములలో మునిగి తేలుతూ ఉంటుంది. ఈ విషయాన్నే అన్నమయ్య పల్లవిలో ఆవిష్కరించారు. సహజంగా చెడు గుణాలలో పడే మనసు శ్రేయస్కరమైన వాటి పట్ల దృష్టి కలిగి ఉండదు అనేది ఆయన భావన. దీనిని మూడు చరణాలలో ఉదాహరణల ద్వారా మరింత వివరించారు అన్నమయ్య. వంకరగా ఉన్న కుక్క తోకను ఎంతో ప్రయత్నం చేసి గుంజకు కట్టి సరి చేయాలని చూసినా ఆ వంకర పోదు. అలాగే ఈ మనసు శరీరం వల్ల కలిగే అనేక వికారాల వల్ల స్వాధీనమైనట్లే ఉండి పట్టు విడవగానే మళ్లీ పక్క దారులు తొక్కుతుంది. ఎందుకు అలా? అదే మాయ. ఆ మాయకు ఆ దేహం వశపడుతుంది. తద్వారా మనసు ఆధీనము తప్పి వివిధ నీచ ప్రవృత్తులలో కొట్టుమిట్టాడుతుంది. అలాగే, కఠినమైన లోహముతో చేయబడ్డ గొడ్డలిని ఎన్ని మార్లు ఎంత కాలం నీటిలో ఉంచినా అది మెత్తబడదు. పాషాణమైన దాని గుణాన్ని మనసుతో పోల్చారు అన్నమయ్య. తేలు లక్షణం కుట్టటం. దాన్ని తీసుకు వచ్చి ప్రేమగా అందమైన చీరలో చుడితే అది కుట్టకుండా ఉంటుందా? మనసు కూడా అంతే. ఎన్ని అనుకూల పరిస్థితులు కల్పించినా తన సహజ స్వభావం నుండి మారదు. ఇక్కడ తేలును ప్రస్తావించటానికి రెండు కారణాలు 1. అది బాధ కలిగించేది 2. విషపూరితమైనది. రెండూ కూడా మనకు నిజజీవితంలో విషయలోలత్వం, దుర్జన సాంగత్యం వల్ల కలిగేవి. వీటివల్ల భగవత్కృప అనే అమూల్యమైన వరం పక్కనే ఉన్నా మనసు దానివైపు వెళ్లదు. ఈ సంకీర్తన మనకు అన్నమయ్య మనసు గురించి వాపోతున్నట్లు అనిపించినా, మార్గం పరమాత్మ సాన్నిధ్యమే అని కూడా సందేశం ఇచ్చారు.

సరే. చిత్త చాంచల్యం లేని వారెవరు? అర్జునుడంతటి యోధునికే తప్పలేదు. ఆ వీరుడు పరమాత్మను ఇలా ప్రశ్నించాడు:

యోऽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం

చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం
తస్యాహి నిగ్రహం మన్యే వాయోరివ దుష్కరం

ఓ మధుసూదనా! నీవు చెప్పిన యోగము ద్వారా స్థిరత్వము, సమభావమనే స్థితిని నా చంచలత్వం వలన తెలుసుకోలేకున్నాను. ఈ మనసు చాలా చంచలమైనది. బాగా విషయ లోలత్వం చెందేది. మనసు యొక్క ఈ పోకడ చాలా దృఢమైనది, బలీయమైనది. దానిని ఆపటం గాలిని ఆపటంవలె అత్యంత కఠినమైనది.

అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు:

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే

నిజమే మహాబాహువువైన కుంతీపుత్రా! నీవు చెప్పిన దానిలో ఏ మాత్రం సంశయం లేదు. మనస్సు చంచలమైనదే, దానిని నిగ్రహించటం చాలా కష్టం. కానీ, అభ్యాసము మరియు వైరాగ్యముతో మనస్సును స్వాధీనపరచుకోవచ్చు.

మరి ఏమిటా అభ్యాసం, వైరాగ్యం?

అభ్యాసమనగా నిరంతర సాధన. జ్ఞాన కర్మ భక్తి యోగములలో దేనిలోనైనా, కలిపైనా అభ్యాసము చేయటం. ఇది నిరంతరం అచంచలమైన విశ్వాసంతో జరగాలి. మొదట్లో యాంత్రికమనిపించినా కొన్నళ్ల తరువాత మనసు ఆ పరమాత్మ తత్త్వాన్ని కొద్ది కొద్దిగా గ్రహించి ఆ మార్గంపై విశ్వాసం కలుగుతుంది. ఇది ఒంటరి ప్రయాణం కాకూడదు. తప్పకుండా సద్గురువుల సాంగత్యంలోనే జరగాలి. అహంకారం మనిషి సహజ లక్షణం. దాని నియంత్రణకు స్వశిక్షణ సరైన మార్గం కాదు. గురువు మార్గదర్శకంలో అలవడే శిక్షణ వల్ల అహంకారము తొలగుతుంది. అందుకే మనకు సనాతన ధర్మం గురుతత్త్వాన్ని అనేక విధాల బోధించి ఆ గురు సుశ్రూషలో అభ్యసించమని శ్రుతి స్మృతి పురాణాలలో ఉట్టకించింది.

వైరాగ్యమనగా?

ఏ విషయమైనా కూడా రాగద్వేషరహితుడై ఉండటం. అనగా, మమకారము, ద్వేషము లేకుండా ఉండటం. ఇది ఎలా సాధ్యం? జీవితంలో అనేక మార్లు మనకు తాత్కాలిక వైరాగ్యం కలుగుతుంది. అందులో ముఖ్యమైనవి ప్రసూతి మరియు స్మశాన వైరాగ్యం. జనన మరణాల సమయంలో మనుషులకు తప్పకుండా వైరాగ్యం కలుగుతుంది. ఒకటేమో ప్రసవ సమయంలో ఆ తల్లి పడే ఆవేదన చూసి, మరొకటేమో మనకు ప్రియమైన మరో జీవి దేహాన్ని వీడి వెళ్లటం జీర్ణించుకోలేని విరాగం. రెండూ తాత్కాలికమే. ఇక్కడ పరమాత్మ చెప్పింది నిరంతర వైరాగ్యం. దీనికి ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోవటం చాలా ముఖ్యం. శాశ్వతమైన ఆత్మ, పరమాత్మల జ్ఞానం, అశాశ్వతమైన దేహము, ప్రపంచము యొక్క అవగాహన కలగాలంటే జీవన ధర్మాలను పాటిస్తూ, గురు సుశ్రూష చేస్తూ అనుభూతులను గమనించి తద్వారా కలిగిన జ్ఞానాన్ని ఆచరించటం చాలా ముఖ్యం. అభ్యాస వైరాగ్యాలు రెండిటికీ క్రమశిక్షణ చాలా అవసరం. ఇవి శమదమాది షడ్గుణాల ద్వారా సఫలమవుతాయి.

అన్నమాచార్యుల వారు పంచమహాపాతకాల గురించి ప్రస్తావించటం ఈ సంకీర్తనలో ఓ ముఖ్యమైన అంశం. అరిషడ్వర్గాల ప్రకోపం వల్ల మనిషి మనసు సంతులన కోల్పోయి చేసేవీ పాతకాలు. ధర్మాన్ని అర్థం చేసుకుని ఆచరించే వానికి వీటితో పనిలేదు. ఇవే కాకుండా మనకు తెలిసీ తెలియక అనేక జీవులకు మనం హాని కలిగిస్తూనే ఉంటాము. వీటికి ప్రాయశ్చిత్తంగా మనకు ధర్మం అనేక కర్మలను ప్రస్తావించింది. జీవకారుణ్యం, నిష్ఠగా కర్మానుష్ఠానం, గురు ముఖత జ్ఞానసముపార్జన, నవ విధ భక్తి మార్గాలు మనలను అరిషడ్వర్గాలను నియంత్రించి షడ్గుణ సంపదను పెంపొందించుకునేలా చేస్తాయి. అటువంటి మనోస్థితిని కలిగించమని, తద్వారా పరమాత్మ కృపకు పాత్రులమయ్యేలా చేయమని ఈ కృతి ద్వారా అన్నమయ్య తెలియజేశారు.

శ్రీగురుభ్యోనమః.

అంతా రామమయం - భద్రాచల రామదాసు కృతి

అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అండాండంబులు పిండ...